శర్మ కాలక్షేపంకబుర్లు-కౌపీన సంరక్షణార్ధాయ………….

కౌపీన సంరక్షణార్ధాయ…………….

శ్లో. అస్థిరం జీవనం లోకే అస్థిరం ధనయౌవనం,
అస్థిరం దారపుత్త్రాది ధర్మః కీర్తిర్ద్వయం స్థిరమ్॥
గీ. అస్థిరంబిల జీవన మస్థిరములు 
ధనము,  యౌవనము, సుతులు, ధర్మ పత్ని, 
స్థిరము ధర్మంబు, కీర్తియు, పరమ పథము 
చేరు మార్గంబులివ్వియే ధీరులకిల.
భావము. ప్రాణము, ధనము, యౌవనము, భార్యాపుత్రాదులు సర్వము అస్తిరమైనవే, ధర్మము, కీర్తి ఈ రెండే స్థిరమైనవి. 
Courtesy:Sri.Chinta Ramakrishna Rao garu.
Andhraamrutam.blogspot.com

 

ఒక బ్రహ్మచారి ఒక గురువు దగ్గర చేరేడు, విద్య కోసం. గురువు చదువు చెప్పేడు, భోజనమూ పెట్టేడు. శిష్యునికి ఉన్నవి రెండు కౌపీనాలు, అంటే గోచీలు, వాటితోనే చదువు కాలం గడిపేశాడు. చదువైపోయిందని గురువు స్నాతకోత్సవం జరిపించి పంపేసేరు. ఏం చేయాలో తోచని బ్రహ్మచారి ఉండటానికి ఒక చుట్టు గుడిసె వేసుకున్నాడు, ఊరి చివర. తపస్సు చేస్తూ, నారాయణ స్మరణ చేస్తూ,ఉంఛ వృత్తి చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఉన్న రెండు గోచీలలో, రోజూ ఒక గోచీ ఉతుక్కుంటున్నాడు, నదిలో, దానిని ఆరేస్తున్నాడు, ఒకటి పెట్టుకుంటున్నాడు. ఈ ఆరేసిన గోచీని ఒక ఎలక కొట్టెయ్యడం ప్రారంభించింది. ఏం చేసినా ఎలకనుంచి గోచీని కాపాడుకోలేకపోయాడు. ఎలకనుంచి గోచీని రక్షించుకోడానికి, ఒక పిల్లిని మాలిమి చేసేడు. రోజూ పిల్లికి ఎలకలు దొరుకుతాయా? దానిపోషణకోసం, పాల కోసం ఒక ఆవును కొన్నాడు. అందుకోసం సంపాదన మొదలెట్టేడు. నారాయణ నామ జపం కొంత వెనకబట్టింది.ఆవును కొన్నంతలో పాలు పిల్లి కంచం లో వాలవు కదా! గోవును చూసుకోడానికి ఒక మనిషిని పెట్టేడు, ఆ మనిషే గోవును మేపి, పాలు తీసి ఇస్తున్నాడు. మరి పిల్లికి సంరక్షణ  జరగాలంటే, ఈ పిల్లిని గోవుని సంరక్షించేందుకు పాలు వ్యవహారం సరిగా నిర్వహించేందుకుగాను బ్రహ్మచారి పెళ్ళి చేసుకున్నాడు.దీంతో నారాయణ నామ జపం బదులు నారీ నామ స్మరణ ప్రారంభమయింది.

పెళ్ళి చేసుకోడంతో గోచీ అవసరం పోయింది, చీని చీనాంబారాలొచ్చాయి. ఇప్పుడింక ముందుకుపోవడమే తప్పించి వెనక్కి వెళ్ళేదారి మూసుకుపోయింది. పెళ్ళాన్ని పోషించడానికి, ఆమె అవసరాలకోసం సొమ్ము సంపాదించడం మొదలు పెట్టేడు. ఆమె ఆ గుడెసెలో ఉండటమెలా? అందుకుగాను ఇల్లు కట్టేడు, అందుకు సొమ్ము సంపాదించాడు. ఇల్లు, ఇల్లాలు అమిరింది, ఇల్లాలు సంసారం చేయకపోతే ఊరుకుంటుందా? సంసారం చేసేడు. సంసారం చేస్తే పిల్లలు పుట్టేరు. ఇప్పుడు నారీనామ స్మరణతో ధన సంపాదనా స్మరణ తోడయింది, నారాయణ నామమే గుర్తులేదు. వారి ఖర్చుకి సంపాదన మళ్ళీ పెంచాల్సివచ్చింది. ఆ తరవాత వారి విద్యకి,పెళ్ళి పేరంటాలకి సొమ్ము సంపాదించాడు. కొడుకులు కోడళ్ళు, కూతుళ్ళు అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళ సంఖ్య పెరగడం తో ఇల్లు సరిపోక మరో అంతస్థు వేసేడు, దానికోసం సంపాదించాడు. ఏమో! ఏ రోజెలా ఉంటుందో తెలీదు కదా, వీళ్ళలో ఎంతమంది ప్రయోజకులవుతారో చెప్పలేమని స్థిరాస్థులు సంపాదించాడు. వాటికోసం కష్టపడ్డాడు. కొడుకులికి కూతుళ్ళకి పిల్లలు పుట్టేరు, వాళ్ళూ పెద్దవాళ్ళవుతున్నారు. ఎవరి సంసారం వాళ్ళు చేస్తున్నారు, ఈ ఇంటిలోనే ఉంటున్నారు,  తండ్రి సంపాదన మీద బతుకుతూ, తమ సంపాదన దాచుకుంటున్నారు.

ఇప్పటికే భగవంతుని మరచిపోయి చాలా ఏళ్ళే అయింది.ఇప్పుడితనికి కనపడటమూ లేదు, వినపడటమూ లేదు. ఎవరూ ఇతనిని పట్టించుకోడం మానేశారు. వేళకి నాలుగు మెతుకులు పెడుతున్నారు, ఎవరూ మాటాడేవారు లేరు, పలకరించేవారు లేరు, చేసేపని లేదు, చేయగల ఓపికాలేదు. భార్య కూడా పిలిస్తే పలకడం మానేసింది. ఇతనికి అనారోగ్యం చేస్తే తెలియకుండానే బట్టలలో అల్పాచమానమవుతుంటే బట్టలు మార్చడం కష్టంగా ఉందని కొడుకు వీధిలో నులక మంచమేయించి, గోచీ పెట్టించి పడుకోబెట్టేడు. రెండు గోచీలు కుట్టించేరు. ఒకటి పెడుతున్నారు, మరొకటి ఆరేస్తున్నారు తన ఎదురుగానే. మళ్ళీ ఒక ఎలక గోచీ కొట్టెయ్యడం ప్రారంభించింది, తన ఎదురుగానే, కాని దానిని వెళ్ళగొట్టే ఓపికే లేకపోయింది.అప్పుడు గుర్తొచ్చిందీ మానవుడికి తన గోచీ కధ. అయ్యో! ఆనాడు గోచీని సంరక్షించుకోడానికి పిల్లి దాని సంరక్షణకి మరొకరు, మరొకరు, అలా సంసారం పెరిగింది, భగవంతుడు దూరమయ్యాడు, ఈ రోజు భగవంతుడిని తలుద్దామంటే ఒళ్ళు సహకరించటం లేదని వాపోతూ, కొపీన సంరక్షణార్ధాయ అయం పటాటోపః అయిపోయిందే బతుకు అని నిట్టుర్చాడు.

ఒంటరిగా ఈ ప్రపంచంలోకి వస్తాం. వయసుతో, లంపటాలన్నీ, బంధాలు, కావాలని తగిలించుకుంటాం. తగిలించుకున్నవన్నీ ఆనందం కలగచేసేవే అని ఆనందిస్తాం. కాలం గడుస్తున్నకొద్దీ, ఈ తగిలించుకున్నవి ఆనందం కాదని తెలుస్తూ ఉంటుంది, కాని వదిలించుకోడానికి ప్రయత్నం చెయ్యం. ఇంకా కాలం నడుస్తుంది, ఈ బంధాలన్నీ సంకెళ్ళేననే సంగతి పూర్తిగా అవగాహన కొస్తుంది, కాని తెంచుకోలేక…చిక్కులలో వృద్ధావస్తా చింతాసక్త మిగిలిపోతుంది. పరమాత్మ కరుణిస్తే,కాలుడు ఈ బంధాలనుంచి విముక్తి చేస్తాడు, అప్పుడూ ఒకరే పోతారు……ఆలు మొదటిసారిగా వీధిగడప దాటి వచ్చి వీడ్కోలిస్తుంది,కొడుకు కాటిదాకా వచ్చి వీడ్కోలిస్తాడు……….తోడెవ్వరూ రారు, తోడొచ్చేదొకటే…….దానిని జీవితంలో సాధించలేదు….

అందువలన,అందుచేత, అందు కొరకు గోచీ ఉంటే ఎలకబాధ, ఆ తరవాత పిల్లి, ఆ తరవాత పనివాడు, ఆ తరవాత పెళ్ళాం,పిల్లలు సంసారం, ఇల్లు గోల సంపాదన ఏమీ అక్కరలేదు. అందుచేత అంతా గోచీలు తీసేయండి, సుఖపడిపొండి.

“ఇదెవరిని ఉద్దేశించి రాసినది కాదని మనవి.”

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కౌపీన సంరక్షణార్ధాయ………….

  • సుధాకర్ జీ,
   ఒక దానికోసం ఒకటి, దానికోసం మరొకటి ఇలా సంసారం పెరుగుతూనే ఉంది. చివరికి సమయం తరిగిపోతే మిగిలేదేం కనపడటం లేదు, చింత తప్పించి.
   నెనరుంచాలి.

 1. మిత్రులు శర్మగారు. బాగా వ్రాసారు. నేను అన్నది మొదలు కావటానికి కారణం మాయ. ఈ‌ నేను అన్నదాని ప్రభావం‌ యేమిటంటే చుట్టూ ఉన్న సృష్టికన్న తాను భిన్నుడననే భావన కలగటమే. దానితోబాటే తనకన్న భిన్నమైన సృష్టిలో ఇది నాది ఇది పరాయిది అన్న స్పహా కలుగుతుంది. ఇలా నేను – నాది అన్నవి యేర్పడ్డాక మిగిలిన త్రిగుణాలూ, వాటి వెనక దండులాగా అరిషడ్వర్గాలూ వగైరా అంతా తనని కమ్ముకొని పెత్తనం చేస్తాయి. పూర్వపుణ్యమో గురుబోధో యేదో ఒకటి భగవంతుడిమీద దృష్టిని కలిగించినా ఈ‌ నేను-నాది అనే భావనల పటాటోపం ఆ దృష్టిని నిలబడనీయవు. శరీరం యొక్క ప్రతాపం అణగ్గానే ఆ భగవంతుడు మళ్ళీ గుర్తుకు వస్తాడు. ఆ ప్రతాపం ఉన్నంతకాలమూ పంచమలాలు జీవికి భగవంతుడిని దూరంగానే ఉంచుతాయి. ఎంత తెలిసినవారైనా ఈ‌ గడబిడలో నుండి బయటపడటం దుష్కరంగా ఉన్నది,

  • శ్యామలరావుగారు,
   మాయ కప్పేస్తోందండీ! నేను అన్నది కొంత కావాలి కాని అదే సర్వస్వం అయికూచుంటోంది. నేడు నా అదృష్టం కొద్దీ ఈ టపాకి సరిపోయే శ్లోకమిచ్చారు చింతావారు. అది తెచ్చి ఈ టపాని సుసంపన్నం చేసేననుకుంటున్నా.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s