శర్మ కాలక్షేపంకబుర్లు- మూడు రకాల మిత్రులు

 మూడు రకాల మిత్రులు

సన్తప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే
ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే
అస్తస్సాగరశుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధమమధ్యమోత్తమజుషామేవంవిధావృత్తయ…… భర్తృహరి.

నీరము తప్తలోహమున నిల్చి యనామకమైనశించు నా
నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు, నా
నీరమె శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచితప్రభం బౌ
రుషవృత్తులిట్లధము మధ్యము నుత్తముగొల్చువారికిన్…లక్ష్మణ కవి.

నీటిచుక్క కాలిన ఇనుముపైబడి పేరు కూడా లేక నశించును. అదే నీటిబొట్టు తామరాకుపై నిలిచి ముత్యంలా మెరుస్తుంది. అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలోబడి ముత్యమే అవుతుంది. ఈ ఫలితాలే అధములు, మధ్యములు, ఉత్తములను ఆశ్రయించినవారికి కలుగుచున్నవి అని కవిగారి భావం.

నీటిబొట్టు బాగా కాలిన ఇనుము పై పడినపుడు తన పేరు,రూపమూ కూడా లేక ఆవిరైపోతూ ఉంది, ఏ ప్రయోజమూ సిద్ధించలేదు. నిజమేకదా! ఇది నిజ జీవిత సత్యం. కాని ఈ పోలికని చాలా విషయాలలో మనం చూడచ్చు. ఎంత గొప్పవారయినా తాము చేసే స్నేహాలవల్ల ఇలా పేరు రూపు కూడా పోగొట్టుకుంటుంటారు. ఎవరు చెబుతారు మీరు పేరు పోగొట్టుకుంటున్నారని,మీ రూపమే అంతరించిపోతోందనీ, అసలెవరు చెప్పగలరు? ఎవరు మాత్రం ఎందుకు చెప్పాలి? మన మటుకు మనకు తెలియనక్కర లేదా?  పాపం! నాకు ప్రతిసారి రాక్షుసుడే అయినా నిజం చెప్పిన మారీచుడే గుర్తొస్తాడు, సులభా పురుషా రాజన్…….. పాపం ఇతను కూడా ఈ మాట ఎప్పుడు చెప్పేడు? నువ్వు వెళ్ళక తప్పదు, మాయలేడిగా, లేకపోతే నేనే చంపుతానని రావణుడు అన్నప్పుడు కదా! నిజంగానే ఇది మారీచుని మరణ వాంగ్మూలం 🙂 రాముని బాణపు దెబ్బ రుచి ఎరిగినవాడు కనక ఈ మాట చెప్పేడు. అదేగాక రావణుని చేతిలో చస్తే పేరు ప్రఖ్యాతీ లేవు, అది కుక్క చావే! ఈ మాట చెప్పి, రాముడి చేతిలో చచ్చి, ఈ నాటికి మనకు అందరి ఆరాధ్యుడయ్యాడు. మరి ఈ మాట నేటికీ నిజమే కదూ! మన ఎదురుగానే సంఘటనలు జరుగుతున్నా వాటినుంచి మనం కొంతయినా నేర్చుకోలేకపోతే, కాలిన ఇనుముపై పడిన నీటి చుక్కలా పేరు, రూపు కూడా లేకుండా పోతాం.

అదే నీటిబొట్టు తామరాకు మీద పడితే ముత్యంలా ప్రకాశిస్తుంది. నిజానికి అది ముత్యమా? కాదు, కాని ముత్యం లా కనపడుతుందంతే. కనపడుతుంది కాని ప్రయోజనమే లేదు. మధ్యములతో స్నేహం వలన కొంతలో కొంత మేలు ముత్యం లా కొంతకాలమైనా ప్రకాశించడం జరుగుతుంది. ఈ సందర్భంలో తామరాకుకి, నీటి బొట్టుకి కూడా ప్రత్యేక ప్రయోజనాలేమీ సిద్ధించలేదు, కొంతసేపు ఇద్దరూ అందంగా ప్రకాశించారు, అంతతో వారిద్దరూ విడిపోయినా ఇద్దరికి ప్రయోజనం కాని ప్రమాదం కాని జరగలేదు. ఇద్దరూ ఇద్దరిగానే వారివారి వ్యక్తిత్వాలను నిలుపుకున్నారు. ఇదీ మన సమాజంలో చూస్తూనే ఉంటాం, కాని పోల్చుకుని అనుభూతుల్ని మాత్రం మిగుల్చుకోం, అనుభవాలనీ తెల్సుకోం, పాఠాలూ నేర్చుకోం.

అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలోబడితే తన పేరు, ఉనికి పోగొట్టుకున్నా ముత్యమై ప్రకాశించింది, ఉత్తమమైన రూపాంతరం చెందింది.ఎందరికో ఆదర్శమూ అయింది, ఎందరో తనని కావాలనీ అనుకునేలా మారింది,విలువనూ సంతరించుకుంది. కాని అలా మారినది ఒక మామూలు నీటిబొట్టు మాత్రమే! అది కూడా ఆశ్రయ ప్రభావమే!! ఈ సంఘటనలూ మనం సంఘం లో చూస్తుంటాం, కాని గమనించం.

జీవితంలో కాలిన ఇనుము,తామరాకు,ముత్యపు చిప్పలలాటి స్త్రీ పురుషులు తారసపడుతుంటారు. ఈ ముగ్గురిలోవారెవరనేది గుర్తించగలగడమే మన విజ్ఞత, చదువుకు సార్ధకత,ప్రయోజనం కూడా. ఎవరిమటుకు వారు వారి సహజ స్వభావాలను వదులుకోలేరు, వదులుకోమని చెప్పాల్సిన అవసరమూ లేదు, చెప్పనూకూడదు. రైలింజను వస్తుంటే పట్టాలపైనుండితప్పుకోవాలన్న జ్ఞానం మనకుండాలి కాని రైలింజనుకి ఉండదు, అదే తెలుసుకోవలసినది. చెప్పడం తేలికే ఆచరణే కష్టం.

ఈ పద్యాలూ వాటి భావమూ ఎవరికీ తెలియవా? తెలియకేం బాగా తెలుసు, ఇంతకంటే చాలా బాగానూ వ్యాఖ్యానించగలరు. ఐతే వీటిని చదువుకుని మననం చేసుకుని మనం చేసే పనులలో ఉత్తమ, మధ్యమ, అధమ స్థితులను గమనించుకున్నపుడే వీటిని చదువుకుని సార్ధకత, చదువు యొక్క ఉపయోగమూ, చదువును జీవితానికి అన్వయించుకోడమూ, ముత్యపు చిప్పలో పడి ముత్యమైపోలేకపోయినా, మనకు మనంగా మిగిలే తామరాకు మీద నీటిబొట్టులానైనా ఉండాలి తప్పించి, కాలిన ఇనుమును ఆశ్రయించిన నీటిబొట్టుకాకూడదు, అది తెలివయినవారి లక్షణమూ కాదు!.ప్రయత్నం మీదనయినా కాలిన ఇనుములాటి స్త్రీ పురుషుల ధృతరాష్ట్ర కౌగిలినుంచి వదలించుకోవాలి, వదలించుకోడం తేలికయినపని మాత్రం కాదు. చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండదు ! చేతులు బొబ్బలెక్కడం తప్పించి…

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- మూడు రకాల మిత్రులు

  1. అలాగే, చేసే ప్రయత్నాల విషయంలో మనుష్యుల రకాల గురించి “ఆరంభింపరు నీచ మానవులు ….. ” అనేది తెలుగు పద్యసంపదలో మరొక మంచి పద్యం.

  2. లక్ష్మణ కవి గురించి విన్నాను గానీ పద్యాలు చదవటం ఇదే మొదటిసారి. ఇంత కమ్మగా ఉంటాయని అనుకోలేదు. ఎందుకనో ఈ పద్యాల్లొ కొన్నిటి నయినా స్కూల్ పుస్తకాల్లో పాఠాలు గా పెట్టలేదు. మా పిల్లలకి ఎప్పుడూ చెబుతాను జీవితం లో స్నేహితులను ఎన్నుకోవటం చాలా ముఖ్యం. జీవితం ఒడుదుడుకులు లేకుండా నడవాలంటే ఇది చాలా చాలా ముఖ్యం. ఒకవేళ కర్మగాలి గుంటలో(సమస్యల్లో) పడ్డా లేవదీసే వాళ్ళు ఉంటారు . చాలా ఆలోచింప చేసే చక్కటి పోస్ట్.

    • Rao Lakkarajuగారు,
      నా బ్లాగులో భర్తృహరి సుభాషితాలు, ఏనుగు లక్ష్మణ కవి పద్యాలు చాలానే ఉన్నాయండి. ఇప్పటి రోజులలో వీటిని పాత చింతకాయ పచ్చడి అనుకుని విద్యార్ధులకి చెప్పటం లేదండి.ముత్యపు చిప్పను వెతుక్కోగలిగితే, పోల్చుకోగలిగితే ఆనందం కదండీ. నచ్చినందుకు
      ధన్యవాదాలు.

  3. ఏమి వ్రాయను శర్మగారు,మనుషులు,వారిలోని గుణాలనాధారంగా మీరు చెప్పినవిశ్లేషణ.ఎంత పరిపక్వతవుంటేనో మనమలాంటి వారిబారిన పడకుండా జీవితాన్ని దాటగలము.మీరన్నట్లు జీవితంలో అదొక పెద్ద సవాలు లాంటిదనే అనుకోవాలి. విశ్లేషించేనేర్పుగలవాళ్ళకు మిగిలిన జీవితం నల్లేరుపై నడక. ఎటువంటి ఒడుదుడుకులూ వుండవు. చాలా మంచి పోస్టు ఇచ్చారు. దన్యవాదాలు. ఎంత మేధావులైనా పైన మీరుచెప్పిన విశ్లేషించే గ్నానం లేకుంటే తిప్పలు పడాల్సిందే.

    • మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి గారు,
      మనుషులు ఇలా ఉంటారన్న సంగతి తెలియాలి కదండీ. ఒక్కో సంఘటనలో జీవితం లో ఒక్కో పాఠం నేర్చుకోక తప్పదు. అందుకే పెద్దలు చెప్పిన మాటలు మననం చేసుకుని అనుభవాలను పోల్చుకుంటే ఇబ్బందులు తక్కువుంటాయి. కందుకమువోలె సుజనుడు కిందంబడి మగుడ……..
      ధన్యవాదాలు.

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి