శర్మ కాలక్షేపంకబుర్లు-నడమంత్రపు సిరి..

నడమంత్రపు సిరి..….

నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఒకలాగే సలుపుతాయని నానుడి. నడమంతరపు సిరి ఎప్పుడూ రాలేదు కనక దాని గురించిన అనుభవం లేదుగాని, నరం మీద కురుపు అనుభవం లోకొచ్చింది.

అదేమోగాని వీపుమీద సరిగా మెడ నుంచి ఆరంగుళాల దూరం లో సరిగా వెన్ను మీద కుడి వైపున పెసరబద్దంత బొడిపి తేలింది, మొదటి రోజు. ఆ( ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని ఊరుకున్నా, అశ్రద్ద కూడా చేశా. మర్నాటికి కొంచం పెరిగిందేమో తెలియదు కాని మూడవనాటికి నేనున్నానని జ్ఞాపకం చెయ్యడానికి సలుపు, పోటు మొదలెట్టింది. ఒక టేబ్లెట్ పడేశాను సలుపు,పోటు తగ్గేయి, మరచిపోయా. మర్నాడు ఉదయానికి మళ్ళీ పోటు, సలుపుతో పాటు కొంచం పెరిగింది. అమ్మో! ఇదేమో అనుకుని ఎందుకేనా మంచిదని చక్కెర ఫేక్టరీ ఉత్పత్తి ఎలా ఉందని చూస్తే, అదుపులోనే ఉందని సమాధానమొచ్చింది. మరి ఇదెందుకొచ్చిందంటే? సమాధానం లేని ప్రశ్న కదా! ఎందుకొచ్చినా వచ్చింది, పెరిగింది, ఉన్నానూ అనీ చెబుతోంది, సలుపూ,పోటూ కూడా బాగానే ఉంది, మరి నరం మీద వేసింది కదా! డాక్టర్ మందులు రాసేరు వాడుతున్నా!

అన్నీ బాగుంటే నా అంతవాడు లేడంటాం, ఇప్పుడు చిత్ర వధ ఎలావుంటుందో అనుభవం లోకొచ్చింది. కూచుంటే జేరబడ్డానికిలేదు, పడుకుంటే పక్కగా పడుకోవాలి, మరో పక్క తిరగాలంటే లేచి మళ్ళీ మరో పక్క పడుకోవాలి, దొర్లడానికి లేదు, నిద్రలో దొర్లితే అబ్బో మెలుకువ వచ్చేసి అబ్బా! బాధ, అసలు నిద్రెక్కడ? చలి తిరిగింది, నిన్నటినుంచే, దానితో దోమలూ పెరిగాయి, ఫేన్ వేసుకుంటే చలి, వేసుకోకపోతే దోమలు పీకుతున్నాయి.ఫేన్ వేసుకుని కప్పుకుందామనుకుంటే కురుపు గోల, నరకం వేరుగాలేదు. ఇదే….ఎంత సేపని కొరడా కర్రలా కూచోడం…

ఇలా ఉండగా అసోసియేషన్ వారు మీరు రెండు సార్లనుంచి మీటింగ్ లకి రాలేదు, బుధవారం మీటింగ్ రాకతప్పదు రాజమంద్రి అన్నారు. పది రోజుల కితమే ముఖ్య కార్యక్రమానికి రాజమంద్రి వెళ్ళి, ఎలాగా కదిలేం కదా అని బ్లాగిల్లు శ్రీనివాస్ గారిని కలిస్తే, అబ్బో! అదో అపూర్వ అనుభవం. వారేమో మరో ఇద్దరు స్నేహితుల్ని పిలిచి, చిన్న సభలా ఏర్పాటు చేసి నేనేదో వాగేస్తోంటే అదే మహా కావ్యంలా వినేసి తలలూపేసేరు. నిజానికి బ్లాగిల్లు శ్రీనివాస్ దంపతులిచ్చిన ఆతిథ్యం, కృష్ణుడు,రుక్మిణీదేవి, కుచేలునికిచ్చిన ఆతిథ్యం మరపుకు తెప్పించింది.అసలు ఎవరినైనా మాటాడనిస్తేనా ఒక గంట సేపు, వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేసేను. ఆ తరవాత ఒక స్నేహితుడు నన్ను బస్ దగ్గర దింపేరు.

మళ్ళీ ఇప్పుడు….అనుకుంటూ, ఇంటి దగ్గర కూచుంటే వెఱ్ఱాడికి….మీదే లోక మని, మన మనసు కురుపు మీదే ఉంటుందని, కొంత మార్పు ఉంటుందని బయలుదేరేను. దగ్గరగా ఎనభైమంది చేరేరు, ఇక్కడా మంత్రివర్గం మార్పు చెందిందిట, ఉత్సాహం ఉరకలే వేసింది. కొద్ది సేపు మాటాడమన్నారు, ఆ తరవాత ఎనభై ఏళ్ళు పైబడినవారిని సన్మానించారు, ఆనందమే అయింది. భోజనానికి బయలుదేరుతుంటే ఒక మిత్రుడొచ్చి ఎన్నాళ్ళకి,ఎన్నాళ్ళకని గుచ్చి కౌగలించాడు, నేనేమో గిలగిల లాడుతూ ఏడవలేక నవ్వు మొహం పెట్టేను. ఏం అలా పెట్టేవు మొహమన్నాడు. ఏం చెప్పనురా బాబూ! నరం మీద కురుపేసింది, వీపుమీద. ‘పుండుకి పుల్ల మొగుడని’ నువ్వేమో దాన్ని కాస్తా నొక్కేసేవు, అసలే సలుపు,పోటూ తో చస్తున్నా అంటే. అయ్యో నాకు తెలియదుకదా అని దీన్ని వార్త చేసి అందరికి చెబితే అదో సంతాప సభలా యిపోయింది, ఓదార్పులతో. అలా కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేటప్పటి రాత్రయింది.

ప్రయాణానికి ఒళ్ళు చితక్కొట్టిన్నట్టయిపోయింది, అన్న వస్త్రాలకిపోతే ఉన్న వస్త్రాలు పోయేయన్నట్టు అయిందే అనుకుని,కురుపుతో’బాధగా ఉందోయ్’ అన్నా, ఇల్లాలితో, ’మీరే చెబుతారుగా నడమంత్రపు సిరి నరం మీద కురుపు ఒకలాగే బాధ పెడతాయని, అనుభవించకతప్పదు మరి’ అని వెళిపోయిందండి.
కూచోడానికి, పడుకోడానికీ బాధగానే ఉంది, కొన్ని టపాలు ఎప్పుడో రాసి వదిలేసినవాటిని కొన్నిటిని ప్రోగ్రాం చేశాను. కొద్దికాలం శలవు.
స్వస్తి.

ప్రకటనలు

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నడమంత్రపు సిరి..

 1. బాబాయ్ గారూ ! ఆరోగ్యం అశ్రధ్ధ చేయవద్దండీ! మీరు త్వరగా కోలుకోవాలని ‘అమ్మ’ను కోరుకుంటున్నాను.

  • అమ్మాయ్ నాగరాణి,
   అమ్మ మీ మాట విన్నది, అందుకే కురుపు చితికి అదుపులోకి వచ్చింది.
   మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 2. సీనియర్ డాక్టర్ గా నా సలహా;:1.మూత్రంలో సుగర్ మాత్రమే చూసుకొన్నారా?రక్తంలోసుగర్ కూడా చూపించుకోవాలి 2.anti-biotics వాడుతున్నారా?ఇంజక్షన్ లుగా తీసుకొంటే మంచిది.3.biopsy అవసరమేమో అడగండి.పెద్దహాస్పిటల్ లో స్పెషలిస్టులికి చూపించుకొంటే మంచిది.

  • రమణారావు గారు,
   సుగర్ అదుపులో ఉంది,మూత్రం లో సుగర్ చూడటం మానేశామండి. రక్తంలో నే చూచే ఏర్పాటుకోసం ఒక యంత్రం కొన్నాను. దానితో చూచుకోవడమూ, ఆ రీడింగులు నమోదు చేసుకోడమూ అలవాటేనండి. అనుమానం వచ్చిన ప్రతిసారి చూస్తూనే ఉంటాను. ఉదయం ఆరు-ఏడులోపు ఆ తరవాత టిఫిన్ చేశాకా చూస్తాను. తేడా ఎంత ఎక్కువ ఉంటోంది కూడా గమనిస్తాను. డాక్టర్ గారికి కూడా వీటిని పట్టుకెళ్ళి చూపించడం అలవాటే. సుగర్ కంటే బి.పి అదుపులో లేదన్నారు, దానికి మందులు వాడుతున్నానండి, ఇప్పుడు కురుపు అదుపులోకి వచ్చేసినట్టే..పలుకు పోయేదాకా సలుపు పెట్టేసిందండి. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 3. శర్మ గారు, పుండుతగ్గుతుంది,కానీ షుగర్ని మాత్రం పెరగనీయకుండా చూడండి.ఎంత చిన్నకురుపైనా తగ్గుతుంది షుగర్ లేకుంటే. నా పితృదేవులు ఈ ఒక్క మాట వినక నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పితృసమానులుగా భావించి చెప్తున్నా,అమ్మగారు చెప్పినట్లు వినేయండి. త్వరగా మీకు తగ్గాలని కోరుకుంటూ,త్వరగా మీ పోస్టులు చదవాలిగామరి.అందుకేత్వరగా తగ్గించేసుకుని మళ్ళీ మనం బ్లాగు ప్రయాణంలోకలుసుకోవాలి.

  • స్వరాజ్య లక్ష్మి గారు,
   సుగర్ అదుపులో ఉంది, కురుపు చితికింది,పలుకు ఊడిపోయింది, పలుకు ఊడిన తరవాత సలుపు తగ్గింది, పుండు తగ్గుతోంది,ఇల్లాలి మాట విని ఉయ్యాలలోనే కూచున్నా! నిజానికి ఆవిడ మాట వినబట్టే ఇంకా ఇలా ఉన్నానండి, ఇది నిజం. 🙂 ఇన్ని రోజులు నెట్ లోకి రాలేదు అందుకే, మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

  • శ్రీనివాస్ గారు,
   కార్తీకం వచ్చినది మొదలు ప్రయాణాలు పెరిగాయి, నిజమే. ఇక మొహమాటానికి పోయి ప్రయాణాలు చేయదలచలేదు. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 4. దోమల బాధ నుండి తప్పించుకోవడానికి దోమ తెరని మించిన (అపాయం లేని) ఉపాయం లేదండి.
  ఇక్కడ బెంగళూరులో దోమల బెడద తక్కువే కాని, మేము దిల్లీలో ఉన్నప్పుడు దోమతెర తప్పనిసరిగా వాడేవాళ్ళం.

 5. శీఘ్రం గా కోలుకోండి !!

  ఇంతకీ కురుపు ఎందువల్ల వచ్చిందంటారు ?? మరీ టెన్షన్ ఎక్కువై పోతోందా బ్లాగు లోకం వల్ల ??

  జిలేబి

  • జిలేబిగారు,
   మనమేం చెయ్యలేనివాని కోసం పట్టించుకుని బాధ పడడం మానేయాలండి, తప్పదు మరి. 🙂
   మీరన్నట్టు వైద్యులు మీకు సుగర్ అదుపులోనే ఉంది కాని బి.పి పెరిగిందనే చెప్పేరు. కురుపు తగ్గు ముఖం పట్టిందండి. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s