శర్మ కాలక్షేపంకబుర్లు-మూడు రకాల మనుషులు.

మూడు రకాల మనుషులు.

అజ్ఞ స్సుఖ తరమారా
ధ్యస్సుఖతర మారాధ్యతే విశేషజ్ఞః
జ్ఞానలవ దుర్విదగ్ధం
బ్రహ్మాపి నరం న రంజయతి.

కం. తెలియని మనుజుని సుఖముగ
దెలుపందగు సుఖతరముగ దెలుపగవచ్చుం
దెలిసినవానిం దెలిసియు
దెలియని నరుదెల్ప బ్రహ్మ దేవుని వశమే?

తెలియనివానికి సుఖంగా తెలియచేయచ్చు, తెలిసినవానికి తెలియచేయడం తేలికే, తెలిసితెలియనివానికి తెలియచేయడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు.

మూడు రకాల మనుషులున్నారన్నారు కవి. తెలియనివారు,తెలిసినవారు,తెలిసి తెలియనివారు,వీరేంటో చూదాం.

తెలియనివారు,నిజానికి వీరు చిన్నపిల్లలలాటి, కుమ్మరి చేతిలోని మట్టిముద్దలా, రాయని తెల్లకాగితంలాటివారు. వీరికి ఏ విషయమైనా చెప్పినా వినగలరు, అర్ధమూ చేసుకోగలరు. ఈ చెప్పడమూ తేలికే, పని పద్దతి  గురించి తెలియనివారికి తేలికగా నేర్పచ్చు,వివరంగా చెప్పడం ద్వారా. ఐతే సరియైన గురువు దొరకాలి అది మరో విషయమనుకోండి.

ఇక తెలిసినవారు, వీరికి విషయం ఇతిశ్రీగా తెలిసి ఉంటుంది, తెలిసిన విషయం గురించి వివరించనూ గలరు, లేదూ మనం ఆ విషయం గురించి చెప్పినపుడు అందులో తప్పొప్పులూ చెప్పగలరు లేదా మనం ఏదైనా కొత్త ప్రతిపాదన చేసినా దాని గురించీ మాటాడగలరు. ముంబై డబ్బావాలాలు ఏం చదువుకున్నారు? అవసరాన్ని మధించారు,తపించారు, నిజానికి అది ఒక తపస్సు. ముక్కు మూసుకు కూచోడమే తపస్సు కాదు. దానిని ఆచరణలోకి తెచ్చుకున్నారు, ఒక్క పొరపాటు కూడా లేక అలవైకుంఠపురంబులో, నగరిలో, ఆమూల సౌధంలో ఉన్న బాబుకు ఒక పల్లెనుంచి ఇల్లాలు కట్టిచ్చిన మధ్యాహ్న భోజనం సమయం లో, అతి భద్రంగా అందచేస్తున్నారు, మళ్ళీ ఆ డబ్బాని ఇంటికీ చేరుస్తున్నారు,భద్రంగా,ఇవేమైనా ఒకటీ రెండూనా? వేలనుకుంటా. దీని గురించి మాటాడేందుకు ఎవరికి అర్హత ఉంటుంది? వారికి తప్ప. ఈ పనిలో మార్పు చేర్పు చేయాలంటే చేయగలవారు, సూచనైనా ఇవ్వగలవారు ఎవరు? వారే. వీరికి ఆ విషయం గురించి ఏమి చెప్పినా సులువుగా నేర్చుకోగలరు, దాని గురించి వివరమూ చెప్పగలరు, అది వారి అధికారం.

ఇక మూడవవారు, తెలిసి తెలియనివారన్నారు కవి. నిజానికి కవిగారు వీరిని తృతీయ ప్రకృతి వారనుకున్నారేమో! వీరికి ఏమి తెలుసో తెలియదు, ఏమి తెలియదో కూడా తెలియదు. ఎంత తెలుసో తెలియదు..అంతా గందరగోళమే.. కాని వీరు అంతా తమకే తెలుసనుకుంటారు, అదీ చిత్రం. తెలిసినవారెవరేని వీరికి చెప్పబోతే, మాకు తెలుసండీ అని విర్రవీగుతారు. తెలియదనీ తెలియదు. మరో సంగతి వీరు సర్వమూ తెలుసనుకుని వాదిస్తారు,అదీ మరీ చిత్రం. ఇక వీరికి చెప్పబోయి భంగ పడటం తప్పించి ఫలితం ఉండదు. పాపం కవిగారే ఇటువంటి వారికి చెప్పడం నా వల్ల కాదని చేతులెత్తేసి, అటువంటివారికి చెప్పడం వాళ్ళని పుట్టించిన బ్రహ్మ కి కూడా సాధ్యం కాదన్నారు…..

ఐతే ఇటువంటి వారితో ఎలాగా? మరో శ్లోకమూ చెప్పేరు, వివరించాలంటే మరో టపా తప్పదు.మరో మూడు రకాల మనుషులున్నారన్నారు, వీరిగురించి మరోసారి.

(అమ్మయ్య చిత్తులో ఉన్న పాత టపాలన్నీ అయిపోయాయండి.)

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మూడు రకాల మనుషులు.

  • సుధాకర్జీ,
   బహుకాల దర్శనం, కుశలమేనా?
   చిత్తులో ఉండిపోయిన టపా అంటే చెత్త టపా కాదన్నారు 🙂 . ఒక్కొకప్పుడు వచ్చిన ఆలోచన బట్టి గబగబా టపా రాసేస్తాను. ఎందుకో పబ్లిష్ చెయ్యడానికి నచ్చదు, దాన్ని చిత్తులో వదిలేస్తా. ఒక్కొకప్పుడు వాటినుంచి తీసి మెరుగుపెట్టి టపా వేయడం జరుగుతూ ఉంటూ ఉంది. ఈ మధ్య టపా రాయాలనే ఉత్సాహమూ, ఓపికా చచ్చిపోయాయి. చిత్తులో వదిలేసినవాటిని కూడా యధాతథంగానే ప్రచురించేశా, అదీ సంగతి. టపాలు నచ్చినందుకు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s