శర్మ కాలక్షేపంకబుర్లు-సమస్యను ఎదుర్కోడం ఎలా?

సమస్యను ఎదుర్కోడం ఎలా?

సమస్య వచ్చింది, మన గుమ్మం దగ్గర నిలబడింది. అయ్యో! సమస్య వచ్చిందే అని భయపడితే, సమస్యకి సగం విజయం. అదే మనం సమస్యతో, ‘ఓస్! నువ్వా ఎడం చేత్తో గెంటేస్తా’ అన్నామనుకోండి, సమస్య భయపడుతుంది. ఆహార నిద్రాభయ మైధునాలు సర్వ జీవులకూ సమానం, మరి సమస్యకూ భయముందిగా. అసలు సమస్య మన గుమ్మందగ్గరికే రాకుండా చూసుకునేవాడు దీర్ఘదర్శి, సమస్య వచ్చిన తరవాత ఎదుర్కుని విజయం సాధించేవాడు సమయజ్ఞుడు, సమస్యతో పోరాడలేక దానికి లొంగిపోయేవాడు……ఈ మూడు చేపల కథని ఒక సారి భారతం నుంచి చెప్పుకున్నాం కూడా, మళ్ళీ చెబితే చర్విత చర్వణమవుతుందని మానేశాను, పక్క దారి పట్టేస్తున్నా.

సమస్య వచ్చినపుడు సమస్య గురించి కూలంకషంగా ఆలోచించాలి. నిప్పంటుకుంటే కూలంకషంగా ఆలోచిస్తున్నాను, ‘నేనీ కంపెనీ అధిపతిని’ అని కూచుంటే అది చేసేపని అది చేసుకుపోతుంది, ‘అయ్యా! మీరీ కంపెనీ అధిపతి, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకునేదాకా ఆగుతాను’ అనదు. అప్పుడేం చెయ్యాలి? కంపెనీ అధిపతినని మరిచిపోయి, ఇతరులను సహాయానికి పిలుస్తూ నిప్పు ఆర్పేయాలి, లేకపోతే…..ఇంతే సంగతులు. సమస్యను ఎదుర్కోడానికి నాలుగు ఉపాయాలు చెప్పేరు, సామదానభేదదండోపాయాలు. అన్నీ ఒక సారే ఉపయోగించెయ్యకూడదు. సమస్య స్వరూపాన్ని బట్టి, ఇందాకా చెప్పినట్టు నిప్పు ఆర్పడానికి నాలుగో ఉపాయం తప్పించి మరొకటిలేదు, దానినే ఉపయోగించాలి. పెదవి కొరుక్కున్నాం, పంటి మీద కోపం తెచ్చుకుని నాలుగో ఉపాయం ఉపయోగించి పీకేస్తామా? పెదవి ఎవరిది మనదే, పన్నెవరిది, అదీ మనదే అంటే దేని మీద నాలుగో ఉపాయం ఉపయోగించినా నష్టపోయేది మనమే, అప్పుడేం చెయ్యాలి భేదో పాయం ఉపయోగించి, ఇద్దరినీ వేరు చెయ్యాలి, అప్పుడు మనం సుఖంగా లేమూ! ఇలా సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉపాయాలుపయోగించాలి. అదికూడా అపాయం లేని ఉపాయమై ఉండాలి. మనవాళ్ళు పిల్లి,ఎలక, కుక్క, నక్క, పులి, ఎద్దు ఇలా పేర్లు పెట్టి కథలు చెప్పేరు, ఎందుకో తెలుసా? ఇటువంటి ప్రవృత్తి ఉన్నవాళ్ళు సమాజంలో ఉంటారని పెద్దవారికి చెప్పడం, పిల్లలకైతే కథ తొందరగా ఆకర్షించేందుకూ, అస్థిగతమై పెద్దయ్యాకా ఉపయోగపడేందుకు చెప్పేరు. మనమంతా పెద్దవాళ్ళ మైన తరవాత ఈ కథలని మరిచిపోయాం ,జీవితంలో ఉపయోగించుకోలేకపోతున్నాం. చతుర్విధోపాయాలు చిన్నప్పుడు చాలా సార్లు విన్నాం, కాని జీవితం లో ఉపయోగించుకోలేకపోతున్నాం. భారతం లో ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తా, కాగలపని గంధర్వులే చేశారని, ఆ సంఘటనలో దుర్యోధనుడు గేలి చేద్దామని ససైన్యంగా వచ్చాడు, గంధర్వునితో అనవసర కయ్యానికి దిగాడు, దెబ్బలూ తిన్నాడు. గంధర్వుడు జుట్టు పట్టి ఈడ్చిపారేశాడు,అప్పుడు, దుర్యోధనుని పరివారం తప్పక ధర్మరాజునే ఆశ్రయించింది. సమస్య గుమ్మంలోకొచ్చి నిలబడింది, ధర్మరాజేం చేశాడు, సమస్యనే ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. తమ్ములు కాదంటున్నా యుద్ధానికి పంపేడు, ‘దాయాదులుగా మనం ఐదు మంది, వాళ్ళు నూరు మంది ఇందులో అనుమానం లేదు, కొట్లాడుకుంటే మనమూ మనమూ కొట్లాడుకోవాలి, పై వాళ్ళ దగ్గర మనం నూటయిదుమందిమే.’ తీరా వెళ్ళి యుద్ధం చేస్తుంటే శత్రువు, ‘ఓహో మిత్రుడా! నువ్వా అని పలకరించేడు, యుద్ధం చేస్తున్నవాడు. సమస్య సగం చచ్చింది. ‘అన్నయ్య యజ్ఞదీక్షలో ఉన్నాడు, వీణ్ణి వదలిపెట్టు, అన్నయ్యే వద్దామనుకున్నా’డనేటప్పటికి గంధర్వుడు ధర్మరాజు దగ్గరకొచ్చి, భాయి,భాయి అని దుర్యోధనుడిని వదిలేసి పోయాడు. అప్పటికే సగం చచ్చి ఉన్న దుర్యోధనుని ధర్మరాజేం చేశాడు? ‘ఒరే తమ్ముడూ! ఇలా పిచ్చి పిచ్చి వేషాలేస్తే పులుసులోకి ఎముక మిగలకుండా కొట్టేస్తార్రా, ఎప్పుడూ ఇటువంటి పిచ్చి పనులు చెయ్యకు’ అని కూకలేసి పొమ్మన్నాడు. తను కాలు కదపక అందరినీ దగ్గరకి రప్పించుకుని పని పూర్తి చేసుకున్నాడు, తెలివైన ధర్మరాజు. ఇప్పుడు దుర్యోధనుడు మానసికంగా పూర్తిగా చచ్చిపోయాడు. అప్పుడేం చేశాడు, తప్పు తెలుసుకున్నాడా లేదు, వినాశకాలే విపరీత బుద్ధిః అలా పాడయిపోయాడు.

తనమీద ఇటుకలు విసురుతుంటే వాటితోనే ఇల్లు కట్టుకున్నవాడు చతురుడు, తెలివైనవాడు. మొన్నటికి మొన్న చేతకాని పెద్దమ్మ, ‘టీకుర్రాడు భారత ప్రధాని కాగలడా? మా సభలో టీ అమ్ముకోవచ్చు, అనుమతిస్తున్నాం’ అన్నాడు, ఏదో పెద్ద ఎద్దేవా చేస్తున్నట్టుగా, ఒక మేధావి మణిశంకర్ అయ్యర్, అదిగో ఆ మాట పుచ్చుకున్నాడు, తెలివైన మోదీ, ఏం చేశాడు? అది చరిత్ర. ‘నోరా వీపుకి దెబ్బలుతేకే’ అంటే ఇదే. ‘దారేపోయే తద్దినమా మా ఇంటికిరా’ అని పిలిచి సమస్యను కొని తెచ్చుకున్నట్టయింది. ఏమయింది? పార్టీ సోదిలోకి కూడా రాకుండా పోడానికి రాచబాట వేశాడు అయ్యర్ గారు, అందరూ అందులో నడిచి ఓటమి తీరాన్ని అవలీలగా అందుకున్నారు. చిన్నపుడు జ్వరం వస్తే అమ్మ ‘ఆయ్యో! నీకేరావాలా నాన్నా జ్వరం, ఊళ్ళో వాళ్ళింతమంది ఉంటేనూ’ అనేది. అంటే? జ్వరం రావడం గొప్పనీ, ఊళ్ళో వాళ్ళకి లేని గొప్పేదో నాకే వచ్చిందనీ, తగ్గిపోతుందనీ అమ్మ చెప్పిన భరోసా!, సమస్యని గొప్పచేసి చూపి.

కొన్ని కొన్ని సమస్యలని ఒంటి చేత్తో ఎదుర్కోలేం! కలౌ సంఘే శక్తిః అన్నారు పరమాత్మ. అప్పుడు సమస్యని జాగ్రత్తగా పదిమందిలో పెట్టాలి,ఆవేశపడితే? రూల్స్ మాటాడుకుంటే? పెదవి పన్ను కథయిపోతుంది. పదిమంది అభిప్రాయం కూడగట్టాలి, ఓపిక కావాలి.పది మందిలో పడ్డ పాము చావదని నానుడి, ఏం ఎందుకు చావదు? వారు కొడతారులే అని వీరు, వీరనివారూ, ‘మనకెందుకు పాపమని’ మరికొందరు, ‘సాక్ష్యం చెప్పాలేమో మనకెందుకొచ్చిన గొడవ’ అని కొందరూ ఊరుకుంటారు, పాము దాని పని అది చేసుకుపోతుంది.నేడు సమాజం లో జరుగుతున్న నేరాలన్నీ ఈ అవ్యవస్థకి రూపాలు. చిన్న విషయంలో తప్పు ని తప్పని అని చెప్పలేనివాళ్ళం. అలా జరుగుతూ ఉంటాయ్! వాటిని ఆపలేం అనుకుని సద్దేసుకోడం మనకి బాగా అలవాటు.ఒక అబలను పదిమందిలో నడిరోడ్ మీద వివస్త్రను చేస్తుంటే, చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నవాళ్ళనేమనాలి?.ప్రాణ భయమా? ఎన్నిసార్లు చస్తాం?. పోనీ ఆ తరవాత కూడా ఒక్క గుడ్డ ముక్క ఆ అబలమీద కప్పలేని నీచానికి దిగజారిపోతున్నామా? సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం, మనమే…..మనకి హక్కులగురించి మాట్లాడటం బాగా తెలుసు బాధ్యతలు మాత్రం నిర్వర్తించం.

భార్యాభర్తల మధ్య సమస్య వస్తే, విడివిడిగా ఆలోచించండి, ఎదుటివారి కోణం లో, ఆ తరవాత ఇద్దరూ కలిసి ఆలోచించండి, ఎవరి కోణం లో వారు మాటాడండి, వాదించకండి, ఆవేశపడకండి, దెబ్బలాడుకోకండి, సమస్యని విశ్లేషించండి, సమస్య దూదిపింజలా విడిపోతుంది. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకోవద్దు. ‘నువ్వు నా అంత నేను నీ అంత’ అనుకోండీ! సమస్య మూడో వారిదగ్గరకెళ్ళిందా? ఇంతే సంగతులు. కోర్ట్ కెళ్ళిందా? విడాకులే గతి. ఒకళ్ళని కొడితే వారికెంత దెబ్బ తగిలిందో అంత దెబ్బా మనకూ తగిలింది. అది గుర్తించం, మానసికంగా కొట్టేమని ఆనందిస్తాం. ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే చూసి వినోదంతో ఆనందించేవారే ఎక్కువ. సమస్యలో ఉన్నవారిని ఆదుకునేవారే తక్కువ, ఇది గుర్తించండి, న్యాయం మీ పట్ల ఉన్నా జరగదు, అన్ని వేళలా. కోపం లో, ఆవేశం లో నిర్ణయం తీసుకోవద్దు, ఆనందంలో వాగ్దానమూ చెయ్యద్దు, ఓర్పు చాలా అవసరం.

సమస్యను మనకి తెచ్చిపెట్టాలనుకునేవాడు ‘అమ్మో! మనం సమస్య వాడికి తెస్తే, వాడు మనల్ని తినేస్తా’డనే భయం, ‘అమ్మో! వాడితో పెట్టుకుంటే, చాలా తెలివైనవాడు, ఐపోతా’మనే భయమే ఎదుటివాడికి లేకపోతే, బతకలేం.  పాములా బుసకొట్టి, భయపెట్టి బతకాలి, కాటేసి కాదు…అదే…అదే కావాలి…. అదే…తెలివి. చదువుకున్నవారంతా తెలివైనవారు కాదు, తెలివైనవారంతా చదువుకునీ ఉండకపోవచ్చు. నిజంగా చదువుకోని తెలివైనవారే కదా మనల్ని పాలిస్తున్నారు.

‘టపాలు పెద్దవైపోతున్నాయి, మొదటి రోజులలోలాగా!’ అన్నాడు మా సత్తిబాబు. నిజమే ‘ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ’  🙂 నేను మేనేజిమెంట్ నిపుణుడిని కాను మట్టి మనిషిని.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సమస్యను ఎదుర్కోడం ఎలా?

 1. శర్మగారూ!
  మనసులో భావాలు మనిషన్న ప్రతివారికీ మెదులుతాయి.
  వాటిని చక్కగా ఎదుటివారి మనసుకు హత్తుకునేలా చెప్పగల కళని మాత్రం ఆ భగవంతుడు నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే ప్రసాదిస్తాడు.మీ విషయంలో ఆ వరానికి అనుభవ జ్ణానం కూడా తోడయ్యింది…మాలాంటి సామన్య చదువరులం అబ్బురపడుతూ ఆస్వాదిస్తున్నాము.
  కడుపు మండే పరిస్థితిలొ కూడా ఇంత బాలన్సుడ్ గా ఎలా రాయగలుగుతున్నారో ఆశ్చర్యం గా వుంది.

  • శ్రీ దేవిగారు,
   కొద్దిగా ఉద్రేకపడిన మాట వాస్తవం. మీరన్న గుణాలేం లేవు, నేను మట్టి మనిషిని. మీ అభిమానం తో నాలో మీకు గుణమే కనపడుతోంది 😉
   నెనరుంచాలి.
   ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడు దేవుడా.

  • మోహన్జీ,
   ఉద్రేకంలో ఉరికిన టపా. ఎక్కడా సంయమనం కోల్పొలేదు. టపా నాలుగైదు నిమిషాల్లో అలవోకగా టైప్ చేసి ముగించిన తరవాత చదివా, అబ్బా బాగా పెద్దయిందే అనిపించింది.మొదటి రోజుల్లో టపాలు ఇంతంత పెద్దవిగా ఉండేవి. కత్తెరెయ్యడానికి సావాకాశమెక్కడా కనపడలేదు. అదే మాట్ కీబోర్డ్ నుంచి ఉరికింది,కూడా సామెతా ఉరికేసింది, కొంచం సంయమనం తప్పింది.మీ సునిసిత దృష్టిని దాటిపోలేకపోయింది. మీ సూచనకి అభినందన. సారీ నేనే చెప్పాలి:)
   నెనరుంచాలి.
   ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడు దేవుడా.

 2. శర్మ గారూ ,

  శుభోదయం .

  ఈ విషయాలన్నీ విపులంగా , ఉపమానాలతో సహా విన్నవించారు . అర్ధంచేసుకొని , మరువకుండా అవసపమైన సందర్భాలలో ఉపయోగించ గలిగితే , జీవితాలు ఆయువు ,వాయువులో కలసిపోనంత వరకు , ఆనందంగా జీవించగలుగుతారు , జీవింపచేయ గలుగుతారు .
  ఇవి చదివి పారేయాలసినవి కావు . చెడుని మాత్రమే ఏరి పారేయాలసినవి అనితెలుసుకొని , కొంచెం మననం చేసుకొంటుంటే చాలా బాగుంటుంది సర్వులకూ .

  ” సమస్యను మనకి తెచ్చిపెట్టాలనుకునేవాడు ‘అమ్మో! మనం సమస్య వాడికి తెస్తే, వాడు మనల్ని తినేస్తా’డనే భయం, ‘అమ్మో! వాడితో పెట్టుకుంటే, చాలా తెలివైనవాడు, ఐపోతా’మనే భయమే ఎదుటివాడికి లేకపోతే, బతకలేం. పాములా బుసకొట్టి, భయపెట్టి బతకాలి, కాటేసి కాదు…అదే…అదే కావాలి…. అదే…తెలివి. చదువుకున్నవారంతా తెలివైనవారు కాదు, తెలివైనవారంతా చదువుకునీ ఉండకపోవచ్చు. నిజంగా చదువుకోని తెలివైనవారే కదా మనల్ని పాలిస్తున్నారు.”
  టపాలో విషయమున్నంత వరకు , ఎంత పెద్దదైనా చదవ గలరు . కనుక సందేహించకండి .

  • అబ్బాయ్ రవి,
   కడుపు రవిలిపోయిందయ్యా! కీ బోర్డ్ మీద వేళ్ళు పరిగెట్టి,ఎప్పుడూ అంత స్పీడ్ గా చెయ్యలేదు, భావం మనసులోంచి ఉరికితే వేళ్ళు తదనుగుణంగా నాట్యం చేస్తే గంగా లా ఉరికి వచ్చిన టపా
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s