శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు అమ్మకమునకు కలదు-వివరణ

బ్లాగు అమ్మకమునకు కలదు-వివరణ

బ్లాగు అమ్మకం సంబంధించిన విషయాల మీద మీతో ఇంటర్వ్యూ కావాలన్నాడు, మా సత్తిబాబు. అలాగేనని కాఫీ తెప్పించి ఇచ్చి, తను తాగిన తరవాత మొదలుపెట్టమంటే ఇలా ప్రశ్న లేస్తే నేనిచ్చిన జవాబులు.

ప్ర:- బ్లాగు అమ్ముతానన్నారట నిజమా?
జ:- నిజమే. 23.09.2014 వ తారీకు వరకు కష్టేఫలే వర్డ్ ప్రెస్. కాం బ్లాగులో ప్రచురింపబడే అన్ని టపాలు అమ్మడానికి నిశ్చయించుకున్నా.
ప్ర:- ఎవరేనా కొంటారనే అనుకున్నారా? డబ్బు కోసమా? ఎంత చెబుతున్నారు?
జ:- అమ్మకానికి పెడితే కొనేవారుంటే కొంటారు, లేకపోతే లేదు. “మీ బ్లాగు కొనడానికి అడిగే సీన్ ఉందా” అని కూడా అడిగారు, తప్పేంటీ? అమ్మకం డబ్బు కోసం మాత్రమే కాదు, చిరు నవ్వు వెల ఎంత? మరుమల్లెపువ్వంత…..అమ్మేస్తే పుస్తకంగా వేసుకుంటారని, అలాగయినా ఈ తస్కరణ తగ్గుతుందేమోనని.
ప్ర:-కాపీ స్కాన్ చేసుకోవచ్చుగా?
జ:- ’దమ్మిడీ ముండకి ఏగానీ క్షవరమని’ సామెత.
ప్ర:- మీరే పుస్తకంగా వేసుకోవచ్చుగా.
జ:- వేసుకోవచ్చు! కాని దానికి తగిన సాధన సంపత్తి లేదు.
ప్ర:-మిత్రులు చాలా సూచనలిచ్చారు కదా!
జ:- చూచాను, గతజలసేతు బంధనం కదా! ఇప్పుడేం చేసినా! జరిగినదానికి వగచి ప్రయోజనం లేదు కదా!
ప్ర:- బ్లాగు రాయనంటున్నారట.
జ:- నిజం
ప్ర:- ఏం? ఎందుకు?
జ:- తస్కరులకోసం రాయలేను, నా సమాజానికి, తెనుగు వారికి ఉపయోగపడగలనేమో అన్నదే నా తపన..
ప్ర:- ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకుంటారా?
జ:- తగలబెట్టుకోరు, కాని ఇక్కడ రాసిన టపా ఎవరిపాలబడిపోయిందో, తెలియని అయోమయ స్థితిలో రాయడం ఎందుకు?
ప్ర:- కంటెంట్ ఉన్నోడికి పేటెంట్ అక్కరలేదంటున్నారు.
జ:- కాలమెప్పుడూ ఒకలా జరగదు. కాలం తో మార్పులొస్తాయి, మరపూ వస్తుంది.
ప్ర:-చిన్నవాళ్ళ మాట వింటారట, మనవరాళ్ళంటే ప్రాణం పెడతారట, వారి మీద ఈగ కూడా వాలనివ్వరట! మిత్రులంటే చాలా ఇష్టమట! అమ్మాయ్ అమ్మాయ్ అంటూనే ఉంటారట!
జ:- బాలాదపి సుభాషితం, పాపం వాళ్ళకి అబద్ధం చెప్పడం తెలియదు, మన లాగా, లోకం తెలియనివాళ్ళు, ‘ఒక చెంపకొడితే పాలు, మరొక చెంప కొడితే నీళ్ళూ’ అంటారు. ఆడవారు అమాయకులయ్యా! ‘కుడుము చేతికిస్తే పండగ’నుకుంటారు పాపం!అల్ప సంతోషులు.కోపమొస్తే తాటాకు మంట, కొద్ది సేపే.
ప్ర:- ఎవరో దొంగిలించారంటున్నారు, ఋజువేంటీ?
జ:- అందుకే ఎవరు తస్కరించినదీ చూపుతూ ఐదుగురు జడ్జీల బెంచ్ కి ఇచ్చాను. వారిలో ఇద్దరు నేను చెప్పిన మాట నిజమన్నారు. మిగిలినవారు జడ్జిమెంట్ ఇవ్వాలి. బెంచ్ లో ముగ్గురు మగవారు ఇద్దరు ఆడవారు ఉన్నారు.
ప్ర:- మీరు పురుష పక్షపాతా?
జ:- కాదు, స్త్రీ పక్షపాతినని నాకు పేరు.
ప్ర:- అవే ఋజువులు ఇక్కడ చూపచ్చు కదా?
జ:- నాకు సభ్యత తెలుసు, వారికి తెలియనంతలో, వారి పరువు బజారులో పెట్టలేను, అందుకే ఇక్కడ ఇవ్వటం లేదు.ఇది కొంతమందికి నచ్చకాపోవచ్చు. లోకో భిన్నరుచిః అన్నారు కదా! హక్కులకోసం పోరాడాలనీ అంటారు. కనిపించిన వారు సరే కనిపించనివారితో ఎలా? సమాజంలో మనం కొంత ప్రత్యేకత ఉన్నవాళ్ళమనీ, చదువుకున్నవాళ్ళమనీ, సభ్యత తెలిసినవాళ్ళమనీ ఇతరులనుకుంటారు. మేధావి వర్గమనీ అనుకుంటారు, మనలోనే కుళ్ళుంటే? మనల్ని మనమే బాగుచేసుకోలేనపుడు? వాదానికి అంతులేదు.
ప్ర:- మీ పేరుతో షేర్ చేసుకోవచ్చంటున్నారు, మీ పేరు లేకపోతే తస్కరణ అంటున్నారు. ఇది మీ ఒంటెత్తుపోకడ కాదా? మీ నియంతృత్వం కాదా?
జ:- పెద్ద పెద్ద మాటలేవో అడిగేసేరు, వాటి అర్ధాలు కూడా తెలియవు నాకు. రెండూ ఒకటికావనే నా ఉద్దేశం. ఇప్పుడు నా పేరులేకుండా ఉంచుకుంటే రేపు అదే వాటిని ఈ బుక్ లేదా అచ్చు పుస్తకం వేయించుకోనయినా వేయించుకోవచ్చు.అడిగేవారుండరు.
ప్ర:- మీ టపాలు అంత విలువైనవనుకుంటున్నారా?
జ:- కాకిపిల్ల కాకికి ముద్దు. ’ఊరివాళ్ళ కంతులెన్నో కోశాను కాని నా కంతి అంత నెప్పి ఎవరికి లేద’న్నాడట ఒక వైద్యుడు అలా ఎవరిదాకా వస్తే కాని వారికి నొప్పి తెలియదు.
ప్ర:- సరదాపడి కొన్ని టపాలు తీసుకుంటేనే అంత సీరియస్ అయిపోవాలా?
జ:- దొరికితేనే దొంగ లేకపోతే దొర. బలహీనుడికి న్యాయం జరగదు. ఇది నేటి రివాజు. తస్కరులు బలమైన వారు కదా! ‘తోటకూర నాడయినా చెప్పకపోతినిరా కొడకా’ అన్న పరిస్థితి వారికి రాకూడదనే. ఈ అలవాటు పెరిగి మరో వెఱ్ఱి తల వేయకుండా, ఈ ప్రయత్నం.ఒక జడ్జీ గారికి నిందితుల సమాధానం,  జడ్జీ గారి మాట చూడండి..

“sir,

just i m sharing good information to my friend about our tradition . if u r giving permission then only i keep this page in my blog now i m removing

:  మరుస్తున్న కొన్ని కూరలు, పళ్ళు,చిరుతిళ్ళు  page. once again sorry”
——————————————————————–
“అందులో నిజాయితీ కనిపించలేదు నాకు. మీకు క్షమాపణ చెప్పుకొని పర్మిషన్ అడగండి అని సలహాయిచ్చాను.  కానీ, ఇప్పుడు ఆ బ్లాగును పరిశీలించి చూడగా అదొక దొంగసొత్తు అడ్డా బ్లాగు. ఔరా! ఔరా!”
ప్ర:- మిగతా వారు రాయమంటున్నారు కదా.
జ:- ……….. నో కామెంట్
ప్ర:- ఇదే అంతిమ నిర్ణయమా?
జ:- ప్రస్తుతానికిదే
ప్ర:- పాఠకలోకానికి జవాబుదారి ఉందంటారా?
జ:- జవాబుదారీలు నిర్ణయించగల శక్తి నాకు లేదు.
ప్ర:- ఈ చౌర్యం అరికట్టడానికి మార్గమేమైనా సూచిస్తారా?
జ:- అగ్రిగేటర్ యజమానులు, బ్లాగర్ల నుంచి ఎన్నుకోబడిన కొంత మందితో జడ్జీల పేనల్ తయారు చేసి వారు ఇటువంటి కేస్ లను చూసి తగు విధంగా చర్యలు తీసుకున్నప్పుడు కొంత తగ్గే సావకాశం ఉంటుంది.
ప్ర:- మరేమైనా చెబుతారా
జ:- చాలా చెప్పాలని ఉంది, గుండె గొంతులో కొట్టుకుంటోంది. చాలా మంది పరిచయమయ్యారు, ప్రపంచం మొత్తం మీద. నేనో అనామకుడిని, నన్ను వారిలో కలుపుకున్నవారందరికి నమస్కరించడం తప్పించి, ఏం చెప్పాలో తెలియని అర్భకుడిని. పేర్లు చెప్పుకుంటూ పోతే అదే ఒక టపా అయిపోతుంది. కొంతమంది దర్జాగా గుండెలలో చేరిపోయారు,తిష్ట వేసుకునీ కూచున్నారు. కొంతమంది గుండెలో చేరి ముక్కలు చేసీపోయారు, బ్లాగులో తప్పించి కొత్తవారితో నేరుగా మాటాడటానికీ భయమేస్తోంది, ఏ అనుభవాలు ఎదుర్కోవాలోనని. నేనూ మనిషినేగా, నాకూ స్పందన ఉంటుంది కదా. చాలా మంది ఆత్మీయునిగా ఆదరించారు. కొంతమంది ఈ అర్భకుని చూడాలనీ వచ్చారు. వేసవిలో బాధలనుభవించిన మేమిద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం, ఇప్పుడు. నేనెక్కడికీపోటం లేదు, మీ గుండెలోనే ఉన్నా, ఓ మూల. రాయడం మానేసినా, మీ అందరి మెయిల్ అడ్రస్ లూ ఉన్నాయి, కాని మెయిల్ ఇస్తే ఏమనుకుంటారోననే సంకోచం. నా తరవాత మూడు తరాలు వచ్చేశాయి, లోకం మారుతోంది, విలువలూ మారుతున్నాయి,మా మాటలు నచ్చని వారికి చెప్పి పెద్దరికం పోగొట్టుకోవడం నచ్చలేదు. నాతో మాటాడే తీరికా ఎవరికి లేదు.

అనువుగాని చోట అధికులమనరాదు
కొంచముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమైయుండదా?
విశదాభిరామ వినుర వేమ.

చిన్నపుడు చదువుకున్నా. ఇప్పుడు జీవితానికి అన్వయం చేసుకున్నా. రిటయిర్ అవడం కూడా ఒక కళ అన్నారు ధూర్జటి

దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతా సంఘము రోయనప్పుడే జరా క్రాంతంబుగానప్పుడే
వింతల్మేన చరింపనప్పుడె కురుల్వెల్లంగగానప్పుడే
చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!

దంతాలూడిపోకముందు అనగా జిహ్వ చాపల్యం ఉండగానే అంటే రసనేంద్రియం అదుపు తప్పనపుడే, శరీరంలో శక్తి ఉన్నపుడే, స్త్రీలు ముసలివాడని దరిచేరనివ్వకముందే, అనగా స్పర్శ ఇంద్రియం స్వాదీనం చేసుకుని, ముసలితనం రాకుండానే, వింతవింతలొస్తాయి ముసలితనంతో, అవి రాక ముందే, జుట్టు తెల్లబడకముందే అంటే కోరికలింకా ఉన్నపుడే నీ పాదపద్మాలు పట్టుకోవాలి కాని ముసలితనం వచ్చి, కదలలేక మెదలలేక ఉన్నపుడు కాదు, నిన్ను తలవడం అన్నారు. నిజంగానే ఇప్పుడే రిటయిర్ కావాలన్నారు. 

ఎవరూ ఎత్తుకుపోనిది విద్యా ధనమన్నారు, నేడు అది కూడా నిజం కానట్టే ఉంది. ఎవరూ ఎత్తుకుపోనిది,   ఉత్సాహమూ చచ్చిపోయింది, 
ప్ర:- మీ మాటేదీ నచ్చలేదు. మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?
జ:-……………………అందరికి అన్నీ నచ్చాలనీ లేదు……..నేను ఈ ప్రపంచంలోకి రాక ముందూ ఇది ఉంది, తరవాత కూడా ఉంటుంది…………ఇది సత్యం.
ప్ర:- చివరగా ఒక ప్రశ్న. మీకు తెలియని విషయం ఒకటేనా ఉందా?
జ:- సత్తిబాబూ ములగచెట్టు ఎక్కించేస్తున్నావు, పడిపోతాను సుమా! నిజంగానే నాకేం తెలియదు. అంతెందుకు నేనెవరో నాకే తెలియదు. (నాన్ యార్?) “నేనెవరు?” తెలుసుకోమన్నారు రమణులు.

టపా బాగా పెద్దదయిపోయి బోర్ కొట్టిందా……క్షమించండి

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు అమ్మకమునకు కలదు-వివరణ

 1. శ్రీశర్మగారు ప్రకటించిన జడ్జీ గారి మాటలో ఉన్న లింకు: మరుస్తున్న కొన్ని కూరలు, పళ్ళు,చిరుతిళ్ళు
  దీన్ని గమనించారా?
  సదరు బ్లాగులో దొంగసొత్తు కాని టపా ఏదైనా ఉందేమో ఎవరన్నా వెదికి పట్టుకోగలరా అని?

 2. బ్లాగు అమ్మకమునకు కలదు – అనే టపాను చదివిన తరువాత ఎంతో బాధ కలిగిందండి. కొంతకాలం క్రిందట ఇలాంటి విషయం గురించి బ్లాగులలో చర్చ జరిగినప్పుడు నేను ఒక టపా కూడా వ్రాసాను.
  ఈ విషయంలో నా అభిప్రాయాలలో కొన్ని, అందరికీ నచ్చకపోవచ్చని నాకు అనిపించింది. అందుకే వెంటనే వ్యాఖ్యను వ్రాయలేకపోయానండి.
  ……………..
  మనకు తెలిసిన మంచి విషయాలను వీలైనంత ఎక్కువమందికి తెలియజేయటం ద్వారా సమాజానికి మంచి జరిగితే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. .
  ……………
  నేను కొన్నివిషయాలను నా బ్లాగ్లో వ్రాస్తున్నానంటే అందుకు కారణం దైవం దయ.
  ఎందరో పండితులు, పామరులు.. నుండి తెలుసుకున్న విషయాల గురించి కూడా నేను నా బ్లాగులో వ్రాస్తుంటాను.( నేను కూడా కాపీ చేస్తున్నట్లు అవుతుందేమో ? అని ఒక్కోసారి నాకు సందేహం వస్తుంది.)

  కొన్నిసార్లు , ఈ విషయాలను ఫలానావారి ద్వారా తెలుసుకున్నాను. అని చెబుతూ ఉంటాము. అలాగని, ప్రతిసారీ అవి ఫలానా వారి ద్వారా తెలుసుకున్నాను . అని చెప్పటం కూడా కుదరకపోవచ్చు..
  ……………
  అయితే, మనం వ్రాసిన విషయాలను ఇతరులు తాము వ్రాసినట్లు వారి టపాగా వారి బ్లాగులో ప్రచురించటం అనేది కొంచెం వేరే విషయం. ఇది సరైన పద్ధతి కాదు.
  అలాంటివారి పేరును బైటపెట్టడమే మంచిదనిపిస్తుంది. అప్పుడే ఇంకోసారి ఇతరుల టపాలను కాపీ చెయ్యకుండా ఉంటారు.
  ………………..
  మీరన్నట్లు , మనం మన బ్లాగులలో వ్రాసిన విషయాలను కాపీ చేసిన వారు .. భవిష్యత్తులో ఆ టపాలు తమవేననీ, మనమే వాటిని కాపీ చేశామనీ కేసు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
  అందువల్ల మన బ్లాగులలో వ్రాసిన విషయాలను మనమే వ్రాసినట్లు ఖచ్చితంగా తెలియటానికి టెక్నికల్ గా ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో తెలుసుకుని అలా కట్టుదిట్టం చేసుకోవటం మంచిదండి.
  ……………..
  ఇంకో విషయం ఏమిటంటేనండి, మన బ్లాగులో వ్రాసిన విషయాలను ఇతరులు తమ ఆర్టికల్స్లో వాడుకోకూడదని గట్టిగా అంటే మన అభిప్రాయాలు ఎక్కువమందికి తెలియకుండా పోయే ప్రమాదమూ ఉంది
  మంచివిషయాలు వీలైనంత ఎక్కువమందికి తెలియటం ఎంతో ముఖ్యం. రకరకాల కారణాల వల్ల పరిమితులు విధించుకుంటే మంచివిషయాలు ఎక్కువ మందికి తెలియకుండా పోయే అవకాశం ఉంది..
  ………………
  నా అభిప్రాయం ఏమిటంటేనండి, మీరు వ్రాస్తున్న విషయాల వల్ల ఎందరికో ఎన్నో చక్కటి విషయాలు తెలుస్తున్నాయి. ఇతరులు కాపీ చేస్తున్నారని చెప్పి మీకు తెలిసిన విషయాలను చెప్పటం ఆపివేయటం ఎందుకో ? తెలియటం లేదు..

  • అమ్మాయ్ అనురాధ,
   నీ మాటేదీ కాదనను కాని, మీరు రాస్తూ ఉండండి, మేము దోస్తూ ఉంటామన్నట్టుగా ఉంది మీ ఆఖరు మాట.చోరులకోసమా రాసేది?
   నెనరుంచాలి.

   • సర్ ! క్షమించాలి. ఇతరులు కాపీ చేయటం కోసం మీరు టపాలను రాయాలని చెప్పటం నా ఉద్దేశ్యం కానే కాదండి.
    నేను వ్రాసిన వ్యాఖ్యలో- కాపీ వంటి కొన్ని విషయాల గురించి నాకు గల కొన్ని అభిప్రాయాలను వ్రాసాను.
    నా వ్యాఖ్యల వల్ల మీ మనసుకు కష్టం కలిగితే దయచేసి క్షమించండి.

   • అమ్మాయ్ అనురాధ,
    ఒక విషయం మీద ఎవరి అభిప్రాయం వారికుంటుంది. అది తప్పెలా అవుతుంది? నేను పాత కాలం వాణ్ణి కనక మీ స్థాయికి ఎదగలేకపోయి ఉండచ్చు. సమాచార మార్పిడి యుగం లో ఏది, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఎవరు వాడుకున్నా తప్పు లేదు, సభ్యత సంస్కారాలు వదిలేద్దామనే దశకు చేరుకోలేకపోయినందుకు నేనే మన్నింపు కోరుతున్నా.ఎదగ డానికి ప్రయత్నం చేస్తా.
    ధన్యవాదాలు.

 3. శర్మగారూ ! మీ సత్తిబాబులో నన్ను నేను ఊహించుకుని అడిగినట్లు ఉన్నాయి ప్రశ్నలు.
  కానీ ” మీ మాటేదీ నచ్చలేదు. మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?..”

  • శ్రీనివాస్ జీ
   సత్తిబాబు పక్షపాతం లేకుండా ప్రశ్నలేశాడు కదండీ అందుకు అంత ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి అర్ధం ఈ రోజు టపాలో చూడండి. మీకు తెలియదని కాదు…
   నెనరుంచాలి.

 4. శర్మ గారూ ,

  నమస్తే.

  మీరు ధైర్యంగా చెప్పిన ఈ అంశాలు , చాలామంది మన తెలుగు బ్లాగరు మిత్రులు అనుభవిస్తున్నారు .

  తస్కరణ అలవాటున్న ఆ ప్రబుధ్ధులు మీ ఈ టపాలో నుంచి కూడా కొంతభాగమైనా తస్కరించే అవకాశాలు అధికంగానే వున్నాయి .
  ఈ తస్కరణకు మారో పేరు , కూర్పు వున్నది . అలా చేసుకొని వాళ్ళదిగా ప్రచురించే అవకాశాలు లేకపోలేదు .

  ” మెత్తగా వున్న ప్రదేశాన్ని వత్తాలని అనిపించటం అనేక మందికి అనిపిస్తుంటుంది . కానీ కనపడింది కదా! మనం వత్తచ్చా ? వత్తకూడదా ! అన్న వారి ఇంగిత ఙ్నానాన్ని మఱుగున పెట్టి వత్తటమనేది ఎవ్వరూ గర్హించరు . అయితే ఈ కాలంలో అందంగా ( ఆకర్హణీయంగా , ఉత్సాహకరమైన వ్రాయకుండా ఉంటే ,తస్కరులకు చిక్కే అవకాశమే వుండదు కదా ! )కనపడటమే తప్పు అని , అనర్ధాలకు హేతువని తెలియవస్తోంది .

  ఈ నడుమ శ్యామలీయం గారు ” నేను మేధావిని కాను ” అని వ్రాశారు వారి బ్లాగులో . కనుక వారివెవరూ తస్కరించరు అని . అది నిజమే . కాని యిలా మనం మన అభిప్రాయాల్ని వెలిబుచ్చుకొనటం వల్ల , ఆ తస్కరుల దృష్టిలో పడే అవకాశం వున్నదన్న విషయాన్ని మఱచిపోతున్నాము .

  చివరగా మీరనుకొన్నట్లు ” నాన్ యార్ ” అనుకోవటం అందఱికీ తప్పదు , తెలుసుకోలేకపోవటం తప్పదు , ఎవ్వరో , ఎక్కడో ఒక్కళ్ళూ , యిద్దరూ తప్ప . ”

  ఈ వయసులో ( ఈ తరానికి , ముందు తరాల వారికి మీరు అందిస్తున్న మీలాంటివారికి ) ఇటువంటి మనస్థాపం ఎవ్వరికీ రాగూడదని , అందులో మీలాంటి పెద్దవారికి , మంచివాళ్ళకు రాకూడదని మనసా , వాచా , కర్మణా కోరుకొంటున్నాను .

  • శర్మాజీ,
   పేర్లు బయట పెట్టాలనే ఉంది కాని చిన్న సందేహం, పెద్దలకి లింక్ లిచ్చా, వారు నిజమే అంటే పేర్లు లింక్ లతో సహా పెట్టేస్తాబ్లాగులో.
   నెనరుంచాలి.

 5. సెహ , సెగ భేషైన టపా !! ఇట్లాంటి మరిన్ని టపాలు మీ వద్ద నించి వస్తాయని ఆశిస్తో !!

  నాన్ యార్ అన్నారు చూసేరు అదీ దమ్మున్న మాట !

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s