శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం

జీవితం

వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము చెప్పకు
పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ.

వఱదలో వ్యవసాయం చెయ్యకు,కరవైనా బంధువులవద్దకు పోవద్దు,ఇతరులకు రహస్యం చెప్పద్దు, పిరికివాడిని దళపతిగా చెయ్యద్దు అన్నారు బద్దెన భూపాలుడు..

వఱదలో వ్యవసాయం మొదలు పెట్టద్దంటే చేసేపని వ్యర్ధమని తెలిసి చెయ్యడం అవుతుంది. ఇది వ్యవసాయానికే కాదు జీవితంలో అన్నిటికి వర్తిస్తుంది. సమయం సందర్భం చూసుకోకుండా అనువు కాని సమయం లో పని మొదలుపెట్టి నష్టపోవడం కూడా ఇటువంటిదే. ప్రతి పని మొదలు పెట్టడానికి కొన్ని కొన్ని ప్రత్యేక సమయాలుంటాయి, అప్పుడే మొదలు పెడితే కలసివస్తుంది .సరియైన ఋతువులో విత్తాలి,అప్పుడే మంచి పంట పండుతుంది. సరియైన వయసులో చదువు, పెళ్ళి చేసుకోవాలి,జీవితంలో నూ స్థిరపడాలి.అదును దాటిన వ్యవసాయం ఎలా ఫలించదో, కాలం గడచిన తరవాత పెళ్ళీ అలాగే ఉంటుంది.ముఫై ఏళ్ళ దాకా చదువంటే, ఆపైన ఉద్యోగమంటే, ఆ తరవాత ఉఛ్ఛదశకోసం చూపంటే, వయసు కరిగిపోతోంది, ఆ తరవాత అంటే అమ్మాయికి ముఫై ఐదు, అబ్బాయికి నలభైలలో అనుభవాలకి అవకాశమూ తక్కువ, ఏరొక చోట చాకిరేవొక చోటలాగా వారొక చోట వీరొకచోట, ముడి పడేదెలా?,పొరపాటున అప్పటికే కొన్ని అనుభవాలుంటే అవి కాల నాగుల్లా వెంటాడుతుంటాయి. ఆదరణలూ లేవు, సద్దుకుపోయే తత్వమూ అప్పటికే చచ్చిపోయి ఉంటుంది. నా మాటే చెల్లాలనే అహంకారమూ బుసలు కొడుతుంటుంది. అప్పుడు పెళ్ళి విడాకులకే దారితీసే సావకాశాలూ ఎక్కువే. ఈ పిల్లలు సంసారం అంతా ఎందుకనుకుంటే సంన్యాసం తీసుకోవచ్చు కాని, ఇందులోనే ఉండి అదును తప్పిన వ్యవసాయంలాగా ఉంటే, ఆ తరవాత ఏ పసి పాపను చూసినా అయ్యో! మనకు లేకపోయారే అనే బాధ మనసును కలుక్కుమనేలా చేస్తుంది, ఇది మగవాడికంటే స్త్రీకి చాలా బాధాకరం. స్త్రీకి తల్లి కావాలనే కోరిక చాలా బలవత్తరమైనదని గుర్తించాలి.

కరువులొ అధికమాసం అంటారు, కరువంటేనే దరిద్రం, ఏమీ లేకపోవడం, భావదారిద్ర్యమూ ఇందులోకే వస్తుందేమో చెప్పలేను. ఇటువంటి సమయంలో బంధువుల దగ్గరికి పోవద్దన్నారు. ’చెడి చెల్లెలింటికి వెళ్ళేకంటే స్నేహితుని ఇంటికి వెళ్ళమని’ సామెత. మన దరిద్రం సంగతి అక్క/చెల్లి; అన్న/తమ్మునికి, కావలసినవారికి, అత్తమామలకి, బావ మరదులకి ముందుగానే తెలుస్తుంది. ముఖ్యంగా అత్తవారింటికి అసలే పోకూడదు. వీరు మాటాడరుకాని, వారి వెనకవారు సన్న సన్నగా కోస్తారు. ’అయ్యో! అన్నయ్యా!! మాకు నాలుగు సంవత్సరాలుగా ఏదీ కలిసిరావటం లేదు, రోజు గడవటమే కష్టంగా ఉందనుకో’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇక సాయం అడగడానికి వెళ్ళినవారికి నోరు పెగలదు. మన వెనకని ’అమ్మబాబోయ్! ఆ మాత్రం భాగ్యానికే ఏం మిడిసిపడిపోయారూ, నడమంత్రపు సిరి నరం మీద కురుపూ అని ఊరికే అన్నారా! దేవుడు లేడూ!’ అని ఎగతాళీ కూడా చెయ్యచ్చు. అదే స్నేహితుని ఇంటికి వెళితే ధన సహాయం చేయలేకపోయినా నోరారా పలకరిస్తాడు, మనసారా కష్టం విని తరణోపాయం కోసం వెతుకుతాడు. కుదిరితే మనం కష్టాన్ని దాటే ఉపాయమూ చెప్పగలడు, అసలు ఇతను సరియైన మిత్రుడయి ఉంటే సుమా! సుదాముడు అదే కుచేలుడు మిత్రుడు కృష్ణుని దగ్గరకే వెళ్ళేడు, నోరు విప్పి దరిద్రం తీర్చమని అడగలేకపోయాడు, మిత్రుడే ఒక పిడికెడు ఎండిన అటుకులు తిని అనుగ్రహించాడు. ఇంకా తినబోతుంటే చిన్నతల్లి అడ్డుపడింది. అదీ స్నేహితుని యొక్క గొప్పతనం. అందుకే ఎప్పుడూ చెడి చెల్లెలింటికి వెళ్ళద్దన్న మాట మరవద్దు. స్నేహితుడు ధన సహాయం చేసి ఆదుకోలేకపోయినా మెండయినా ఆత్మ విశ్వాసం మనలో నింపగలడు, మనలని మాటలతో ఆత్మ విశ్వాసం పోగొట్టడు, ధైరం నూరిపోయగలడు.ఉల్లికుట్టు మాటలతో చంపెయ్యడు.

ఇతరులకు మర్మం చెప్పద్దనారు కవి. నిజం, ఇది జీవిత సత్యం. చెప్పద్దన్నారని ఎవరికి చెప్పుకోకపోవడం తప్పు. కట్టుకున్నవారికి, కావలసినవారికి, ఆత్మీయులకి చెప్పుకోకతప్పనివి చెప్పుకోవాలి, అప్పుడు కాని గుండె బరువు తీరదు. కాస్త పరిచయస్థులకు కూడా గుట్టు చెబుతుంటారు కొంతమంది, అది అప్పటికి బాగుండచ్చు కాని తరవాత కాలంలో మనల్ని ఇబ్బందులకు గురిచేయచ్చు. అది కూడదనే కవిగారి ఉవాచ.

పిఱికికి దళవాయితనం ఇవ్వద్దన్నారు, అంటే, పిఱికివానికి సేనా నాయకత్వం ఇవ్వద్దని. నేటికాలానికి సేనా నాయకత్వం చెప్పక్కరలెదు కాని, మన కంపెనీలు ఆఫీసులలో నిర్ణయాలు తీసుకోవలసినవారి పిఱికివారై ఉండకూడదు. ఇటువంటి వారికి నాయకత్వం కనక కట్టబెడితే, నిర్ణయాలు తీసుకోక, ఆలస్యం చేసి, తప్పు నిర్ణయాలు తీసుకుని అందరిని బాధకు గురిచేస్తారు, నట్టేట ముంచేస్తారు. ఇది మన ఇళ్ళలో కూడా అనుభవమే అందుకే,అటువంటి అవసరమే కనక వస్తే చొరవ, ధైర్యం,ఆలోచనా శక్తి, సమయస్ఫూర్తి ఉన్నవారికే నిర్ణయం తీసుకునే బాద్యత వదలిపెడితే మంచిది,పురుషాధిక్యతకిపోక, కట్టబెట్టాలని అనుకోవాలి.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం

 1. కాలక్షేపం వారు,

  ఏరొక చోట చాకిరేవొక చోటలాగా వారొక చోట వీరొకచోట,… ఇట్లా ఉండ డాన్నే కదండీ ఈ ఐటీ కాలం లో బీ పీ ఓ, అవుట్ సోర్సింగ్ గట్రా అంటారు ! దానివల్లే కదా గిట్టు బాటు మరి !!

  ఏరొక చోట చాకి రేవు ఒక చోట ఉంటె, అబ్బ , ఎంత ఎకానమీ మూవ్ అవుతంది ! ఇవన్నీ వదిలేసి , మొగుడు, పెండ్లాం పిల్లా జెల్ల గట్రా బాదర బందీ అంటే ఎట్లా మరి ??

  జిలేబి

  • జిలేబిగారు,
   నేటి రోజుల్లో పెళ్ళి, సంసారం కూడా ఔట్ సోర్సింగ్ ఇచ్చేసేలా ఉన్నట్టే ఉందండి 🙂
   ధన్యవాదాలు.

 2. సరియైన వయసులో చదువు, పెళ్ళి చేసుకోవాలి,జీవితంలో నూ స్థిరపడాలి.అదును దాటిన వ్యవసాయం ఎలా ఫలించదో, కాలం గడచిన తరవాత పెళ్ళీ అలాగే ఉంటుంది.ముఫై ఏళ్ళ దాకా చదువంటే, ఆపైన ఉద్యోగమంటే, ఆ తరవాత ఉఛ్ఛదశకోసం చూపంటే, వయసు కరిగిపోతోంది, ఆ తరవాత అంటే అమ్మాయికి ముఫై ఐదు, అబ్బాయికి నలభైలలో అనుభవాలకి అవకాశమూ తక్కువ, ఏరొక చోట చాకిరేవొక చోటలాగా వారొక చోట వీరొకచోట, ముడి పడేదెలా——-అక్షర లక్షలు చేసే కబుర్లు చెప్పారు

 3. ఏరొక చోట చాకిరేవొక చోటలాగా వారొక చోట వీరొకచోట,
  ————
  ఇటువంటి సామెత ఉందని నాకు తెలియదు. ఈ కాలంలో ఎంత నిజం ఇది.

  • రావు లక్కరాజు గారు,
   ఈ సామెత సామాన్యంగా పల్లెలలో ఎక్కువగా వాడటం అలవాటండి. నేటి కాలానికి ఇదే నిజమండి..
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s