శర్మ కాలక్షేపంకబుర్లు-పేరు పెట్టడం (నామోత్కీర్తనం)

పేరు పెట్టడం (నామోత్కీర్తనం)

అసలు పేరన్నది ఎందుకూ అని ఆలోచిస్తే ఒక వ్యక్తిని ప్రదేశాన్ని గుర్తించడానికే. ఈ పేర్లు పెట్టుకునే (పేర్లు, పద్దులు పెట్టుకోడం అంటే విమర్శ చెయ్యడమని అర్ధం ఉందిట) అలవాటు లేని కాలం లో గుర్తించడానికని ఎర్రాడు, నల్లాడు, పొట్టాడు,పొడుగాడు, కుంటాడు, బొల్లోడు, బక్కోడు, ఇలా మనుషుల రూపాల్ని బట్టి పేర్లు పెట్టుకున్నారు. ఆ తరవాతి రోజులలో ద్రోణుడు కుండనుంచి పుట్టినవాడు, ఘటోత్కచుడు కుండవంటి తలకలవాడు, ఉపరిచరవసువు ఈయనెప్పుడూ ఆకాశంలో తిరిగేవాడట అందుకు ఉపరిచరుడు అన్నారు. కృష్ణ శబ్దానికి నలుపు అని కూడ అర్ధం. భారతం లో నలుగురు కృష్ణులున్నారు. శ్రీకృష్ణుడు ఈ యనకి రాధికాపతి, నందనందనుడు, ఇలా చాలామందితో కలిపి పేర్లున్నాయి. రెండవ కృష్ణుడు, కృష్ణద్వైపాయనుడు, కురువంశ కర్త. మూడవ కృష్ణుడు అర్జునుడు, ఇతనికి కృష్ణుడనే పేరు, చిత్రం భారత యుద్ధానికి కారకురాలైన ద్రుపద రాజ పుత్రికి కూడా కృష్ణ పేరుంది, అందరూ నల్లనివారేనట, అందం నలుపులోనే ఉందేమో! మరో పేరు వృకోదరుడు అని భీమునికి పేరు, ఏంటిటా నక్కలాగా ఎంత తిన్నా ఆకలేట, కడుపు నడుముకు అంటుకుపోయి ఉంటుందట. భీకరమైన రవం చేసినవాడు కనక రావణుడు అన్నారుట. ఇలా కూడా మనుషుల్ని గుర్తించేవారు. దేవతలకి, దేవుళ్ళకీ ఇది తప్పలేదు నారాయణుడు నీరునివాసంగా కలవాడు, ఇవిగాక మరొకరితో కలిపి గుర్తించడం పార్వతీపతి, పార్వతీదేవి భర్త, సీతాపతి, సీత భర్త ఇలాగా పేళ్ళున్నాయి, పూర్వకాలంలోనూ, ఇప్పటికి మా పెల్లెలలో ఇటువంటివి చాలా చూస్తుంటాం, పల్లమ్మ గారి రామన్న. ఈ పల్లమ్మగారు కొంత ప్రఖ్యాతి ఉన్నవారు అందుతో ఈ రామన్నగారు పల్లమ్మగారి రామన్న అయ్యాడు. పాతూరి బులెంకమ్మ మొగుడని పేరు, ఈ బులెంకమ్మగారు దాత, మరి ఆయన పేరు తెలీదు. అనామకుడు అనగా గుర్తింపులేనివాడని అర్ధం, పాతూరి బులెంకమ్మ మొగుడివేంటిరా అనేవారు, పేరు చెప్పకపోతే. ఇలా చూస్తే రామానుజుడు, రాముని తమ్ముడు లక్ష్మణుడు. అబ్బో దీనికి అంతులేదండి చెప్పుకుంటూ పోతే.

పేర్లలో చిత్రాలూ ఉన్నాయి, మీనాక్షికి చింతాకంత కళ్ళు, మన్మధరావు పాపమీయన పగలు చూస్తే రాత్రి కలలో కొస్తాడు. పేరు సుభాషిణి కదిలిస్తే నత్తిమాటలే, పేరు మితభాషిణి కదిలిస్తే గచ్చపొద, పేరు సత్యారావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే. పేరు భారతి పొట్టకోస్తే అక్షరమ్ముక్క రాదు,నీలవేణి కి తల ముగ్గుబుట్ట.పెళ్ళిలో పేర్లు చెప్పించడమనే ముచ్చటుండేది, ఇప్పుడు మరచారనుకోండి, ఇప్పుడు ’హబ్బీ ఇలారావోయ్’ అనే పిలుస్తున్నారు. మా మాస్టారొకాయన ’వైఫూ’ అని పిలిచేవాడు పెళ్ళాన్ని, చాలా కాలం అర్ధం కాలా, ఏమని పిలుస్తున్నట్టు, అని

ఇక ఊళ్ళని గుర్తించడానికి పల్లె,పట్నం,ఖండ్రిగ,మొగ,పర్తి,పాడు,పురం చివరగా పేర్లు ఉన్నాయి. ఇలాగే ఉత్తర,దక్షిణ,తూర్పు,పడమరలతో కలిపిన ఊర్లపేర్లూ ఉన్నాయి. మిట్ట, పల్లం తో కలిగిన పేర్లూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? గుర్తింపుకే. ఆ తరవాత కాలంలో కొన్ని కొన్ని కొత్తపేర్లు, ఎవరికీ పెట్టని, తెలియని పేర్లు పెట్టుకోవడం కూడా ఒక ఆనందమై కూచుంది. ఉష్,చన్, నన్ చివరగా కల పేర్లూ వచ్చాయి. విరోచన్ అని ఒకరు పేరెట్టుకున్నారు, పాపం ఆ పేరు ఎవరికి ఉండి ఉండదనుకుని, తీరా చూస్తే ఈ విరోచనుడన్నపేరు భారతం లో ఉంది :). మీకు వింత వింత పేర్లు కావాలనుకుంటే భారతం చదవండి, భలే పేర్లు కనపడతాయి.

కొన్ని పౌరుషనామాలు ధనుంజయుడు,సవ్యసాచి వగైరా ఈ కోవకి చెందినవే. కొన్ని చేసే వృత్తినిబట్టి వచ్చే పేర్లూ ఉన్నాయి తోప్ ఖానేవాలా వీళ్ళ పూర్వులు ఫిరంగులు తయారు చేసేవారట. ఇక చదువుల్ని బట్టి పేర్లు వేది,ద్వివేది,త్రివేది,చతుర్వేది, వేదం చదువుకున్నవాడు,రెండు వేదాలు చదువుకున్నవారు, మూడు వేదాలు చదువుకున్నవారు, నాలుగు వేదాలూ చదువుకున్నవారని. పేర్లు మిగిలాయి కాని వేదాలు పారిపోయాయి, నేటికి. ఇక కులాల తో పేర్లు అదో పెద్ద చిత్రమే, ఇది ఈ మధ్యనే మనకి బాగా చేరింది. మరి మీపేరేంటి కులం పేరుకాదా అని అడగచ్చు, కాదు, కానే కాదు, శర్మ అంటే విష్ణువు పేరు శాంతి అని అర్ధం, దీక్షితులు అంటే దీక్ష తీసుకున్నవాడు అని అర్ధం మరివి, కులనామాలెలా అయ్యాయి. శాస్త్రి శాస్రం చదువుకున్నవాడు అని అర్ధం. వీటిని కులనామాలు చేసేశారు. ఇక రావు అనేది పేరు చివర రావడం మరాఠీ సంస్కృతితో వచ్చినదనుకుంటా. కాపు అంటే రక్షకుడు, రక్షించేవాడని అర్ధం, అలాగే నాయుడు అన్నది నాయకుడికి వికృతి. ఇలా కులాల పేర్లుగా చివర తగిలించుకోడమనేది ఉత్తరాదివారి సంస్కృతి, మనది కాదు.

పుట్టని బిడ్డకి పేరు పెట్టడం గురించి దెబ్బలాడు కున్న దంపతుల్ని చూశాం కదా! అజాతపుత్ర నామోత్కీర్తన న్యాయంలో. పుట్టిన బిడ్డకి పేరు పెట్టడంలో తిరకాసు చూదాం. ఇదివరలో చాలా మంది పిల్లలుండేవారు కనక పేర్లు పెట్టడానికి ఒక ప్రోటోకోల్ ఉండేది. మొదటి బిడ్డకి ఆయన తండ్రిపేరు,ఆడ బిడ్డకి ఆయన తల్లిపేరు. ఆతర్వాత మగ ఆడ బిడ్డలకి ఆమె తల్లితండ్రుల పేర్లు పెట్టడం ఆచారం ఉండేది. ఇప్పుడు ఆ సావకాశాలు లేవు కనక ఒక జరిగిన సంఘటన. ఒక దంపతులకి మగ బిడ్డ కలిగితే ఎవరిపేరు పెట్టాలని ఆలోచించారు, తగువెందుకని ఆమెతండ్రి, ఆయన తండ్రి పేర్లు కలిపి పెట్టేశారు.. మరో చిత్రం కూడా, ఆమె తరఫువాళ్ళంతా, ఆమె మామగారి పేరుతోనూ, ఆయన తరఫు వాళ్ళంతా ఆమె తండ్రి పేరుతోనూ పిలుస్తారు. మంచి సయోధ్య కుదిరిపోయింది. ఒక్కొక్కరి పేరు కొండవీటి చాంతాడంతా ఉంటుంది. వీరవేంకట సత్య సూర్య వరప్రసాద నరసింహ వినాయక మణికంఠ………వరాహరావు, పాపం ఈయనను తెలిసినవాళ్ళంతా ’పందిగాడు’ అనిపిలిస్తారు, దెబ్బలాటకొస్తే ’పందెగాడు’ అని సద్దేస్తారు, ఇతనికి పందాలు వేయడం బాగా అలవాటూ.

ఏపేరు పెట్టాలని దెబ్బలాడుకుని చివరికి భార్యభర్తలు ఏదో పేరు పెట్టినా చివరికి వాణ్ణి ఏదో పొట్టి పెరుతోనే పిలుస్తారు, పండూ, చిన్నా అని.

’ఏంటీ ఏర్ పోర్ట్ పేరు తగువ’న్నాడు మా సుబ్బరాజు. ’ఏముంది ముందు ఒకరి పేరు పెట్టేరు. ఆ తరవాత అధికారానికి వచ్చినవారు ఆ పేరు మార్చి మరొకరి పెరు పెట్టేరు, ఇప్పుడు మొదటివారొచ్చి మళ్ళీ పేరు మార్చారు. ఆయనెవరూ బారువాగారా ఇండియా అంటే ఇందిర అన్నాడు కదా! అన్నిటికి ఆ పేర్లే పెట్టేస్తే పోలా అనుకున్నారు వారు. అవే తగిలించారు మరీ. తగువులేక ఒక పేరు పెట్టలేమా? అని ఆలోచిస్తే ఈ తగువంతా కాలక్షేపానికి, నాదే పైచెయ్యి అని చెప్పుకోడానికి, వినోదానికి, అసలు విషయాల్ని దాటెయ్యడానికి అనిపించడం లేదా? రాజీవ్ పేరుపెట్టినా ఎన్.టి.ఆర్ పేరు పెట్టినా కేబ్,ఆటో వారు షంషాబాద్ ఏర్ పోర్టు అనే పిలుస్తారు. రాజీవ్ పేరు చెబితే ఒక రూపాయి తగ్గించడు……..రాజకీయ నాయకులే సమాజానికి సేవచేస్తున్నారా? ఇదంతా ఎందుకుగాని హైదరాబాద్ లో ఒక ఆటోవాలా గర్భిణీ స్త్రీలని ఉచితంగా హాస్పిటల్ కి చేరుస్తుంటాడు..అతను సమాజానికి నిజమైన సేవ చేస్తున్న సామాన్యులలో మాన్యుడు… అతనిపేరెట్టచ్చుగా…’ అని వెళిపోయాడు మా సత్తిబాబు…నిజమేనంటారా?

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పేరు పెట్టడం (నామోత్కీర్తనం)

 1. విరోచన శబ్దం మనకి తప్పుగా అర్థం అవుతున్నది. విరేచన శబ్దం వేరు, దానితో జనం అన్వయించుకుంటున్న విరేచన శబ్దం వేరు. విరోచనుడి సంతతి వాడు కాబట్టి బలిచక్రవర్తి వైరోచని. పూర్వం జనం విరేచనాలకోసం ఆముదం పుచ్చుకునేవారు.

  • శ్యామలరావు గారు,
   ఆ పేరు పెట్టుకున్నవాళ్ళు ఇదివరలో ఆ పేరు ఎవరికి లేదనుకున్నారండి.
   ధన్యవాదాలు.

 2. ఇంతకీ ఈ జిలేబి ఇట్లాంటి పేర్లు పెట్టేసు కుంటారె, వీళ్ళ నేమనాలండి !!

  రెండు, మీరు నా కొంత సాగాదీశారేమిటి ?? అచ్చు పప్పా ?? ఈ కాలం ‘నమోత్కీర్తనం’ కాదుస్మీ !

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   జిలేబి, రసగుల్లా, జాంగ్రి పేర్లు పెట్టుకున్నారు తాము తియ్యగా ఉంటామని చెప్పుకోడానికి, పకోడి లాటి పేరు పెట్టుకున్నవారు తాము కారంగా ఉంటామని చెప్పుకోడానికిసంకేతనామాలనుకుంటా, నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s