పోతనగారి చమత్కారం.
భాగవతం మొదలుపెడుతూ ఇలా అన్నారు.
శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలనకళారంభకున్ దానవో
ద్రేక స్తంభకు గేళీలోలవిలసద్దృగ్జాల సంఘాతనా
నా కంజాతభవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.
అని శ్రీవారిని స్తుతించారు. మరికొన్ని పద్యాలలో స్తుతి కొనసాగిస్తూ అమ్మలగన్నయమ్మ ఆది పరాశక్తి శ్రీవారి తల్లిని స్తుతించారు.
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాభ్ధి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
హరికిన్ బట్టపుదేవి పున్నెములప్రో వర్ధంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేముల్ బాపు తల్లి సిరియిచ్చున్ నిత్యకల్యాణముల్
శ్రీవారికి పట్టపుదేవి, మా పుణ్యాలమూట, రత్నాల రాశి ( మనం సాధారణంగా కావలసినవారిని అనుకునేమాటలే కదూ) చంద్రునితోబుట్టువు అనడం లో చందమామవంటి ముఖం కలిగినదని, చంద్రునిపోలికతో అందంగా ఉన్నదనీ కదా! పార్వతి, సరస్వతులతో ఆడుకునే తల్లి, తామరపూలలో ఉండే తల్లి, ప్రపంచమంలోనివారంతా మన్నించే తల్లి, నిజమే కదా ఇరుసున కందెన బెట్టక పరమేశుని బండి యైన బారదు సుమతీ అన్నట్టు లచ్చి తల్లి లేకపోతే ఏపనీ జరగదు కదా! అటువంటి సిరి తల్లి, చిన్నతల్లి మాకు నిత్య కల్యాణాలివ్వాలి అని శ్రీవారి దేవేరిని వేడుకున్నారు. మరి తర్వాత
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెటవాటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.
ఈ అధములైన రాజులకి కావ్యాన్ని అంకితమిచ్చి, అగ్రహారాలు, సొమ్ములు పుచ్చుకుని, ఆ తరవాత యముని దండనకి గురి కాను, శ్రీహరికే అంకితమిస్తాను అని ఘంటాపధంగా చెప్పి సరస్వతిని, ఎవరామె ఇంటి కోడలు,అత్తగారి ఆజ్ఞ అయినా కోడలుగారి అనుగ్రహం లేక ఏదీ జరగదు, అత్తగారు కూడా తాను కోడలి ద్వారనే అనుగ్రహిస్తుంది కదా, అందుకు ముఖ్యమైనది ఆమెను ఊరడించారు, స్తుతించారు.
అయ్యో చివరికి మిగిలిపోయానా నేనంటే ఇంత చులకనా అని కోపగించుకుంటుంది, ఇంటి ఆడపడుచు పార్వతీ దేవి, ఈవిడకి అసలే ముక్కుమీదుంటుంది కోపం, ఒకప్పుడు పరమేశుడే కాలీ అని పిలిచినందుకు అనగా నల్లని దానా అని హాస్యమాడినందుకే శరీరం విడిచిపెట్టేసింది, ఆ తరవాత మరొక అవతారంలో దాక్షాయనిగా జన్మించి హరుని చేరి తండ్రి చేత అవమానింపబడి శరీర త్యాగం చేసిన అభిమాని. మరీ ఈవిణ్ణి చివరికి పెట్టేస్తే కోపం వచ్చేస్తే అందుకు పోతనగారు చేసిన చమత్కారం చూడండి, శ్రీ వారి అనుగ్రహం కోసం ఆయనకు కావలసినవారిని స్తుతించారు, మరి అలాగే శ్రీవారి తోబుట్టువుకు కావలసినవారెవరు? పరమేశుడు కదా అందుకు
చేతులారంగ శివుని బూజింపడేని నోరునొవ్వంగ హరి కీర్తి నుడువడేని
దయయు సత్యంబులోనుగా దలుపడేని కలుగనేటికి దల్లుల కడుపుచేటు.
శివుణ్ణి పూజించని వారు, శ్రీవారిని పొగడలేనివారు, దయ సత్యం లేని వారు పుట్టడమెందుకయ్యా, తల్లులకి కడుపుకోత తప్పించీ, అని పరమేశ్వరుని స్తుతించి, ఆమె అన్నగారిని కూడా కలిపి వీరిద్దరూ ఒకటే సుమా అని చేప్పేరు, పరమేశ్వరి సంతసించింది. ఇప్పుడు అందరమ్మలూ ఆనందం పొందారు. అలా ఉన్న సమయంలో నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, ఆజానుబాహుడు కనపడ్డాడట, ఆయనతో మాటాడదామనుకునే లోగానే ‘పోతనా! భాగవతం తెనిగించవయ్యా అని ఆనతిచ్చి తిరోహితులయ్యారట’ శ్రీరాముని అవతారంలో. ఇంకేమి
పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట పలికెద వేరొండు గాధ పలుకగనేలా!
చెప్పేది భాగవతమా, రాముడే చెప్పిస్తున్నాడు, మరింకెందుకూ, పాపాలు తొలిగిపోతాయి అని
భాగవతం మొదలు పెట్టేరు.
———————
————————————-
భాగవతం నుంచి కొన్ని అమృత గుళికలు
ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెదు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే’
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వడు, నేకాకృతి వెలుగునతని నే సేవింతున్.
“నీ పాద కమల సేవయు, నీపదార్చకుల నెయ్యమును,నితాం
తాపార భూతదయయును, దాపసమందార! నాకు దయసేయగదే.”
లేమా! దనుజుల గెలువగ లేమా నీవేల గణగి లేచితి విటు రా
లే మాను మాన వేనిన్, లేమా విల్లందుకొనుము లీలం గేలన్
గాలిం గుంభిని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్
రేలన్ ఘస్రములన్ దమః ప్రభల భూరి గ్రాహా రక్షో మృగ
వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమతాస్త్రశ
స్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ యిప్పింపవే
మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్
జచ్చుచునుండ జూచెదరు చావక మానెడు భంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావుకు నొల్లక డాగవచ్చునే;
యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్.
జలధరదేహు నాజాను చతుర్భాహు సరసిరుహాక్షు విశాలవక్షు
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు గంఠ కౌస్తుభమణి కాంతిభాసు
గమనీయ కటిసూత్ర కంకణకేయూరు శ్రీవత్సలాంఛనాంచితవిహారు
నురుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైడూర్య మణిగణ వరకిరీటు
బాలు బూర్ణేందు రుచిరజాలు భక్తలోక
పాలు సుగుణాలవాలు కృపావిశాలు
జూచి తిలకించి పులకించి చోద్యమంది
యుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించె.
అన్న! శమింపుమన్న! తగదల్లుడు కాడిది మేనకోడలౌ,
మన్నన సేయుమన్న! విను మానిని చంపుట రాచ పాడిగా
దన్న! సుకీర్తివై మనగదన్న! మహాత్ములు వోవుత్రోవ భో
వన్న భవత్సహోదరికదన్న! నినున్ శరణంబు వేడెదన్.
పావనమయ్యె నా కులము పండెదపంబు గృహంబు లక్ష్మికిన్
సేవితమయ్యె నిష్టములుసేకుఱె విశ్వనిదానమూర్తులై
భూవలయంబుగావ నిటు పుట్టిన మీరలు రాక చేసి నే
నేవిధ మాచరింతు బను లెయ్యవి బంట నెరుంగ జెప్పరే.”…
స్తన భారంబున డస్సి క్రుస్సి యసదై జవ్వాడు మధ్యంబుతో
జనిత స్వేదముతో జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో
వనజాతేక్షణ కూడబాఱి తిరిగెన్ వారించుచున్ వాకిటన్
ఘన యోగేంద్రమనంబులన్ వెనుకొనంగాలేని లీలారతున్
పట్టిన పట్టుబడని నిను,బట్టెదమని చలము కొనిన బెట్టే
పట్టుపడవండ్రు పట్టీ పట్టుకొనన్ నాకుగాక పరులకు వశమే
పానీయంబులు ద్రావుచున్, కుడుచుచున్, హాసలీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతు డేతద్విశ్వమున్ భూవరా! …
మేల్కొన్న తెరంగున మెల్లన్ గనువిచ్చి క్రేగంట జూచుచు గిదికి నీల్గి
యావులించుచు జేతులాకాశంబున జాచి యొదిగిలి యాకొన్న యోజ నూది
బిగి చన్నుగవ గేల బీడించి కబళించి గ్రుక్క గ్రుక్కకు గుటుకు గుటుకు మనుచు
నొకరెండు గ్రుక్కల నువిద ప్రాణంబులు సయితము మేనిలో సత్వమెల్ల
ద్రావె నదియును గుండెలు దల్లడిల్ల
జిమ్మ దిరుగుచు నిలువక శిరము వ్రాల
నితరబాలుర క్రియవాడ వీవుగావు
చన్నువిడువుము విడువుము చాలు ననుచు.
దిక్కులు గెలిచితినన్నియు,దిక్కెవ్వడురోరి!నీకు దేవేంద్రాదుల్
దిక్కుల రాజులు వేఱొక, దిక్కెరుగక కొలుతు రితడె దిక్కని నమ్మిన్.
బలయుతులకు దుర్బలులకు, బలమెవ్వడు నీకునాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు ప్రాణులకును, బలమెవ్వం డట్టి విభుడు బలమసురేంద్రా! అంటూ
దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండగలుగు దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి, దిక్కెయ్యది యదియ నాకు దిక్కు మహాత్మా!
“కారేరాజులు, రాజ్యముల గలుగవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటకట్టుకొని పోవం జాలిరే భూమిపై
పేరయినం గలదే శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే ఇక్కాలమున్ భార్గవా!
ఆదిన్ శ్రీ సతి కొప్పుపై దనువుపై సంసోత్తరీయంబుపై
పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ చెందు కరంబు కిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమన్ సతతమే కాయంబు నా పాయమే!
మచ్చికవీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్
జచ్చుచునుండ జూచెదరు చావక మానెడు వాని భంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావుకు నొల్లక డాగవచ్చునే?
యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్…
కింకలు ముద్దు బల్కులును గెంపు గనుంగవ తియ్యమోవియున్
జంకెలు తేఱిచూపులెకసక్కెములున్ నెలవంక బొమ్మలున్
గొంకక వీడనాడుటలు గూరిమియుం గల కాంత గూడుటల్
అంకిలిలేక జన్మఫల మబ్బుత గాదె కురంగలోచనా!.
ఓడితివో శత్రువులకు,నాడితివో సాధు దూషణాలాపంబుల్
గూడితివో పరసతులను,వీడితివో మాన ధనము వీరుల నడుమన్…
తప్పితివో యిచ్చెదనని,చెప్పితివో? కపట సాక్షి, చేసిన మేలుం
దెప్పితివో? శరణార్ధుల, రొప్పితివో? ద్విజుల బసుల రోగుల సతులన్…..
అడిచితివో?భూసురులను గుడిచితివో? బాల వృద్ధ గురువులు వెలిగా
విడిచితివో? యాశ్రితులను, ముడిచితివో? పరుల విత్తములు లోభమునన్…
మన సారధి,మనసచివుడు,మనవియ్యము,మనసఖుండు,మనబాంధవుడున్
మనవిభుడు,గురువు,దేవర మనలనుదిగనాడి చనియె, మనుజాధీశా!
ఇది మొన్న జన్మాష్టమి కోసం మొదట రాసిన టపా
>>> మచ్చికవీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్…….
ఇది పోతన గారిదా? నేను తిక్కన గారిది అనుకున్నాను.
ధన్యవాదాలు.
మిత్రులు సుబ్రహ్మణ్యంగారు,
బ్లాగులో బహుకాల దర్శనం.
హిరణ్యకశిపుడు చెప్పినమాటండి ఇది, పోతనగారు బహు రమ్యంగా చెప్పేరు కదా!
ధన్యవాదాలు.
కష్టే ఫలే వారు,
బాగు బాగు !!
పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట పలికెద వేరొండు గాధ పలుకగనేలా!
జిలేబి
జిలేబిగారు,
జన్మాష్టమికి ఈ టపా రాసి నచ్చక వెయ్యలేదు, మరొకటి రాశా.చాలామంది చదివారు, ఇంతమందికి నచ్చుతుందనుకోలేదుస్మీ
ధన్యవాదాలు.
చాలా బాగుందండి. పద్యాలు కొంచెం పెద్ద అక్షరాలతో ఉంటే ఇంకా బాగుండేది.
suresh babu గారు,
మీ సూచన గమనించా.
ధన్యవాదాలు.