శర్మ కాలక్షేపంకబుర్లు-శతంజీవ శరదో…….

శతంజీవ శరదో…….

శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి…..ఇది వేదాశీర్వచనం. నమస్కారం చేసినవారికి ఆశీర్వచనమివ్వడం మన సంప్రదాయం. ఈ నమస్కారంలో భక్తి, ప్రేమ కలిస్తే; ఆ ఆశీర్వచనానికి శ్రేయం, అభిమానం తోడయితే, ఆ సందర్భమే ఆనంద రసప్లావితమై, మాటలు మూగబోతాయి, కరువవుతాయి, మనసులే మాటాడుకుంటాయి, కళ్ళే మనుషుల్ని, మనసుల్ని ఆనంద పారవశ్యంలో ముంచుతాయి…చెమరుస్తాయి, అసంకల్పితంగా….”నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా?’ అన్నారో సినీకవి…..రససిద్ధి కలిగించి, మనసులు ఆనంద డోలికలలో ఊగించిన ఒక సంఘటన జరిగింది…

మా ఇంటికి ఎవరెవరో ఒంటరిగానూ, జంటగానూ రావడం, చేతిలో పళ్ళు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది, అప్పుడపుడు. నేనీ ఊరు రిటయిరయి వచ్చిన కొత్తలో, అలా వచ్చిన ఒక జంట నా చేతిలో పళ్ళు పెట్టేసి నమస్కారం చేసి కూచుని ’అమ్మాయి పెళ్ళికి ముహుర్తం పెట్టా’లన్నారు. నాకైతే మతిపోయింది,ఏమిటో అర్ధం కాక, అప్పుడు నా ఇల్లాలు కలగచేసుకుని ’ముహూర్తమైతే ఈ శర్మగారు కాదండి, ముందు మరో ఇల్లుంది, వారిపేరూ భాస్కర శర్మ, వారు జాతకాలు చూస్తారు, ముహూర్తాలూ పెడతారు, మీరు పొరబడ్డా’రని చెబితే చేతిలో పెట్టిన పళ్ళు తిరిగి ఇవ్వబోతే తీసుకోక మరలా పళ్ళు తెచ్చుకుని ముహుర్తం పెట్టించుకోడానికి వెళ్ళేరు. ఇదెందుకంటే మావీధిలో నాతోకలిపి ముగ్గురు ’శర్మ’లున్నాం. మరొకరు వేంకటరామ శర్మ, వీరు ఆడిటర్, ఇంకొకరు ఉదయ భాస్కర శర్మ, వీరు జాతకాలు చెబుతారు,ముహుర్తాలు పెడతారు. ఎక్కడెక్కడినుంచో వస్తుంటారు, ఆ వచ్చినవారు మా ఇంటికొస్తుంటారు పొరపాటున,వారిల్లు తెలియకా, మా ఇల్లు వీధికి మొదటిలో ఉండడం మూలంగానూ. అటువంటి వారెవరో అనే అనుకున్నా..మొన్న గురువారం వచ్చినవారిని కూడా…అదెలా జరిగిందంటే…

మొన్న గురువారం,పద్దెనిమిది తారీకు,రోజూ లాగే ఉదయమే నాలుగుకే లేచి, ఉదయ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, టిఫిన్ చేసి కంప్యూటర్ దగ్గర కూచున్నా, అంతకితం రోజే ’పల్లెప్రపంచం’ కిచ్చిన ఇంటర్వూ చూస్తూ…. http://praja.palleprapancham.in/2015/04/blog-post_87.htmlనేనూ చాలా ఇంటర్వూలిచ్చేస్తూ పెద్దవాణ్ణయిపోతున్నట్టుంది 🙂 ) ’మావయ్యగారు, మీకోసమెవరో వచ్చారు’, అంటూ వచ్చింది, చిన్నకోడలు. ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ’లోపలికిరమ్మనమ్మా’ అంటూ లేచా కంప్యూటర్ దగ్గరనుంచి…..ఒకరెవరో ముఫై, ముఫై ఐదు వయసు మధ్యవారు, చేతిలో సంచి పుచ్చుకుని బయట నిలబడి ఉన్నారు, మామిడి చెట్టునీడలో. ’రండి రండి’ అంటే లోపలికి వచ్చారు. వస్తూనే సంచి పక్కనబెట్టి, ’నేను మీ అభిమానిని, మీ బ్లాగ్ చదువుతాను’ అంటూ వంగి పాదాభివందనం చేశారు. అదిగో ఆ సమయంలో నా మనసులో మెదిలిన భావమే పైది, ఆశీర్వదిస్తూ.

వారిని సోఫాలో కూచోబెడుతూ ’అమ్మాయ్! మంచినీళ్ళమ్మా’ అంటుండగానే పట్టుకొచ్చేసింది. మంచి తీర్థం తీసుకున్న తరవాత, అతనిపై ప్రశ్నలు వర్షం కురిపించా, ఎవరు? ఎక్కడనుంచి వచ్చారు, పేరు వగైరాలడుగుతూ. వారు నా ప్రశ్నల జడికి తట్టుకుని చెప్పారు, తమ ఊరు పేరు చెప్పి, వృత్తి వ్యాపారమనీ, బ్లాగులు చదవడం ప్రవృత్తి అనీ, అలవాటనీ, మిమ్మల్ని చూడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా కుదరలేదనీ, ఈ రోజు వ్యాపార పని మీద కాకినాడ నుంచి వస్తూ ఇక్కడ దిగేననీ’ చెప్పేరు. ఈ లోగా ఇల్లాలు టిఫిన్ పంపించింది, వెనక తనూ వచ్చి పలకరించింది. టిఫిన్ చేస్తుండగానే, ఇల్లెలా కనుక్కునారంటే, మీరు రాసిన టపాలో వివేకానంద విగ్రహం గురించి రాశారు కదా! అక్కడకొచ్చి వెతికితే దొరకదా! అనుకుని బయలుదేరేనన్నారు. ఏదో ఏదో చెప్పేను, వారూ ఎమో ఏమో మాటాడేరు,సంచిలోంచి పళ్ళ పేకట్, జీడి పప్పు పేకట్ తీసి చేతిలోపెడుతూ మరలా నమస్కారం, నాకేదో ఎబ్బెట్టుగానూ ఉంది, ఇబ్బందిగానూ ఉంది, అయినా వారి ఆనందం కోసం తప్పదు. అక్కడే ఉన్న శ్రీపాద వారి అనుభవాలూ-జ్ఞాపకాలున్నూ చూసి అందులో కొంత సొమ్ముంచి మీరు ఈ టపాలని పుస్తకంగా వేయించండంటూ ముగించారు. నాకైతే ఏంజరుగుతున్నదీ కాసేపు అర్ధం కాలేదు, తేరుకుని ఆ సొమ్ము తీసి మరలా వారి జేబులో పెడుతూ పుస్తకం వేయించాలని ఉంది కాని దాని ఖర్చు భరించడం కష్టమని ఊరుకున్నానన్నా. మీకిచ్చిన సొమ్ము పుస్తకం వేయించడానికే అన్నారు, ఎంతవుతుందని వాకబూ చేశారు. పుస్తకం వేయించే ప్రయత్నం చేస్తాననీ, అప్పుడు వారి దగ్గర డబ్బులు తప్పక తీసుకుంటాననీ వాగ్దానమైతే చేసేశాను. ఈ లోగా డయరీ తీసి దానిలో ఏదయినా రాయమన్నారు, ఏదో రాశాను, అదే మహాభాగ్యమన్నట్టు చదువుకుని లోపల భద్రంగా పెట్టుకుని తన అడ్రస్, ఫోన్ నంబర్లిచ్చి, నావితీసుకున్నారు, ఈలోగా రెండు సార్లు వారికి ఫోన్ రావడం, వచ్చేస్తున్నానని చెప్పడం జరిగిపోయింది. వారికీ సమయం తెలియలేదు, నాకూ తెలియలేదు,ఏదో మాటాడుతుంటే, చివరికి వదలలేక వదలలేక బయలుదేరారు, నా పరిస్థితీ అందుకు భిన్నంగానూ లేదు.

సాధారణంగా ఒక బ్లాగర్ మరొక సమభావాలు కలిగిన మరొక బ్లాగర్ ని కలవాలనీ కొంత సేపు వారితో గడపాలనీ, ముచ్చటించాలనీ అనుకోవడం సహజం. కాని ఈ వచ్చినవారు, బ్లాగర్ కాదు, ఒక అభిమాని మాత్రమే, ఎప్పుడూ కామెంట్ కూడా పెట్టలేదనీ చెప్పేరు. ఆయన తెనుగు బ్లాగులన్నీ చదువుతారు. మాటలలో ఫణిబాబుగారి పేరొస్తే వారిని గుర్తించారు, అలాగే చాలా మంది బ్లాగుల గురించీ మాటాడేరు. నా మనసు ఆనంద డోలికలో ఊగిందంటే అతిశయోక్తి కాదు. మరో మాట కూడా చెప్పేరు, మొన్న జరిగిన ఇబ్బందిలో రాయడం మానేస్తానన్నారు, ఆ ఆలోచన రానివ్వకండనీ చెప్పేరు. వారి మాటలలో నాకొకటి స్ఫురించింది, ’బ్లాగు రాస్తున్నా, నాకోసమే రాసుకుంటున్నా’నన్న మాట పొరబాటనీ, చాలామంది పల్లెల నుంచి కూడా మనల్ని చూస్తున్నారనీ, మన మాటలువింటున్నారనీ, చదువుతున్నారనీ, గమనిస్తున్నారనీ, మన పై బాధ్యత మరికొంత పెరిగిందనీ అనిపించింది. మరోసంగతి వారొచ్చినది ఒక పల్లెనుంచి, నూరు కిలో మీటర్ల పైదూరం, మరో జిల్లా
నుంచి ప్రయాణం చేసి రావడం, ఇది మరీ కొత్త అనుభవమే, వారి పేరు వివరాలు చెప్పాలనే ఉంది కాని వారి అనుమతి తీసుకోలేదు, అందుకు……… నేనొక సామాన్యుడిని, చదువుకోనూ లేదు, పెద్దవిషయాలూ తెలియవు, ఇదేంటో నిజంగానే నా అదృష్టం గా భావిస్తాను, ఏమోగాని, మనసు రసప్లావితమే అయిపోయింది….ఏమయిందీ నోరు చెప్పలేకపోతోంది…ఆ అనుభూతిని….ఈ చిరంజీవికి నాపై ఎందుకింత అవ్యాజమైన ప్రేమ ఏర్పడింది? ఇది నా పూర్వ జన్మ సుకృతమే అనుకుంటా, లేదా అతని ఔదార్యం. ఇంత ప్రేమ కురిపించిన చిరంజీవికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను శతంజీవ ’శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి………’, అని ఆశీర్వదించడం తప్ప ఏమీ చేయలేని, చేతకాని ఆశక్తుడిని.

ఇంకా పల్లెలలో ఉన్నవారిదగ్గర మన సంప్రదాయాలు మిగిలున్నాయనిపించింది. ఎందుకంటే దేవుని దర్శనానికి, తల్లి తండ్రులు, గురువు, రాజు వద్దకు, స్నేహితులవద్దకు, గర్భిణీ స్త్రీని, చిన్నపిల్లలను చూడాడానికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళ కూడదనీ, ఏదయినా ఫలం, అదీ తీయనిది పట్టుకువెళ్ళాలనీ పెద్దలు చెబుతారు. అదేగాక ఫలితం కోసం వెళ్ళేటప్పుడు కూడా ఫలం తీసుకువెళ్ళాళంటారు. ఆ( ఇదంతా ఛాదస్తం అంటారా? మన్నించి మరచిపొండి….

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శతంజీవ శరదో…….

 1. మాస్టారూ,
  విపులాచ పృధ్వీ అన్నట్టు ఆత్మీయతలు ఇప్పటికీ వున్నాయండి!

  సీ || నిన్నటి కాల మనాగరికము కాదు,
  నేటి కాలము నవీనమ్ము కాదు,

  రేపటి దూహించ రానిదియున్ గాదు,
  అంతయు నిటులనే యుండు నండి!

  ఆశలు, మోహముల్, బాంధవ్యములు గల
  మనబోటి సామాన్య మానవుల్, మ

  రి ధనాశాపరులు, ధూర్తులు, పదవీ లాల
  సులు, గోముక వ్యాఘ్రములు మరింక

  తే || చెప్పనేల – అందరు సహచరులుగా బ
  తక వలసినదే కాలమేదైన గాని!
  మంచి చెడులు కాలాల యందు లేవు,
  మనము బతికేటి పధ్ధతే మనకు రక్ష!
  ———–హరికాలం(14/07/1993)
  మీలాంటివారు మాలాంటివారికి యెన్నో నేర్పాలి!

  • హరిగారు,
   ’ఎంత పుచ్చిపోయిన మిరియాలైనా జొన్నలపాటి చేయవా?’ అని సామెత. భారత సంస్కృతిలో ఆత్మీయతలొక భాగం. సంస్కృతిని ఎంత చిందరవందర చేసినా మూలాలు పోలేదండి.
   ’సీసం కవికి కంచరికి తేలికే’ అన్నారు. బాగుంది మీ సీసం.
   వినేవారుంటే కొన్నయినా చెప్పచ్చనుకుంటానండీ, అంత ఖాళీ ఇప్పటివారికి ఉందా అనే అనుమానం.
   ధన్యవాదాలు.

 2. మీగురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు ,నేను చెప్పాలను కున్నవి అందరు చెప్పేసారు ,
  నాకెందుకో పుష్పక విమానం గుర్తు వస్తోంది ,ఆ మాదిరి మీరు ఎన్ని పోస్ట్ లు పెట్టినా ఇంకా
  ఒకటి మా కోసం మిగిలే వుండాలని కోరు కుంటున్నాను . ప్రణామాలు ….

  • అంజలి తనూజ గారు,
   మనసులో భావం చెప్పడానికి పెద్ద చిన్న భేదం లేదండి.
   మరీ పుష్పక విమానం తో పోల్చేశారే! అంతా అమ్మ దయ, మీ అభిమానం.
   ధన్యవాదాలు.

 3. చాలా సంతోషం.
  ఇది ఒక రకమైన కొత్త బంధం. మీరు సరదాగా వ్రాయడం మొదలు పెట్టినా, ఇప్పుడు పాఠకుల కోసమేనా వ్రాయాలి. మీ బంధు వర్గం చాలా చాలా పెరిగింది. వ్రాయాల్సిన బాధ్యత కూడా పెరిగింది.
  మీ టపాలు మరింత ప్రజాదరణ పొందాలని ఆశిస్తున్నాను.

  • మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   సరదాగానే మొదలు పెట్టినది. బంధాలూ పెరిగాయి, బంధుఇవులూ పెరిగారు.ఓపిక తగ్గుతోంది కదండీ, అదీ సంగతి
   ధన్యవాదాలు.

 4. చాలా బాగుంది శర్మగారు. మంచి మాటలే మీకింతటి అభిమానులని సంపాదించిపెట్టింది. మొన్నటివరకూ నేనుకూడా వారిలాటి అఙాతాభిమానిగా మీ టపాలన్నీ చూస్తూ వచ్చా. ఆ టపాలలోనె వనజాగారు మీ ఇంటికివచ్చినట్లు తెలిసికున్నా.పెద్దదిక్కు లేని కొన్ని కుటుంబాలకు మీలాటి పెద్దవారి మాటలు వారి వారి జీవితాలకు మార్గదర్శకాలు కాగలవు.”పెద్దవారి మాటలెపుడూ చద్దెన్నం మూటలని” మీ టపాలద్వారా నేను అనుభవిస్తున్నాను.ధన్యవాదాలు.

  • స్వరాజ్య లక్ష్మి గారు,
   మంచి మాట అన్నది తరుగులేని ధనం కదండీ, ఖర్చు పెట్టినకొద్దీ నిలవ పెరుగుతూ ఉంటుంది….ఇంతమంది అభిమానులు 74 దేశాలలో ఉన్నారంటే అదృష్టం కదండీ…
   ధన్యవాదాలు.

 5. ” మనసు రసప్లావితమే అయిపోయింది….ఏమయిందీ నోరు చెప్పలేకపోతోంది…ఆ అనుభూతిని…” మీ పోస్ట్ చదివాక నా పరిస్థితీ ఇంచుమించు అంతే…మీరు ధన్యులు.

  • శ్రీదేవిగారు,
   మనసు మాటాడేటపుడు మాట మూగపోతుంది, ఆ అనుభవం నోరు చెప్పలేదు, ఆ రసానుభవం అనుభవించాల్సిందే…….మాటతో చెప్పలేం…
   ధన్యవాదాలు.

 6. బాబాయ్ గారూ ! మీ ఊళ్ళో మాకు చుట్టాలున్నారు, వారి వంకతో మిమ్మల్ని చూడాలని ఆశ .ఎప్పటికి కుదరుతుందో మరి?

  • అమ్మాయ్ నాగరాణీ,
   అలాగా! మంచిదే, మరెందుకమ్మా ఆలస్యం, వచ్చెయ్యి తల్లీ! నీకిదే మా కుటుంబ ఆహ్వానం…
   ధన్యవాదాలు.

 7. ఆ పల్లె ప్రపంచం ఇంటర్వ్యూ లింకు పెట్ట వలె ! అప్పుడే ధర్మ మగును !!

  మంచి మనసు కలిగిన వారు మీరు ! మీ మంచి మనసుకి వసుధే ఇవ కుటుంబకం !!

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   తాళమూ వేసితిని, గొళ్ళెము మరచితిని. లింకు కలిపితిని, మన్నించవలె.

   వసుధైక కుటుంబకమ్ అన్నారు, తమ దర్శనమే లేదు.. ఆ భాగ్యమెప్పుడో…
   ధన్యవాదాలు.

 8. పల్లెల్లో మన సంప్రదాయాలు ఇంకా మిగిలున్నాయి నిజమే సార్.ఆ సంప్రదాయాలు తెలియని వారు మీ లాంటి పెద్దలు చెప్పే విషయాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది సార్.

  • అమ్మాయ్ చిత్ర,
   జ్ఞాపకం ఉన్నవరకు చెబుతూనే ఉన్నానమ్మా! అన్నీ గుర్తుకు రావుగా, మాట అంటే దాని మీద ఒక సంగతి గుర్తొస్తుంది అంతే! కాకపోయినా కంప్యూటర్ కి వయసయిపోయిందమ్మా, మూడు పాతికలు పని చేసింది కదా! అక్కరలేనిది కావలసినది కావలసిన దానికన్నా ఎక్కువ డాటా ఉండిపోయింది. అదీ సంగతి 🙂
   ధన్యవాదాలు.

 9. మీరు ఇప్పుడు మాట తప్పాల్సిందే 🙂 మరిన్ని మంచి పోస్టులు వ్రాయడానికి. ఈ అనుభవాన్ని, మీ ఆనందాన్ని మా అందరితో పంచుకుని తెలుగు బ్లాగర్లకు కొత్త ఉత్సాహాన్నిచారు. ఇదెట్టిపరిస్తితిలోనూ చాదస్తం కాదు. ఇక మీరలా అనకూడదు. పల్లెల్లో బ్లాగులు చదువుతున్నవారు, పల్లెలల నుండి బ్లాగులు వ్రాస్తున్నవారూ, పల్లెల అభివృద్ధికి పాటుపడుతున్న బ్లాగర్లను చూస్తుంటే సంతోషంగా ఉన్నది. పల్లెలలో నేటికీ పాతకాలం నాటి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. వాటన్నింటినీ అందరూ మీలాగే వ్రాస్తే అన్నింటిని ఓ చోట చేర్చి బుక్ వ్రాస్తే తెలుగు బ్లాగు ప్రపంచం ద్వారా ఓ అద్భుతమైన పని జరిగినట్లే. అది జరుగుతుందని ఆశిస్తున్నాను శర్మగారు.

  • మిత్రులు కొండలరావుగారు,
   మాటతప్పే టపాలు రాసేస్తున్నానండి 🙂
   మన బ్లాగర్లని ప్రజలు,సామాన్యులు కూడా చూస్తున్నారు సుమా! అని మన బాధ్యత మరికొంచం పెరిగిందని చెప్పడమే నా ఉద్దేశం.
   ఈ బుక్ రాబోతున్నట్టు ఉందండి.
   ధన్యవాదాలు.

   • మిత్రులు శర్మగారు,
    ఇ-బుక్ రాబోతున్నట్టు ఉందన్నారు కదా. ఆమాట చాలా సంతోషం కలిగించింది. మీ నుండి ఇలాంటివి బోలెడు పుస్తకాలు వస్తే మాకు బోలెడు సంతోషం కలుగుతుంది మరి. కానివ్వండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s