శర్మ కాలక్షేపంకబుర్లు-హద్దు

హద్దు                                     స్వాతంత్ర్య దినోత్సవ శుభకామనలు.                               

హద్దు అంటే పరిమితి. ఇంటికి, పొలాలకి, గ్రామాలకి, నగరాలకి, దేశాలకి హద్దులుంటాయి. మనుషులకీ ప్రవర్తన, వేష భాషలలో హద్దులున్నాయి. పంచభూతాలు వాటి హద్దులలోనే ఉంటాయి ఎప్పుడూ, కాని మనమే సమతుల్యం చెడకొడితే హద్దులు మీరతాయి, అప్పుడు కుయ్యో! మొర్రో!! మని అరుస్తాం తప్పించి మన హద్దులలో మనం ఉండాలనుకోము. దేశాల మధ్య హద్దులు ఎల్లలు ఉండాలి, వాటిని కాపాడుకోవాలి కూడా.

రామాయణం లో చూస్తే ఈ హద్దులు ఎంత చక్కగానో నిర్వచించబడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఒక సంఘటన చూద్దాం. రాముని పనుపున లక్ష్మణుడు కిష్కింధకు చేరతాడు, కన్నులలో నిప్పులు కురిపిస్తూ, సుగ్రీవుడు అన్నమాట నెరవేర్చడానికి చర్యలు తీసుకోనందుకుగాను హెచ్చరించడానికి. చాలా కోపంగా ఉన్న సమయం. సాధారణంగా హద్దులు మరచి ప్రవర్తించేది కోపంలోనే. సుగ్రీవుని అంతఃపురం దగ్గరదాకా వస్తాడు, అక్కడ ఆగిపోతాడు, ఈలోగా తార పరుగునవస్తుంది. అప్పటిదాకా కోపంలో ఉన్న లక్ష్మణుడు తలదించి తారతో మాటాడతాడు. స్త్రీలతో ఎలా ప్రవర్తించాలో హద్దు తెలిసినవాడు కావడం చేత,అందునా అస్తవ్యస్తంగా ఉన్న వస్త్రాభరణాలతో మత్తులో ఉన్న స్త్రీతో మాటాడేటపుడు ఎంత హద్దు తెలిసి ప్రవర్తించాడు లక్ష్మణుడు?. ఆయన లోపలికి ప్రవేశిస్తే ఆపగలవారున్నారా అక్కడ?. అప్పుడు తార ఆహ్వానిస్తుంది, అంతఃపురం లోకి, ”స్నేహితుని ఇంటిలోకి స్నేహితుడు రావచ్చయ్యా! ఇలా గడపలో నిలబెట్టి మాటాడటం నాకు భావ్యం, సభ్యత కాదు, లోపలికి రాననడం నీకుభావ్యంకాద”ని, అప్పుడులోనికెళతాడు లక్ష్మణుడు, అక్కడ సుగ్రీవునికి చెప్పవలసిన మాటలు చెప్పడం మాత్రం మరువలేదు. ఆయన కోపం తగ్గేలామాటాడిన చతుర, తార. అక్కడ ఎవరి హద్దులు వారు ఎంత చక్కగా పాటించారు, కోపంలో కూడా. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

ద్రౌపదిని సభకు జుట్టు పట్టి ఈడ్చుకు రావడం, ఆ వచ్చిన తరవాత మానవ ధర్మాన్నే మరచిపోయారు కదా కౌరవులు, హద్దు మీరి ప్రవర్తించారు కదా! ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానమెవ్వరూ ఇవ్వలేదు, చిన్నవాడయిన వికర్ణుడు నిజం చెబితే అతని నోరు నొక్కేశారు. రాయబారంలో పరమాత్మ మంచిమాట చెబితే వినక హద్దులు తెలియక ఆయనను బంధించాలనుకుని ప్రవర్తించినవాడు తన వినాశం తనే కొని తెచ్చుకున్నవాడు, దుర్యోధనుడు, అందుకే ఫలలితమూ అనుభవించాడు.

నేడు మనది స్వతంత్ర భారతదేశం, వాక్స్వాతంత్ర్యం ఉంది. దాని వినియోగం ఎలాఉంది? దేశవిద్రోహంగా మాట్లాడటమే గొప్పనుకుంటారు,కాదు కావాలనే చేస్తారు. వారికి వంతపాడేవారూ ఉన్నారు. ఒకరు, వారు చెప్పినది ఏదో జరగకపోతే దేశంనుంచే విడిపోతారట, మరొకరు వారికి కావలసినది చేయకపోతే మారణ హోమం సృష్టిస్తామనడం, ఒకరినొకరు ముక్కలుగా నరికేస్తామనడం,ప్రతీకారాలు తీర్చుకోవాలనడం, ఇంకా ముందుకెళ్ళి అనగూడని, వినకూడని, మాటలనేస్తున్నారు, మరి వీరికి హద్దులెవరు ఏర్పాటు చేస్తారు? చేయవలసినవారు మాటాడటంలేదు, పోలీస్ కేస్ లు పెడుతున్నారు, వాటి  పర్యవసానం మాత్రం తెలియటం లేదు..స్వాతంత్ర్యం అంటే హక్కులే కాని బాధ్యతలు లేని సమాజమా? సముద్రానికి హద్దు చెలియలికట్ట కదా! అలాగే ప్రకృతి దానికదే హద్దులు నిర్ణయించుకుంది, వాటిలోనే చరిస్తుంది. అవితప్పితేనే విలయం వస్తుంది. మరి ఇది మనుషులలో ఎందుకు తప్పుతోంది? ముఖ్యంగా మన దేశంలో?

స్త్రీ పురుషుల ప్రవర్తనకి కొన్ని హద్దులున్నాయి.వస్త్రధారణకీ హద్దులున్నాయి, వస్త్రాలు లేకుండా తిరగడం నా జన్మ హక్కంటే ఊరుకుంటారా?. హద్దు మీరి ప్రవర్తించడమే నాగరికత అనుకుంటున్నారు, సినిమాలలో నాయికల్ని తక్కువ బట్టల్తో చూపించి సొమ్ము చేసుకోవాలనే యావ మాత్రమే కనపడుతోంది..అసలు కధలో పట్టుంటే ఈ తడిమిట్లు అక్కరలేదు, అది లేక ఇలా.. తిరుగుబాటే అభివృద్ధి అనుకుంటున్నారు. తిరుగుబాటు కావాలి చెడుమీద, కాని తిరుబాటు మంచి మీద, మంచి కట్టుబాట్లమీద జరుగుతోంది. హద్దులు మీరిన తరవాత ఫలితాలు వేరుగా ఉంటున్నాయి, అప్పటికే చేతులూ కాలుతున్నాయి, ఇహ ఆకులు పట్టుకుని ఉపయోగం కనపడటం లేదు, జీవితాలు నిస్సారమవుతున్నాయన్న స్పృహ ఉండటం లేదు. అంతా జరిగిపోయాకా ఏడ్చి ఉపయోగమూ లేదు.

ఎవరూ మోరల్ పోలీస్ కారు, ఆ అవసరమూ లేదు, రావణుడు మా ఆరాధ్య దైవం అంటున్నారు. అస్తు, అంటే ఏమి కావాలనుకుంటున్నారు? రావణునిలా స్త్రీలోలత్వం, అందునా బలవంతంగా చెరచడం, ఇతరుల సొమ్మును బలవతంగా అనుభవించడం ఆదర్శం గా తీసుకుంటామని చెబుతున్నారా? అస్తు, కానివ్వండి, మీ స్వాతంత్ర్యాన్ని కాదనేదెవరు? రావణుని ఆరాధ్యంగా తీసుకునేవారికి తెలుసో తెలియదో కాని ఈ దేశం లో రావణునికి కూడా గుడి ఉంది, దుర్యోధనునికీ గుడి ఉంది, పూజించండి. సమాజం అలాగే ఉండాలనుకునేవారెక్కువగా ఉంటే కాదనేవారే లేకపోవచ్చు, జంతు ప్రకృతి విజృంభించడమే కావలసినది.

మనం ఏర్పాటుచేసుకున్న రాజ్యాంగ వ్యవస్థలనే తప్పు పడుతున్నవారు, హేళన చేస్తున్నవారు, వాటి విలువలను దిగజారుస్తున్నవారా మన నాయకులు? దొంగలు, దళారులు, గూండాలు, నేరస్థులు ఇటువంటివారినా మనం ఎన్నుకుంటున్నది? ఆలోచించండి…. అన్నిటా మనకు మనమే హద్దులు నిర్ణయించుకోవాలి… అదే సభ్య సమాజం…లేకపోతే మళ్ళీ ఆటవిక సమాజానికి రహదారి వేసుకుంటాం….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s