శర్మ కాలక్షేపంకబుర్లు-కొండనితవ్వి…..

కొండనితవ్వి…..

ఈ మధ్య బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడటం లేదు మరీ కూపస్థ మండూకంలా బతకడమెలా? ‘అబద్ధంవా సుబద్ధంవా కుంతీ పుత్రా వినాయకా’ అని, తెలిసో తెలియకో నాలుగు మాటలాడి ఒకళ్ళని తిట్టి మరొకళ్ళని భళా అని, నలుగురిలో పేరు సంపాదించాలి కదా! అందుకు పాతకాలం లోనే ‘పటం చిత్వా ఘటం భిత్వా….’ చొక్కా చింపుకునో నాలుగురోడ్ల కూడలిలో కుండ బద్దలు కొట్టో నలుగురు నోళ్ళలోనూ నానాలికదా, మనపేరని అనుకుని మా సత్తిబాబు దగ్గరకి వెళ్ళేను. మా సత్తిబాబూ సుబ్బరాజు కలిసి మాటాడుకుంటున్నారు. నేనెళ్ళేకా మా సుబ్బరాజు ’నల్లధనమంటే ఏంటీ?’ అని ఒక ప్రశ్న జనాంతికంగా వేశాడు…సాలోచనగా నా కేసి చూస్తూ……..’సత్తిబాబూ నువ్వు సుబ్బరాజు అనుమానం తీర్చవయ్యా!’ అని తప్పుకున్నా. మా సత్తిబాబిలా మొదలెట్టేడు.

నల్లధనం అంటే పన్నుకట్టని సొమ్మని అర్ధం. అదెలా పోగుపడుతుందంటే ప్రభుత్వం వలననే. నువ్వు పొలం అమ్మేవు ఎకరానికి పదిహేను లక్షలొచ్చింది, స్టాంపు డ్యూటీ ఎంత పెట్టేడు? కొన్నవాడు, మూడు లక్షలకి. నీకు మొత్తం సొమ్మిచ్చేడు. ప్రభుత్వానికి పన్ను కట్టవలసిన మిగిలిన పన్నెండు లక్షలూ, నీకు నల్లడబ్బే! కొనుక్కున్నవాడు పదిహేను లక్షలకి స్టాంపు పెట్టలేడు కారణం గూబ దిరిపోయేలా ఉంటుందా పన్ను రేటు, అందుకువాడు పెట్టడు. రేపు నువ్వు కొన్నా అంతే. పిచ్చివాడెవడేనా ఇలా మొత్తానికి స్టాంపు డ్యూటీ పెడతానన్నా సబ్ రిజిస్ట్రారు ఒప్పుకోడు. ’నువ్వొకడివి ఇలా పెడితే, అందరిచేత ఇలాగే పెట్టించమని ప్రభుత్వం నన్ను చంపుతుంది, ‘నలుగురితో నారాయణా కులంతో గోవిందా’ అనక ఇదెందుకొచ్చిన తిప్పలు, డబ్బు మిగుల్చుకోక, ఇది చెప్పినందుకు నాకు కమిషన్ ఇవ్వక’ అంటాడు. సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించిన మగాడు కనపడలేదు, ఈ రోజునాటికి. ఆఖరికి వీలునామా రిజిస్ట్రేషన్ కి కూడా డబ్బులివ్వక జరగదు, అదీ మన దేశం. ఇక దుకాణ దారు వసూలు చేసేపన్నులో అంతా ప్రభుత్వానికి చేరదు, అంటుంటే మా సుబ్బరాజు ’ఇదంతా తెలిసినదే కాని విదేశాల్లో నల్లడబ్బు గురించి చెప్పవయ్యా!’ అన్నాడు.

’అదా! కొంతమంది విదేశాల్లో వ్యాపారాలు చేసి సంపాదించినది, పన్ను ఎగవేసి అక్కడ దాచుకున్నది. ఇది నల్లడబ్బు…”
’మరయితే పెద్దపెద్దలు దాచుకున్నదో?’ అడిగాడు మా సుబ్బరాజు.
’అది దొంగడబ్బు,నిజంగానే! కమిషన్ల పేరిట సంపాదించినది. నల్లడబ్బు కాదు. అక్కడిబేంకులకి ఇది నల్లడబ్బు,దొంగడబ్బు అని తెలియదు. అది డబ్బు! చాలు వారికి జాగ్రత పెట్టడానికి, పన్నులేదు, వడ్డీ లేదు, ఎవరికి చెప్పరు.’
’ఈ మధ్య ఈ డబ్బేదో తెప్పించుతామంటున్నారు, నిన్న నాకెవరో చెప్పేరు వికి లీక్స్ ఒక లిస్ట్ ఇచ్చిందట, అందులో చాలాపెద్దలున్నారట’ ప్రశ్నించాడు మా సుబ్బరాజు.
’నువ్వేం కంగారు పడిపోకు, అదేం జరిగే పనేంకాదు.అది నల్ల డబ్బో,దొంగ డబ్బో తేలాలి కదా! దానికితోడు ఎన్ని పిల్ల సమేరీలు? దైపాక్షిక ఒప్పందాలు, ద్వైపాక్షిక పన్ను విధానం ఇవన్నీ తేలేటప్పటికి ఎంతకాలం పట్టేనో! మరో సంగతయ్యా! నక్షత్రాల దూరాన్ని కాంతి సంవత్సరాలలో చెబుతారు. అంటే కాంతి ఒక సెకన్ లో లక్ష డెభ్భయిరెండువేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. సంవత్సరంలో ఎంతదూరం ప్రయాణం చేస్తుంది? కోట్ల కిలో మీటర్ల దూరం, ఒక నక్షత్రం ఒక కాంతి సంవత్సర దూరంలో ఉందనుకుందాం! ఈ రోజు మనకి కనపడిందనుకుందాం. అంటే ఆ నక్షత్రం ఒక కాంతి సంవత్సరం కితం అలా ఉందనమాట, ఇప్పుడెలా ఉందో తెలియదు, తెలియాలంటే మరో కాంతి సంవత్సరకాలం పడుతుందిట. ఇప్పుడు మనకి తెలుస్తున్న విదేశీ బేంకుల ధనం లిస్ట్ కూడా అటువంటిదే! ఈ రోజుదికాదు. ఆ తరవాత ఆ డబ్బు ఎన్ని మార్పులు చెందిందో! ఇప్పుడక్కడ ఉందో లేదో! తెలియదు.’
’అదేంటి విదేశాలలో నల్లడబ్బు దేశానికి తెస్తామంటున్నారు కదా!నువ్వు కాదంటున్నావ’ని నిలదీశాడు మా సుబ్బరాజు.
’బలేవాడివే కాదని ఇప్పుడు మాత్రం అన్నానా? అసలక్కడ ఉన్నప్పుడు కదా తేవడానికి,దాన్ని ప్రభుత్వం నల్లడబ్బే అంటోది,దొంగడబ్బని మాత్రం అనటం లేదు..ఈ మాత్రమైనా ఎందుకు కదిలిందనుకున్నావ్! సుప్రీం కోర్టు మొట్టబట్టి, ఎవరి ప్రభుత్వం వచ్చినా అధికారం లోకి చేసేదింతే….’
’అంటే ఈ ప్రయత్నమంతా….కొండని తవ్వి ఎలకని పట్టినట్టేనా?’ అని నిరుగారిపోయాడు మా సుబ్బరాజు.
’అదీ తప్పే అది కొండని తవ్వడమే…ఎలకెప్పుడో పారిపోయింది 🙂 అని ముక్తాయించాడు, మా సత్తిబాబు…నిజమంటారా?

(చాలా కాలంగా చిత్తులో ఉన్న టపా.)

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కొండనితవ్వి…..

 1. ’అదీ తప్పే అది కొండని తవ్వడమే…ఎలకెప్పుడో పారిపోయింది
  —————-
  ఎన్ని సంవత్సరాల నుండో అదేదో తీసుకు వస్తా మంటున్నారు. దానికి మీరన్నట్లు ఆ డబ్బుకి “దొంగడబ్బు” అనే రూపం ఏమీ లేదు. అది నిజంగా దొంగ డబ్బే అయితే బయట పెడతాము అన్నతర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు అక్కడ కూర్చుని ఉంటుందా ?

  • Rao Lakkaraju గారు,
   ఎలకని పట్టుకుంటామని కొండని తవ్వడానికి ఆర్భాటంగా బయలుదేరితే ఎలక ‘నన్ను పట్టుకో’ అని అక్కడ కూచుంటుందా? అమాయకులేనండి ప్రజలు..
   ధన్యవాదాలు.

 2. ఆ నల్ల డబ్బో, దొంగడబ్బో అది మనదేశానికి వెనక్కి వచ్చి మన అభివృద్ధికి తోడ్పడుతుందని ఇంకా అనుకొంటూ ఉన్నవాళ్ళు అమాయకులైనా అవాలి,లేక అజ్ఞానులైనా అవాలి.

  • రమణా రావుగారు,
   దేశానికి ఉపయోగపడిపోతుందని నమ్ముతున్న అమాయకులు చాలా మంది ఉన్నారండి. చిత్రంగా అన్ని పార్టీలు ఈ విషయంలో ఒకే బాటలోనే ఉన్నాయండి. ఎంత ముందు చూపుతో చేసుకున్న ద్విపాక్షిక అంతర్జాతీయ ఒప్పందాలు చెప్పండి, వాటిని తప్పగలమా? తప్పితే దేశం పరువో …అది తెలియక పాపం అమాయకులు….
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s