శర్మ కాలక్షేపంకబుర్లు-తలనుండు విషము…

తలనుండు విషము…

వృశ్చికస్య విషంపుచ్చం మక్షికస్య విషంశిరః !
తక్షకస్య విషందంష్ట్రాస్సర్వాంగం దుర్జనే విషం !!

తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
తల తోకయనక యుండును ఖలునకు
నిలువెల్ల విషము గదరా సుమతీ.

ఓ బుద్ధిమంతుడా! పాముకి తలలో, తేలుకి తోకలో విషముంటుంది, కాని దుర్మార్గుడికి తల తోక అనే భేదం లేదు నిలువెల్లా విషమే అన్నారు బద్దె భూపాలుడు.

”పాముకి పంటిలోనూ, జ్ఞాతికి కంటిలోనూ విషముంటుంద”ని నానుడి. అంటే పాము కంటే విషం కక్కేవాడు, చూపుతోనే, ఒక్క జ్ఞాతి మాత్రమేనన్నారు మన పెద్దలు.

పాము అంటే చెప్పుకునేది గిరినాగు, నల్ల/తెల్ల/గోధుమ రంగుత్రాచు అనబడే కింగ్ కోబ్రా. ఇది నేరుగా దాడిచేసి కళ్ళలోకి విషం చిమ్మగలదు, ఆరడుగుల పై ఎత్తుకూ లేవగలదు. అడవిలో జంతువులన్నీ సింహానికి భయపడితే, సింహమూ, ఏనుగూ కూడా ఈ కింగ్ కోబ్రాకి భయపడతాయట. ఈ పాము విషం సరియైన మోతాదులో కనక ఇస్తే క్లిష్టపరిస్థితులలో బతికిస్తుందని చెబుతారు. దీనిని వినియోగించడం చాలా కాలంగానే తెలుసు, మనవారికి. దీనిని గరళం అంటారు, ఆయుర్వేదం లో. చివరి క్షణాలలో, ‘గరళమిచ్చారు, అదృష్టం ఉంటే లేస్తాడు,’ 50:50 అవకాశం, అనేవారు, నాటి కాలం లో. ఈ గరళం వైద్యం చేసేవారు ప్రత్యేకంగా ఉండేవారు. ఇక దీనిని హోమియో లో “నజా” అని పిలుస్తారు, ఇది తాచు విషం నుంచి తయారు చేసినదే. దీనిని హోమియో వైద్యులు గుండె జబ్బులకి వాడతారు. లేకసిస్ అనే మరో మందు ఉంది కట్లపాము విషం నుంచి తయారు చేసినది.ఇలా మనవారు ఈ విషాన్ని ప్రాణాలు నిలపడనికి వాడేవారు.

రాక్షసమంత్రి చంద్రగుప్తుని పై ప్రయోగించడానికి, విష కన్యను తయారు చేశాడు. విష కన్యను చంద్ర గుప్తుని పై ప్రయోగించాడు కూడా, కాని తెలివైన చాణుక్యుడు ఆమెను పర్వతకుని వద్దకు పంపి, అతని అడ్డూ తొలగించాడు, చంద్రగుప్తుణ్ణీ రక్షించాడు. అదే ఏక క్రియా ద్వర్ధికరీ అంటే, ఒక పనితో రెండు లాభాలు పొందడం. నిజంగా విష కన్యను తయారు చేయచ్చా? నిజమే! చిన్నప్పటినుంచి ఒక అందమైన అమ్మాయికి “’నాభి” అనే వృక్ష సంబంధమైన విషాన్ని కొద్ది కొద్దిగా ఇస్తూ పోతే ఆమె యుక్త వయసొచ్చేటప్పటికి నిమ్మకాయంత నాభి తిన్నా, ఆమెకు ఏమీ కాదు కాని ఆమెతో సంభోగించినతను మాత్రం ఖచ్చితంగా మరణిస్తాడు, ఈ విషంతో ఆమె మరింత అందంగానూ తయారవుతుందట.ఇదే అసందర్భ ప్రలాపమంటే.

కింగ్ కోబ్రా సాధారణంగా కరవదు విషం కళ్ళలోకి చిమ్ముతుంది, దీని ఆహారం కూడా పాములే. తాచు అనేవి కరుస్తాయి. ఇవి కనక కరుస్తే ఏడు నిమిషాలలో మనిషి మరణిస్తాడు. ఎందుకంటే, ఏడు నిమిషాలలో ఒక సారి రక్తప్రసరణ చక్రం పూర్తి అవుతుంది, అనగా గుండె నుంచి బయలుదేరిన రక్తం మరలా గుండెను చేరడానికి పట్టే సమయం ఏడు నిమిషాలు.

మనిషి మత్తు కలిగించేందుకుగాను చాలా వాటిని మత్తు పదార్ధాలుగా తీసుకుంటూనే ఉన్నాడు. మచ్చుకి కొన్ని, సారా, బ్రాందీ, హెరాయిన్ వగైరా వగైరా. ఇప్పుడు ఈ తాచు విషం కూడా అందులో ఒకటిగా చేరిపోయిందిట. K-76 అనే విషంతో తయారు చేసిన దానిని మాదక ద్రవ్యంగా వినియోగిస్తున్నారట. యువత ఇప్పుడు ఈ K-76 వెనకపడి తీసుకుంటున్నట్టు వార్తలున్నాయి. దీనికి అలవాటు పడిన వారికి విముక్తి లేదంటున్నారు. దీనిని తయారు చేసి యువత మీదకి ఎక్కు పెట్టిన మన జ్ఞాతికి నిలువెల్లా. డబ్బు సంపాదించుకోవాలనే విషం పూర్తిగా ఉన్నట్లే కదా! మన బద్దె భూపాలుడు ఎప్పుడో చెప్పేరు ’ఖలునకు నిలువెల్ల విషము’ అని, అదిప్పుడు అనుభవంలోకొచ్చింది కదా!
తస్మాత్ జాగ్రత

 

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తలనుండు విషము…

  1. చాలా చక్కని పద్యాన్ని వివరణాత్మకంగా తెలియపరిచారు. విషానికి విషమే విరుగుడు అన్న సామెతని వివరంగా వివరించారు, అది ఎంతవరకు నిజమో తెలియదు కాని “శ్రీ” అనే అక్షరానికి ఉన్న విషము, అమృతము అనే అర్థాలు మాత్రం ఆ విషయాన్ని దృవపరుస్తున్నాయి.

    సందర్భం వచ్చింది కాబట్టి మీకుతెలిసిందే అయినా మరికొందరికి తెలియటానికి పై పద్యానికి సంస్కృతంలోని శ్లోకాన్ని ఇక్కడ ఉంచుతున్నాను.

    వృశ్చికస్య విషంపుచ్చం మక్షికస్య విషంశిరః !
    తక్షకస్య విషందంష్ట్రాస్సర్వాంగం దుర్జనేన విషం !!

    తేలుకు తోకలో, ఈగకు తలలో, నాగుపాముకు కోరల్లో విషముంటే దుర్జనులకు మాత్రం నిలువెల్లా విషమే ఉంటుంది.

    • మఠంవారు మంచిశ్లోకాన్ని ప్రస్తావించారు. చిన్న తప్పనిసరి సవరణ “సర్వాంగం దుర్జనేన విషం !!” అని (9 అక్షరాలు) కాక “సర్వాంగం దుర్జనే విషం !! అని (8 అక్షరాలు) ఉండాలి లేకుంటే ఛందోభంగం అర్థదోషం కలగదు కాని.

      యథాప్రకారం శర్మగారి విజ్ఞానభాడారంలోంచి మరొక ఆణిముత్యం ఈ టపా.

      • శ్యామలరావుగారు,
        శ్లోకమూ సరి చేసి టపాలో ఉంచాను, మీకు, స్వామిగారికి మరొక సారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.
        నెనరుంచండి.

  2. శర్మ గారూ ,

    నమస్తే .

    మీరు మీ బ్లాగుని అమ్ముతాను అనగానే కరెంట్ షాక్ తగిలి అవాక్కయినట్లయ్యింది . అందుకే నేటివరకు వ్యాఖ్య వ్రాయలేకపోయాను .
    మీలాంటి ( బ్లాగులోకానికి ) పెద్దలు యిలా బ్లాగులమ్ముకుపోతే మంచి మంచి విషయాలను ( చాలా మందికి తెలియనివి ) తెలియచేసేవారెవ్వరు ?

    ఎందుకంటే ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు , ఆ పెద్దలు ఎక్కడో వృధ్ధాశ్రమాలలో , అనాధాశ్రమాలలో జీవిస్తున్నారు కదా! అది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి . మీరు , మీ శ్రీమతి గారి ద్వారా మానవ మనుగడలో ముఖ్యమైన విషయాలను చక్కగా బ్లాగు ద్వారా తెలియ చేస్తున్నారు .
    ఒక్క మాటలో చెప్పాలంటే నవరసాలను సమ పాళ్ళలో అందిస్తున్నారు .
    ఎవరో కాపీ కొట్టారని , బ్లాగునే అమ్మేస్తాను , వ్రాయటమే మానేస్తాను అనటాన్ని ఎవ్వరూ , ఎన్నటికీ అంగీకరించరు .

    కనుక మీరు ఎప్పటిలాగే మీ స్వానుభవాల్ని వేల మందికి మార్గదర్శకంగా వుండేటట్లు కొనసాగించండి , ఈ బ్లాగు కొనని సాగించండిలా .

    • శర్మాజీ,
      నమస్తే! బ్లాగు మొదలుపెట్టింది, అనుభవాలు పంచుకోడానికే. నిన్నటి టపాలో మా సత్తిబాబు చేసిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించాను. చూసి ఉంటారనుకుంటా. కాలం కలిసిరావటం లేదండీ
      నెనరుంచండి.

  3. శర్మ గారూ ,

    నమస్తే .

    మీరు మీ బ్లాగుని అమ్ముతాను అనగానే కరెంట్ షాక్ తగిలి అవాక్కయినట్లయ్యింది . అందుకే నేటివరకు వ్యాఖ్య వ్రాయలేకపోయాను .
    మీలాంటి ( బ్లాగులోకానికి ) పెద్దలు యిలా బ్లాగులమ్ముకుపోతే మంచి మంచి విషయాలను ( ఛళ ంఆండీఖీ టేళీYఆణీవీ ) తెలియచేసేవారెవ్వరు ?

    ఎందుకంటే ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు , ఆ పెద్దలు ఎక్కడో వృధ్ధాశ్రమాలలో , అనాధాశ్రమాలలో జీవిస్తున్నారు కదా! అది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి . మీరు , మీ శ్రీమతి గారి ద్వారా మానవ మనుగడలో ముఖ్యమైన విషయాలను చక్కగా బ్లాగు ద్వారా తెలియ చేస్తున్నారు .
    ఒక్క మాటలో చెప్పాలంటే నవరసాలను సమ పాళ్ళలో అందిస్తున్నారు .
    ఎవరో కాపీ కొట్టారని , బ్లాగునే అమ్మేస్తాను , వ్రాయటమే మానేస్తాను అనటాన్ని ఎవ్వరూ , ఎన్నటికీ అంగీకరించరు .

    కనుక మీరు ఎప్పటిలాగే మీ స్వానుభవాల్ని వేల మందికి మార్గదర్శకంగా వుండేటట్లు కొనసాగించండి , ఈ బ్లాగు కొనని సాగించండిలా .

Leave a reply to తాడిగడప శ్యామలరావు స్పందనను రద్దుచేయి