శర్మ కాలక్షేపంకబుర్లు- ! దడిగాడు వాన సిరా

! దడిగాడు వాన సిరా

అల్లరి అంటే ముందు గుర్తొచ్చేది వానర సేన. అయ్యో! సీతను వెతకడంలో, యుద్ధంలో, రామునికి సహాయకారిగా ఉన్న కపిసేన అల్లరి చేసిందా? ఎప్పుడు ఎక్కడా అని చూస్తే రామాయణం లో సీతను వెతికి తిరిగొస్తూ వానర సేన అంగదుని, హనుమ ఇతర పెద్దల అనుమతితో మధువనం లో చేసిన అల్లరి సాక్ష్యం. ఈ మధువనం అనేది ఒక మంచి వనం దీనిని ఋక్షరజసుడు, సుగ్రీవునితాత, ఆ పైవారి కాలం నుంచి రక్షించుకొస్తున్నది. దీనిని ఇప్పుడు కాపాడుతున్నవాడు సుగ్రీవుని మేనమామ దధిముఖుడనేవాడు. దీనిని చాల ప్రేమగా, గౌరవ చిహ్నంగా భావిస్తూ సంరక్షిస్తున్నారు. అదిగో అటువంటి వనం అనగా తోటలో ప్రవేసించారు, వానర సేన. ఏం చేసారయ్యా! తేనె తుట్టెలని పట్టుకుని తేనె తాగేరు,కొంతమంది పాటలు పాడేరు, కొంతమంది నృత్యం చేసేరు,మరికొంతమంది చెట్లకి తలకిందులుగా వేలాడేరు.కొంతమంది పకపకా నవ్వేరు, కొంతమంది ఏడ్చేరు.కింద పడ్డారు, మీదపడ్డారు, ఒకళ్ళమీద ఒకళ్ళు పడ్డారు,ఇటుఅటూ పని లేకపోయినా తిరిగేరు,ఒక చెట్టుమీదనుంచి మరో చెట్టుకి దూకేరు, చెట్టు పైనుంచి నేలకి దూకేరు. ఒకడు నవ్వుతుంటే వాడి దగ్గర మరొకడు బోరున ఏడ్చేడు, మరొకడు ఏడుస్తున్నవాడిని వీపు పట్టుకుని ముందుకుతోసేడు. ఇక అందరూ మధుపానం చేసేరన్నారు వాల్మీకి, మధువు అంటే రెండర్ధాలున్నాయి, తేనె,కల్లు. తేనె కూడా ఎక్కువగా తాగితే కల్లు తాగినంత నిషా చేస్తుంది తెలుసా! ఇలా మధువు తాగిన వారు చెట్లు విరిచేస్తూ పాడు చేస్తున్నారని వన సంరక్షకులు అడ్డుపడ్డారు. వాళ్ళని పట్టుకుని చితక్కొట్టేరు, వానరులు. వాళ్ళు పోయి దధిముఖునికి చెప్పుకుంటే అతనొచ్చి వీళ్ళని కొంత పరుషంగా మాటాడేడు, కొంతమందిని వేడుకున్నాడు.అబ్బే వానరులు ఎవరు చెప్పిన మాట వినేలా లేరు, అలా చెబుతున్న దధిముఖుని గోళ్ళతో రక్కేరు, కరిచేరు, నానా భీభత్సం చేసేరు. దధిముఖుని ప్రవర్తనతో కొంత భయపడ్డ వానరులకు అంగదుడు ప్రోత్సాహమిచ్చాడు. ఇక వానరులు విజృంభించారు. తాగినంత తేనె తాగేరు, కుండలు దొర్లించేసేరు. పారబోసేరు.తేనె పట్టులతో కొట్టుకున్నారు. బాగా తాగినవాళ్ళు ఆకులు పరుచుకు పడుకున్నారు. కొంతమంది పిచ్చెక్కినట్టు కొంతమందిని పట్టుకుని నేలకేసి కొట్టేరు. కొందరు ఏడుస్తున్నట్టు నటించేరు. అడ్డొచ్చిన వారిని మళ్ళీ చితక్కొట్టేరు. వాళ్ళుపోయి దధిముఖునికి చెప్పుకున్నారు. దధిముఖుడొచ్చి వానరులను కట్టడి చేయబోతే చెట్లు పీకి కొట్టేరు, ఆఖరికి అంగదుడు కూడా తాత దధిముఖుని వాయించేడు, ఇక వీళ్ళ అల్లరి భరించలేక దధిముఖుడు పోయి సుగ్రీవుని దగ్గర చెప్పుకున్నారు, ఆ తరవాతేం జరిగింది ప్రస్తుతానికి అనవసరమనుకోండి.(రామాయణం,సుందరకాండ,61,62 సర్గలు స్వేఛ్ఛానుసరణ.) అన్నీ మగకోతులేనండి, ఆడకోతులు లేనట్టే ఉందండి. సీతని వెతకటానికి గాని యుద్ధానికి కాని ఆడకోతులు వెళ్ళినట్లు వాల్మీకి గారు చెప్పలేదండి. ఆడ కోతులు కూడా ఉండి ఉంటే ఆ అల్లరి ఎలాఉండేదంటారు?

ఇలా అల్లరనేటప్పటికి చిన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి.వేసవి వస్తే మామిడి జీడి తీసుకుని తెల్ల గోడలమీద ‘జీడికి బంటెవరు’ అని రాయడం, దానికింద మరొకడు ‘దడిగాడు వానసిరా’ అని రాయడం, ఇలాగే పుస్తకాల మీద రాయడం. ఏవో కొన్ని గొప్పపేర్లు పదాలు చెప్పి వాటిలో మొదటి అక్షరాలన్నీ నువ్వే అనడం, ఇలా అల్లరి చేస్తుండేవారు. ఇవి కాక ‘ఇచ్చట ఉ…పోయరాదు,’  ‘ఇచ్చట నోటిసులు అంటించరాదు’ అని ఉన్న చోట్ల చివర అక్షరం తీసెయ్యడంతో ‘ఇచ్చట ఉ…పోయరా,’  ‘నోటీసులు అంటించరా’  అని అర్ధం మారిపోయేది.

నేను నాలుగో ఫారం కి వచ్చేటప్పటికి అప్పటికే ఆ క్లాసులో ఉన్నవారిద్దరు,డింకీ కొట్టి ఆగిపోయినవారు, ఒకరు నా హీరో సూర్రావు, రెండవ వారు కృపమ్మ. ఈ ఇద్దరూ నాకన్నా నాలుగేళ్ళయినా పెద్దవారే. ఇద్దరూ వెనకబెంచీలలో చెరోవైపు కూచునేవారు. నా హీరో సూర్రావుతో స్నేహం కుదిరడంతో పీరియడ్ కి పీరియడ్ కి మధ్య వాడిదగ్గరకెళ్ళి వాడడిగినవాటికి సమాధానాలు చెబుతుండేవాడిని, 🙂 వాడు తేగలు, కందికాయలు వగైరా తెచ్చేవాడు, నాకు పెట్టేవాడు. ఇది చూసిన కృపమ్మ ఒక రోజు నేను నా బెంచీకి వస్తుండగా ” తమ్ముడూ” అని కేకేసింది. ‘ఎవరినీ?’ అని చూస్తే, ‘నిన్నే!’ అన్నట్టు చెయ్యి ఊపితే, దగ్గరకెళితే, తనకి వచ్చిన అనుమానమేదో అడిగింది, చెప్పేను. అలా మొదలయింది కృపమ్మతో స్నేహం. ఆ తర్వాత ఎప్పుడూ నన్ను ” తమ్ముడూ” అనే పిలిచేది. ఇది నా క్లాసులో వారందరికి ఏదోలా ఉండి, నన్ను ” తమ్ముడూ” అని ఎగతాళి చెయ్యడం మొదలెట్టేరు. నేను ఉడుక్కునేవాడిని, కృపమ్మని అలా పిలవద్దనీ చెప్పలేకపోయాను. ఒక సారి ” తమ్ముడూ! గొప్ప కుటుంబంలో పుట్టి, ఊరు మధ్య ఉన్న నువ్వూ, కడజాతిలో పుట్టి, ఊరు చివరుండే నేనూ ఒకలాగే ఉన్నాం” అంది, పాపం లెక్కడిగింది, చేసి చెబుదామంటే తెల్లకాగితాల పుస్తకం లేదు, తనకీ నాకూ కూడా, అప్పుడు నా హీరోసూర్రావు, తన పుస్తకమిచ్చేసేడు కృపమ్మకి, వద్దంటూనే తీసుకుంది. ఇది చూసిన వాళ్ళకి కడుపు మండిపోయే ఉండి ఉంటుంది. ఇది ఐదో ఫారం లోకొచ్చిన తరవాత జరిగింది. ఎవరోగాని జీడితో సూర్రావు,కృపమ్మల పేర్లు బడి గోడమీద రాసేరు.  హెడ్ మాస్టారు చూసి, చెరిపించేసి అసెంబ్లీలో అందరిని తిట్టేరు. కృపమ్మ ఏడ్చింది ’ తమ్ముడూ ఇంతేరా’ అనేది. నాకేమీ అర్ధమయ్యేది కాదు. ఒక రోజు అలా వెనకబెంచీ దగ్గరకెళ్ళి వస్తుండగా ఒకడు ‘ఒరే తమ్ముడూ’ అన్నాడు, నన్ను ఏడిపించడానికి. కృపమ్మ ఇది వింది. వెంటనే లేచింది, నా చెయ్యి పట్టుకుని మాస్టారి డ్రాయర్ దగ్గరకి తీసుకెళ్ళి,  క్లాసుకేసి తిరిగి, ”వీడు నా తమ్ముడు, ఏం? మీకేం బాధా! ఎవరైనా నాతో మాటాడేరురా! ఇంతమంది క్లాసులో ఉన్నా, సంవత్సరం నుంచి వీడొక్కడే నాతో మాటాడుతున్నాడు, వీడి మూలంగానే నేను పాసయ్యాను, ఇకముందు ఇలా వీడిని ఏడిపిస్తే ఊరుకోను! జాగర్త!!” అని కడిగేసింది. నిజానికి అప్పటివరకు ఎప్పుడూ కృపమ్మని, అక్కా అని పిలవనివాడిని ఆ రోజునుంచి ‘అక్కా’ అనిపిలవడం మొదలెట్టేను, చిత్రంగా. అందరు నోళ్ళు మూశారు. ఆ తరవాతెవరూ నన్నలా పిలవా లేదు. స్కూల్ ఫైనల్ అయింది ఎవరిదారిని వారు విడిపోయాం. స్వంత ఊరు, అమ్మ, నాన్నలని చూడటానికి వెళ్ళినా రాత్రికి వెళ్ళడం , ఉదయమే బయలుదేరిపోవడం జరిగేది. దానితో ఎవరిని కలిసే సావకాశం లేకపోయేది. అమ్మ చనిపోయిన సందర్భంగా అక్కడ ఉన్నరోజులలో ఒక రోజు గోదావరి గట్టుకు వెళితే, ఎవరో ’ తమ్ముడూ’ అని పలకరించేరు. ఎవరా అని చూస్తే, అది కృపమ్మ, స్కూల్ వదిలేసిన పాతిక సంవత్సరాల తరవాత, అదే కృపక్కని చూడటం.  గుర్తు పట్టేను, తన ముఖం మీద తల రెండు పక్కలా ఉన్న మచ్చలతో, ఇలా మచ్చలున్నాయని ‘మూడు తలకాయలపామ’ని పిలిచేవారు, కృపమ్మని..”అమ్మపోయిందిట కదూ! అన్నయ్య కనపడినపుడు చెప్పేడు…అయిపోయింది”..అని నా వివరాలడిగింది, చెప్పేను, తన వివారలు చెప్పింది, తాగి, తాగి మొగుడు (చచ్చేడంది) కాలం చేసేడని, ముగ్గురు ఆడపిల్లలతో బతుకు బండి ఈడ్చుతున్నానని, నర్స్ గా ఉద్యోగం చేస్తున్నానని, మళ్ళీ పెళ్ళి చేసుకునే ఆచారం ఉన్నా, పిల్లలకోసం చేసుకోలేదని, చెప్పింది. ఆ తరవాతెపుడో వెళ్ళినపుడు అన్నయ్య చెప్పేరు, కృపమ్మఅర్ధాంతరంగా కాలం చేసిందని, కారణం తెలియదని. నిజంగా ఏడుపొచ్చింది. నాడు , తను అల్లరి పడి కూడా, నన్నుఅల్లరినుంచి కాపాడిన అక్క జీవితం లో ఓడిపోయింది.

మిత్రులు జె.వి.రావుగారి ప్రేరణతో

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- ! దడిగాడు వాన సిరా

    • సుధాకర్ జీ,
      నేనూ ఆ కులాల మతాల అంతస్థులలో ఉండిపోయిన వాడినే, కాని ఆ అమ్మాయి నన్ను తమ్ముడూ అని పిలవడంతో, ఆ తరవాత నన్ను ఎగతాళి చేస్తున్నందుకు తను బాధ పడిన సంఘటనతో నేను అక్కగా పిలవగలిగేను. ఆ రోజుల్లో కులమతాల పట్టింపులున్నా, నేటి రోజుల్లోలాగా ద్వేషాలు లేవు.ఒకరికొకరు సాయం చేసుకోడమే ఉండేది.
      నెనరుంచండి

  1. ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.
    కొంతకాలం క్రితం పిల్లలు బాల్యంలో చదువుతో పాటు ఆటపాటలు ఇంకా లోకజ్ఞానం కూడా నేర్చుకునేవారు.

    ఈ రోజుల్లో పిల్లలపై చదువు పేరుతో మోయలేనంత భారం పడుతోంది. చదవటానికే ఎక్కడి సమయమూ సరిపోవటం లేదు. వీళ్ళకు పెద్దయిన తరువాత చెప్పుకోవటానికి ఎక్కువ విషయాలు ఉండవనిపిస్తోందండి.

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి