శర్మ కాలక్షేపంకబుర్లు-గుట్టు

దీపావళి శుభకామనలు

గుట్టు

శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,
దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః.

గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, యౌషధమును,
మానమును సంగమంబవమానము మరి
దానమును, మంత్రమును బృహద్జ్ఞానులెపుడు
తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య.

భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము , అవమానము – ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను

Coutesy:-Sri.Chinta Ramakrishna Rao gaaru. andhraamrutam blogspot.com

ఏంటో! పెద్దాళ్ళ మాటలేం అర్ధమై ఛావవు, ఏంటిటా! వయసు,సంపద,ఇంటిపోరు, మంత్రం,మందు,దానం,సన్మానం, అవమానం,స్త్రీ పురుష సంభోగం,వీటన్నిటిలోనూ గుట్టుండాలోయ్ అన్నారట.

పెద్దలన్నారు కాని ఈ విషయాలలో స్త్రీ పురుషులలో తేడాలున్నాట్టున్నాయి. వయసు గురించి పెద్దలు చెప్పిన మాట అక్షరాలా పాటించేవారెవరో తెలుసా! స్త్రీలే!! “నీ పెళ్ళెప్పుడే?” అని అడిగింది ఇల్లాలు ఒక ముఫై ఏళ్ళ బాలా కుమారిని, “ఇంకానేను చిన్నపిల్లనే, అప్పుడే పెళ్ళేంటీ”అని సాగతీసిందా బాలకుమారి. వాళ్ళ అమ్మమ్మ మాత్రం “నీ వయసుకి, నలుగురుపిల్లలుట్టేరు నాకు, నీ బాబు నీకు పెళ్ళి చెయ్యక నువ్విలా గిడసబారిపోయావు కాని” అంటుంది. ఏం చేస్తాం! ఢిల్లీకి రాజయిన అమ్మకి కొడుకేగా! ఒక సారి మా విశ్వనాధ వారితో ఒక సంభాషణ జరిగింది, ఇద్దరం ఒక వయసు వాళ్ళమే, ఆయన జుట్టు నల్లగానూ, నా చెంపలు నెఱసి ఉన్నాయి, పాతికేళ్ళ వయసులోనే. నేనాయనతో ’మీ జుట్టు నల్లగా ఉంది నాది తెల్లబడిపోయింద’ంటే! ’ఒరే శర్మా! స్త్రీ అందరి కంటె చిన్నదానిననుకుంటే సంతోషిస్తుంది, మగాడు తాను అందరికంటే పెద్దవాణ్ణి అనుకుంటే సంతోషిస్తాడు, మరో సంగతి విను, చెట్టుకి చేవ నలుపు, మనిషికి చేవ తెలుపు, అందుకు జుట్టు నెఱసిందని బాధ పడకురా’ అన్నారు. నిజమే అనుకుంటా. ఆడవారు వయసుదాచుకోడమూ సహజమే, మగాడు పెద్దవాడినని అనుకోడమూ సహజమనుకుంటా.

ఇహ సంపద గురించయితే ఇద్దరిలోనూ పెద్ద తేడా కనపడదు కాని, ఆడవారిలో ఈ విషయం లో గుట్టు మరి కాస్త హెచ్చనుకుంటా. కళ్ళ ఎదురుగా పెద్ద బంగళా, పదెకరాల స్థలంలో,ఊరి నిండా స్థిరాస్థులు, ఒంటి నిండా బంగారం,నౌకర్లు చాకర్లు, కార్లు, కూచుంటే లేవలేక, లేపడానికి మనుషులు ఉన్న గజలక్ష్మి, ’అయ్యో! మాదేం ఉంది నాయనా! ఇన్కం టాక్స్ కట్టడానికే సతమతమైపోతున్నాం చూడూ’ అని బీదారుపులారుస్తుంటే వింటానికి బలేగా పసందుగా ఉంటుంది లెండి. మొహమ్మీద కనపడే వయసూ, ఎదురుగా కనపడే సంపదా దాచుకోగలమా? ఏంటో! మరి గుట్టెలా? హా! తెలిసెన్ మేకప్పు, స్విస్సు బేంకు……

వార్ని సిగదరగ, ఇంటిపోరా ఎందుకు తెలీదూ? ఇద్దరూ వీధిన పడి కాట్లకుక్కలలా దెబ్బలాడుకుంటుంటే! నిజంగా గుట్టు కావలసిందే, ఈ విషయంలో. ఆలు మగల మధ్యపోరు అసలు పనికిరాదు, అసలురాదా? వస్తుంది రావాలి కూడా. దెబ్బలాడుకునైనా కలసిపోవాలి, విడిపోడానికి కాదు. ఆలు మగల తగువు అద్దం మీద ఆవగింజ నిలిచినంత సేపంటారు, నిజం గా కూడా అలాగే ఉండాలి. పోరు బయటికి తెలిసిందా, వీధిన పడిందా, మూడో వారికి తెలిసిందా! ఇంతే సంగతులు, చిత్తగించవలెను, మరో సమిధ వేసేవారేగాని కలియడానికి తోసేవారుండరు. ఇక కేసు కోర్ట్ కెళితే కొత్తకొత్త ఆలోచనలూ పుడతాయి. తస్మాత్ జాగ్రత.మిగిలిన ఇంటిపోరలంటారా? అవి దీనంత బాధాకరం,భయకరం కావు, జాగ్రతతో సమర్ధించుకుంటే వీధినాపడవు. ఆ( మనవాళ్ళే కదా అని ఉపేక్ష చేస్తే అపేక్షలు చస్తాయి, మరి అదే తగదు.

మంత్రం గుట్టన్నారు, ఇప్పుడు మంత్రం నమ్మేవారు లేరనుకోండి,మంత్రం గుట్టే, అదేమో తెలిసిపోతే! చులకనే, అందుకే గుట్టు. ఇహపోతే, మందు కూడా గుట్టే. మందంటే అనుమానపడకండి, నిజమే ఇప్పుడు కూడా, నా మొగుడు రోజూమందుకొట్టి వస్తున్నాడోచ్ అని మొగుణ్ణి వీధిలో పారేస్తే, నిజంగానే ఇక పబ్లిగ్గా తాగుతాడు, అప్పుడు ఏడ్చి ఉపయోగముండదు. ఇలా రోజూ తాగితే ఆరోగ్యం చెడుతుంది మగడా! అని నెమ్మదిగ సమయం చూసి చెప్పాలి, వినకపోతే నాకూ తాగాలని ఉంది ఇద్దరం ఇంట్లోనే పెట్టేద్దాం బారు, ఇంటికే తెచ్చెయ్యి సరుకంటే, భయపడతాడు. చతురత కావాలండీ బతకడానికి కూడా. నిజంగానే మందు గుట్టే, మీకిప్పుడు సయాటికా కి చిట్కా వైద్యం చెప్పేననుకోండి, ఆ! తగ్గుతుందా, ఈయన పిచ్చిగాని, అనుకుంటారు. అదే టెస్టులూ గట్రా చేసి పెద్ద బిల్లిచ్చి, అంగుళం పొడుగు మాత్రలు మూడుపూటలా మింగిస్తే గొప్పగా చెప్పుకుంటారు, కాని నువ్వుల నూనెలో నిమ్మకాయ రసం పిండి కలిపి దానిని పైనుంచి కిందకి, నెప్పి ఉన్న చోట రోజుకి మూడు పూటలా రాయండి తగ్గిపోతుందంటే వింటారా? నమ్ముతారా? ఛీ! ఇదేం వైద్యం అంటారు, అంచేత మందు గుట్టే. నా దగ్గరికి రండి మందిస్తా బిల్లవుతుందంటే, ఆనందంగా వస్తారు, క్యూలో నిలబడతారు, నాకు చాలా ఉచిత పబ్లిసిటీ కూడా ఇస్తారు, ఒక వంద ఎమ్.ఎల్ బాటిలు ఖరీదు రెండు వందలంటే ఆనందంగా ఇచ్చేస్తారు. మానవ మనస్తత్వమింతేనండి.

దానం గుట్టుగా ఉండాలన్నారు. ఏమయ్యా! చెయ్యక చెయ్యక ఒక జత బట్టలు దానం చేసేం, అవీ పాతవేలెండి, ఒకఫోటో తీయించుకుని బ్లాగులో పెట్టుకుని, టి.వి, పేపర్లో వేయించుకోవద్దంటే ఎలా? దీనికి గుట్టంటే అస్సలు నచ్చలేదండీ.

ఇక సన్మానం, అవమానం గుట్టన్నారు. అవమానమెలాగూ గుట్టే అనుకోండి, అదెలాగా చెప్పం ఎవరికీ, ఎదుటివారు మనకి అవమానం బలే జరిగిందని చంకలు గుద్దుకుని, చెవులు కొరుక్కుంటారుగా! ఆప్పుడు ఆశ్చర్యం నటించచ్చు. సన్మానం ఎవరికీ తెలియకూడదంటే ఎలా? అదే పేపర్లో పడాలి,టి.వి లో చూపాలి, పది మంది చెప్పుకోవాలి, ఎంత హంగామా కావాలి? అంతే కాని ఏదో ఒక దండేసి సన్మానం చేసేరని కూడా చెప్పుకోనివ్వకపోతే! నచ్చలేదండి. అవమానం కంటే సన్మానమే గుర్తుంటుంది కదా!

భార్యాభర్తలు సంగమిస్తారన్న సంగతి అందరకు తెలిసన బహిరంగ రహస్యమే! కాని ఏ భార్య భర్త సంగమిస్తుండగా మరొకరు చూడరు, చూడకూడదు. నేటిరోజుల్లో ఆకలేస్తే అన్నమెలా తింటున్నామో, సంగమం కూడా అటువంటిదే, ఇది కూడా ఒక శారీరక అవసరమే, దాని గురించి గుట్టెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పాలో అర్ధమూ కావటం లేదు. ఒక ఇంట్లో తగువు జరుగుతోంది, పెద్ద మనిషిగా నన్ను పిలిచారు, వెళ్ళక తప్పలేదు, అక్కడ ఒక అమ్మాయి తల్లి తండ్రులతో దెబ్బలాడుతూ నేను మిమ్మల్ని కనమన్నానా? మీ శారీరిక వాంఛ తీర్చుకోడంతో నేను పుట్టేను అని చాలా పచ్చిగా మాటాడింది, ఇక అక్కడ నిలబడితే పరువు దక్కదని తల్లి తండ్రులకి చెప్పి వచ్చేశాను, అందుచేత ఆధునికులు సంగమానికి గుట్టక్కరలేదంటున్నారు, ఇది పురోగమనమో తిరోగమనమో కాలమే చెప్పాలి.

ప్రకటనలు

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గుట్టు

 1. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  గుట్టుని చక్కగా రట్టుచేశారు. చాలా విజ్నానకరంగా, హాస్యంగా చెప్పారు. అయితే, “ భావం; మంత్రం; దానం; సన్మానం” విషయాలలో ఎందుకు గుట్టుగా వుండాలో మీరు వివరిస్తే, అంటే, శాస్త్రం ఎందుకు అలా చెప్పిందో చెప్పివుంటే బాగుండేది.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవరావు గారు,
   ఊళ్ళో లేక జవాబు ఆలస్యమయింది. మన్నించాలి.
   మంత్రమనేది కొన్ని మాటలని ఉచ్చరించడం, మౌనంగానే. అవి అలాగే ఉచ్చరించాలి, లేకపోతే పని చెయ్యదు, కారణం వాటి మౌలిక విలువ చెడుతుంది, అందుకే గుట్టన్నారు.
   ఔషధం,దానం, సన్మానం వీటి విషయానికొస్తే. ఔషధం కూడా చులకనయి మానసికంగా, ఇది పని చేస్తుందా? అనిపిస్తుంది, అందుకు గుట్టు.
   ఇక సన్మానం,దానం అన్నవి గుట్టు కాక, చెప్పుకోడం పారంభిస్తే మనిషిలో అహంభావం పెరిగిపోతుంది, అందుకు గుట్టన్నారు.

   ధన్యవాదాలు.

  • అలివేలు గారు,
   మందు గుట్టన్నారు, మీరేమో చిటకా అడిగేసి మొహమాట పెట్టేస్తున్నారు, సరే తప్పదు కదా, మీరు బాధ పడుతోంటే చూడలేక…
   మీరన్నదాని అర్ధం వాతపు కీళ్ళనొప్పులు కదా!
   నువ్వులనూనెలో సగం నిమ్మకాయ రసం కలిపి నొప్పి ఉన్న చోట రాయండి. నిమ్మ రసం లో నీళ్ళు కలపద్దు. దీనిని నిలవా ఉంచద్దు, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడండి. చేతిలో వేసుకు తయారు చేసుకోవచ్చు లేదంటే గాజు పాత్ర ఉపయోగించండి. రాయండి చాలు మర్దనా కాని గట్టిగా నొక్కడం కూడా చేయద్దు. రోజుకి మూడు నాలుగు సార్లు రాయండి. చర్మానికేం కాదు. ఒక రోజులోనే మీకు కొంత ఉపశమనం కలగచ్చు. ఇది పూర్తిగా తొలగాలంటే కొంత ఆహార మార్పు తెచ్చుకోవాలి, తప్పదు. మూడు రోజుల తరవాత ఎలా ఉన్నది చెబుతారు మీరే!
   నెనరుంచాలి.

   • శర్మ గారూ సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు కదండీ పెద్దలు.

    రోగం రట్టు చేసుకోవటం మంచిదే (సలహాలు దొరుకుతాయని), కాని అఫ్కోర్స్ మందు – అదే ఔషధం 🙂 – కాంపోజిషన్ గుట్టు గానే ఉంచటానికి ప్రయత్నిస్తారులెండి మీరు కరక్టుగా చెప్పినట్లు. నాకు తెలిసిన హోమియో డాక్టరు గారొకరున్నారు. మంచి వైద్యుడే, మంచి మందే ఇస్తారు. కాని ఇచ్చిన మందు పేరు మాత్రం చెప్పరు. అడిగినా నవ్వేసి దాటేస్తారు.

    మీరు బయటపెట్టిన (టీవీ ఏంకరిణుల పరిభాషలో – “రివీల్” చేసిన) కీళ్ళవాతం మందు బాగుంది. నాకవసరంలేదు గాని – నాకు తెలిసినవాళ్ళెవరికైనా చెప్పటానికి పనికొస్తుంది, థాంక్స్.

   • sarma garu, namaste. indaka maree rendu mukkale tookeega vrasaanu kshaminchagalaru. gatha rendu samvatsaraaluga nenu chalaa badha paduthunnanu .enthomandi vaidyulani adiganu.kontha vupasamanam kooda dorakaledu. anduke adiganu. meeru aahaara maarpu annaaru-meeku abhyantharam lekapote cheppagalaru

   • మిత్రులు విన్నకోట నరసింహారావు గారు,
    ఔషధం గుట్టే. తెలిసిపోతే చులకనైపోతుంది. ఆ దీనికి తగ్గుతుందా అనిపిస్తుంది. మందు పని చేయాలంటే ముందు మనసు ముఖ్యం కదండీ! సామెతలు చెప్పడం మానేశానేమో ననిపిస్తోందండీ! ఇదివరలో మాటకి ముందు సామెత చెప్పేవాడిని. పరోపకారర్ధమిదం శరీరం అన్నారు కదండీ అందుకే గుట్టయినా చెప్పేసేను. ఇంతలో అయిపోదండి, ఇంకా చాలా విషయాలున్నాయి కదా!
    ఇది పురాతన వైద్యం.
    నెనరుంచాలి.

   • అలివేలు గారు,
    పేరు పొరపడ్డాను, మన్నించాలి. సరిచేశాను. ఔషధ సేవనం మొదలు పెట్టడానికి ఆదివారమే మంచిది
    నెనరుంచాలి.

   • అలివేలు గారు,
    ముందుగా ఉపశమనం పొందండీ, తర్వాత ఆహార మార్పు చేద్దురుగాని, చెబుతాను.
    నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s