శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గం వద్దు బాబోయ్!

స్వర్గం వద్దు బాబోయ్!

పూర్వం ముద్గలుడనే మహర్షి ఉంఛ వృత్తితో జీవించేవారు. ఉంఛ వృత్తి అంటే, పొలంలో యజమాని వదలి వేసిన ధాన్యపు గింజలని,రాలిన ధాన్యపు కంకులను ఏరుకుని ఆహారం సమకూర్చుకుని జీవించడం. దీనినే ‘పరిగి ఏరుకోడం’ అనీ అంటారు. ధాన్యం దంపిన రోటి వద్ద వదలివేయబడ్డ బియ్యపు గింజలను ఏరుకుని పొట్టపోసుకోవడం, తరవాతి కాలంలో ఈ వృత్తిని అవలంబించేవారు నారాయణ నామ స్మరణ చేస్తూ వీధి వెంట వెళుతుండగా, ఎవరైనా స్వఛ్ఛంధంగా ఇచ్చిన ధాన్యం పుచ్చుకోవడం.

ముద్గలుడు ఇలా జీవిస్తూ పక్షోపవాసం చేసేవారు. అనగా పాడ్యమి మొదలు చతుర్దశి దాకా ఉపవసించి పదిహేనవరోజున భుజించడం. పాడ్యమి మొదలు ఒక్కొక గింజగా ధాన్యాన్ని కూడబెట్టి దానిని పదిహేనవరోజున పచనం చేసి అతిథి అభ్యాగతులకు పెట్టి, మిగిలినది భుజిస్తూ వచ్చారు. ఒక పదిహేనవ రోజున ఉన్మత్తునిలా, ఒంటి పై బట్టలేకుండా, జడలు విరబోసుకుని, జుగుప్స కలిగించే వేషంతో, గ్రామ్య భాష మాటాడుతూ, ఆకలికి తూలిపోతూ దుర్వాస మహాముని విచ్చేశారు. వచ్చిన దుర్వాసునికి స్వాగత సత్కారాలు జరిపి, భోజనం పెట్టి సంతృప్తుణ్ణి చేశారు,ముద్గలుడు. కాని దుర్వాసుడు మిగిలిన అన్నాన్ని తన ఒంటికి పూసుకుని వెళిపోయారు. ముద్గలునికి మరలా ఉపవాసమే గతి అయింది, ఐనా వారు కోపమూ తెచ్చుకోలేదు. మరలా పదిహేనవ రోజున దుర్వాస మహాముని మరలా అలాగే వచ్చి భుజించి మిగిలిన అన్నం ఒంటికి పూసుకుని వెళిపోయారు. ఇలా ఆరు సార్లు జరిగింది. అయినా ముద్గలునికి కించిత్తు కోపం రాలేదు,మనసులో కూడా బాధ పడలేదు. అప్పుడు దుర్వాసులు ముద్గలా! నీవు కోపాన్ని జయించావు,కోరికను జయించావు, నీకు మనసులో కూడా కోపం రాలేదు, నా చేష్టలకి, నీవు స్వర్గానికి పోదగిన వాడవు అని వెళిపోయారు. ఆయన అలా వెళ్ళిన వెంటనే ఒక దేవ దూత విమానం తీసుకువచ్చి, ముద్గల మహామునీ! మీరు స్వర్గానికి వచ్చే సమయం వచ్చింది, విమానం తీసుకు వచ్చాను, ఎక్కండి, మిమ్ములను స్వర్గానికి తీసుకు వెళతానని అన్నాడు. ఇది విన్న ముద్గలుడు,

దేవదూతా! స్వర్గం అంటున్నావు కదా, అదెలా ఉంటుంది? దాని గుణ దోషాలు చెప్పమన్నారు. అందుకు దేవదూత, మహానుభావా! భూలోకానికి పైన ఉన్నది స్వర్గం,అందులో యజ్ఞాలు చేసినవారు,సత్యసంధులు,దానపరులు, ఇంద్రియాలను జయించినవారు,రణశూరులు, వారివారికి తగిన చోట ఉంటారు. అక్కడింకా అప్సరసలు, సిద్ధులు, సాద్యులు ఉంటారు. స్వర్గం ముప్పది మూడు వేల యోజనాల విస్తీర్ణం లో ఉంటుంది, మేరు శిఖరం, నందనము మొదలైన ఉద్యానవనాలుంటాయి, అవన్నీ వీరందరికి ఆట స్థలాలై ఉంటాయి. అక్కడ ఆకలి, దప్పిక, చలి,వేడి బాధలుండవు. అక్కడ ముసలితనము, రోగము ఉండదు. ఎక్కడ చూచినా మనసుకు ఆహ్లాదం కలిగించే అందాలే కనపడతాయి. మీలాటివారంతా మనుష్య శరీరాలు వదలి, దేవదూతలచే తీసుకురాబడి, అక్కడ విహరిస్తుంటారు, అన్ని రకాల సుఖాలు అనుభవిస్తుంటారు.. ఆ పైది బ్రహ్మలోకం, అక్కడ మునులు,మనువులు,బ్రహ్మగారు ఉంటారు. అక్కడ లోభం, కోపం,దుఃఖం, ఉండవు. ఇప్పటిదాకా స్వర్గం గుణాలు చెప్పేను ఇక దోషాలు వినండి

భూమిపై చేసుకున్న పుణ్యమంతా స్వర్గంలో అనుభవించడమే కాని అక్కడ పుణ్యం చేసుకోడానికి కుదరదు. పుణ్యం పూర్తికాగానే మళ్ళీ మనుష్యలోకానికి పంపేస్తారు. అక్కడ అలవాటయిన సుఖాలు వదలుకోలేక బాధపడుతుంటారు,అక్కడ కొచ్చినవారు.. ఒక్క బ్రహ్మలోకంలో తప్పించి మిగిలిన అన్ని లోకాలలో ఇదే విధానం. మరో మాట అక్కడ పుణ్యం పూర్తయితే భూలోకంలో పుట్టేవాడు సుఖాలు అనుభవించేలాగా పుడతాడు. భూలోకం కర్మభూమి, అది ఫలభూమి, నీ మీద గౌరవంతో ఇదంతా చెప్పేనయ్యా!, విమానం ఎక్కెయ్యండి, తీసుకెళిపోతానన్నాడు.

అందుకు ముద్గలుడు అమ్మబాబోయ్! అటువంటి స్వర్గం నాకొద్దయ్యా!

ఎయ్యెడకు జనిన బురుషుం డియ్యెడకును మగుడకుండు నెక్కలమున నే
నయ్యుత్తమపదవికినై యెయ్యనువున నైన నుత్సహించెద బుద్ధిన్….భార…అర.ప…ఆశ్వా..6…140

ఎక్కడికెళితే మళ్ళీ ఇక్కడికి తిరిగిరానో అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను.

నువ్వు నీ చిత్తమొచ్చినట్లు వెళిపోబాబూ అని పంపేశారు. ఆ తరవాత ముద్గలుడేం చేశాడన్నది తరవాతి కథ.

ఇప్పుడు తెనుగునేల మీద ప్రభుత్వాలు అరచేతిలో సింగపూర్ స్వర్గాన్ని చూపించేస్తున్నాయి….

భారతం అరణ్యపర్వం షష్ఠ ఆశ్వాసం 114 నుండి స్వేఛ్ఛానువాదం.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గం వద్దు బాబోయ్!

 1. ఈ మానవుడు మరీ చాదస్తపు మానవుడు లా ఉన్నాడు ! ఫ్రీ గా వచ్చినదానిని అట్టేసుకుని ఆ పై చూద్దారి ఆ ఏమి దొరుకుతుందో చూద్దామని అనుకోక చేత వచ్చిన దాన్ని వదులుకుంటే ఎట్లా !!

  సింగా పోరు అంత మహిమాన్విత దేశమ్మా నండీ ??

  జిలేబి

  • జిలేబిగారు,
   ఫ్రీగా వస్తే ఫినాయిలయినా తాగేద్దామనుకునే రోజులు, నేటివి. పాపం! ఆయన మీరన్నట్టుగా చాదస్తుడే. స్వర్గం అనగానే విమానం ఎక్కి కూచోలేదు.
   సింగా పూర్ అంత గొప్ప దేశమో ఏమో నాకైతే తెలియదు. డేశాలు చూసినవారు చెప్పాలి. 🙂
   ధన్యవాదాలు.

 2. కార్తీక మాసం, పరమేశ్వరుడు దివిలో సంచరించే వేళలో మంచి నీతి కధ సెలవిచ్చారు. సంతోషం. మరలా ఈ మురికి రాజకీయాలు మనమీసందర్భంలో ఎందుకులెండి. తెల్లవారిందిమొదలు టివి పెట్టినా, పేపర్ తీసినా వాళ్ళ గారడీలతో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఎన్ని కాలాలు మారినా ధనిక,పేద,మద్యతరగతి అనే వర్గ విచక్షణలు ఎవరూ మార్చ లేకపోతున్నారు.ఎప్పటికీ ఆ గాలిలో దీపంలాటి బతుకులు చూస్తూనే ఉంటామేమో. పరమేశ్వరుని దయ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s