శర్మ కాలక్షేపంకబుర్లు-భీష్ముడు అంపశయ్యపై ఎన్నాళ్ళున్నారు?

 భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిందనీ, అందులో భీష్ములు పదవరోజున కూలారనీ అందరం చెబుతాం, ఆ తరవాత వారు అంపశయ్యపై ఉన్నారనీ మాఘ శుక్ల ఏకాదశి రోజు నిర్యాణం చెందారనీ, ఈ రోజును స్మరించుకుంటాం. భీష్ములు అంపశయ్య మీద దక్షణాయనంలో చేరినా ఇఛ్ఛామరణం మూలంగా ఉత్తరాయణం కోసం వేచి చూచారు, దేహ త్యాగం చేయడానికి.  అంప శయ్యపై ఉన్న కాలంలో కూడా ధర్మరాజాదులకు రాజవ్యవహారాలలో, ధర్మాలలో ఉపదేశం చేశారు, అసలు వారు అంపశయ్యపై ఉన్నది ఎన్నిరోజులు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం యుద్ధం మొదలైన రోజు, పరమాత్మ రాయబారానికి బయలుదేరిన రోజు కూడా చూడాలి. ప్రయత్నిద్దాం.అమావాస్యనుంచి వెనక్కి లెక్కవేసుకువెళితే….
రాయబారానికి ముందు, ధర్మరాజు సభలో ధృతరాష్ట్రుని కి చెప్పవలసిన సంధి మాటలు మాటాడటం జరిగింది, ఆ తరవాత  ధర్మరాజిలా అంటారు.

” అని కార్యంబు నిశ్చయించి దినశుద్ధి నిరూపించి నారాయణుం జూచి నీనక్షత్రంబు రోహిణిగదా యెల్లి రేవతి నీకు జంద్రతారాబలంబులు గలవు…. భార..ఉద్యోగ..ఆశ్వా..3…130″

అంటే సాధనతారను ప్రయాణ నిశ్చయం చేసేరు, అది కూడా మరునాడే అన్నారు. అంటే ఆ రోజుకార్తీక మాసం బహుశః బహుళ పంచమి అయి ఉండాలి,  ఆరోజు బయలు దేరి రాత్రికి కుశస్థలం చేరి అక్కడ డేరాలు వేసి ఉన్నారన్నారు. మరునాడు బయలుదేరి హస్తినాపురం చేరేరు, అనగా షష్ఠినాటికి కరినగరంలో ఉన్నారు. ఆరోజు కుంతిని కలిశారు, ధృతరాష్ట్రుని కలిశారు, విదురుని ఇంటా రాత్రై విడిది చేశారు. మరునాడు సభ జరిగింది, అనగా ఆ రోజు సప్తమి. సభ రసాభాస అయింది, సాయంత్రం బయలుదేరుతూ, కర్ణునితో ‘కొద్ది దూరం సాగనంపి వత్తువు రమ్మని’ రధమెక్కించుకుని, అతనితో జన్మ రహస్యం చెప్పి, ఇలా అన్నారు.
“……గురుభీష్ములకును మీకుం దోడువచ్చిన రాజులందరకుం జెప్పు మిమ్మాసంబు సౌమ్యంబై శీతోష్ణంబులులేక పుష్పఫలోపేతంబును సమగ్రధాన్యంబును సులభయవ సంభవంబును నగుచు నొప్పియున్నది యేడెనిమిదిదినంబులకు నమావాస్య వచ్చు నది పుణ్యదినంబు నాడు భండనముగావలయుననిన………” భార…ఉద్యో.ప..ఆశ్వా..4….49
యుద్ధముహూర్తం పరమాత్మ నిర్ణయం చేసి చెప్పేరు. తిరిగి బయలుదేరిన రోజు సప్తమి అనుకున్నాం కదా అప్పటినుంచి లెక్క వేస్తే…ఎనిమిదవరోజు అమావాస్య, మహాభారతయుద్ధం ప్రారంభమయిందనమాట.కార్తీకమాసమనే నిర్ణయానికెలా వచ్చారని అడగచ్చు,  పరమాత్మచెప్పిన మాటలో ఈ మాసం” సౌమ్యంబై శీతోష్ణంబులులేక” అన్నారు, కార్తీక మాసమే అలా ఉండేది, మార్గశిరం మొదలు కొద్దిగాచలి ఉంటుంది, కనుక కార్తీకమే సరియైనదని నా మాట.

ఈ తరవాత అమావాస్యమొదలు పదవనాడు భీష్ముడు శరతల్పగతులయారుకదా అనగా మార్గశిర శుద్ధ నవమి రోజున అంపశయ్యపై పరున్నరనమాట. అది మొదలు మాఘ శుద్ధ ఏకాదశి వరకు అనగా మార్గశిరశుద్ధ నవమి మొదలు పున్నమి వరకు ఏడు రోజులు. ఆ తరవాత బహుళపక్షం పదిహేను రోజులు,పుష్యమాసం మొత్తం ముఫైరోజులు, మాఘమాసం పదకొండురోజులు  అంపశయ్యపై ఉన్నారనమాట. మొత్తం లెక్కేస్తే అరవై మూడు రోజులయింది (7+15+30+11= 63).

నా దగ్గరున్న కవిత్రయాన్ని ఆధారం చేసుకుని టపా రాసిన తరవాత ఈ అనుమానం
మనకే కాదు ఇంత కితం వారికి వచ్చి ఉంటుందనుకుని వెతకడం మొదలెట్టేను. చాలా లింక్ లే కనపడ్డాయి. మీ కోసంఒక రెండు లింకులు చూడండి.కార్తీక బహుళ అమావాస్య యుద్ధ ప్రారంభం అనేమాట అందరూ ఒప్పుకున్నదే. 

http://en.wikipedia.org/wiki/Kurukshetra_War

http://www.patheos.com/blogs/drishtikone/2010/09/astronomical-proof-mahabharata-war-shri-krishna/

ఈ కింది బ్లొగ్ వారిని చదివిన తరవాత ఈ రకమైన ఆలోచన కలిగింది. వారు చెప్పిన ప్రకారం నవంబర్ 6న కార్తీక అమావాస్య,ఆ రోజు యుద్ధమూ ప్రారంభమైనట్టిదానిలో అనుమానం లేదు. యుద్ధము మొదలయినాటికి 68 రాత్రులు,భీష్ముడు అంపశయ్యపై చేరి 58 రాత్రులు అయినట్టు చెబుతున్నారు. అలా నవంబర్ 6 నుండి లెక్కిస్తే జనవరి 12 రాత్రితో యుద్ధం ప్రారంభమై 68 రాత్రులు గడుస్తున్నాయి. అనగా పదమూడు జనవరి సంక్రమణం జరిగి ఉండాలి. నిర్యాణం సంక్రమణం రోజునే అయినట్లయితే ఆ మాట వ్యాసులవారు చెప్పి ఉండేవారే, అందుచేత నిర్యాణం జనవరి 13 కాదు. మరి సంక్రమణం రోజు రథసప్తమి అయ్యే సావకాశమే ఎక్కువ కనపడుతోంది, ఎందుకంటే నవంబరు 6 అమావాస్య కనక, డిసెంబర్ 6, జనవరి 6 అమావాస్య అయి ఉండే సావకాశం ఉంది. ఈ అమావాస్య ఏరోజయిందో గుర్తిస్తేనూ, సంక్రమణం ఏరోజో గుర్తిస్తేనూ నిర్యాణం సులభం గానే చెప్పచ్చు. సంక్రమణం జరిగితే కాని ఉత్తరాయణం రాదు, ఉత్తరాయణంలో కాని రథ సప్తమి లేదు. అందుచేత జనవరి 13 న మాత్రమే సంక్రమణం, రథ సప్తమి జరిగిఉండాలి.నా ఊహ ప్రకారం సంక్రమణమూ, రథ సప్తమీ జనవరి 13న జరిగితే, ఏకాదశి జనవరి 17వ తారీకున, ఆ రోజే భీష్మ నిర్యాణమూ జరిగి ఉండాలని, అప్పుడు లెక్కిస్తే నవంబరు 15 నుంచి జనవరి 17 కు 63 రోజలుగా ఉంది. ఈ విషయం నిర్ధారణా కావల్సి ఉంది.

మాఘశుద్ధ ఏకాదశిరోజున పరమాత్మ అనుమతితో దేహత్యాగం చేశారు, ఈ రోజు భారతీయులు వారికి తర్పణం వదిలిపెట్టాలి.
ఇలా తప్పు దిద్దుకున్నా!

భీష్మ నిర్యాణం అష్టమి ఇందులో అనుమానమే లేదు, నేను పొరబడి ఏకాదశిగా ముందు రాశాను. పాత టపా తీసెయ్యడం ఇష్టం లేదు, చేసిన తప్పు కనపడేలా గే ఉంచేశాను. ఇప్పుడు ఒక పేరా చేరుస్తున్నా కొత్తగా. అదేఇది.

భీష్మనిర్యాణం అష్టమి అప్పుడు అంపశయ్యపై ఉన్నరోజులు (7+15+30+8=60) ఇదీ పొరబాటే ఎందుకంటే ఒక రోజుకి ఒక తిథి ఉండే సావకాశమూ తక్కువ. అదీగాక ఈ సందర్భంగా పదమూడు నక్షత్రాల కాలానికే అమావాస్య పున్నమి వచ్చేయన్నారు.కాని పితామహులు అంపశయ్యపై ఉండి శరీర త్యాగం చేసిన రోజున చెప్పిన లెక్కప్రకారంగా, అప్పటికి యుద్ధం ప్రారంభమయి 68 రాత్రులు, అంపశయ్యపై 58 రాత్రులు గతించాయని చెప్పేరు. అది అధారంగా తీసుకుంటే నవంబర్ 6 నుండి లెక్కిస్తే జనవరి 12 రాత్రితో అన్ని రోజులు పూర్తి అవుతున్నాయి.పితామహులు శరీరత్యాగం ఉత్తరాయణం లో చేదామనుకున్నారు కనక 12 వ తేది సంక్రాంతి, మరియు రథ సప్తమి అయ్యాయి. జనవరి 13 న వారు శరీరం విడిచిపెట్టేరు. అనగా 58 రోజులు అంపశయ్యపై ఉన్నారన్నది నిజం

స్వస్తి.

 

        

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భీష్ముడు అంపశయ్యపై ఎన్నాళ్ళున్నారు?

 1. శర్మ గారూ ,

  నమస్తే .

  దీనికి సమాధానమైతే చాలామంది చెప్పలేకపోవచ్చు గాని , చదివి తెలుసుకోవాలన్న జిఙ్నాస మాత్రం బహు చక్కగా పెరుగుతోంది .

  పూర్తిగా ఆధారాలతో తెలుసుకొన్న నాడు నేనూ నా టపా ద్వారా తెలియ చెయ్యాలనుకొంటున్నాను . ఎంత టైం పడ్తుందో యిప్పుడు మాత్రం చెప్పలేను .

 2. శర్మగారూ,
  1. భీష్మనిర్యాణం అష్టమితిథియందే జరిగింది.
  2. తిథులను బట్టి దినగణనం చేసేటప్పుడు కొంత ఇబ్బంది ఉన్నది. ప్రతి తిధికి ఒక సౌరదినం కాదు. అవమతిధులు కూడా వస్తాయి. అధికమాసాలూ వస్తాయి. ఇక్కడ ఇంత చిన్నలెక్కలో సందర్భపడకపోవచ్చు నన్నది వేరే విషయం.
  3. రవిసంక్రమణం కేవలం సూర్యమానం. కొన్ని ఖగోళికకారణాలవలన ఖచ్చితంగా ప్రతిసంవత్సరం ఒకతారీఖున రాకపోవచ్చును. దీర్ఘకాలంలో అంటే ప్రతి డెబ్బది రెండు మూడేళ్ళకూ ఒకరోజు వ్యత్యస్తం అవుతుంది.
  4. గ్రహగణితం అతిదీర్ఘకాలానికి సరిగా వర్తించదు. ౫౦౦౦సంవత్సరాలకు పూర్వపు తిథులను ఖచ్చితంగా కొలవటం అసాధ్యం.

  • శ్యామలరావు గారు,
   రోజుకో తిథి అన్నది తప్పని తెలుసు, అష్టమి తిధిలో భీష్ములు నిర్యాణమూ తెలుసు, ఎందుకో పొరబడిపోయాను, పొరపాటు చెప్పినందుకు ధన్యవాదాలు. టపా సరి చేస్తాను. అంత పూర్వకాలపు తిథులు లెక్కించడం కష్టమే కాని సమీప ఋజువులతో నియం చేసుకోవచ్చనుకుంటాను. అమావాస్య కూడా ఒక నెలలో వచ్చినట్టు మరొక నెల రావాలనీ లేదు. అలాగే సంక్రమణం కూడా మారుతుంది.
   ధన్యవాదాలు.

 3. Sarm Garu

  Bhisma pitamaha niryana happened on Ashthami (next day of Ratha Saptami) and not in Ekadaisi – please refer any panchanga that there is mention of Bhishma asthami as well as Bhisma Ekadasi – this ekadasi is important as Bhishma told Vishnu Sahasra nama to Yudhishtar/Dharmaraja.. Makara Sankranti date is not fixed and changes every 72 years for one day.

  For example Sri Swami Viveka Nanda was born on 12th January 1863 which is Makara sankranti at that time and presently makara sankranti happens on jan 14 and may be changed to jan 15th in future. Kaliyuga started on Chaitra shulka padyami which happened on 18th Feb 3102 BC (Now Chaitra month is coming in March/April month).

  Regarding Maha bharata war there are different opinions – some scholars calculated that war was not done daily but with a day gap/alternative day means Bhisma falls on 10th war day – 19th day after start of war and remains up to Ratha saptami day.

  • వేంకట్రామ్ గారు,
   భీష్మ నిర్యాణం తిథి అష్టమే ఎందుకో పొరబడిపోయాను, తప్పుదారి పట్టేశాను. జనవరి పన్నెండు సంక్రమణం రథ సప్తమి దాకా బాగానే చెప్పేను, అక్కడే తరవాత పొరబడ్డాను. పితామహులు జనవరి పదమూడునే దేహత్యాగం చేసింది. ఆ మాట వారి మాటలద్వారానే ఋజువవుతోంది. తాను అంపశయ్యపై చేరి ఏబైఎనిమిది రాత్రులు, యుద్ధం మొదలయి అరవై ఎనిమిది రాత్రులు గడచాయని చెప్పినట్టు తెలుస్తోంది. దీనితొ జనవరి పదమూడున దేహత్యాగమన్నది నిజం.
   ధన్యవాదాలు.

 4. కష్టే ఫలే వారు,

  కొంత తర్కం(మీమాంశ ? లాజిక్) కుంటు పడు తుందేమో అని పిస్తుంది !

  >>జనవరి 13 న మాత్రమే సంక్రమణం, రథ సప్తమి జరిగిఉండాలి ..

  రథ సప్తమి వసంత ఋతువు లో ఏడవ రోజు.. (వసంత పంచమి తరువాయి) . వసంత ఋతువు సంక్రమణం తరువాయి గాని రాదు ? ఎట్లా మరి ? వసంత ఋతువు సంక్రమణం ముందు వచ్చే అవకాశం ఉంటుందం టారా ??

  జిలేబి

  • చైత్రమాసం ఉగాదినుండి ప్రారంభం కదండీ? మకరసంక్రాంతి దానికన్నా చాలా ముందుగానే వస్తుంది కదా చైత్రవైశాఖములు వసంత ఋతువు అని కదా లెక్క? శుక్లా మాఘస్య సప్తమీ అని కదా రథసప్తమి ప్రమాణం? రథ సప్తమి వసంత ఋతువు లో ఏడవ రోజు అని ఎలాగు?

   • శ్యామలరావు గారు,
    తెలియకకాదు, నేను మరిన్ని తప్పులు చేస్తే చూదామని. 🙂
    ధన్యవాదాలు.

   • అటల్జీ,
    మీరు చెప్పినది నిజమే! ఆ సమయంలో సంక్రాంతి రథ సప్తమి జనవరి పన్న్నెండునే జరిగాయి, మరుసటిరోజే భీష్మ నిర్యాణం, నేనెందుకో ఏకాదశిగా పరాకు పడ్డాను.
    ధన్యవాదాలు.

  • జిలేబిగారు,
   కొంత దాకా బాగనే చెప్పేను కాని ఆ తరవాత తప్పుదారి పట్టేసేను.రథ సప్తమి శిశిరంలో మాఘమాసంలో వస్తుందని మీకు తెలియదా? ఇంకా తప్పులు చేయించాలనే 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s