శర్మ కాలక్షేపంకబుర్లు-అరటి దూట పెసరపప్పు,/ దూట పచ్చడి./అరటి పువ్వు మెంతులు కూర.

అరటి దూట పెసరపప్పు,/ దూట పచ్చడి./అరటి పువ్వు మెంతులు కూర.

అరటి దూట అంటే గెలవేసిన అరటి చెట్టును నరికేస్తాం. నరికేసిన చెట్టు పై డిప్పలు వలుస్తూ పోతే లోపల తెల్లగా రూళ్ళ కఱ్ఱలాగా ఉండేదే దూట. దీనిని చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు.

దూటని మొదటగా చక్రాల్లా తరుగుకోవాలి. ఇది కూడా పల్చటి మజ్జిగలోకి తరుగుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. తరిగేటపుడు పీచు వస్తుంది దానిని వేలుకు చుట్టుకుంటూ తరగాలి. ఇలా తరిగిన చక్రాలను మరల చిన్న ముక్కలుగా చేసుకోవాలి, వాటినీ మజ్జిగలోకే తరుగుకోవాలి. దూటని ఏరకంగా వాడుకున్నా మొదట చేయవలసినది. ఇప్పుడు పచ్చడి చూద్దాం. పళ్ళ గెల వేసిన చెట్టు దూట మెత్తగా ఉంటుంది, కాయల గెల చెట్టు దూట కొంచం గట్టిగా ఉంటుంది.
==================================================================
1.దూట పచ్చడి

తరిగిన అరటి దూట ముక్కలకి కొద్దిగా పసుపు, తగిన ఉప్పు, వేయించినకారం, పులుపుకు చింతపండు పులుసు కలుపుకుంటే అరటి దూట పచ్చడి తయార్.పచ్చి ముక్కలే వాడాలి,ఉడకపెట్టకూడదు.
==========================================================
2. అరటి దూట పెరుగుపచ్చడికి

దూట ముక్కలని ఒక సారి ఉడకపెట్టండి, పసుపు,పోపు, ఉప్పు, వేసి ఉంచిన పెరుగులో దూట ముక్కలని కలపండి. అరటి దూట పెరుగుపచ్చడి తయార్.
=========================================================
3.అరటి దూట పెసరపప్పు కూర.

పెసరపప్పు ఉడికించండి దానికి ఉడికించిన దూట కలపండి. దూట ఉడికించేటపుడే పచ్చి మిర్చి చీరి వేసి ఉడికించండి, కొద్ది మిరియాలు, కూరవడియాలు నేతితో వేయించండి, అందులో ఇష్టాన్ని బట్టి ఇంగువ వేయండి.. వీటిని కూడా చేర్చి కొద్దిగా పోపు,పసుపు వేసి ఒక్కసారి మూకుడులో వేసి వెచ్చబెట్టండి, నీరు ఇగిరిపోతుంది. మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన అరటిదూట పెసరపప్పు ముద్ద కూరరెడీ.
=========================================================

అరటి దూట ఆరోగ్యానికి మంచిది. దీనిలో ఉన్నదంతా పీచే. దీనిని తినడం మూలంగా ప్రేవులని తుడిచేసి అన్న వాహికను శుభ్రం చేస్తుంది. అదేగాక రోజూ అరటి దూట రసం తాగితే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి. ఈ వైద్యం చేసేటపుడు టమాటా తినకండి.అరటి దుంప రసం విషాన్ని హరిస్తుంది.

=========================================================

4.అరటి పువ్వు మెంతులు కూర.

అరటి పువ్వును కూరకి తయారు చేసుకోడమే పెద్ద పని. పువ్వు పై డిప్ప తీయండి, కింద చిన్న చిన్న పువ్వులు కనపడతాయి. వాటన్నిటిని ఒకచోట చేర్చండి. ఈ చిన్న పువ్వులలో కాడల్లాగా కేసరాలుంటాయి, వాటిని లాగేయండి, ఆ తర్వాత ప్లాస్టిక్ డిప్పలలా ఉన్నవాటినీ తీసేయండి. వీటిని పారేయకండి. వీటి ఉపయోగం చివర చెబుతా. అప్పుడు చిన్న పువ్వులని రోటిలో వేసి దంచాలి, నీళ్ళు పోసి కడగాలి. ఇలా మూడు సార్లయినా చేయాలి. అప్పుడు అరటి పువ్వు ముద్ద తయారుగా ఉంటుంది. ఈ ముద్దకి తగిన మెంతులు పొడిచేసి కలపడి, ఇవి కొద్ది ఎక్కువగానే కావాలి. వీటిని మూకుడులో వేసి ఉడికించండి, వీటికి పచ్చి మిర్చి చీరి వేసుకోవచ్చు, పసుపు, పులుపు కోసం చింతపండు పులుసు చేర్చండి, అన్నిటిని ఉడికించండి.. ఆ తరవాత కొద్దిగా పోపు, వేయించిన కూర వడియాలు కలపండి. పోపులో ఇష్టాన్ని బట్టి ఇంగువ వేయండి. అరటిపువ్వు మెంతికూర తయారు. ఇది చాలా రుచిగా పనసపొట్టు కూరలా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం లో వగరు చాలా తక్కువగా తీసుకుంటాం. ఈ కూరలో తినేది వగరే. తొక్కి కడిగితే చాలా వగరుపోతుంది, పోవాలి కూడా.

ఇక పారేయద్దన్న డిప్పలు కాడలని కొద్ది నూని వేసి వేయించి కొద్దిగా ఉప్పు చేర్చిన కారం చల్లండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అరటి దూట పెసరపప్పు,/ దూట పచ్చడి./అరటి పువ్వు మెంతులు కూర.

 1. ఏమిటో ఈ శర్మ గారు ఇన్నేసి వంటకాలు రాసేస్తున్నారు ! ఒక్కటీ తినడానికి భాగ్యం ‘ఈ’ కాలం లో లేకుండా పోతోందాయే !

  ఇట్లా తిరిగితే ‘దయా బేటీ’ అట్లా తిరిగితే ‘కీ’ ళ్ళ వాత, మరో వైపు తిరిగితే బ్లడ్ ‘ప్రెషర్! హుష్! ఈ వంటకాలన్నీ ఏమి చేసు కునేను !!

  కలి కాలపు ఇక్కట్ల లా, ‘e-కాలపు మా ఇక్కట్ల కి ఏదన్నా ఔషధాలు కూడా రాయండి మరి !!

  జిలేబి

  • జిలేబి గారు,
   ఊళ్ళో లేక జవాబు ఆలస్యమయింది. మన్నించాలి.
   నిజానికి ఈ కాలానికి కావలసిన కూరలే ఇవి. ఈ కూరలు తింటే మీరన్న దయాబేటీ అదుపులోనే ఉంటుంది. మాత్రలు మింగి, సూదులు గుచ్చుకునేకంటే ఇది మంచిదేమో 🙂
   ధన్యవాదాలు.

 2. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  నోరూరించే వంటకాలను గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు. మా పెరటిలో ఓ రెండడుగుల స్థలం వున్నది. తెలిసినవాళ్లు ఇచ్చిన ఒక కూర అరటి, ఒక అమృతపాణి మొక్కలని నాటాము. పండ్లు ఒక గెల వచ్చింది. దాదాపు 120 పండ్లు వచ్చాయి; రుచిగా వున్నాయి; మేము తిన్నాము; అందరికీ ఇచ్చాము. దూటని కూడా వాడాము. అలాగే కూర అరటిని కూడా వాడాము. ఇకపోతే, ఇప్పుడు రెండవసారి పండ్ల గెల వచ్చింది. పువ్వు చాలా పెద్దగా వచ్చింది; అయితే, ఐదు అత్తాలు వచ్చిన తరువాత, పూలు, కాయలు కట్టక, రాలి పోవటముతో, అక్కడవరకూ కోసేసాము. ఐదు అత్తాలు పెరుగుతున్నాయి. తుంచేసిన పువ్వు పై దొప్పలని తెరిస్తే, లోపల పూలు కొన్ని వరసలు నల్లబడి పోయి వున్నాయి. ఇలా ఎందుకు జరిగివుంటుందో చెప్పగలరా? కాయలు/పండ్లు బాగా రావటానికి ఏంచేయాలి? దయచేసి చెప్పగలరు. ఎందుకంటే, ఇంకా చాలా పిలకలు పెరుగుతూవున్నాయి. మెంతులతో కూర, దూట పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు తెలిసింది కాబట్టి, ఈసారి తప్పకుండా చేస్తాము.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవ రావు గారు,
   ఊళ్ళో లేక జవాబు ఆలస్యమయింది. మన్నించాలి.
   మీ అరటి మొక్క రెండవ తరానికి పంట తగ్గింది, కారణం అదే దుంప నుంచి వచ్చిన పిలక అక్కడే ఉంచడం. చోటయినా మార్చాలి లేదా పిలకయినా మార్చాలి. ఇక ఉన్న చోటు తక్కువకనక ఇబ్బందే, పశువుల ఎరువు పని చేస్తుంది.సాధారణం గా అందరు నిత్యం వాడుకునే కూరలు చెప్పను, ఇటువంటివి ఆరోగ్యానికి మంచివి అందుకే చెబుతాను, ఉపయోగించుకుంటే ఆనందం కదా!చోటున్నా మేము ఆకుల కోసం తప్పించి, కాయలకోసం ఆశించం. ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా విసుగు లేక ఆకు కోసిస్తాం, అదో అలవాటు
   ధన్యవాదాలు.

 3. >నరికేసిన చెట్టు పై డిప్పలు వలుస్తూ పోతే…

  ఈ డిప్పలు కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోడానికి వాడవచ్చు కదండీ శర్మ గారూ? 🙂 మా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం. కాలవ దాకా వెళ్ళడానికి ఓపికలేక ఇంట్లోనే పెట్టేవాళ్ళు దీపాలు. నూతిలోనో, పళ్ళెంలో నీళ్ళు పోసో.

  • nEnunEnE గారు,
   ఈ నెలంతా వీటి అవసరం ఎక్కువే,దీపాలు నూతుల్లోనూ,. పళ్ళెంలో నీళ్ళు పోసీ ఇప్పటికి పెడుతున్నారండి 🙂
   నెనరుంచాలి.

 4. అరటి వంటకాల గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
  వీటిని చన్నైలో ఎక్కువగా వాడతారు.
  అరటి పువ్వు, అరటి దూట తో చేసిన వంటకాలు అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయట.

  • అనురాధ,
   ఇప్పుడు మనవారికి నాగరికత పెరిగింది కదమ్మా! మందులేనా మింగుతాం తప్పించి ఆరోగ్యాన్నిచ్చే ఆహారం మాత్రం తీసుకోం, ఇదింతే.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s