శర్మ కాలక్షేపంకబుర్లు-కెరటాల పన్ను

కెరటాల పన్ను

” పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి పుడకలతో కానిపోదని” నానుడి. ఒక అలవాటు చిన్నప్పటినుంచి చేసుకుంటే అది చివరిదాకా నిలిచిపోతుంది,అంటే చచ్చే దాకా ఉండిపోతుంది. అది మంచికావచ్చు, చెడ్డా కావచ్చు. అందుకే “మొక్క అయి వంగనిది మానై వంగుతుందా” అని నానుడి, ఒక చిన్న కథ చెప్పుకుందాం , మీకందరికి తెలిసిందే……..

అనగనగా ఒక దేశం, దానికో రాజు, ఆయనకి ఇద్దరు భార్యలు. రాజు కొలువులో ఒక ఉద్యోగి. ఈ ఉద్యోగి లంచాలు తీసుకుంటాడని, వారకాంత “లంచం ఇవ్వందే మంచమెక్కను” అన్నట్లు లంచం తీసుకోకుండా ఏ పనీ చేయటం లేదని రాజుగారికి చాలా ఫిర్యాదులొచ్చాయి. రాజు దాని మీద దర్యాప్తూ చేయించాడు, కాని అతను లంచం తీసుకున్నట్టుగా ఆధారాలు మాత్రం దొరకలేదు, ఏమీ చేయలేకపోయాడు, కాని ఫిర్యాదులు మాత్రం ఆగటం లేదు. రాజుకి ఏమీ పాలుపోక ఏం చేయాలని దీర్ఘంగా ఆలోచించి ఒక అప్రధానమైన చోట, పనిలేని చోట, ప్రజలతో సంబంధం లేనిచోట ఇతనిని నియమించాలనుకుని, దేశాన్ని ఆనుకుని ఉన్న సముద్ర తీరంలో కెరటాలు లెక్కపెట్టి గంటకు ఎన్ని కెరటాలొస్తున్నాయి, రోజుకెన్ని? దాని మూలంగా తీరానికి ఏమయినా లాభమా? నష్టమా? వివరాలు రోజూ నివేదిక సమర్పించమని చెప్పి సముద్రపు ఒడ్డుకు పంపేసేరు. ఉద్యోగి ఆనందం గా సముద్రపు ఒడ్డుకు పోయి అక్కడే కాపరం పెట్టి హాయిగా ముసుగుదన్ని పడుకుని కాకి లెక్కలు పంపడం ప్రారంభించాడు. కొద్దిగాలి ఎక్కువైన రోజు ఎక్కువా, తక్కువైన రొజు తక్కువా కెరటాల లెక్కలువేసి పంపుతూ, దీని వల్ల తీరానికి జరిగే ఉపకార, అపకారాలను ఇతర విషయాలను అంచనా వేస్తున్నాను, సమయం పడుతుందని నివేదిక పంపేసేడు. రాజుగారు కొద్ది కాలం ఇతని నివేదికలు చూసి ఆ తరవాత చూడడం మానేశాడు. ఫిర్యాదుల తలనొప్పి వదిలిందని రాజు సంతోషించాడు. కాలం గడిచింది.

ఒక రోజు ఒక నివేదిక వచ్చింది, అందులో వర్షాకాలంలో కెరటాలు ఎక్కువగా ఉన్నాయనీ అందుచేత ఒడ్డు కోసుకుపోతోందనీ దానిని బాగుచేయించడానికి తోటలు పెంచడానికి, మడ అడవులు పెంచడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతోంది కనక, ఈ మడ అడవులనుండి ప్రజలు లబ్ధి పొందుతున్నారు కనక కెరటాల పన్ను అదిన్నీ కొద్దిగా వేయడానికి, వసూలు చేయడానికి ప్రభువు అనుమతి కోసం, నివేదిక పంపేడు.. ఇది చూసిన ప్రభువు ఇదేదో బాగున్నట్టుంది అని ప్రజల వద్దనుంచి కెరటాల పన్ను వసూలు చేయమని ఆజ్ఞ ఇచ్చేశాడు. మనవాడి రొట్టి విరిగినేతిలో పడింది. కెరటాలపన్ను వసూలు చేసి లెక్కడొక్కా సరిగా చూసి, చూపించి, సొమ్ము ఖజానాకు జమ చేస్తూ వచ్చాడు. రాజుకి కొంత నమ్మకం ఏర్పడింది ఉద్యోగి మీద, మారినట్టున్నాడని సంతోషించాడు. కాలం గడిచింది, ఇప్పుడు ఉద్యోగి, మీరు మడ అడవులను పాడుచేస్తున్నందున గాలి ఎక్కువ వీస్తోంది, అందుమూలంగా ఎక్కువ ఖర్చు పెట్టవలసివస్తోందని, పన్ను పెంచుతానని ప్రజలని బెదిరించడం మొదలెట్టేడు. ఇది విన్న ప్రజలు బాబూ! పన్ను పెంచకండి, మీకు నజరానా చెల్లిస్తామని ప్రజలే ఎదురొచ్చి లంచం ఇవ్వడం ప్రారంభించారు, ఉద్యోగికి కాలం మూడు పువ్వులు ఆరు కాయల్లా నడచిపోతోంది, ఖజానాకీ సొమ్ము జమపడుతోంది, రాజు గారు ఆనందంగానే ఉన్నాడు. ఉద్యోగి ఇలా పన్ను పెంచుతానని ప్రజల దగ్గర సొమ్ము వసూలు చెయ్యడం నచ్చనివారు రాజుకి ఫిర్యాదు చెయ్యడం మొదలెట్టేరు, ఉద్యోగి లంచం తీసుకుంటున్నాడని. రాజుకి చర్య తీసుకోడానికీ కుదరటం లేదు, ప్రభుత్వ సొమ్ము ఖచ్చితంగా వస్తోంది కదా!. ఫిర్యాదుల జోరు పెరిగింది, ఉద్యోగి లంచం తీసుకోడమూ పెరిగింది. కథ మళ్ళీ మొదలు కొచ్చింది, రాజు గారికి. మళ్ళీ దీర్ఘంగా అలోచించి, ఇతనిని ఇంతకంటే పనీ పాటూ లేని చోటకి బదిలీ చెయ్యాలని నిర్ణయించి, మంత్రితో కూడా ఆలోచించి, దివాణం లో గంటలు కొట్టే పనికి బదిలీ చేసేరు. ఆ కాలంలో ఇసుక గడియారాలే తప్పించి మరో విధానం లేదు, కాల గణనకి. అది కూడా కలిగినవారికే కాని సామాన్యులకు అందుబాటులో లేకపోవడం మూలంగా, ప్రజల సౌకర్యార్థం, సమయం తెలియడానికి గంట గంటకీ ఎన్ని గంటలయ్యింది, అన్ని సార్లు గంట వాయించే ఉద్యోగం ఇచ్చారు. అమ్మయ్య! సమస్య తీరిందనుకుని రాజు సంతసించాడు, ఇక్కడ లంచం పుచ్చుకోడానికి సావకాశం లేదు కదా అని తలపోశాడు….. లంచం ఇచ్చేవాడూ ఉండడనుకున్నాడు.

కాలం గడిచింది, జీవితం నిస్సారంగా గడచిపోతోందని విచారించి, ఒక రోజు గంట సమయం పూర్తి కాకుండానే గంట కొట్టడం, అందునా రాత్రి పన్నెండులోపు ఇలా చెయ్యడం ప్రారంబించాడు.  మూడు గంటల సమయాన్ని  నాలుగు గంటలయినట్టుగా గంటలు కొడుతున్నాడు. రాజుగారు రాత్రి పన్నెండు దాకా చిన్న రాణి ఇంటిలోనూ, ఆ తరవాత పెద్ద రాణి దగ్గర ఉండటం అలవాటు. గంటలు తొందరగా అయిపోతున్నట్లు గ్రహించిన చిన్న రాణి, ఇది పెద్ద రాణి పన్నాగంగా భావించి గంటలు కొట్టే ఉద్యోగి భార్యను పిలిచి సత్కరించి పంపింది. ఉద్యోగి భార్యకి సత్కారం చెయ్యడం, దండిగా నగలు ఇవ్వడం మూలంగా ఉద్యోగి, గంటలు సాగతీయడం మొదలు పెట్టేడు. రాత్రి ఒంటి గంటకి పన్నెండు గంటలు కొడుతున్నాడు. రాజుగారు ఆలస్యంగా రావడాన్ని గమనించిన పెద్దరాణి, తన గూఢచారుల ద్వారా చిన్నరాణి గంటలు కొట్టేవాని భార్యకు చేసిన సత్కారం గురించి తెలుసుకుంది. కర్తవ్యం బోధ పడింది. ఇంకెందుకు ఆలస్యమని ఆమె కూడా ఉద్యోగి భార్యను సత్కరించింది భారీగా. దానితో మళ్ళీ గంటలు కొట్టడం తేడా వచ్చింది. ఇలా ఇద్దరు రాణుల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా సొమ్ములు వసూలు చేస్తూ కాలం గడుపుతున్నాడు, సమయాన్ని పెంచడం తగ్గించడం చేస్తూ.. ఇది గమనించిన రాజు తాను ఉద్యోగిని పిలిచి ఈ రాత్రి చిన్నరాణి గారి దగ్గర ఎక్కువ కాలం ఉండాలని ఉందని, ఒక్కొకప్పుడు పెద్ద రాణీ గారి దగ్గర ఎక్కువ కాలం ఉండాలని ఉందనీ చెప్పి తదనుగుణంగా గంటల్లో మార్పు చేసి కొట్టించుకోవడం మొదలెట్టేడు, అందుకుగాను బహుమానాలూ ఉద్యోగికి ముడుతున్నాయి, దండిగానే. ఉద్యోగి పని మూడు గంటలు ఆరు బహుమతులుగా రోజు నడచిపోతోంది…..

ఈ కథని బట్టి మనకి అర్థమవుతున్నదేమి?

1.లంచం పుచ్చుకోవాలనే ఉద్దేశం ఉండాలి కాని సావకాశం వెతుక్కోవచ్చు, తప్పు చేసి తప్పించుకోనూ వచ్చు.


2.రాజే స్వయంగా లంచం ఇవ్వడం చిత్రం కదా! “కంచెయే చేను మేసిన కలదె దిక్కు” ప్రజలకి దిక్కెవరు? రాజే స్వయంగా ఎందుకివ్వాలసివచ్చింది, లంచం? ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేక. ఈ లంచం మరొకరిచేత ఇప్పిస్తే మరీ వీధిన పడిపోతాడు కనక, స్వయంగా సమర్పించుకుంటూ వచ్చేడు.


3. ఇప్పుడు ఈ ఉద్యోగిని ఇక్కడినుంచి మరో చోటికి బదిలీ చేసే సావకాశం కూడా లేదు. బదిలీ చేస్తే రాజు గుట్టు రట్టవుతుంది కదా!


4.రాజు మొక్కగా ఉన్నపుడు సరి అయిన చర్య తీసుకుని ఉంటే మానుగా పెరిగేది కాదు.


5.పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి పుడకలతో కాని పోదుకదా! చెడ్డ అలవాటయితే పోవడం కష్టమే!

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కెరటాల పన్ను

 1. శర్మ గారూ ,

  నమస్తే .

  లంచగొండులను పై అధికారులే తమ స్వలాభాల కొఱకు పెంచి అలా పోషిస్తుంటే , ఏపుగా పెరుగుతుందే గని , మాపు అవటానికి పెనుతుFఆను లాంటిది అవసరం .

  మన ప్రభుత్వాలు అలాగే వున్నాయి .

  కనుక ఏదైనా అలాటు కానంతవరకు అసలు స్వరూపం కనపడ్తుంటుంది . అలవాటైన తర్వాత అసలు రూపమే కనుమరుగైపోతుంది .

  కనుక ప్రక్షాళన పై వర్గాల నుంచే ఆరంభమవ్వాలన్నమాట . కింద వర్గాల నుంచి కూడా మొదలవచ్చు . ఆయితే అధిక ఫలితాన్నివ్వలేవు .

  • శర్మాజీ,
   నీతి పై వర్గాలనుంచి కిందికి వస్తుంది. ఊర్ద్వమూల మధశ్శాఖా! పై వర్గాలు, ప్రభుత్వాలే అవినీతిని పెంచి పోషిస్తున్నాయి
   ధన్యవాదాలు.

 2. కథ బాగుందండి.

  మీ బ్లాగుతో ఉన్న చనువుతో ఇక్కడ “మాలిక” కు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.

  ఒక కాలమ్‌లో “ప్రజ”, మరొక కాలమ్‌లో “శంకరాభరణం” తప్ప మిగతా బ్లాగుల వ్యాఖ్యలు సరిగా కనపడడంలేదు.
  దయచేసి ఈ రెండు బ్లాగుల వ్యాఖ్యలు ఒకే కాలమ్‌లో ఉంచి మిగతా బ్లాగుల వ్యాఖ్యలని రెండో కాలమ్‌లో వచ్చేలా చూడండి.

  • బోనగిరిగారు,
   నచ్చినందుకు, ధన్యవాదాలు.
   పాపం వారు కూడా ఏమీ చేయలేరేమో అనిపిస్తూంది. తప్పదు. Survival of the fittest is the rule of nature.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s