మృగతృష్ణ న్యాయం
మృగమంటే లేడి తృష్ణ అంటే దాహం. వేసవి కాలంలో పచ్చికబయళ్ళు ఎండిపోయి ఎండలో ఉన్న లేడికి దాహమేస్తే, సుదూరంలో నీరున్నట్టు కనపడుతుంది. లేడి అక్కడికి పరుగెడుతుంది, నీటికోసం, అక్కడ నీరు కనపడదు కాని, సుదూరంలో నీరున్నట్టుగా కనపడుతుంది. పాపం ఈ లేడి, దాహం తీర్చుకోడానికి మంచినీటికోసం అలా పరుగెడుతూనే ఉంటుంది, నీరు ఉన్నట్టు కనపడుతూనే ఉంటుంది, కాని నీరుండదు, దాహమూ తీరదు. లేని నీటికోసం పరుగులు పెట్టి ఉన్న శక్తిని పోగొట్టుకుంటుంది పాపం, లేడి.ఇదే ’ఎండమావి’అసలు ఎండమావి ఎలా ఏర్పడుతుంది?వేసవి వచ్చేటప్పటికి పచ్చిక ఎండిపోయి భూమి కనపడుతూ ఉంటుంది. ఎండవేడికి భూమి వేడెక్కి, భూమికి దగ్గరగా ఉన్న గాలిపొర వేడెక్కి దాని సాంద్రత కోల్పోతుంది. ఎక్కువ సాంద్రత ఉన్న గాలి తక్కువ సాంద్రత కలిగిన గాలితో కలిగే ప్రతి చర్యవలన అక్కడ అలలు ఏర్పడినభావన కలుగుతుంది. ఆ దృశ్యం దూరంనుంచి చూచేవారికి అక్కడ నీరున్న భ్రమ కలిగిస్తుంది. (This is an optical illusion.)
Photos courtesy: Google
మానవ జీవితానికి పోల్చుకుంటే ‘అందని మాని పండ్లకి అఱ్ఱులు చాచడమ’ని చెప్పుకోవచ్చు. మీకు పది కోట్లు లాటరీ తగిలిందని చెప్పి భ్రమ కలిగించి, దానిగురించి పరిగెట్టేలా చేసి, ఉన్న సొమ్ము పోగుట్టుకోడాన్ని, ఈ న్యాయంతో సరిపోల్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ‘మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకున్న’ట్టనీ అనచ్చు. దీనినే ఎండమావి అంటాం. దీనిని ఇంగ్లీష్ లో (mirage)మిరేజ్ అంటారు. ఇది వేసవి కాలమే కాదు శీతాకాలంలో నూ ఏర్పడుతుంది. ఒడ్డున నిలబడ్డవారికి ఎదురుగా ఒక ఓడ కనపడుతూ మరో ఓడ ఆకాశం లో కనపడుతుంది, ఇదీ అటువంటిదే. మరొక ఓడ, సుదూరంలో అక్కడ ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది. జీవితం లో అందమైన మృగతృష్ణలు చాలా తారసపడుతుంటాయి, నిత్యమూ, వాటిని అందుకోడానికి ప్రయత్నం చేయకపోడమే తెలివయినపని. ఒక దాన్ని అందుకోడానికి ప్రయత్నం చేసినా మిగిలేది అధోగతి, అది మృగతృష్ణ తెలిసేటప్పటికి చేతులు కాలిపోతాయి.. వాటి వెనక పరిగెట్టక శ్రమనే నమ్ముకుంటే సౌఖ్యమేమనది.
కులాలచక్రకీటన్యాయం
కులాలచక్రం అంటే కుమ్మరి చక్రం కీటం అంటే పురుగు, కుమ్మరి చక్రం ఇరుసు భూమికి లంబంగా ఉంటుంది. చక్రం అక్కడే తిరిగితుంది కాని ప్రయాణం చేయదు. కాని చక్రం ఇరుసు భూమికి సమాంతరంగా ఉంటే చక్రం ప్రయాణం చేస్తుంది. కుమ్మరి చక్రం ప్రయాణం చేయదు, దాని మీద ఒక పురుగు తిరుగుతుంటే ఎక్కడికెళుతుంది? ఆ చక్రం మీదే ఉంటుంది అనగా గానుగుకు కట్టిన ఎద్దు తిరుగుతుంటుంది, కాని ఎక్కడికీ వెళ్ళదు. అదీ సంగతి కులాల చక్ర కీటన్యాయం.మనం ట్రెడ్ మిల్ మీద నడుస్తున్నాం, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం?.మరో ఉపమానం చెప్పుకోవాలంటే లోకమే ఒక వింత రాగద్వేషాలతో, ఈ వింతయిన లోకంలో మరో వింత బ్లాగుల్లో రాగద్వేషాలు, వింతలో వింతకదా!.
గృహదీపికాన్యాయం
గృహం అంటే ఇల్లు దీపిక అంటే దీపం. ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే ఏం జరుతుంది? మూతి కాలుతుంది, అనగా మనవారేనని, మనవారి తప్పులను సమర్ధిస్తే నష్టపోతామని.మనవాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని ముద్దు చేస్తే ఏదో ఒకరోజు మీసాలు కాలటం ఖాయం.మన ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే జరిగేదీ అదే. అందుకే తప్పు ఎవరు చేసినా తప్పేనని చెప్పే ధైర్యం కావాలి. తప్పు తెలియక చేస్తే పరిహారం ఉంది కాని తెలిసి చేసే తప్పుకి తప్పక దండన కావాలి, ఇది మరచిపోతున్నాం.
తృణజలూకాన్యాయం
తృణము అంటే గడ్డి పరక, జలూకం అంటే జలగ (leech). మీరు జలగ పాకడం చూసి ఉండకపోవచ్చు. జలగ నీటిలో కాని మరొక చోట కాని గడ్డి మీద పాకేటపుడు ఒక గడ్డిపోచనుంచి మరొక గడ్డిపోచమీదికి తల చాచి కొత్త గడ్డిపోచను గట్టిగా పట్టుకుని అప్పుడు వెనక గడ్డిపోచను వదలుతుంది. దీనినే తెనుగులో ‘ఆచి తూచి అడుగేయడం’ అంటారు. ‘పట్టుకునేది చింత కొమ్మ కావాలి గాని ములగ కొమ్మ కాకూడ’దంటారు. చింతకొమ్మ సాగుతుంది, వంగుతుంది కాని సామాన్యంగా విరగదు, అదే ములగకొమ్మ విరుగుతుంది, బాగా పెళుసు, కాని వంగదు. ఎప్పుడైనా ఒక దాని నుంచి మరొక దానికి మారేటపుడు రెండవదాని మంచిచెడ్డలు చూసుకుని అప్పుడు మొదటి దానిని వదలాలి, లేకపోతే రెండిటికి చెడ్డ రేవడి అవుతాం కదూ!
అంధాక్షిమీలన న్యాయం
అంధః అంటే గుడ్డివాడు అక్షిమీలనం అంటే కళ్ళు మూయడం. గుడ్డివాడు కళ్ళు మూయడమెందుకూ. అందుకే తెనుగులో ‘గుడ్డి కన్ను తెరచినా మూసినా ఒకటే’ అంటారు. పనికి మాలిన వారు ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టనమాట.
అసిధారావ్రత న్యాయం
అసి అంటే కత్తి ధార అంటే పదును.వ్రతం అంటే దీక్ష. అసిధారా వ్రతం అనగా నిత్య జాగురూకత.కత్తి మీద నడిస్తే ఏమవుతుంది? తెగుతుంది. తెనుగులో చెప్పాలంటే ‘కత్తి మీద సాము’. అనగా ఏమాత్రం తేడా వచ్చినా ప్రమాదం జరుగుతుందని సూచన.
ఈ అసిధారావ్రతానికో చిన్న కథ చెబుతారు, ఇది పాతదే చిన్నప్పుడు చదువుకున్నది, మీకూ తెలిసినదే అవధరించండి.
ఒక రాజు పరిపాలన ధర్మబద్ధంగా చేస్తున్నాడు. తీర్పులూ ధర్మ బద్ధంగానే ఇస్తున్నాడు. తీర్పులు ధర్మబద్ధంగా ఇస్తున్నా, తీర్పులు ధర్మ బద్ధంగా ఉన్నట్టుగా ఋజువు కావాలనుకుని, అందరికి తెలియాలని, ఏం చేస్తే అందరికి తెలుస్తుందని పెద్దలనడిగేడు. వారు ఒక పదునైన కత్తిని పొడుగైన వెంట్రుకకు కట్టి, దానిని సింహాసనం పైన వేలాడతీయమన్నారు. రాజు నిర్భయంగా వేలాడతీశాడు. రాజు ధర్మ బద్ధంగా, నిష్పక్షపాతంగా తీర్పులిచ్చినంత కాలం లోనూ ఆ వెంట్రుక తెగి కత్తి రాజుని చంపదని చెబుతారు. రాజు ప్రతినిమిషం కత్తి నెత్తి మీద ఉన్నదన్న స్పృహతో ధర్మ బద్ధంగా తీర్పులిచ్చాడు. కత్తి తెగి కింద పడి రాజు మరణించలేదు. రాజు ధర్మమే కాపాడింది, ఇదే అసిధారావ్రత న్యాయం.
ఇప్పటికివి చాలు మరోసారి మరికొన్ని.
తాత గారు..నేను మీ బ్లాగు చదవడం మొదలుపెట్టాక చాలా కొత్త,మంచి విషయాలు తెలుసుకున్నాను.మీ బ్లాగులో చదివిన ప్రతి కొత్త టపా గురించి నేను నా భర్త తో చెపుతూ ఉంటాను..మీ టపా చదివినంతసేపు ఆత్మీయులతో మాట్లాడినట్లే అనిపిస్తుంది.. ఇప్పుడు శర్మ తాత గారు మా ఇద్దరికీ తాత గారు.. ధన్యవాదములు.
చిరంజీవి బుజ్జి,
మీ దంపతుల అభిమానానికి అవాక్కయ్యాను.
ఇదే అశీర్వచనం
దీర్ఘసుమంగళీభవ
దీర్ఘాయుష్మాన్భవ.
ధన్యవాదాలు.
గురువుగారు మీ బ్లాగ్ చాలా బాగుంది….. చదివే కొద్ది ఇంకా చదవాలనిపిస్తుంది……..
Meghaa గారు,
ధన్యవాదాలు.
మీ బ్లాగ్ చదివి నప్పుడల్లా ఇంట్లో పెద్దవాళ్ళు లేరనే లోటు తీరుతోంది ,నమస్కారాలు
anjalitanuja గారు,
ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళని హోముల్లో జేర్చేస్తున్న రోజులలో, పెద్దవాళ్ళు లేరని బాధ పడుతున్నావా తల్లీ!
దీర్ఘసుమంగళీ భవ.
దీర్ఘాయుష్మాన్భవ.
నెనరుంచండి
నీతి చంద్రికలు భేషుగ్గా ఉన్నాయి
మోహన్ జీ
నెనరుంచండి
గుర్తుంచుకోవలసిన చాలామంచివిషయాలు చెప్పారు, ధన్యవాదాలు. క్షీరనీర న్యాయం కూడా వివరించగలరు.
స్వామిజీ,
క్షీరనీర న్యాయం గురించి ఇదివరలో చెప్పేను. ఒక టపా పూర్తిగానే రాయాలి, దాని గురించి. వీలు చూచుకుని మరల చెబుతాను. చెప్పినదే మళ్ళీ చెబుతానని అనుముకుంటా రని భయం.
నెనరుంచండి