శర్మ కాలక్షేపంకబుర్లు-నిద్ర లేదండి!మనసుకి కుదురు లేదండి!!

దీపావళి శుభకామనలు

నిద్ర లేదండి! మనసుకి కుదురు లేదండి!!

మొన్న మా సత్తిబాబొచ్చాడు, వస్తూనే నిద్దరలేదండీ! మనసుకి కుదురు లేదండి!!అన్నాడు. కాఫీ తెప్పించి ఇచ్చి, తను తాగుతుండగా నిద్ర లేకపోడానికి కారణం ఏమన్నట్టు కళ్ళెగరేశాను. నోటితో మాత్రం

సత్తిబాబూ! సంజయుడు రాయబారానికి వెళ్ళేడు, తిరిగొచ్చి, కనపడి, రేపు సభలో, అక్కడేం జరిగింది చెబుతానని వెళ్ళాడు. నాకు నిద్ర పట్టటం లేదయ్యా, ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్పూ అని ధృతరాష్ట్రుడు అడిగితే విదురుడు ఇలా ప్రశ్నించాడు.

బలవంతుడు పైనెత్తిన బలహీనుడు,ధనము గోలుపడినయతడు మ్రు
చ్చిలివేచువాడు కామాకులచిత్తుడు నిద్రలేక కుందుదురధిపా!

బలమైనవాడు దండెత్తివచ్చినపుడు బలహీనుడు,డబ్బుపోయినవాడు,దొంగతనానికి, లంజతనానికి సిద్ధపడినవాడికి నిద్రపట్టదు ఇందులో నీ స్థితేంటీ అని అడిగేడయ్యా అన్నా.

దానికి మా సత్తి బాబు నవ్వి ఇవేం కాదండి, ఇదో చిత్రమైన సమస్యండి అని మొదలెట్టేడు.

మా ఇంటి ఎదురుగానే మావాడి ఇల్లండి. ఆ ఇంటరుగు మీద రాత్రి బోజనాలు చేసొచ్చి రెండు పుంజీలమంది లోకాభిరామాయణం మొదలెడతారండి. ఇక అక్కడినుంచి చూడండి, ఒకటే అరుపులు,కేకలు, సుదీర్ఘ ఉపన్యాసాలు,ఎక్కడెక్కడినుంచో ఎవరికి తెలియని రిఫరెన్సులు ఇలా సాగిపోతూ ఉంటుందండి. ఇదే కాక మధ్య మధ్యలో ఒకరినొకరు త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని అనుకోడమూ జరుగుతూ ఉంటుందండి. ఇదేగాక నువ్వు మితవాదివంటే, నువ్వు మతవాదివంటే, నువ్వు అతివాదివంటే, నువ్వు తీవ్రవాదివంటే, మరొకరు నువ్వు ఉగ్రవాదివని పేర్లు కూడా పెడతారండి. ఇంకప్పుడు చూడాలండి, కొట్టేసుకుంటారేమో అనిపిస్తుందండి. నిజానికి వీళ్ళు ఇంత సీరియస్ గా చేసే చర్చ ఏమీలేదండి. వడ్లగింజలో బియ్యపు గింజ ఉందా? ఎందుకుంది? ఎందుకులేదు? ఎందుకు విరిగింది? విరిగినదాన్నేమంటారు? దానిని బియ్యపు గింజ అని ఎందుకనరు? విరిగిన ముక్కలని నూకలనే ఎందుకనాలి? అని కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ఉంటారండి. కోడి గుడ్డే ఎందుకు పెడుతుంది? పిల్లనెందుకు పెట్టదు? గుడ్డు మీద వెంట్రుకలున్నాయని ఒకరు, లేవని మరొకరు, కుందేలుకి నాలుగుకాళ్ళని ఒకడు, కాదు మూడే అని మరొకరు, కాదు కాదు నేను నిన్న కుందేలు నిలబడుండగా, నడుస్తుండగా చూసేను రెండే కాళ్ళని మరొకరు, ఇలా సాగిపోతుంటాయండి. ఒక్కోకప్పుడు వీళ్ళు ఒక సారిగా కలబడిపోయి కొట్టేసుకున్నా బాగుణ్ణు అనిపిస్తుందండి. ఇలా కొట్టేసుకుంటారేమో అనుకున్న వాళ్ళు, రాత్రి ఎప్పటికో పొతారండి, అరుచుకుంటూ, అమ్మయ్య రేపు రారేమో అనిపిస్తుందండి, కాని మర్నాడు మళ్ళీ తయారండి, మళ్ళీ మామూలేనండి. ఈ గలాటా చూసి మా వీధిని ఆడాళ్ళు రావడం మానేశారండి, మగాళ్ళూ పిల్లలూ ఈ వీధిని నడవడానికి భయపడుతున్నారండి. వీధి ఆడాళ్ళయితే, ఇల్లువదలి బయట కాలే పెట్టటం లేదండి. రాత్రి పూట ఈ అరుపులు కేకలకి నిద్ర పట్టటం లేదండి. ఒకవేళ కొద్దిగా కోడి కునుకు పట్టినా ఎవరో ఒకరు కయ్యిమని కేకెట్టడంతో, ఆ కోడికునుకూ పోతొందండి..పగలు నిద్ర మత్తుతో ఏ పనీ తోచటం లేదండి, మా వీధివాళ్ళందరికి. ఏ పనీ చేసుకోలేకపోతున్నామండి, అసలు ఆలోచనే తోచటం లేదండి,మనసుకి కుదురు లేదండి. ఏం చెయ్యాలో తోచటం లేదండి. మా వాడికి చెబుదామనుకున్నామండి ఒకరిద్దరం, నీ ఇంటి దగ్గర ఈ గలాటా మూలంగా మేం బాధపడుతున్నామని, కాని మా వాడేమనుకుంటాడో, ‘నా స్వాతంత్ర్యానికి భంగం కలిగిస్తున్నా’రనుకుంటాడేమోనని, ఇంకా ఏమైనా నుకుంటాడేమోనని చెప్పలేదండి. అతనికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నామండి. మీకేమైనా తోస్తే చెప్పరూ! అని ఆగాడు.

సత్తిబాబూ! సమస్య చిత్రంగానే ఉందయ్యా! మీవాడి అరుగు మీదకదా జరుగుతున్నది, మీవాడు జరుగుతున్న జగడాలు, చర్చలు విని, చూసి ఆనందిస్తున్నట్టే ఉంది. దీని వల్ల ఏమైనా విజ్ఞానం సంపాదిస్తున్నాననుకుంటున్నాడేమో! అదీగాక ఒక మాట చెబుతా విను, ఈ మాట మారీచుడు రావణునికి చెప్పినది. సందర్భం సీతను ఎత్తుకొస్తానని చెప్పినపుడు మారీచుడు చెప్పిన సలహా ఇది.

సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్య పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః

మెచ్చుకోలు కబుర్లు చెప్పేందుకే అందరూ ఉత్సాహం చూపుతారు.అప్రియమైన సత్యం చెప్పేవాడు లేడు, ఒక వేళ ఎవరైనా చెప్పినా వినేవాడు లేడయ్యా అన్నా!

ఏంటో ఏదీ తిన్నగా చెప్పరుకదా! అనుకుంటూ కోపంగా వెళిపోయాడు, మా సత్తిబాబు.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నిద్ర లేదండి!మనసుకి కుదురు లేదండి!!

 1. అబ్బబ్బా,

  ఈ ‘సనాతీయులకు’ ఈ కాలపు ఈ యవ్వారం అస్సలు పట్టదు సుమీ !! అరుగు మీద రచ్చ బండ లేకుంటే జీవితం లో కిక్కు ఇక మరి ఏమి ఉన్నది ??

  అబ్బబ్బా, ఒకటే కాకుల గోల అంటారు గాని, అస్సలు కాకులు లేకుంటే, ఇక మిగిలిన బువ్వ ని లాగించేది ఎవరు మరి ??

  చీర్స్
  దీపావళీ శుభాకాంక్షల తో
  జిలేబి

  • జిలేబిగారు,
   రచ్చ బండ మీద చర్చ తప్పేం కాదు, కాకపోతే అది ఇతరులను కించపరచేలాగా, పనికిరాని చర్చ బాగోదు.
   భారతీయులు వాదం ప్రతివాదం చేయడం ఎరగని వారు కాదు. తర్కం ఒక్కటే పనికిరాదని మీకూ తెలుసు. తర్కం తో న్యాయం, మీమాంస శాస్త్రాలు కూడా చదువుకుని తర్కం లోకి దిగాలి లేకపోతే వారు ఉట్టి శఠులవుతారని పెద్దలెప్పుడో చెప్పేరు. అటువంటి వారు మాటాడే మాటలు అలాగే ఉంటాయి. దానికి తావివ్వడం……
   ధన్యవాదాలు.

  • మోహన్జీ,
   మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.
   తెనుగువారు ఆరంభ శూరులు కదా! ఇదింతే మారదుగాక మారదు. మనం మారిపోతే పోలా!!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s