శర్మ కాలక్షేపంకబుర్లు-మహా శివరాత్రి.

Courtesy: Chandra kotta. Rendered by Sri. Marepalli Naga Venkata Satsri garu. listen on you tube.

Mahanyasam

మహా శివరాత్రి.

ఈ రోజు మహా శివరాత్రి, ప్రతినెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశిరోజు మాస శివరాత్రి, మాఘ బహుళ త్రయోదశి మాత్రమే మహా శివరాత్రి, అందుచేత ఈ రోజును మహా శివరాత్రి అనాలి కాని శివరాత్రి అనకూడదు. . మహాశివరాత్రిరోజు నడిరాత్రి శివుడు లింగంగా ఉద్భవించాడంటారు, పెద్దలు.శివరాత్రి గురించి, శివుని గురించి తెలియనివారెవరు? ఏమిరాయాలో తోచలేదు, చివరకు, చిన్నప్పుడు చదువుకున్న కథ….పొరబడితే సరిదిద్దండి…..

పార్వతీ పరమేశ్వరులు ప్రతిరోజు సాయంత్రం ఆకాశవిహారం చేస్తారు. అలా చేస్తూ భూలోకాన్ని పరికిస్తున్నారు, ఆరోజు మహా శివరాత్రి, ఎక్కడ చూచినా శివనామ స్మరణ “ఓంనమశ్శివాయ” సిద్ధమంత్రం, నామ సంకీర్తనం, ఏ గుడిలో చూచినా “నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ’ చమక నమక పారాయణలూ మిన్ను ముట్టుతున్నాయి, శివాభిషేకాలూ జరుగుతున్నాయి.. అమ్మకి చాలా సంతోషంగా ఉంది. కారణం ఆ రోజు అర్ధరాత్రి స్వామివారి లింగోద్భవకాలం. అలా చూసుకుంటూ వస్తుండగా శ్రీశైలం సానువులపైకి చేరేరు. చీమలబారులాగా జనం అమ్మ అయ్య దర్శనానికి పోతున్నారు, ఓం నమశ్శివాయ నామం వినపడుతూ ఉంది, అమ్మకి ఎందుకో అనుమానం వచ్చింది. అమ్మకి అనుమానం రావడమంటే అది లోక కల్యాణానికే, ఎందుకంటే అమ్మ అనుమానం అయ్య తీరుస్తారు, అది లోకానికి ఉపయోగం కనక. అమ్మ మనసులో ఉన్న అనుమానాన్ని శంకరునితో చెప్పింది ఇలా ” స్వామీ! ఇంతమంది భక్తులు మీదర్శనానికి వస్తున్నారు కదా! ఇందులో మిమ్మల్ని చేరేవారెవరూ? ” ఇది విన్న శంకరులు “ఓ గిరిరాజ పుత్రీ! వీరంతా నా భక్తులే, ఎవరు చేసుకున్న పాప పుణ్య కర్మలను బట్టి వారికి జన్మ లభిస్తుంది. ’జంతూనాం నర జన్మ దుర్లభం’, ఈ జన్మలో చేసుకున్న పాప ,పుణ్యాలను బట్టి మరుజన్మగాని, జన్మరాహిత్యం కలిగి నాలో చేరుకోవడం గాని జరుగుతూ ఉంటుంది, ఇది ఒక మానవ జన్మలోనే సాధ్యం, మరొక జన్మలో సాధ్యం కాదు,” అన్నారు. అమ్మకి కుతూహలం పెరిగింది ఇందులో మిమ్మల్ని చేరుకునేవారెవరో చూడాలని ఉంది అని ఆశపడింది.

దానికి శంకరులు ’అదెంత భాగ్యం’ నడు అని ముసలిబ్రాహ్మణ రూపంలోనూ అమ్మ పండు ముత్తయిదువుగానూ శ్రీశైలం యాత్రీకులు వెళుతున్న బాట పక్కగా చేరేరు. అయ్య, అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నారు, అమ్మ అంగలారుస్తోంది “రక్షించండి! రక్షించండి!! కాస్త గంగ స్వామి నోటిలో పోసి పోయే ప్రాణాన్ని రక్షించండి!!!” అని. ఇది విన్న ఒక వృద్ధబ్రాహ్మణుడు నీరుపోయడానికి సిద్ధమయ్యాడు, అప్పుడు అమ్మ ఆయనతో “పాపం చేయనివారు మాత్రమే గంగపోయాలి, పాపం చేసినవారెవరైనా పోస్తే ఈయన మరణిస్తారు” అని చెప్పింది. ఇది విన్న వృద్ధుడు ఆగిపోయాడు. వేద వేదాంగాలు చదువుకున్నా కాని, ఏమో ఎప్పుడేనా ఏ పాపమైనా చేశానేమో! ఈ చివరి జీవితపు రోజులలో ఆయననోట నీరుపోస్తే, ఆయన మరణిస్తే ఈ బ్రహ్మహత్యాపాతకం కొని తెచ్చుకున్నట్టవుతుందనుకుని వెనకంజవేసి వెళిపోయడు. ఎవరెవరో వస్తున్నారు వచ్చినవారికి అమ్మ షరతు చెబుతూనే ఉంది, ఏమో ఎందుకొచ్చిన తలనొప్పి అని ఎవరూ నీరుపోయటం లేదు. అమ్మ అంగలార్చడం మాననూ లేదు. కాలం గడుస్తోంది, అమ్మకి ఉత్సుకత పెరుగుతోంది. ఈ లోగా ఒక స్త్రీ వచ్చింది, అమ్మ చెప్పిన షరతూ వింది, పరిస్థితీ చూసింది, మంచినీరుపోయకపోతే ఆ వృద్ధుడు మరణిస్తాడేమో, చూస్తూ చేయగల సహాయం చేయకపోవడం మూలంగా ఒక నిండు ప్రాణం పోవడం, బాధను చూస్తూ, సహాయం చేయగలిగి ఉండి చేయకపోవడమూ పాపమే కదా! అని ఇలా వితర్కించుకుంది మనసులో, “నేనా వేశ్యను, పుట్టినది మొదలు పాపాలే చేశానో పుణ్యాలే చేసేనో చెప్పలేను కాని, వయసువచ్చినది మొదలు విటులతో నేను చేసినది పాపమే, పొట్టకూటికి ఇన్ని పాపాలు చేసిన నేను మంచినీళ్ళుపోయడం మూలంగా ఈ వృద్ధ బ్రాహ్మణుడు మరణిస్తే వచ్చే బ్రహ్మహత్యాపాతకం అనుభవించడానికే సిద్ధంగా ఉన్నాను, కాని మంచినీళ్ళు పోయకపోవడం మూలంగా ఈ ప్రాణి చనిపోవడం సహించలేను” అనుకుని, మంచి నీళ్ళు పోయడానికి సిద్ధమయ్యింది. అప్పుడు అమ్మ మళ్ళీ హెచ్చరించింది, అయినా ఆ వేశ్య వెనక్కి తగ్గక, “అమ్మా! నేను వేశ్యను, తెలిసినకాలం నుండి పాపాలే చేస్తున్నాను, ఇప్పుడు వీరికి మంచినీళ్ళుపోయడం మూలంగా వీరు మరణిస్తే వచ్చే బ్రహ్మహత్యా పాతకం, ఇదివరలో చేసిన పాపాలకంటే పెద్దది కాదు, దానిని అనుభవించడానికే సిద్ధం గా ఉన్నాను, భగవంతునిపై అపారమైన నమ్మకం త్రికరణశుద్ధిగా కలిగి ఉన్నాను, నేను చేసిన పనికి ప్రతిఫలంగా స్వామి ఏది అనుగ్రహిస్తే అది పొందడానికే సిద్ధపడ్డాను తప్పించి వీరిని మంచినీరు ఇవ్వకపోవడం మూలంగా ప్రాణం కోల్పోనివ్వను” అని చెప్పి వృద్ధుని నోటిలో నీరుపోసింది. అప్పుడు శంకరులు లేచి కూచున్నారు. వేశ్య ముందుకు కదలిపోయింది, ఒకరికి ఉపకారం చేయడం మూలంగా ఒక నిండుప్రాణాన్ని నిలిపిన ఆనందంతో. అయ్యవారు చెప్పేరు ఈమె ఈ జన్మాంతరమందు నన్ను చేరబోయేదని, పార్వతీ పరమేశ్వరులు తిరోహితులయ్యారు.

ఇప్పుడు కథను విశ్లేషించుదాం. ఆమె వృత్తి రీత్యా వేశ్య, నిత్యమూ చేస్తున్నది పాపం, కాని చిత్రంగా అనుగ్రహం పొందింది, ఎలా? ధర్మవ్యాధుడు తెలుసుకదా? మాంసం అమ్ముకునేవాడు, కాని బ్రహ్మ జ్ఞానం బోధించాడు, కౌశికునికి, పుట్టుక వృత్తి ముఖ్యంకాదు.. అంటే వృత్తికాదు, ప్రవృత్తి ముఖ్యం. ఎన్ని గుడులు గోపురాలకి తిరిగామన్నది కాదు కావలసినది, ఎంత భక్తిని చూపాము, ఆత్మ సమర్పణ సంపూర్ణమేనా అన్నదే కావలసినది. మహా శివరాత్రిరోజు ఉదయమే లేచాం, గోదావరిలో ములిగాం, గబగబా బయలుదేరాం, బస్ పట్టుకున్నాం, అక్కడినుంచి మొదలయింది, పక్క వారి చీరలు, నగలు పరిశీలన, మన గొప్ప చెప్పుకోడం, ఎన్నిసార్లు ఈ పంచారామాలు తిరిగివచ్చినదీ చెప్పుకోడంతోనూ, కూడా పట్టుకుపోయిన సెల్ ఫోన్లో, నెట్లో, ఫేస్ బుక్ లో, వాట్సప్ లో మిత్రులతో కబుర్లు చెప్పడంతోనూ, ఎక్కడున్నది, ఏ గుడి చూస్తున్నదీ వివరాలు ఫేస్ బుక్ లో పెట్టడం తోనే సరిపోయింది. సాయంత్రమయింది, ఇంటికి చేరేం, చేసినదేమి, ప్రయాణం, గొప్ప చెప్పుకోడం, లైన్ లలో తోసుకోడం లేదా అక్కడ మన గొప్ప ప్రదర్శించి ముందు దర్శనం చేసుకోడం ఇంతేగా! నిజానికి మనసు శివునిపైలేదు. ఎంత కష్టపడి పత్రి తెప్పించినదీ, ఎంత ఖర్చయినదీ, ఎంతమంది చేత అభిషేకం చేయిస్తున్నదీ చెప్పుకోడం తోనే సరిపోయింది, ఆడంబరమే కాని ఆత్మ సమర్పణ లేకపోయింది, ఇదా మహా శివునికి కావలసినది? మనం ఇవ్వవలసినది? వేశ్య ఏం చేసింది, శివుని నమ్మింది, మనసా, వాచా, కర్మణా, పాపం వచ్చినా సరే ప్రాణం నిలబెట్టాలనుకుంది, కావలసింది ఇదీ,ఆ తరవాతైనా ఆమె నేనిదివరలో చేసినదంతా పుణ్యమే అందుకే ఆ ముసలాయన బతికేడనుకోలెదు, పరమేశ్వరానుగ్రహం అలా ఉంది అనుకుందంతే!!!తాను చేయవలసిన కర్మ తాను చేసింది, ఫలితం భగవంతునిదే అనుకుంది. ఆడంబరం కాదు.తల్లి తండ్రులను ప్రేమించలేనివారు, భార్య/భర్తలతో ప్రేమ అభిమానం పంచుకోలేనివారు, పెద్దల యెడ గౌరవం చూపలేనివారు, ఎన్నిగుడులు, గోపురాలూ తిరిగినా ఫలితం శూన్యం.అంటే ఈ గుడిగోపురాలని దర్శించడం, లింగార్చనలు చెయ్యడం, ఏకాదశ రుద్రాభిషేకాలు చెయ్యడం కూడదంటారా? అని ప్రశ్నించవచ్చు. శక్తి కొలది చేయవలసినవి చేయాలి, శక్తిలేని పని చేయబూనడమమెంత తప్పో, శక్తి ఉండి చేయకపోవడమూ తప్పే! ముఖ్యంగా కావలసినది భక్తి, భక్తిలేని పూజ పత్రి చేటు అన్నారు వేమన తాత, తస్మాత్ జాగ్రత!.
“ఓం నమశ్శివాయ” సిద్ధమంత్రం గురూపదేశం కూడా అక్కరలేనిది……..

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మహా శివరాత్రి.

 1. మామయ్య గారికి నమస్కారములు చాలాకాలానికి మరల శంకరుడు మీ చేత టపా శివరాత్రితో మొదలు పెట్టించినందుకు చాలా ఆనందంగా వున్నది. సంపూర్ణ ఆరోగ్యం మీకు కలగ చెయ్యాలని శివుణ్ణి సదా ప్రార్ధిస్తూ మీ వెంకట్రామయ్య

  • s.venkataramayya,
   అల్లుడుగారు,
   నడుస్తూ గడచిపోతే అంతే చాలు. ఈ రాతలు కోతలు ఉట్టి వ్యర్ధమైన పని అనిపిస్తుంది, అప్పుడపుడు.
   ధన్యవాదాలు.

 2. ఈ కథ నాకు ఏమీ అర్ధం కాలేదు, బహుశా నా మెదడు పరిపక్వం చెందలేదు అనుకుంటున్నా!
  ఎందుకంటే ఈ కథ లో వేశ్య నీళ్ళు పొయ్యడానికి ముందుకు వచ్చింది, నీళ్ళు అందించింది, దానితో శివుడు కరుణిం చారు అన్నారు, అంటే ఆమె గతంలో ఎన్ని తప్పులు చేసినా ఉపకారం చేయడంలో వెనకంజ వేయలేదు కాబట్టి ఆమెను శివుడు అనుగ్రహించాడా? లేదా ఆమే తను చేసే వృత్తి హేయమైనది అని తెలిసినా బ్రతకడానికి ఇంకో మార్గం లేక అందులో ఉండిపోయి ఎవరికైనా అవసరం ఉంటె తన వంతు సాయం చేస్తుంది కాబట్టి శివుడు అనుగ్రహించాడా?
  మొదటి ప్రకారం అర్ధం చేసుకుంటే నేను ఎన్ని తప్పులైన చేస్తాను ఒక్క ఒప్పు చేస్తే చాలు నా జీవితం సఫలం అవుతుంది అని తప్పులు చేసే ప్రవృత్తి పెరిగిపోతుంది, రెండవ ప్రకారం అర్ధం చేసుకుంటే దేవుడు మంచి చేసే అవకాశం అందరికీ ఇస్తాడు అందుకని నువ్వు ఒకవేళ కాల ధర్మం ప్రకారం చెడు చేసినా ఆ చెడు ధర్మం విడిచి పెడితే దేవుడు అనుగ్రహిస్తాడు.
  ఏమో నాకు ఎప్పుడూ కధ లో రెండు వైపులూ కనిపిస్తాయి!
  నా ప్రయత్నం మాత్రం తప్పు చెయ్యకుండా ఉండడమే!

  • ప్రసాద్ గారు,
   ఇటువంటి వాటిలో పాసిటివ్ గానే ఆలోచించాలి. నెగెటివ్ గా ఆలోచిస్తే చిక్కే. మరో సంగతి నీళ్ళు పోసినంతలోనే కైవల్యంరాదు, మిగిలినవీ లెక్కలోకొస్తాయి. ఈ రకమైన పాసిటివ్ ఆలోచన పెరగాలన్నదే, ఎదుటివారిని కష్టం లో ఆదుకోవాలన్నదే ఈ కథ సారాంశం.
   ధన్యవాదాలు.

 3. బాగా చెప్పారు.
  ఇప్పుడు చాలామంది భక్తిని ఆచరించడం కంటే ప్రదర్శించటానికే తాపత్రయపడుతున్నారు.
  ఆ పరమేశ్వరుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
  జిలేబి గారు, మీ పాయింటు బాగుంది కాని, రాయి అనడం బాగోలేదు.
  మీరన్నట్టు ఆదిభిక్షువుకి క్షీరాభిషేకమే కావాలా? జలాభిషేకం చాలదా?

  • బోనగిరిగారు,
   పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు, ఏది ఓపికుంటే అదే సమర్పించచ్చు, ఇదే చేయాలని లేదు. మనమే గొప్పకి చేస్తున్నాం. ఇవన్నీ ఆయనిచ్చినవే మళ్ళీ కొద్దిగా ఆయనకు సమర్పిస్తూ మనమే అనుభవిస్తున్నాం.
   ధన్యవాదాలు.

 4. రాయి కి పాలు ధార గ పోసి
  భక్తి ని చూపించ నేల ! కడివెడు
  పాలు ఆర్తుల సేద దీరంగ నిచ్చి
  భోళా శంకరుని మెప్పించు జిలేబి !!

  శుభం ! మళ్ళీ మీ టపాలు మహాశివరాత్రి తో మొదలెట్టడటం ! ఆరోగ్యం కుదుట బడిందనుకుంటా !

  మహా శివరాత్రి శివ శివా అనుచు
  జిలేబి

  • జిలేబిగారు,
   మహాదేవునిపై పాలు పోస్తూ పాడయిపోతున్నాయనుకోనక్కరలేదు. పెట్టాలనే బుద్ధి ఉండాలి కాని ఇవే పెట్టక్కరలేదుగా! కొంత మెరుగుపడింది, ఆరోగ్యం..అందుకే మళ్ళీ…
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s