శర్మ కాలక్షేపంకబుర్లు-నానాటి బతుకు నాటకము

నానాటి బతుకు నాటకమూ…..

రచన: అన్నమాచార్య

రాగం: ముఖారి

నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ||

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము |
యెట్టనెదుటి కలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము ||

కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము |
వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ||

తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము |
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక

 అన్నమాచార్య కీర్తన శారద విభావరి బ్లాగ్లో విన్నా, అప్పటినుంచి పట్టుకుంది దురద, ఆ కీర్తనమీద టపా రాయాలని, ఇదివరలో వినలేదా ఇది, విన్నాను కాని ఏది ఎప్పటికి ఎలా జరగాలో అలాగే జరుతుంది కదా! నా గోలకేంగాని….. .

నానాటి బతికి నాటకమూ అన్నారు అది ఏనాటి బతుకు?చావు పుట్టుకల మధ్య బతుకు,జీవన్మరణ చక్రం కదలిపోతోంది కాని, ముక్తి కనపడటం లేదు. అక్కడ కానక యున్నది కైవల్యమూ అని ఉండాలేమో అనుకుంటా, లేక కనపడక కనపడేది కైవల్యము అని అర్ధమో చెప్పలేను, పెద్దలెవరైనా వివరించగలరు.

పుట్టడం నిజం, పుట్టినవారు గిట్టడమూ నిజం, జాతస్య మరణం ధృవం. ఏది పుట్టేది? ఏది మరణించేది? పుట్టేది, మరణించేది ఈ శరీరమే కాని ఆత్మ కాదు. ఆత్మ ఈ శరీరం వదలి మరొక శరీరం ధరిస్తుంది, కర్మ పరిపాకం తీర్చుకోడానికే. నాటకంలో నటుడు రంగస్థలం మీదకి తన పాత్ర రావాలసిన సమయం లో వస్తాడు, తన పాత్ర నటిస్తాడు, తన పాత్ర పూర్తయిన తరవాత తెర వెనకకి వెళతాడు, అలాగే కర్మ పరిపాకం పూర్తి చేసుకోడానికే ఒక ఉపాధి అనగా శరీరం పొందుతాడు, అది ఏదయినా కావచ్చు. ఈ పుట్టుక మరణాల మధ్య మాత్రమే ఎదురుగా కనపడుతున్న ప్రపంచాన్ని చూసి మురిసిపోతాడు, నాది నేను అంటూ మానవులు విర్రవీగుతారు. ఊపిరి చొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు అన్నారో సినీ కవి, నిజం కదా! ఇలా పుడుతూ చస్తూ చిట్ట చివరికి చేరేదే ముక్తి.  

కుడిచేదన్నము కోక చుట్టేడిది, నిజమే, కూటికి గుడ్డకోసమే అలమటిస్తారు. వీటి ఆలోచనతోనూ, వీటిని సాధించుకునే ప్రయత్నంలోనూ, ఏదీ కూడా రాదని తెలిసి కూడా,సొమ్ము కూడపెట్టడంలోనూ,జీవితం పూర్తయిపోతూ ఉంది, ఇదే ఒక నాటకం. అదే నడమంత్రపు సిరి. నడమంత్రపు సిరి నరం మీద కురుపు ఒకలాగే బాధ పెడతాయని నానుడి.

ఒడి కట్టుకున్న ఉభయ కర్మలూ గడి దాటినపుడే కైవల్యము. ఏవి ఉభయ కర్మలు? పుణ్యం, పాపం వీటిని కదా జమ చేసుకుంటున్నాం. ఇక్కడ మన బేంక్ లో డబ్బు వేసుకోడం తీసుకోడం చేస్తే ఎప్పటి.కప్పుడు నిలవ చెబుతూ ఉంటారు. కాని ఈ పుణ్య, పాపాల చిట్టా అలాటిది కాదు. పుణ్యం కాతా దానిదే, పాపం కాతా దానిదే. కొంత పుణ్యం చేసేను కనక కొంత పాపం తగ్గించడం, ఏది ఎక్కువ ఉంటే అది అనుభవించడానికి మళ్ళీ పుట్టడం కుదరదు. పాప కర్మా అనుభవించాలి, పుణ్య కర్మా అనుభవించాల్సిందే. రెండు కాతాలలోనూ నిలవ ఉండకూడదు, అప్పుడు మాత్రమే ముక్తికి చేరతాడు. ఇదెప్పటికి? ఏమో చెప్పలేం.అదే తెగదుపాపము, తీరదు పుణ్యము.  

నేను పాపం చెయ్యడం మానేస్తానండి, పుణ్యమే చేస్తున్నానండి అంటే పుణ్య కర్మ ఫలితం అనుభవించడానికీ పుట్టాల్సిందే! దేవతలు వారి వారి పుణ్య కర్మానుభం పూర్తి కాగానే మరల జన్మ ఎత్తాల్సిందే! పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం తప్పదు.ఎలాగా ముక్తి పొందడం అనే ఆలోచన కదా! పుణ్యమే చేసుకున్నా జన్మ తప్పదంటున్నారని కదా! అవును, ముమ్మాటికి నిజం. దీనికి మార్గం చెప్పేరు, పుణ్య కర్మ చెయ్యి, నేను చేస్తున్నానుకోకు కొండమీదున్న వేంకటేశ్వరుని నమ్ము, అతడే దైవం, ఆయనే చేయించాడనుకో, అప్పుడు నీ కాతాలో పుణ్యం జమ కొద్దిగానే ఉంటుంది. అలాగయితే పాపం కూడా దేవుడే చేయించుతున్నాడని చేస్తాను తక్కువ పడుతుందా? నా కాతాలో? నాలాటి బుద్ధిమంతుని ప్రశ్న. అది నీ కర్మ, పాపం తెలిసిచేస్తానన్నందుకు నీకు మరికొద్దిగా వడ్డీ కూడా వస్తుంది, అందుచేత మంచి పని చెయ్యి భగంతుడే చేయించాడనుకో, అప్పుడు కైవల్యం అనగా ముక్తి నీ స్వంతం. అసలు ముక్తి అంటే ఏమండి ప్రశ్న, జనన మరణ చక్రం నుంచి విముక్తి. అదెందుకు పుడతాను,ఛస్తాను  నీకేం బాధా అనచ్చు, అస్తు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ముక్తి పొందలేనివారికోసం పరమాత్మ ప్రళయం సృస్టిస్తారు, అప్పుడు సర్వమూ లయమైపోతుంది ఆయనలో, అదే

ఒకపరిజగములు వెలినిడి,యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై
సకలార్ధ సాక్షియగు నయ్యకలంకుని నాత్మమూలు నర్ధితలంతున్.

 

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నానాటి బతుకు నాటకము

 1. శర్మ గారూ ,

  నమస్తే . శుభోదయం .

  ముక్తి ఎక్కువైతే విముక్తి అన్నది అక్షరాలలో స్పష్టంగా అవగతమౌతున్నది .

  ముక్తి ఎక్కువై , విముక్తిగా మారి ఈ జన్మ రాహిత్యం అయిందని ఎలా తెలుసుకోగలుగుతారు అన్నది నా ధర్మ సందేహం .

  • శర్మాజీ,
   ముక్తి కి, విముక్తి కి అర్ధంలో కొద్ది తేడా ఉందిలా ఉంది. విముక్తి అంటే విడువ బడటం, అనగా షడ్గుణాలు మనలని వదలి పెట్టడం. ముక్తి అంటే స్వతంత్రం పొందటం అనగా జన్మ మరణ చక్రం నుంచి స్వాతంత్ర్యము పొందడమనుకుంటా. పొరపాటయితే సవరించ కోర్తాను.
   ముందువి మనల్ని వదిలేస్తే అప్పుడు మనం జన్మ మరణాల నుంచి ముక్తి పొందుతామనమాట
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s