శర్మ కాలక్షేపంకబుర్లు-(రూపం)అందం-గుణం

(రూపం)అందం-గుణం

శ్లో. నరస్యాభరణం రూపం ,రూపస్యాభరణం గుణః
గుణస్యాభరణం జ్ఞానం , జ్ఞానస్యాభరణం క్షమా.

గీ. మనుజునకు రూపమే యాభరణము తలప.
గుణమె రూపంబునకునాభరణము కనగ.
గుణమునకుజ్ఞానమే యాభరణము తెలియ.
క్షమయె యాభరణంబు సు జ్ఞానమునకు.
భావము:- మానవునకు రూపమే ఆభరణం.ఆ రూపానికి గుణం ఆభరణం. గుణానికి జ్ఞానమే ఆభరణం .జ్ఞానానికి క్షమాశీలం ఆభరణం. 

Courtesy:SrI.Chinta RamakriShNaraavu. aandhraamrutaM.blogspot.in

(మొన్నను అవతలబ్లాగులో ఉపనయనం ఫోటో పెడితే ఉషగారు ఈ వటువు అచ్చంగా వామనుడిలా ఉన్నాడే అన్నారు. అదిగో ఆ మాట కదిలిస్తే ఈ టపా.ఇది చాలాకాలం కితం రాసినటపా,చిత్తులో ఉండిపోయింది.మొన్న రామకృష్ణారావుగారి బ్లాగ్ లో శ్లోకం కనపడితే,అప్పటికే మొదలుపెట్టినది పూర్తి చేసేనుకాని మళ్ళీ చిత్తులో పడిపోయింది.)

అందం వెంఠనే ఆకర్షిస్తుంది, గుణం నెమ్మదిమీద ఆకర్షిస్తుంది. ఈ రూపంతో పాటు గుణమూ ఉంటే అదే ఆనందం, బ్రహ్మానందం.

రూపంతో బతికేవారిలో నేడు ముఖ్యులు సినీతారలు, హీరోయిన్లు. వీరి రూపం చూసి, అంగాంగ ప్రదర్శన చూడడానికి సినిమాకి వెళుతున్నారు తప్పించి, పాముకోడు డొక్కలాటి హీరో మొహం చూసి అసలు కాదని జనాల అభిప్రాయం. నాడు రాజ్ కపూర్ అమాయకపు అందమైన ముఖం చూసి మనసుపారేసుకున్నవారెందరు? నర్గీస్ తో సహా! అలాగే మరొకరు రాజకీయనాయకులు వీరు రూపానికంటే గుణం అదే వాక్చాతుర్యం ద్వారా జనాలని ఆకట్టుకుంటారు, వీరికి రూపం తోడయితే అది సునామీ.

దేవదానవులు అమృతం కోసం సముద్రమధనం చేశారు, హాలాహలం పుడితే పరిగెట్టేరు. అమృతకలశంతో ధన్వంతరి ఉద్భవిస్తే బలంకల రాక్షసులు ఒకరి చేతినుంచి మరొకరు అందుకుంటూ పట్టుకుపోయారు, అమృత కలశం, సద్వినియోగమయ్యే సావకాశం నశించినట్లే అనుకుని శ్రీహరి మోహినీ అవతారం దాల్చారు, అక్కడ కనపడేటప్పటికి అందరూ నిలిచేరు, మోహిని దగ్గరకిపోయి అమృతం పంచమన్నారు. ఆ రూపం అందరిని వివశులను చేసింది, మాయలో పడిపోయారు.

భస్మాసురుడు వరమిచ్చిన వేలుపు తలపైనే చెయ్యిపెట్టి వరం పరీక్షిస్తానన్న వాడు. మోహిని ని చూసి మోహించాడు, తన నెత్తిమీద తనే చెయ్యిపెట్టుకుని నశించాడు.

సుందోపసుందులు లోకాలని ఏడిపించి హింసించినవారు, మోహినిని చూసి మోహించారు, నన్ను పెళ్ళి చేసుకోమంటే నన్నని పోటీ పడ్డారు. ఇద్దరూ యుద్ధం చేయండి గెలిచినవానిని వివాహం చేసుకుంటానంది. ఒకరినొకరు పొడుచుకు చచ్చారు. లోకానికి పీడ వదిలింది.

మరి మాయవటువు బలిచక్రవర్తి చేసే యజ్ఞశాలలో ప్రవేశించాడు. ఒకరిని పలకరించాడు, మరొకరికి నమస్కారం చేశాడు, ఒకరితో వేదం చెప్పేడు, మరొకరితో శాస్త్ర చర్చ చేశాడు. సభ అంతా కలగుండు పడిపోయింది, ఆ రూపవర్ఛస్సుకి. తరవాతేం జరిగింది, బలి చక్రవర్తి ప్రాణం పోయినా మాట తప్పనని దానమిచ్చి కట్టుబడి, ఇంద్రపదవికోల్పోయాడు.

ఇలాగే ప్రవరుని అందం మాయలో పడి వరూధిని ఏమనుకుంది?

దక్షణదేశంవాడు ప్రవరుడనే నిష్ఠాగరిష్ఠ బ్రాహ్మణుడు, అందగాడు, సంసారి, సిద్ధుని కొలిచేడు. సిద్ధుడు నీకోరికేమంటే, హిమాలయాల అందాలు చూడాలని ఉందన్నాడు. సరేనని పాదలేపనం పూశారు సిద్ధుడు. హిమాలయాలకీ వెళ్ళి దిగాడు ప్రవరుడు, అందాలూ చూశాడు, అమ్మో పొద్దువాలిపోతోందని భయపడ్డాడు, ఇంటికిపోవాలనుకుంటే పాదలేపనం కరిగిపోయింది. ఇంటికిపోయే మార్గం కనపడలేదు. అక్కడ తిరుగుతుండగా వరూధిని కనపడింది.ప్రవరుని చూచిన వరూధిని ఇలా అనుకుంది.

ఎక్కడివాడొ! యక్షతనయేందు జయంతు వసంతు కంతునిన్
చక్కదనంబునన్ గెలువజాలెడు వాడు ఈ మహీసురాన్వయం
బెక్కడ ఆ తనూ విభవమెక్కడ ఏలినబంటుగా మరున్
ఢక్కగొనంగరాదె అకటా నను వీడు పరిగ్రహించినన్.

ఎక్కడివాడో! జయంతుని, వసంతుణ్ణి మన్మధుని కూడా తోసిరాజనే అందంతో ఉన్నవాడు. అయ్యో! వీడు నన్ను చేపడితే మన్మధుని కూడా ధిక్కరించినట్లవుతుందే అని మనసులో అనుకుంటుండగా.

తన వర్గత్రయం చెప్పుకుని ఇక్కడ చిక్కడిపోయాను నాకు ఇంటికిపోయే మార్గం చెప్పవా అని అడిగాడు. అమ్మ! మా బలేగా పడ్డాడు బుట్టలో అనుకుంది వరూధిని, తను రూపానికి చిక్కుబడిపోయింది. ఏమంది

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర యే
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరింప లా
గింతయకాక నీవెఱుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ
కింత భ్యంబు లే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్.

ఇంతంత పెద్దకళ్ళున్నాయి, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలతో మాటాడాలనే కోరికతో, ఒక కారణం చూపించడం కోసం, దారడుగుతావా?వంక పెట్టుకుని ఆడవారితో మాటాడాలని కాకపోతే, నువ్వెలావచ్చేవో తెలీదా అని అడిగింది, కాదు ఎకసెక్కాలాడింది.ఆ తరవాత చాలా చర్చచేసి ప్రవరునిపై మోహంతో తమకం ఆపుకోలేక

ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై
యంచుల్‌ మోవఁగఁ గౌఁగిలించి యధరం బాసింప ‘హా! శ్రీహరీ’
యంచున్‌ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ తొలగన్ ద్రోచె గలంచునే సతుల మాయల్‌ ధీర చిత్తంబులన్‌?

పద్యం కదూ అర్ధం చెప్పలేదని కోపగించద్దు, చెప్పకూడదనుకున్నా, తప్పటం లేదు. టూకీగా అందమైన చేతులతో పాలిండ్లు పొంగేలా నడ్డివిరుచుకుని ప్రవరునికి పాలింటి మొనలు తగిలేలా కౌగలించి ముద్దు పెట్టబోతే హా శ్రీ హారి అని ప్రవరుడు మొహం పక్కకి తిప్పుకుని, అమ్మో మైలపడతాననుకున్నాడనుకుంటా సున్నితంగా భుజాలు పట్టుకుని తోసేసేడట, రూపానికి దాసోహమని తమకంలో పడిపోయింది. అప్పుడు వరూధిని

ఇంతలా ఏడ్చినా ఉపకారం లేకపోయింది ప్రవరుని గుణం ముందు తన అందం తేలిపోయిందని తెలుసుకుంది, వరూధిని ఇంకా చక్కటి నాటకం కూడా ఆడింది,

పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య
ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ, గలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్‌.

ఓయి దయలేనివాడా! అలా తోసేస్తే స్త్రీలు భరించగలరా? నువ్వు అలా మోటుగా తోసేస్తే నీ గోరు ఇక్కడ గుచ్చుకుపోయింది, నొప్పితో బాధగా ఉందని కలకూజిత స్వనంతో ఏడ్చిందట. అలా ఏడిస్తే వచ్చిన కన్నీళ్ళు చనుకట్టుపై పడ్డాయన్నారు పెద్దన గారు. ఆ తరవాత ప్రవరుడు అగ్ని దేవుని వేడుకుని తన స్వస్థలానికి చేరేడు.

అలా ప్రవరుడు వదిలేసిపోయిన తరవాత, అదే ప్రవరుని రూపంలో వచ్చిన గంధర్వుని చూసి నిజంగా ప్రవరుడే తనను చూసి మోహించి తిరిగి వచ్చాడని గంధర్వునికి లొంగిపోయింది. సంభోగ సమయంలో వరూధిని కళ్ళు మూసుకోవాలనీ షరతు పెట్టేడు, మాయా ప్రవరుడు, తమకంలో ఒప్పుకుంది,వరూధిని. మాయాప్రవరుడు తన వాంఛ తీర్చుకున్నాడు. వరూధిని తన వాంఛ తీర్చుకున్నాననుకుని మోసపోయింది, తెలుసుకోనూ లేకపోయింది.నేటికి వరూధినిలా కళ్ళు మూసుకుంటున్నవారే ఎక్కువ కనపడుతున్నారు, తమకంలో.

ఇలా రూపం తాత్కాలిక ప్రయోజనం కలిగిస్తుంది, కాని గుణం దీర్ఘకాల ప్రయోజనం సమకూరుస్తుంది.గుణాన్ని ప్రేమించాలి,రూపాన్ని కాదు. కాని వీరిద్దరిలోనూ ఉండే అవగుణం మాత్రం అహంకారం.ఒకరికి రూపముందనే అహంకారం, రెండవవారికి తెలివుందనే అహంకారం తప్పవు, అవే వీరి పతనానికి హేతువులు కూడా.సాధారణం గా అందం ఉన్న చోట గుణం ఉండదు అలాగే గుణం ఉన్న చోట అందమూ ఉండదు. వరూధినికి రూపమే ఉంది గుణం లేదు,ప్రవరునికి రూపమూ, గుణమూ ఉన్నాయి. పాపం! భగవంతుడు సొట్ట బుగ్గలబ్బాయికి తలలో ఖాళీ పెట్టేడు తప్పించి, లేకపోతేనా!! సునామీ కదూ!!!

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-(రూపం)అందం-గుణం

  • స్వరాజ్య లక్ష్మి గారు,
   నాలుగు రోజులు దానికేసి పోవద్దన్న ఇల్లాలి మాట విని నెట్ లోకి రాలేదండి,
   ధన్యవాదాలు.

 1. 1- పాపం! భగవంతుడు సొట్ట బుగ్గలబ్బాయికి తలలో ఖాళీ పెట్టేడు తప్పించి, లేకపోతేనా!! సునామీ కదూ!!!
  2-నేటికి వరూధినిలా కళ్ళు మూసుకుంటున్నవారే ఎక్కువ కనపడుతున్నారు, తమకంలో…
  3-ఇలా రూపం తాత్కాలిక ప్రయోజనం కలిగిస్తుంది, కాని గుణం దీర్ఘకాల ప్రయోజనం సమకూరుస్తుంది.గుణాన్ని ప్రేమించాలి,రూపాన్ని కాదు. కాని వీరిద్దరిలోనూ ఉండే అవగుణం మాత్రం అహంకారం.ఒకరికి రూపముందనే అహంకారం, రెండవవారికి తెలివుందనే అహంకారం తప్పవు, అవే వీరి పతనానికి హేతువులు కూడా.సాధారణం గా అందం ఉన్న చోట గుణం ఉండదు అలాగే గుణం ఉన్న చోట అందమూ ఉండదు..
  4-పాముకోడు డొక్కలాటి హీరో మొహం చూసి అసలు కాదని..
  5- అలాగే మరొకరు రాజకీయనాయకులు వీరు రూపానికంటే గుణం అదే వాక్చాతుర్యం ద్వారా జనాలని ఆకట్టుకుంటారు, వీరికి రూపం తోడయితే అది సునామీ…
  6-అందం వెంఠనే ఆకర్షిస్తుంది, గుణం నెమ్మదిమీద ఆకర్షిస్తుంది..

  టోపీలు దిన్చితిమి శర్మ గారు….

 2. ఫినిషింగ్ టచ్ అదిరింది!
  మళ్ళీ చక్కని ఫామ్‌లోకి వచ్చేసారు. ఈ మధ్య అద్భుతమైన టపాలు వ్రాస్తున్నారు. అభినందనలు. ఇవన్నీ తాతయ్యలు మనవలకి చెప్పే అనుభవాల సందేశాలు. నేటి యువత మీ టపాలు చదివితే ఎంతో నేర్చుకుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s