శర్మ కాలక్షేపంకబుర్లు-పాపి ’డి’ కొండలు

 పాపి ’డి’ కొండలు

పాపి కొండల గురించి చాలా సార్లు చాలా మంది రాశారు కదా! మళ్ళీ ఇదెందుకూ అనుకున్నా కాని ముఖే ముఖే సరస్వతి అన్నరు కదా అని మొదలెట్టా.

గోదావరి నాసికా త్రయంబకంలో పుట్టి అనేక ఉపనదులను కలుపుకుంటూ తెనుగు దేశానికి చేరుకునేటప్పటికి తూర్పు కనుమలు అడ్డేశాయి. ఆ తూర్పు కనుమలలో భాగమే ఈ పాపికొండలు. వీటిని కొండలని ముద్దుగా పిలుచుకుంటాం కాని నిజానికివి పర్వతాలు, పదహారు వందల అడుగుల ఎత్తున దట్టంగా ఉన్న పర్వతాలు.

ఉదయమే స్నానాదికాలు పూర్తి చేసుకుని అందరమూ ఆటోల్లో బయలు దేరాం, పోలవరానికి. రాజమంద్రి నుంచి, పాత పట్టిసం నుంచి కూడా బోట్లు ఉన్నాయి కాని అబ్బాయి పోలవరం నుంచి చేయించాడు, రిసర్వేషన్.ఎనిమిదిన్నరకి చేరేం,బోటు తొమ్మిదిన్నరకి బయలుదేరుతుందన్నాడు, ఎక్కగానే కాఫీ టిఫిన్లు అందించారు. అవి స్వీకరిస్తూ .  దీనిని కొండమొదలు అనిపిలుస్తారన్న మాట గుర్తొచ్చింది. పోలవరం ఊరి చివరగా గట్టున దీనిని పోతగట్టు అంటాం, ఎందుకంటే ఈ పైన గట్టు ఉండదు, గట్లుగా పర్వతాలుంటాయి. ఇక్కడ నుండి కొండలు మొదలు కనక కొండమొదలు అనీ అన్నారు.గోదావరి పశ్చిమగట్టున చివరగా, కొండలు ప్రాంభంలో ఒక అమ్మవారి గుడి ఉంది,అమ్మవారి పేరు కోట సత్తెమ్మ (పూర్తిగా గుర్తులేదు), ఆ గుర్తొచ్చింది కడెమ్మ గుడి. ఒకప్పుడు, గోదావరికి ’ఒడ్డులు’మాత్రమే కాని గట్లు లేవు మొదటగా. ఈ గట్లని పోశారు, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు, తూర్పున పురుషోత్తపట్నం నుంచి ధవళేశ్వరం వరకు, అందుకే వీటిని పోతగట్లంటారు, ఇవి మట్టి గట్లు.బహుశః వీటిని గోదావరి ఆనకట్ కట్టిఉనపుడుపోసి ఉండచ్చు.

అలా తెనుగునాట ప్రవేశించిన గోదావరికి దట్టమైన కొండలు అడ్డు రావడంతో చాలా సన్నటి పాయగా ఒక్కొకచో బాగా సన్నగా వంద మీటర్ల వెడల్పుతో గోదావరి ముందుకు ఉరికింది. తాను ప్రవిహించినంత మేర ప్రకృతిని పులకింపచేసింది. ఈ కొండల మధ్య సన్నటి పాపిడిలా గోదావరి ప్రవహించడంతో వీటిని పాపిడి కొండలు అన్నారు, కాని కాలక్రమేణా చివరి అక్షరం లోపించి పాపి కొండలయ్యాయనుకుంటా.

DSCN5363

ఇలా బోట్ ఎక్కడానికి వేసిన చెక్కబల్ల మీంచి ఎక్కేం, బయలు దేరిన బోట్ మొదటగా ఎదురుగా ఉన్న పురుషోత్తపట్నం లో ఆగి మరికొందరిని ఎక్కించుకు సాగింది.డెక్ మీద 120 కుర్చీలు వేశారు, పైన టాపు ఉంది, పక్కలకి పడిపోకుండా రక్షణ ఉంది, అదిగో దాని మీద అంత మంది చేరేం. ఇటువంటి బోట్లు మొత్తం పది దాకా ఉన్నాయి, రోజూ తిరుగుతాయి. ఇప్పుడే విహారానికి మంచి సమయం. ఈ అందాలు తరవాత కనపడవంటున్నారు కాని పొరపాటే. ఆ తరవాత ఇంకా బాగుండే సావకాశమే ఉంది. డెక్ మీదకి ఎక్కలేకపోయినా, వర్షం వచ్చినా అంతమందికి కింద సీటింగ్ ఉంది, బాగుంది కూడా. ప్రయాణం అంత సేపు గైడ్ చెబుతూనే ఉంటాడు. అతనే ఆట పాటలు ఏర్పాటు చేసి యాత్రీకులని అందులో భాగస్వాములని చేస్తాడు, సరదాగా కాలం గడుస్తుంది.. ఇది అన్ని బోట్లకీ ఉంది. ఈ రకంగా కొంత మందికి ఉపాధీ లభిస్తోంది.
DSCN5391

 తూగోజిలోని మెట్ట ప్రాంతాలకి సాగునిమిత్తం ఎత్తిపోతల పథకం.

DSCN5395

మహానందీశ్వర స్వామి గుడి. అలా అంటే తెలియదు కదండి, సీతారాములు సినిమా గుడి. గోదావరి మధ్య ఉంటుంది, పాత పట్టిసీమలోని వీరభద్రేశ్వర స్వామి గుడిలాగా. మహానందీశ్వరుడు, వీరభద్రస్వామి అన్నగారని, తమ్ముని వైభోగం చూడలేక నెత్తిన మంగలం బోర్లించుకుని వచ్చి ఇక్కడ వెలిశాడని అంటారు. వీరభద్రస్వామికి ఉన్నంత ప్రభ, ధూపదీప నైవేద్య సేవ ఇక్కడ ఉండదు. పూజారిగారు నైవేద్యం తెచ్చి అర్చన చేసి నైవేద్యం పెట్టి వెళిపోతారు, అంతే. దేవుళ్ళలో కూడా నోరున్న దేవునికే సేవలు కదా!ఈ రోజంతా సన్నగా మంచుపడుతూనే ఉంది.

DSCN5429

ఆ తరవాత గండిపోశమ్మ అమ్మవారి గుడి దగ్గర ఆపారు. కొండమీద అమ్మవారి గుడి, విగ్రహం బాగుంది. పావుగంటలో మళ్ళీ బయలుదేరాం, అందాలు చూసుకుంటూ. దేవీ పట్నం చేరాము, ఇక్కడ అందరికి మధ్యాహ్న భోజనాలు బోట్లో ఎక్కించారు. ఇక ఎక్కడా ఆగక ప్రయాణం సాగింది.

DSCN5520

ఇది కచ్చులూరు. అక్కడో చిన్న పడవ కనపడుతోంది చూశారా, అక్కడ నది లోతు దగ్గరగా నూట అరవై  అడుగులుండచ్చట. ఇక్కడ గోదావరి వంపులు తిరిగి వయ్యారంగా కదులుతుంది కాని భయంకరం. గోదావరి పైనుంచి వస్తూ ఒక కొండను ఢీ కొట్టి పక్కకి తిరిగి మరొక కొండను ఢీకొట్టి మళ్ళీ పక్కకి తిరిగి మరోకొండను ఢీ  కొడుతుంది, ఆ చివరికొండే ఇది. ఇక్కడ గోదావరి చాలా సన్నగానే ఉంది.

DSCN5516

DSCN5518

పై ఫోటోలలో ఎదుటిగట్టు కొండ నీడ ఈ కొండ పైబడి వెలుగు నీడల్నిస్తే ఎంత అందంగా ఉంది.

DSCN5507

గోదావరితో సూర్యుని హేల

DSCN5494

ఇలా అందాలు చూసుకుంటూ మధ్యాహ్న భోజనం బోట్ లోనే చేసి పేరంటపల్లి మూడున్నరకి చేరాం, ఫోటో లు పెట్టాలని ఉంది, అన్నీ కుదరదు కదా! అవతల బ్లాగులో పెడతాను. ఈ పేరంటపల్లి లో ఒక శివలింగాన్ని ఒక సాధువు ప్రతిష్టించారు, బాగుంది. ఆ సాధువు గారిని, అన్నవరం దగ్గరున్న బెండపూడి సాధువు గారిని శ్రీ అల్లూరి సీతారామరాజుగా ప్రజలు చెప్పుకుంటారు. ఆయన ప్రఛ్ఛన్నంగా ఇలా ఉన్నారనీ చెబుతారు. నిజానికి శ్రీరామరాజుగారిని బ్రిటిషర్లు కాల్చి చంపినదే నిజం,కాని ప్రజలు శ్రీరామరాజు మరణించారన్నదానిని నమ్మలేక, అభిమానం కొద్దీ ఇలా అనుకున్నారనమాట. పై చిత్రం లోవి వెదురు నుంచి తయారు చేసిన కళా ఖండాలు, వీటికి సరయినా అదరణ లేక కాని చాలా బాగున్నాయి.

DSCN5510

ఎదురుగా కొండల సమూహం ఒక మనిషి పడుకుని ఆకాశం కేసి చూస్తున్నటుంది కదా! ముక్కు, నోరు గడ్డం, ప్రకృతి అందం…ఇటువంటి చిత్రమే వేంకన్నబాబుది తిరుపతిలో చూస్తాం కదూ!

DSCN5525

 అస్తమిస్తున్న సూర్యుడు.

అలా తిరుగు ప్రయాణం మూడున్నర గంటలే పట్టింది. తిరిగి వస్తుండగా సూర్యుడు అస్తమించాడు, దేవీ పట్నం దాటిన తరవాత సెల్ కూడా మూగపోయింది మళ్ళీ తిరిగొచ్చేవరకు, బయట ప్రపంచంతో సంబంధాలే తెగిపోయాయి, ఒక ఆరు గంటల పాటు. ఇటువంటి సందర్భంలో ఒక్క సారిగా లైట్లుపొయాయి, చిమ్మ చీకటయిపోయింది. చుట్టూ ఏముందో తెలియని పరిస్థితి, ఒడ్డెంత దూరంలో ఉందో తెలియదు, సెల్ కవరేజి లేదు, ఒక్క సారిగా అన్నీ తెలిసిన నాకే గుండె ఆగినంత పని అయింది. వెన్నెలరోజులే అయినా కొండల మధ్య ఉండటం చేతా, ఒక్క సారిగా లైట్లుపోవడంతో వెలుగులోంచి చీకటిలోకి పోవడం చేతా కళ్ళు కనపడలేదు, ఒక్క సారి నిశ్శబ్దం భయపెట్టింది, పురుగులు లైట్ల మీదకి దాడి చేయడంతో లైట్లు తీసేశారు, మరి కాసేపటికి లైట్లు వేశారు. అలా మొత్తనికి విహార యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి చేరేం.

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పాపి ’డి’ కొండలు

 1. శర్మగారూ, మీ పాపి డీ కొండలు టపా చూసాను. నేను కూడా రెండు సంవత్సరాల క్రితం వారు, పిల్లలతో పోచారం ప్రస్తుతం ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నట్లుంది. అక్కడినుండి వెళ్ళాము. పిల్లలు కూడ చాలా సంతోషంగా గడిపారీయాత్రమొత్తం.మీరన్నట్లు పోచారం దగ్గరనుండి మాకూ సెల్ సిగ్నల్స్ పొయాయి. చిన్న పాప బాగ భయపడింది. పేరెంటాలపల్లికూడా చూసాము. కానీ ఈప్రాంత విశిష్టతలు చెప్పే పెద్దవారు మాకు లేరు. మీ టపా చదవమని మా పెద్ద పాపకి చెప్పాను. నాకు తెలిసినంతవరకే ఆ రోజు చెప్పగలిగాను. ఇంకా చాలా విషయాలు శర్మగారు వ్రాసారు చదవమని.ఒకటి గమనించారో లేదో అస్తమిస్తున్న సూర్యుడు ఫొటోలో మనిషి పడుకుని ఆకాశం చూస్తూ వున్నట్లుంది అన్నారు,ఆమనిషి నుదుటిపై బొట్టులా సూర్యుడున్నాడు. ప్రకృతిలో వెతికితే చాలా చిత్రాలు మనకు గోచరిస్తాయి అనటానికి ఈచిత్రం, తిరుపతి శేషాచలం కొండలు నిదర్శనాలు. భగవంతుని సృష్టికి ఇంతకంటే వేరేమి తార్కాణాలు కావాలి. ” భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు…’.

  • mallampalli swarajya lakshmiగారు,
   ఆ ప్రాంతం లోనే పుట్టి పెరిగినవాడిని కనక కొంత చరిత్ర తెలుసు, అదే చెప్పేను. ఇక భగవంతుని సృష్టిలో ఉన్నవన్నీ అందాలే! మనకు చూసే కన్నుకంటే చూడాలనే మనసు ముఖ్యం కదండీ! అప్పుడపుడు ఇటువంటి చోట్లకి ప్రయాణిస్తే అదో మథురానుభూతి కదా!!
   ధన్యవాదాలు.

 2. > దేవీ పట్నం చేరాము, ఇక్కడ అందరికి మధ్యాహ్న భోజనాలు బోట్లో ఎక్కించారు.
  72-74మధ్యకాలం మూడేళ్ళు మేము రంపచోడవరంలో ఉన్నాము. రోడ్ మార్గంలో రాజమండ్రినుండి దేవీపట్నం వెళ్ళాలంటే రంపచోడవరం మీదుగానే వెళ్ళాలి. అల్లూరివారి రంపపితూరీ ఈ రంపచోడవరం పోలీస్ స్టేషన్ దోపిడీయే. రంపచోడవరం పోలీశ్ స్టేషన్‍లో ఆయన సంతకం ఉందంటారు. రంపచోడవరంలో విడిది చేసి బాపూగారి సంపూర్ణరామాయణం తీసారు. దేవీపట్నంలో ఆయన అందాలరాముడు కొన్ని సీన్లు తీసారు..

  >అన్నవరం దగ్గరున్న బెండపూడి సాధువు గారిని శ్రీ అల్లూరి సీతారామరాజుగా ప్రజలు చెప్పుకుంటారు.
  అవును. మేము 1958-63 మధ్యకాలంలో కిర్లంపూడి దగ్గర ఉన్న గెద్దనాపల్లెలో ఉన్నాం. అక్కడ మానాన్నగారు హెడ్మాష్టరుగా చేసారు. అప్పట్లో 1960;లో అనుకుంటా బెండపూడి సాధువుగారు గెద్దనాపల్లి వచ్చారు. కూడా ఇద్దరు టీనేజ్ మగపిల్లలు ధనుర్బాణాలూ వాళ్ళూను. ఆయన్ను అంతా అల్లూరి సీతారామరాజుగారు అనే భావించారు, పిలిచారు. కాని ఆయన ఔను కాదు అనలేదని విన్నాను. తమాషా ఎమిటంటే, ఆ రోజు రాత్రి బహిరంగ సభలా చేసి మా స్నేహితులచేత అల్లూరి సీతారామరాజు బుఱ్ఱకథకూడా చెప్పించారు. సాధువుగారు కొసదాకా కూర్చుని ప్రదర్శన తిలకించారు.

  >వెదురు నుంచి తయారు చేసిన కళా ఖండాలు..
  ఇలాంటివి బాపుగారి సంపూర్ణరామాయణంలో కూడా వాడారు. మేం వచ్చేసరికి హెడ్మాష్టరు రూములో ఇవీ ఇంకా చాలా ఆర్టుసామానూ ఉన్నాయి. ఇలా వాళ్ళు వదిలిన పువ్వులు లాంటివి ఆ యేడాది వార్షికోత్సవంలో నాన్నగారు అలంకరణలకు వాడించారు.

  • మిత్రులు శ్యామలరావు గారు,
   సీతారామ రాజు గారి పేరు చెబితేనే దేశ భక్తి పొంగుతుంది. మీరన్నట్లు వారి సంతకాన్ని ఉంచేరో మూల పారేసేరో తెలీదు.
   పేరంటపల్లి సాధువు గారు కాని, బెండపూడి సాధువుగారు కాని తాము సీతారామరాజు కాదనీ చెప్పలేదు, అవుననీ చెప్పలేదు. ప్రజలలో నమ్మకాన్ని అలాగే ఉంచేసేరు. నాకైతే సీతారామ రాజుగారిని బ్రిటిషర్లు కాల్చి చంపినదే నిజమనీ నమ్ముతాను. ప్రాణం కోసం ఆయన ఇలా మారు వేషాలలో ఉన్నారనీ నమ్మను. అదీ గాక స్వాతంత్ర్యం వచ్చకా కూడా అలా ఉండాల్సినదీ లేదు కదా!
   వెదురు కళాఖండాలు తెచ్చుకోవాలనిపించింది, కాని వాటిని తెచ్చుకోడమే పెద్ద సమస్య. తెస్తే ఇంటికొచ్చేలోపే పోతాయి, అంత సున్నితంగా ఉన్నాయి. పేకింగ్ సరిగా చేసి అమ్మకానికి పెడితే బాగుంటుంది, వారికా అది తెలియదు.
   ధన్యవాదాలు
   నెనరుంచాలి.

 3. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  మంచి వివరాలు తెలియచేశారు. త్వరలోనే మేము హైద్రాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి, అక్కడ నుంచి పడవలో బధ్రాచలం వెళదామని అనుకుంటున్నాము.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవ రావు గారు,
   ఏపి టూరిజం వారు టిక్కట్లు రిసర్వ్ చేస్తారనుకుంటా. ముందుగా చేయించుకోండి. రెండవ పంట మొదలు పెడితే నీరు తగ్గిపోతుంది, అప్పుడు ప్రయాణాలు కొంత కష్టం కలగ చేస్తాయి. రాజమంద్రి నుంచి పేరంట పల్లి అక్కడి నుంచి భద్రాచలం కూడా బోట్లు ఉన్నాయి.ఈ బోట్ వచ్చేదాకా అది ఆగుతుంది, అలా ఉంటుంది రిసర్వేషన్.
   ధన్యవాదాలు
   నెనరుంచాలి.

 4. గోదావరి తో సూర్యుని హెల ఫోటో చూస్తూంటే , వామ్మో మరీ భయ్యం వేస్తోందండీ !!

  Before dawn of Nature’s purity
  brings the mind fear of infinity !!

  cheers
  zilebi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s