శర్మ కాలక్షేపంకబుర్లు-కాపీ కొట్టడం కళ.

download

bapu sign

బాపు ఇక లేరన్న వార్త మనసును పిడుగులాతాకింది, మనసు మూగపోయింది. వారి కుటుంబ సభ్యులకిదే నా సహానుభూతి. బాపు స్మృతికి అశ్రు నివాళి.

కాపీ చెయ్యడానికి కుదరనివి బాపు బొమ్మలు.

unnamed

అశ్రు నివాళి

-^-

===================================================

కాపీ కొట్టడం  కళ. 

కాపీ కొట్టడమా? కాఫీ కొట్టడమా? ఇప్పుడు కాపీ కొట్టడమేలెండి. కాఫీ కొట్టడం కూడా కళే అది మరో సారి.

ఆయన కరూశ దేశపు మహరాజు, ఇప్పుడు కరూశని ఏమని పిలుస్తున్నారో తెలియదు, రాజు పేరు పౌండ్రక వాసుదేవుడు. ఈయనకి కోపం వచ్చింది, కృష్ణునిపై, ఎందుకుట? “ఈ భూమి మీద వాసుదేవుని పేరుతో నేను కాక మరొకరుండటమా, అదిన్నీ, అన్నీ అలంకారాలూ నాలా చేసుకుంటూ” అని కోపించాడు. ’రాజు తలచుకుంటే దెబ్బకి కొదవా’ అని నానుడి, వెంటనే ఒక దూతని పిలిచి ఇలా చెప్పి పంపేడు, శ్రీ కృష్ణుని దగ్గరికి.

నా పేరును నా చిహ్నము, లేపున ధరియించి తిరిగెదిది పంతమె యిం
తే పో మది బరికించిన, నే పంత మెఱుగు గొల్లడేమిటనైనన్….భా..స్కం..10..505

ఇంతనుండియైన నెదిరి దన్నెఱిగి నా
చిహ్నములెల్ల విడిచి చేరి కొల్చి
బ్రతుకుమనుము కాక పంతంబులాడెనా
యెదురుమనుము ఘోర కదనమునను…..506

నా పేరు పెట్టుకుని నేను చేసుకునే అలంకారాలన్నీ చేసుకుని తిరుగుతున్నావు, ఇదేమీ పంతమా? ఐనా పంతం మాకుగాని, గొల్లాడివి నీకు పంతమేంతెలుసు? ఇప్పటినుంచైనా నా పేరు, చిహ్నాలు విడిచి పెట్టి నన్ను శరణు వేడితే బతుకుతావు, లేదా యుద్ధానికి సిద్ధం కమ్మని కబురెట్టాడనమాట. ఇది విన్న కృష్ణుడు అలాగే యుద్ధంలో కలుసుకుందామని చెప్పమని దూతని పంపేసేడు, మిగిలినవారు మాత్రం దూత పలికిన పలుకులకు కోపించారు, శ్రీ కృష్ణుడు మాత్రం వారించాడు. ఘోర యుద్ధం జరిగింది, అందులో పౌండ్రకుడు పరలోకగతుడే అయ్యాడు. తగువు తీరిపోయింది.

మరొకరిలా ఉండాలనుకోడం పొరపాటు. మనలా మనమే ఉంటాం. ఎవరి ప్రత్యేకత వారిదే. మరొకరిలా ఉండాలని ప్రయత్నిస్తే మన ప్రత్యేకత పోవటం లేదూ. పరమాత్మ ఏం చెప్పేరు? ”పరధర్మో భయాపః” ఎంత చెడ్డదయినా స్వధర్మాన్నే పాటించాలి, పర ధర్మం ఎంత గొప్పదయినా పనికిరాదనే కదా! ఇక్కడ ధర్మం అంటే మన నైజం కూడా చెప్పుకోవచ్చు.

నా టపాలయితే చాలా కాపీ చేసుకున్నారు. కొంత మంది నా పేరుతో దాచుకున్నారు, వారికి నమస్కారం. కొందరు నా టపాలు వారి టపాలుగా రాసుకున్నారు, వారికి రెండు వందనాలు. ఇలా మరీ ఎక్కువగా, ఒక టపా చాలా సార్లు కాపీ అయి చాలా చోట్ల కనపడింది.

ఈ మధ్య ఒక బ్లాగు చూశాను, టపా మిరపకాయిలా ఉంది. ఎవరా? రాసినది కుతూహలం ఆగక, ఈ బ్లాగు ఇప్పటిదాకా చూడలేదే, అనుకుని వెతుకులాట మొదలెడితే,అది మరొక బ్లాగుకి దారి తీసింది, టపాలు చీమ మిరపకాయల్లా ఉన్నాయి. చాలా బాగా రాసేరనుకుని చదవడం మొదలెడితే, కొన్ని టపాలు కనపడ్డాయి, ఇదేంటీ? ఇవేవో నేను రాసి బ్లాగులో పెట్టుకున్నవి కదా అనుకుని చూస్తిని కదా! కావలసినన్ని నా టపాలు అక్కడ కనపడ్డాయి. సంగతి అర్ధమైపోయింది. పేరు చెప్పను కాని వారికి నా సవినయ వినతి, మీరు నా టపాల పట్ల చూపిన మక్కువకి ఆనందం, మీకు అభినందన. కాని మీరు దానిని మీబ్లాగులో మీపేరుతో ఉంచుకోడం మాత్రం బాగోలేదేమో అనుకుంటాను.నేను చెప్పిన మాట తప్పయితే మన్నించమని వేడుకుంటున్నా. కొన్నాళ్ళ తరవాత ఎవరేనా మీ బ్లాగు నా బ్లాగు చూడటం కనక తటస్థిస్తే ఏంటీ! ముసలాయన ఇలా కాపీ టపాలు కూడా రాసుకున్నాడా అనుకుంటారని తప్పించి వేరు కాదని సవినయ మనవి. నా టపాలకి ఇంత గిరాకీ ఉందా? అని ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారి కలిగాయి.

ఇహ పోతే, నాకూ సహవాస దోషం అబ్బేసిందా? తెల్లారి లేచి పేపర్ చూసినా, టి.వీ పెట్టినా అంధ్రాని, తెలంగాణాని సింగపూర్ లా చేస్తామన్న ప్రకటనలే కనపడుతున్నాయి, సింగపూర్ ప్రదక్షిణలూ ఉంటున్నాయి. సింగపూర్ వాళ్ళు, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళున్నారు, మన అవసరాన్ని బట్టి మనం ఉండాలి. ఒకరెవరో చుడీదార్ తొడుక్కుంటే అందంగా ఉన్నారని నేను చుడీదార్ వేసుకుంటే బాగోదు కదా! నేను నాదయిన చీర కట్టుకుంటేనే అందం. వాళ్ళలా పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు ఎందుకు? వాళ్ళకి చోటులేదు, మనకేం? ఇలాగే చాలా విషయాలలో మనకి వాళ్ళకి తేడాలున్నాయి, మంచి తీసుకుందాం, దానిని మనకి కావలసినట్టు, మనదైనట్టు, మన అవసరానికి తగ్గట్టు మలచుకుందాం, అప్పుడు కాపీ కొట్టిన అందం ఉంటుంది. అసలు కాపీ ఎందుకు కొట్టాలి? మనదైన ఆలోచన లేదా? మనకు ఆలోచన రాదా? ముందు అది ఆలోచించండి. మన తెలివైనవాళ్ళందరిని దేశం నుంచి తరిమేస్తున్నామా? తరిమేశామా? సత్య మావాడని బోర విరుచుకోడం కాదు, అదే సత్య ఇక్కడున్న కాలంలో గుర్తించిన పాపాన పోయిన వారు లేక విదేశం పోవలసి వచ్చిందే! ఇక్కడున్న వారి తెలివితేటల్ని ఉపయోగించుకునే అలవాటు రాదా?

మన దేశం లో ఏ ఫైల్ అయినా బరువు పెట్టనిదే కదలదు. అసలు సింగపూర్ వాళ్ళలో ఉన్నది మన దగ్గర నిజంగా లేనిది దాన్ని కాపీ ఎందుకు చెయ్యం?

ఆ ఒక్కటీ అడక్కు, అది తప్ప…..అన్నీ కాపీ చేస్తాం.

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కాపీ కొట్టడం కళ.

 1. నాకూ కొన్ని పర్యాయాలు ఇలానే జరిగింది శర్మగారు. సాక్షాత్తూ కొన్ని న్యూస్‌పేపర్ల వాళ్ళే అక్షరానికి అక్షరం దొంగిలించి కనీసం నా పేరుకూడా ప్రస్తావించకుండా ప్రింటు చేశారు. గట్టిగా అడిగితే ఆన్‌లైన ఎడిషన్‌లో క్రెడిట్స్ ఇచ్చారు. అలాగే ఒక మహానుబావుడు నా బ్లాగ్‌లో చాగంటి వారి గురించిన ఆర్టికల్ నుంచి సగానికి పైగా తస్కరించి తనదిగా పోస్ట్‌చేసుకొన్నాడు. ఏమని అడిగితే `మీ నుంచే కాదు, చాలా చోట్లనుంచి సేకరించి వ్రాసాను. తప్పేంటి?` అని బూకరించాడు. సెల్ఫ్‌రెస్పెక్ట్ లేనివాళ్ళు చేసే పనులు అలాగే ఉంటాయి. మన కంటెంట్‌ని కాపాడుకోవడానికి ఒక్కోసారి పోరాటం తప్పదు.

  • వర్మాజీ,
   నాకు నిత్యమూ జరుగుతున్నది కనక అలవాటయిపోయింది. ఒక పేపరు వారు నా టపాలు వేసుకుంటామన్నారు, వారి ఏజంట్ అడిగాడు, వేసుకోమన్నా. టపాలు వారివిగానే వేసుకుంటున్నారు, కానిద్దురూ. హక్కుల కోసం ఎందుకో నాకైతే పోరాడాలని లేదు సుమా!

   ఒక సారి ఒక మనవరాలి సింగపూర్ నించి మైల్లో పిలిచి తాతగారు, మీ టపా ఒకటి మక్కికి మక్కి ఫలానావారి బ్లాగులో ఉంది చూడండి అని చెబితే చూశాను. అప్పటికే ఒక మిత్రులు ఈ టపా ఫలానా వారి బ్లాగులో మొన్ననీ మధ్య వేసిన టపాకదా! వారి పేరు మీరు ఉటంకించి ఉంటే బాగుండేదని అడిగేసేరు కూడా. దానికి వారు బుకాయింపు కూడా చెప్పేసేరు. ఇలాగే ఉన్నాయి, పోనివ్వండి.బంగారం ఉంటేనే కదా చోరులొస్తారు. అసలు బంగారమే లేకుంటే? ఉన్నది నాది కాదనుకుంటే?
   స్వాభిమానం ఉన్నవారీ పని చెయ్యరంటారా? ఏమో నేనా మాట కూడా అనటం లేదు సుమా!

   ధన్యవాదాలు.

 2. బాపు గారి వంటి మహనీయుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
  …………..

  కాపీ విషయం గురించి చూస్తే , జిలేబీగారికి అనిపించినట్లే నాకూ అనిపించిందండి.

  ( జిలేబీ గారు వ్రాసినట్లు… మీరు , ఆ యా బ్లాగుల పేర్లు , టపా లింకులు మీ టపాలో ఇచ్చి, గ్రంధ చౌర్యం గురించి రాయాలి . ఇట్లా అట్లా అక్కడ చూసాను ఇక్కడ చూసాను అంటే అది వారికి చురక వెయ్యదు ఎందు కంటే ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు కాబట్టి

  కావున మీరు ఆ యా లింకులు మీ ఓ టపాలో ఇచ్చినారంటే వారి గుట్టు రట్టు అగును.)

  అన్నదే నా అభిప్రాయం కూడానండి.

  • అనురాధ,
   తస్కరాయనమః, రమణులు ఒకసారి ఆశ్రమంలో దొంగతనానికి వచ్చినవారిని మిగిలినవారు అడ్డగిస్తుంటే ఆపి, అక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ అవి ఉన్నాయని చూపి మరీ ఇచ్చారట. అది చూసిన మిగిలినవారడిగితే, పాపం ఎంతలేక మన దగ్గరకొచ్చారో వారు,అన్నారట. తస్కరాయనమః, వీరిలో కూడా భగవంతుని చూడగలిగినవారికి నమస్కారం. వారికి ఎంత మక్కువ కలిగిందో ఆ టపాలు పెట్టుకోవాలని, పోనిద్దురూ, అసలిదంతా చెప్పడం నాదే తప్పు.
   బాపూ గారి గురించి ఏం చెప్పను, మనసే నూగపోతే…..మాటే లేదు.
   ధన్యవాదాలు.

 3. శర్మ గారు,

  మీరు ఈ మేటరు మీద సీరియస్ అయితే, ఆ యా బ్లాగుల పేర్లు , టపా లింకులు మీ టపాలో ఇచ్చి, గ్రంధ చౌర్యం గురించి రాయాలి . ఇట్లా అట్లా అక్కడ చూసాను ఇక్కడ చూసాను అంటే అది వారికి చురక వెయ్యదు ఎందు కంటే ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు కాబట్టి

  కావున మీరు ఆ యా లింకులు మీ ఓ టపాలో ఇచ్చినారంటే వారి గుట్టు రట్టు అగును (కొంప దీసి ఇందులో నా బ్లాగు ఏమైనా ఉందా ? గుమ్మడి కాయ దొంగ కథ గుర్తు కొస్తున్నది!! -జేకే! )

  బాపు గారికి నివాళి ఇవ్వడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి వారికి నమస్కారాలు – వారే లోకం లో ఉన్నా మరిన్ని మెరుగులు దిద్దు కుని మళ్ళీ ముళ్ళ పూడి వారి తో సహా ఆంధ్ర లోకం లో కి వస్తారని ఆశిస్తూ

  జిలేబి

  • జిలేబిగారు,
   నేనీ విషయాన్ని అంత ముఖ్యంగా తీసుకోలేదనే మనవి. ముందే చెప్పాను ఇది అశక్త దుర్జనత్వమని. వారికి కూడా తెలిస్తే చాలన్నదే నా ఉద్దేశం. ఒక సారి మీలాగే కోపమూ వచ్చింది ఆ వెంబడే నవ్వూ వచ్చింది. అదీ సంగతి.
   అన్నట్టు మీ దే ఒఅక్ టపా మీతో చెప్పే నేను కొట్టేసేనుకదూ! నావేమీ మీదగ్గరలేవులెండి.
   బాపూ రమణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఇందులో కూడా రాజకీయం చేస్తున్న మహానుభావులున్నారు, అదీ విచారైంచ తగిన సంగతి.
   ధన్యవాదాలు.

 4. శర్మ గారూ ,

  నమస్తే .

  కాపీ కొట్టి తమ బ్లాగులో పెట్టుకోవలసినంత కాపీనం ఏందుకొచ్చిందో ఆ బ్లాగుదారునికి ?
  మీవి కాని మరెవరివి కానీ మరీ మరీ నచ్చితే తమ బ్లాగులో పెట్టుకొంటూ ,

  “ఇది ఫలానా బ్లాగు వారిచే రచించబడ్డది . నాకు మహ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది . నేను అంతర్జాల పుణ్యమా బహు సులభంగా కాపీ కొట్టేసి నా బ్లాగులో పెట్టేస్తున్నాను . అలా చేయకుంటే ముందు ముందు మళ్ళీ మళ్ళీ చదవాలనుకొన్నప్పుడు ఆ అవకాశం లభించదేమోనని నా బ్లాగులో పెట్టేసుకుంటున్నాను . దయచేసి అర్ధం చేసుకొనవలసింది అందరూ .”

  వ్రాయటం కనీస నైతిక ధర్మం .

  నిజానికి రచించిన వారి అనుమతి లేకుండా ఏ ఒక్కరూ కాపీ చేయకూడదు . ఓ వేళ తీసుకోకపోయినా ఆ రచయిత సౌజన్యంతో అనైనా వ్రాసి తీరవలసిందే ఆ టపాలో .

  ఈ ప్రపంచంలో కాపీయే కాదండి కొట్టటం కూడా కళయే . అంతెందుకు ప్రతిదీ కళయే .

  ఈ మధ్య పదే పదే సింగపూర్ పేరు వినపడ్తూనే వున్నది . సింగపూరులా చేస్తానంటే ఆయన ఉద్దేశం యిది అయి వుండవచ్చు .
  సింగపూర్ అందాలని వాళ్ళొక్కళ్ళే చూసి వుండవచ్చు . మిగిలిన వాళ్ళందరికీ ఆ అవకాశం వుందదన్న గట్టి నమ్మకంతో , అందరికీ ఆ సింగపూరుని చూపించాలనుకొని వుండవచ్చు . అందుకేనేమో పదే పదే సింగపూరుని మీ కళ్ళ ముందుంచి , కాళ్ళముందుకు తెస్తామంటున్నారు .
  ఇలాగైతే యిక్కడివాళ్ళందరికీ ( కానీ ఖర్చులు లేకుండా ) చుపించవచ్చుగదా !
  కొంచెం ఆలోచించి చూడండి .

  అర్ధం చేసుకొని

  • శర్మాజీ,
   షేర్ చెయ్యడాన్ని తప్పు పట్టను, అలా చేసినపుడు మొత్తం టపా పేరుతో సహా వుంటుంది కనక ఇబ్బంది లేదు. పేరు తీసేసి తమదిగా పెట్టుకుంటున్నందుకే ఈ బాధ.

   నిజమే సింగపూర్ ని కాణీ ఖర్చులేకుండా మాటల్లోనే చూపించేస్తున్నారు.
   ధన్యవాదాలు

 5. మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను .మనకి మంచిబ్లాగులు రాయడం రాకపోతే ఇతరులవి మంచి బ్లాగులు చదువుకొని సంతోషించవచ్చును.కావాలంటే దాచుకోవచ్చును. అంతేకాని గ్రంథచౌర్యం గర్హించదగిన విషయం .
  ఇక రెండో విషయం; వైజాగో,విజయవాడో,లేక కొత్త రాజధానో ఎంచుకొని సింగపూర్ లాగ తయారు చెసుకో వచ్చును .పూర్వం లాగ 30,40,ఏళ్ళు అవసరం లేదు.అధునాతన పద్ధతుల్లో 10,15 సంవత్సరాల్లో చేసుకోవచ్చును. అంతేకాని మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని కాని,తెలంగాణాన్ని కాని సింగపూర్ను చేస్తామని ప్రగల్భాల్ని పలకకూడదు. ఎవరూనమ్మరు.ఇప్పటికంటే బాగుచేసి అభివృద్ధి చేస్తే చాలు. 3. బాపూ గార్ని గురించి ఇప్పటికే చాలామంది రాసారు.నేను ప్రత్యేకంగా రాసేదేమీ లేదు.నా ఫ్రగాఢ సంతాపాన్ని తెలుపు కోడం తప్ప.ఆయన చిత్రించిన రంగుల పైంటింగ్సు నా దగ్గర అదృష్ట వశాత్తు ఉన్నాయి.

  • మిత్రులు రమణ రావు గారు,
   ఉదర పోషణార్ధం బహుకృత వేషం, జీవితమంతా అలాగే నడచిపోయింది, పెద్దలను కలిసే భాగ్యం కలగలేదు, మీరు అదృష్టవంతులు.

   ఎక్కడ ఎంతవరకు మనం తీసుకోవాలో అంతదాకా తీసుకుని మనలని మనం అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. వారిలా వీరిలా తయారు చేస్తామనడం….ఎందుకో అంత బాగో లేదనిపించింది…

   నాది కానిదానిని ఎక్కడ నుంచి తెచ్చుకున్నది చెప్పడం నా అలవాటు. నచ్చిన టపాలు చాలా మంది షేర్ చేశారు, నా పేరుతోనే, నాకు చెప్పేరు కూడా, చాలా ఆనందమే అయింది. కాని ఇలా పేరు లేకుండా తమదిగా నా టపాలని పెట్టుకున్నందుకే నా వ్యధ, చేయగలది లేదు.
   ధన్యవాదాలు

 6. శర్మగారు,
  కొంచెం తెలిసిన విషయమే ఐనా, మీరు ప్రస్తావించినది కొంచెం తీవ్రమైనదే. ఈ విషయంలో బ్లాగర్లు ఎలా స్పందించాలో అర్థం కావటం లేదు. నా శ్యామలీయం వంటి బ్లాగును ఎవరూ కాపీ కొడతారని అనుకోను కాని మీ వంటి ఉపయుక్తవ్యాసకర్తలకు ఆ బెడద తప్పదు. ఈ విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొన వచ్చునో తెలియటం లేదు. కొందరు రైట్‍క్లిక్ అవకాశం తొలగిస్తారు కాని దాన్ని మరోరకంగా ఎనేబుల్ చేసుకోవటం క్షణాల్లో పని కాబట్టి అలాంటి ఉపాయాలు నిరుపయోగం. పోతే సగటు బ్లాగర్లు కోర్టుల చ్ట్టూ తిరిగే / తిరగ్గలిగే రకం మనుషులు కాదాయె! ప్రస్తుతానికి ఒక దారి ఉంది. అది రిజిష్టరు చేసుకున్న వారికే మన బ్లాగు కనబడేలా చేయటం. అది ఒకదానికి మందు వేస్తే మరొక అవయవం చచ్చుబడ్డట్టు అవుతుందన్న చందం వైద్యం. మరెలా? బాగా అలోచించాలి ఈ బ్లాగుచౌర్యాల గురించి.

  • మిత్రులు శ్యామలరావు గారు,
   “మీలాటి ఉపయుక్త వ్యాసకర్తలకు ఆ బెడద తప్పదేమో,” బలే చురకేశారు, నిజంగానే మీ “చురకనీ” ఆస్వాదిస్తున్నా. 🙂 ఏమీ చేయలేని అసహాయత. పేదవాని కోపము పెదవికి చేటని, అలా తెలిసి ఊరుకోవచ్చుగా అనచ్చు, అశక్త దుర్జనత్వం మీకు తెలియనిది కాదు కదా!
   ధన్యవాదాలు

   • > …..బలే చురకేశారు.

    ఎంతమాట!
    ఉ।పెద్దలు మీకు నే చుఱక వేసెడు నంతటి వాడ నౌదునే
    యెద్ది స్ఫురించె బుధ్ధి కటులే నొక యించుక వ్రాసినాడ నా
    హద్దు లెఱింగి యుండవలె నన్నది యేమఱి యుంటినేమొ నిం
    కెద్ది యొనర్తు నంజలి ఘటించెద నన్ను క్షమించ వేడెదన్

   • మిత్రులు శ్యామలరావు గారు,
    అనిత్యమైన దాని వెంట పరుగులు తీసి ఎండమావుల్ని వేటాడు తున్న వారిని నీవు చేస్తున్నది తప్పు అని చెప్పేవాడే అసలు స్నేహితుడు, అది కూడా సున్నితంగా చెప్పగలగడం అందరివల్లా సాధ్యమా!
    సులభా పురుషా రాజన్ సతతః ప్రియవాదినః
    అప్రియస్య పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః
    ఇక మిత్రుల మధ్య అలకలు సహజం కావచ్చు కాని క్షమాపణలు కాదని మీ బోట్లకు నేను చెప్పడం బాగుంటుందా! నిజంగానే మీ మాటని అర్ధం చేసుకున్నా!
    మీ ఈ వ్యాఖ్య పద్య రూపంలో ఉండిపోయింది, లేకుంటేనా….
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s