శర్మ కాలక్షేపంకబుర్లు-గోటితో పోయేదానికి………

గోటితో పోయేదానికి………

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదంటారు. ఈ గోరేంటీ గొడ్డలేంటీ? విషయం, సమస్య చిన్నదిగా ఉన్నపుడే పరిష్కారం, సాధనా మార్గం వెతుక్కుంటే సమస్య పెరిగి పెద్దదయి మనల్ని వేధించదని చెప్పడమే.వీటిని విరివిగా వాడేస్తాం కాని ఆలోచించం.

ఇలాగే నిత్యం మనం అనేక సమస్యలు చూస్తుంటాం, కాని పట్టించుకోం. ఒక చిన్న ఉదాహరణ స్నానం చేసేటపుడు వీపు పూర్తిగా తోముకోగలుగుతున్నామా? చేతులు వెనక్కి అందుతున్నాయా? కుడిచేయి పైకి ఎడమచేయి కిందకి వెనక్కి వీపుపై చేర్చితే రెండు చేతులూ అందుతున్నాయా? అందచ్చు, కొంతమందికే, అలాగే ఎడమచేయి పైకి కుడి చేయి కిందకి వెనక్కిపెడితే నూటికి నూరుమందికీ చేతులు అందవు. ప్రయత్నం చెయ్యద్దు, గుండెలలో నెప్పి పుట్టచ్చు 🙂 ఒక కన్ను మూయక రెండు కళ్ళతో ముక్కు కొన చూడగలుగుతున్నారా? అలాగే రెండు కళ్ళతో భ్రూ మధ్యం(కనుబొమల) మధ్య చూడగలుగుతున్నారా? నాలికతో ముక్కు కొన అందుతుందా?ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించారా? చిన్నప్పటినుంచి శరీరానికి తగిన వ్యాయామం లేక. వయసు మళ్ళినవారు ప్రయత్నించకండి 🙂 వయసువారు కొద్దికాలం ప్రయత్నం చేస్తే సాధ్యపడచ్చు, అప్పుడు వీపూ తోముకోవచ్చు:) మనకు మనమే.   కింద కూచుని కాళ్ళు దగ్గరగా చాపుకుని రెండు కాళ్ళ బొటనవేళ్ళూ రెండు చేతులతో అందుకోగలరా? మోకాళ్ళు ముడవకండి మరి, ఆ మోకాళ్ళు ముడవకుండా అలాగే వంగుని మోకాళ్ళు ముద్దు పెట్టుకోగలరా? వద్దు వద్దు ప్రయత్నమే చెయ్యకండేం,నడుం పట్టెయ్యగలదు. 🙂 ఇది ఆరోగ్యానికి సూచిక.

చిన్న చిన్న విషయాలలో ఆశ్రద్ద చేస్తాం అది పెద్దదయితేగాని పట్టించుకోo. చిన్న రావి మొక్క గోడ పగులులో మొలిచింది, చిన్నదిగా ఉన్నపుడు గోటితో పీకేస్తే సరిపోయేది. అశ్రద్ద జరిగింది,పెద్దదయిపోయి గోడ పడగొట్టేలా ఐతే దానికోసం గోడ కొంత తవ్వి వేళ్ళదాకా పూర్తిగా తీసేసి మళ్ళీ గోడ కట్టాల్సివచ్చి, ఇది గుర్తొచ్చింది. వానాకాలం వస్తోంది, టైర్లు,బ్రేకులు చూపించాలనుకుంటూ కాల గడిపేస్తుండగా మొన్న బండి జారింది,కింద పడటమూ జరిగింది, ప్రమాదమూ తప్పింది అదృష్టం కొద్దీ, మరి ప్రతిసారి అదృష్టం కలిసిరాదు కదా!చిన్న విషయాలే అని ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తే అది మానైపోతుంది, మరి ‘మొక్కై వంగనిది మాని వంగుతుందా’ అని సామెత కదా! సమస్య చిన్నదిగా ఉన్నపుడే దాని గురించి ఆలోచించండి, పట్టించుకోండి,పెద్దది కానివ్వకండి. అప్పుడు ఆ పెరిగిన వృక్షాన్ని ఛేదించాలంటే గొడ్డలే కావాలి కదా!

ఒక చిన్న కథ చిన్నపుడు చదువుకున్నది. For want of a nail the war is lost.యుద్ధం జరుగుతోంది. గుఱ్ఱాలకి నాడాలు కొట్టేవాడు, నాడాల సంచి, మేకుల సంచి తెస్తుండగా కొన్ని మేకులు జారిపోయాయి. వాడు అలాగే సంచులు తెచ్చేసి గుఱ్ఱాలకి నాడాలు కొట్టడం ప్రారంభించాడు. ఒక్కో గుఱ్ఱానికి నాలుగు కాళ్ళకి నాడాలు కొట్టుకుంటూ వస్తున్నాడు. నాడాలు కొట్టిన ప్రతి గుఱ్ఱాన్ని రౌతు ఎక్కి వెళిపోతున్నాడు, యుద్ధంలోకి. చివరికి ఒక గుఱ్ఱం వచ్చింది, చివరి నాడాకి ఒక మేకు తక్కువొచ్చింది. ఒక్కోనాడాకి నాలుగు మేకులు పడతాయి. వాడిదగ్గర మూడె వున్నాయి,చివరినాడా కొట్టేసరికి. , మిగిలినమూడు మేకులు నాడాకి కొట్టేసి గుఱ్ఱాన్ని పంపేసేడు యుద్ధం లోకి. రౌతు గుఱ్ఱం మీద వెళిపోయాడు. ఒకటే నాడా తక్కువ కదా గుఱ్ఱం పరుగెడుతుంది భయం లేదని అశ్రద్ధ చేశాడు. యుద్ధం జరుగుతుండగా నాడా ఒకటి తక్కువైన గుఱ్ఱం కుంటింది, ఒక మేకు తక్కువైన నాడా వదులైపోయి కాలికి అడ్డం పడింది.,  మేకు తక్కువ కావడంతో నాడా వదులైపోయింది, గుఱ్ఱం కుంటడంతో గుఱ్ఱం పడిపోయింది. గుఱ్ఱం పడిపోవడం, గుఱ్ఱం లేకపోవడం తో శత్రువు రౌతును సంహరించాడు. ఈ రౌతు కీలక స్థానం లో ఉన్నాడు. ఇతను పడిపోవడం తోనే శత్రువు ముందుకు చొచ్చుకుపోయాడు. అలా చొచ్చుకుపోయిన శత్రువులు కోటని పట్టుకున్నారు. సైనికుడు లేకపోవడం తో కోటపోయింది, కోటపోవడంతో యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. ఇంతకి కారణం ఒక నాడా మేకు లేకపోవదం కదా!. అంటే సమస్య చిన్నగా ఉన్నపుడే శ్రద్ధ తీసుకుని ఉంటే, యుద్ధంలో పరాజయం కలిగేది కాదు.

For want of a worrier the fort is lost.

For want of a fort the war is lost.

For want of a horse the worrier is lost.

For want of a shoe the horse is lost.

For want of a nail the shoe is lost.

For want of a nail the war is lost.

(చాలా కాలంగా చిత్తులో ఉన్న టపా.)

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గోటితో పోయేదానికి………

  1. గురువు గారికి ఈసారి సామెతను కేవలం ఆరోగ్యానికి మాత్రమే అన్వయించారు. అసలీ సామెతను లోతుగా తీసికుంటే అన్నిరకాలలుగా కూడా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనివుంటుందికదా అనిపించింది.ఉదాహరణకి నిత్యజీవితంలో కుటుంబసబ్యులలోగానీ,మనకు తారసపడే మనుషులతో వ్యవహరించేటపుడు కూడా ఎవరివలననైనా మనకు అనారోగ్యకర పరిస్థితులువాటిల్లవచ్చు అనుకున్నపుడు ఆదిలోనే సర్దుకోవాలని.తీరా వారివలన సమస్యలుత్పన్నమైనపుడు లబ లబ మనుకున్నా ప్రయోజనం శూన్యం.మానసిక ఆరోగ్యం చెడుతుంది. అపుడు గొడ్డలి తీసికున్నా పని జరగదు.అవునంటారా?

    • స్వరాజ్య లక్ష్మిగారు,
      మానవ సంబంధాలగురించి, అందునా భార్యాభర్తల గురించి చాలా సార్లు చెప్పేసేనండి. ప్రతి విషయమూ ఈయన దానికే ముడేస్తాడంటారేమోనని మానేశనండి.
      ధన్యవాదాలు.

  2. నిర్లక్ష్యం ఎక్కడా పనికిరాదు. అదో అలవాటుగా మారితే అన్నింటా ప్రమాదమే. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అడ్డంగా వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం – ఓట్లకోసం రైతులకు చైతన్యం నేర్పని ఏమీ అనని ప్రభుత్వాల నిర్లక్ష్యం – సీటు బెల్టు పెట్టుకోని జానకీ రాం నిర్లక్ష్యం అతని ప్రాణాలు తీసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s