శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మయ్య! జ్వరం తగ్గిందండి.

అమ్మయ్య! జ్వరం తగ్గిందండి.

కేశములు, దంతములు, నఖములు, నరులు స్థానభ్రంశం చెందితే రాణించరు అన్నారు చిన్నయసూరి. నిజమే కాని మరొక అర్ధమూ చెప్పుకోవచ్చనిపించింది నాకు, అదెటులంటే….

కేశములు,దంతములు,నఖములు, వీటిని భగవంతుడు మానవులలో కేశములు రక్షణ వ్యవస్థగాను, అందానికి, దంతములు ఆహారం నమలడానికి, నఖములు చేతి వేళ్ళు పని చేయడానికి వీలుగా కల్పించాడు. వీటన్నిటికి ప్రాణం ఉందా? ఉంది, లేదా? లేదు. నిదర్శనం? హిరణ్యకశిపుడు వరంలో ప్రాణులతో కాని, అప్రాణులతో కాని తన ప్రాణానికి హాని కలగకూడదన్నాడు. మరి ఆ మినహాయింపును పురస్కరించుకునికదా గోళ్ళతో కడుపు చీల్చి చంపేడు, నరసింహస్వామి. కేశములు, దంతములు, నఖములు వాటి స్థానాలలో ఉన్నంత కాలంలో నే మానవులకు విలువ, వాటికీ విలువ. సింహానికి ఎందుకు భయపడతాం? దాని గోళ్ళు కోరలకే. అవే పోతే సింహానికి ఎవరేనా భయపడతారా? మానవులకు అవి వాటి స్థానాలలో ఉన్నంతకాలం తెలియదుకాని అవి లేకపోతే తెలుస్తుంది, అదెలాగంటే…స్వానుభవం…..

నోట్లో పదహారు జతల పళ్ళుంటాయి, అవికూడా పైన కింద జతలుగా ఉన్నపుడే ఉపయోగం. గత పదిహేనేళ్ళుగా నెమ్మది నెమ్మదిగా అప్పుడపుడూ పదకొండు జతలు గతించాయి. ఇక మిగిలింది పది, అందులో కూడా రెండు పక్కలా చెరొక జత పనికొచ్చేవి, మిగిలినవన్నీ అలంకార ప్రాయమే. ఇలా గత రెండేళ్ళుగా నడుస్తోంది. ఏమయిందోగాని పై పళ్ళు పోటు ప్రారంభించాయి, పెదవి వాచిపోయింది, డాక్టరమ్మాయి దగ్గరికి పరిగెట్టేను. చూసి, పరిశీలించి, ‘తాతగారూ ఇక ఇవి పని చెయ్యవండి, తీసేసి మొత్తం పళ్ళు కట్టేస్తా! ఏమంటారు?’ అంది, అక్కడికి మరో మార్గం ఉన్నట్టు. ‘అలాగే తీసెయ్యమ్మా’ అన్నా! ‘తాతగారు సుగరుందా?’ అంది. ‘ఉందితల్లీ’ అంటే ‘చూపించుకురండీ’ అని చెప్పి పంపేసింది, తల్లీ అదెప్పుడూ హద్దులోనే ఉంటుందీ అని చెప్పినా వినక. తప్పదు కదా!.’ఈ లోగా ఈ మాత్రలు వాడండి, మూడురోజుల తరవాత రండి’ అంది.

మర్నాడు సుగర్ డాక్టర్ దగ్గరకి పరిగెట్టేను, ఆ రోజు టెస్టులు చేసి ‘సుగర్ ఎప్పుడూ హద్దులోనే ఉంటుంది మీకు, కాని గుండె హద్దులో ఉండటం లేదూ’ అన్నాడు. ‘ఏం చెయ్యను చెప్పండి, అందరూ నావాళ్ళే అనుకుంటా, నా వాళ్ళనుకున్నవాళ్ళని,మనసుకు దగ్గరగా వచ్చినవారిని మరచిపోలేను, అదేకదూ నా బాధా’ అంటే ‘అలా అనుకోకండీ’ అని ఉచిత సలహా ఇచ్చేరు, కాని కుదురుతుందా?ఈ మధ్య ప్రయత్నం మొదలెట్టేను, మరచిపోడానికి. మందులుచ్చుకు వచ్చేను.

మూడురోజులకి వాపు తగ్గింది, మళ్ళీ డాక్టరమ్మాయి దగ్గరకొస్తే కుర్చీలో పడుకోమంది. అదేంటోగాని నాకు ఆ కుర్చీ చూస్తే చచ్చేటంత భయమేస్తుంది, ఎన్నిసార్లు అందులో పడుకున్నా. కబుర్లు చెబుతూ మత్తు ఇచ్చేసింది, ఐదు నిమిషాలు చూసి మత్తు ఎక్కినట్టు నిశ్చయంచుకుని ఒక పక్క ఐదు పళ్ళూ పీకేసింది, మిగిలినవో అంటే ‘నాలుగురోజులు పోనివ్వండి’ అంది. ఏంచేస్తాం, ‘రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువనేర్చునా’ అని నోరు మూసుకుని ఇంటికొచ్చేసేం. సాయంత్రానికి జ్వరం వచ్చినట్టయింది, అసలే చలికాలం, మరి ఈ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళడం, వాళ్ళతో మాట్లాడ్టం వగైరాలన్నీ పాపం చిన్నకోడలే పడుతోంది. డాక్టరమ్మాయితో మాటాడిందిట, మాత్రలెయ్యండి జ్వరం తగ్గుతుంది అంటే మాత్రలేసేరు. మూడురోజులల్లా బాధ పడి నాలురోజు మళ్ళీ మిగిలినవి పీకించుకున్నా, మళ్ళీ జ్వరం మామూలే మరో వారమూ సరిపోయింది. ఇక్కడితో ఈ కథ పూర్తయితే అనుకోడమేలా?

పళ్ళు పీకినచోట ఎలాగూ బాధ తప్పదనుకున్నా కాని అదేమోగాని ఒక వైపు వాపు అసలు తగ్గలేదు, నొప్పి చాలా బాధపెట్టేసింది, మళ్ళీ డాక్టరమ్మాయి దగ్గరికి మోసుకుపోయారు. పళ్ళు పీకిన మొదటి రోజునుంచి వాపుండిపోయిందేమో మాటమాటాడటం కూడా కష్టమైపోయింది. ఇదిగో మొన్నటికి కొద్దిగా వాపు తీత మొదలెట్టింది, అదృష్ట జాతకం కదూ ఈ లోగా వారం లో మూడురోజులు నెట్ పోయిందిట, ఆ తరవాత కూడా నెట్ వస్తూ పోతూ ఉంది. మూడున్నర సంవత్సరాలకితం వచ్చిన బ్లాగు జ్వరం తగ్గినట్టే ఉంది, తిరగబెట్టకపోతే…… 🙂

ఇంతతో కథ ముగిసిందా? ఇప్పుడే కదా మొదలయింది! తినేవి భక్ష్య, భోజ్య,చోష్య, లేహ్యాలన్నారు కదా! మరి కొరికేవి, నమిలేవి తినేందుకు పళ్ళులేవుగా, మిగిలినవి చప్పరించేవి, నాకవే కావాలి కదా!,డాక్టరమ్మాయి ‘తాతగారూ! మూడు నెలలదాకా పళ్ళు కట్టేందుకులేదు, చిగుళ్ళు ఆరాలని’ చల్లగా చెప్పింది కదా! నిన్నటిదాకా ఏవో తాగడం తో నడిచిపోయింది, మరిప్పుడు అసలు కథ నడుస్తోంది….. 🙂 మానవుడు ఎంత బలహీనుడు, ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉన్నంతకాలం నా అంతవాడు లేడని అహంకరిస్తాడు, పళ్ళు లేకపోతేనే ఎంత అవస్థో………ఇల్లాలికి ప్రతిపూటా పరీక్ష అయిపోయింది, కొత్తగా వంట నేర్చుకుంటోంది పాపం……మెత్తగా వండటానికి కష్టపడుతోంది…

మొన్న మళ్ళీ మోసుకుపోయారు డాక్టరమ్మాయి దగ్గరికి, చిగుళ్ళు ఆరుతున్నాయి ‘ఈ మందు చిగుళ్ళకి రాసి  మర్దనా చెయ్యండి తాతగారూ! మానెయ్యకండీ, కొంచం నొప్పిగా ఉంటుంద’ని ఇచ్చిందో మందు, దానితో చిగుళ్ళుతోమితే వాచిపోయి ఆంజనేయుడి మూతి అయిపోయింది,మాటాడటమూ కష్టంగానే ఉంది, తినడం ఉత్తిమాట…..సానుభూతి చూపించకండి నకస్సలు నచ్చదు, మా బాగా అయిందని చంకలు కొట్టుకుంటున్నారా….. రేపు మీకూ ఇదే గతి…..

సర్వేశ్వరా! ఇక అనుభవించేదేంలేదు, ఎందుకీ తిప్పలు చెప్పు నాకు!, నీలో తొందరగా కలిపేసుకోవయ్యా!! ఈ బాధలు పడలేను!!!

ప్రకటనలు

23 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మయ్య! జ్వరం తగ్గిందండి.

  • అమ్మాయ్ ధాత్రి,
   అయ్యో! చిన్నవాళ్ళు పళ్ళు పీకించుకోవడం బాధాకరమే! ఏదైనా తనదాకా వస్తే కాని తత్వం ఒంటబట్టదు కదూ! 🙂

   ధన్యవాదాలు.

 1. ఆ రి పొట్టలో చుక్క ట ఈ గూగుల్ ఇన్పుట్ లో ఎట్లా తెలుగులో వస్తుందో తెలియటం లేదండోయ్ !

  సొంటి యే చురుక్కు ! ఇక శొంఠి అంటారా డబల్ ధమాకా !!

  చీర్స్
  జిలేబి

 2. మీ ఆరోగ్యం కుదుట పడి నందుకు సంతోషం !
  మీ దంత వైద్యురాలు మిమ్మల్ని , కాస్త తొందర పెట్టినట్టు అనిపిస్తుంది !
  ధైర్యం గా, వయసు రీత్యా వస్తున్న బాధలను ఎదుర్కుంటున్నారు !
  మీరు రాసిన ముగింపు వాక్యాలు నచ్చ లేదు !
  అనివార్యమైన అంతాన్ని ఆహ్వానించడం కన్నా ,
  సర్వ విధాలా , ఎదిరించడమే మిన్న !

  • సుధాకర్ జీ,

   వయసుతో వచ్చే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు, అప్పుడపుడు ఇలా నిర్వేదం లోకి జారుకోడం సహజం గాని, అందులో కూరుకుపోయినది లేదు, చివరవరకు పోరాటమే, ఆరాటమే 🙂
   ధన్యవాదాలు.

 3. నమస్కారము శ్రీ శర్మ(బ్లాగ్ గాంధీ) గారూ,
  చిన్నప్పటి నుండీ వివిధ పుస్తకాలు చదివే అలవాటు, ఆసక్తి మరల మీ లాంటి బ్లాగర్ల ద్వారా మాకు ఇలా తీరుతోంది. “అపర భీష్ముడి”లా ఎన్నో మంచి విషయాలను, నా బోటి సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా చక్కటి తేట తెలుగులో వివరించే మీకు నా వందనాలు. అన్నీ తెలిసినా మళ్లీ మీరే ఒకోసారి “అర్జున విషాదయోగం” లోకి వెళ్లి “కాడీ-మేడీ” వదిలేస్తాననడం మాత్రం నా లాంటి అభిమానులకు కాస్త కలవరం కలిగించేమాట వాస్తవం. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మీరు ఓపిక ఉన్నంత వరకూ ఇలా మీకు తెలిసిన మంచిని మాకు పంచుతూ ఉండాలని కోరుకుంటూ…
  మీ బ్లాగాభిమాని
  సుందరం

  • సుందరం గారు,

   నమస్కారం.
   ……..ఒక క్షణం మీ అభిమానానికి ఉక్కిరి బిక్కిరయి నోట మాట రాలేదన్నదే నిజం. ఇలా అభిమానులను సంపాదించుకోగలిగినందుకు ఆనందం. మీ అభిమాన వర్షం లో తడిసి ముద్ద అయ్యాను. మట్టిమనిషిని, చదువుకోనివాడిని, పల్లెటూరివాడిని, నా పై మీరంతా చూపే ఈ అభిమానం, నిజానికి మీ అవ్యాజమైన అనురాగం తప్పించి మరేం కాదు, వీటికి నేను అర్హుడనా అనీ అనిపిస్తుంది.

   అర్జునుడంతవానికే నిర్వేదం కలిగింది కదా! నేనూ సామాన్యుడినే. 🙂 అప్పుడపుడు ఈ కాడీ-మేడీ పారేసిపోవాలనిపిస్తుంది కాని కుదరదే! 🙂 ఇదో చిత్రం. వ్యవసాయం మానలేను. మీలాటివారి మాట మళ్ళీ మొదలెట్టిస్తుంది 🙂 ఓపిక ఉన్నవరకు కొనసాగించాలనేదే నా ఉద్దేశం, అమ్మ దయ ఎలా ఉంటే అలాగే….
   ధన్యవాదాలు.

  • అమ్మాయ్ అనురాధ,
   నొప్పి ఒక బాధ, అన్నీ ఎదురుగా కనపడుతూ ఉండగా ఏమీ తినలేని బాధ అసలు ఎక్కవది 🙂 అలవాటు పడుతున్నా.
   ధన్యవాదాలు.

 4. “చెప్పులోన రాయి …… ” పద్యంలో జేర్చదగినది పంటినెప్పి కూడా , శర్మ గారూ. “ఇంతింత గాదు” అది.
  ఏమైనా ఆ బాధ నుంచి బయటపడటం కాస్త రిలీఫ్ (“పన్ను” చెల్లించుకోవలసి వచ్చినా). మీకు త్వరలో పూర్తి ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాను.

  • మిత్రులు నరసింహారావు గారు,
   ఇదివరలో పన్నుపోటు,’పన్ను’ పోటు, వెన్నుపోటుల గురించి రాసేసేనండీ!. 🙂
   https://kastephale.wordpress.com/2012/01/03/
   పళ్ళు కట్టించుకున్నవారంతా మేం కట్టించుకున్నామన్నారే కాని ఈ బాధ చెప్పలేదు చూడండి. మూడు నెలలు ముచ్చటగా తప్పదండి. 🙂
   ధన్యవాదాలు.

 5. “మానవుడు ఎంత బలహీనుడు, ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉన్నంతకాలం నా అంతవాడు లేడని అహంకరిస్తాడు, ”
  మీరు వ్రాసే ప్రతీ వాక్యం ఓ అనుభవసారం … మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు చల్లగా చూసి మరిన్ని అద్భుతమైన సందేశాలు మొరో ముప్పై ఏళ్ళు మాకు అందించేలా చేయాలని కోరుకుంటాను

 6. భలే వారండీ శర్మ గారు,

  డాక్టరమ్మాయి దగ్గరకొస్తే కుర్చీలో పడుకోమంది … కుర్చీ లో ఎట్లా పడుకుంటా రండీ !!

  నిన్నటిదాకా ఏవో తాగడం తో నడిచిపోయింది … అమ్మో తాగుడూ మొదలెట్టేరు ??!!

  జేకే !

  త్వరగా కోలు కోండి ! !

  సర్వేశ్వరుని దయే అంతా ! ఇచ్చినవాడు వాడే, తీసుకుంటున్నా వాడూ వాడే ! అంతా ప్రేమ సూత్రం లో ‘మణి గణాన్ ఇవ !!

  శుభోదయం
  చీర్స్
  జిలేబి

  • మిమ్మల్ని “జిలేబి” అనేకన్నా “బిజిలీ” అనడం సరైనదేమోనని అనిపిస్తోంది!!!
   మీ వ్యాఖ్యలు ‘చురుక్కు” మన్నా అందులో “చమక్” ఎక్కువ 🙂
   -సుందరం

   • సుందరం జీ,
    నా బ్లాగు మీరు ఎక్కువగా చదివేవారిలాగా, బాగా పరిచయస్థులలాగా ఉన్నారు కాని ఇది మొదటి సారి అనుకుంటా వ్యాఖ్య రాయడం. అలవాటు పడకతప్పదు కదండీ, పడుతున్నా, మెత్త మెత్తగా చప్పరిస్తున్నా, కొత్తగా ఉంది 🙂 ఏమైనా మూడు నెలలు తప్పదు కదా!

    నిజమే అమ్మ కనుకనే ఎలా పిలిచినా పలుకుతుంది. అమ్మకి పిల్లల పట్ల ఉండేది అవ్యాజమైన ప్రేమ కదా!

    సుందరం పేరు చూస్తే మా నేమాని సుందరం అనే మిత్రుడు గుర్తొచ్చాడు. మా సుందయ్య ఎక్కడున్నాడో! ఎలా ఉన్నాడో కనుక్కోవాలి.
    ధన్యవాదాలు.

  • జిలేబిగారు,
   నిజమే! కుర్చీ లో పడుకోమంది డాక్టరమ్మాయి, అప్పుడు ఈ సంగతి గుర్తురాలా! ఈ సారెళ్ళినపుడు అడిగేస్తా 🙂

   శ్రీపాదవారు తాగడం అనేది కల్లు వగైరాలకే ఉపయోగించాలన్నారు, మిగిలినవాటికి పుచ్చుకోవడం అనే మాట వాడాలన్నారు. మరచాను సుమా 🙂

   అన్నీ ఆయనవే..విష్ణుమాయ…ఏదో మనదనుకుంటాం.
   ధన్యవాదాలు.

   • శర్మ గారూ,
    మీ ఆరోగ్యం కుదుటపడినందుకు చాలా సంతోషం.​
    అవునండీ “అమ్మ” కాబట్టే మనం ఎలా పిలిచినా పలుకుతుంది. 🙂

  • శొంఠి వేంకటరమణ గారు….ప్రముఖ వాగ్గేయకారుడు”త్యాగరాజు” గారి సంగీత గురువుగారు.
   వెంకయ్యగారు…..తండ్రిగారి ఆస్థిని అనుభవిస్తూ వ్యవసాయం చేస్తూండేవారు
   వేంకటరమణగారు…..తండ్రిగారి ఆస్థిని అనుభవిస్తూ…ఉపాధ్యాయవృత్తిచేస్తూ …ఇతరులకు “సాయం చేస్తూ” ఉండేవారు (తూగోజి లో రాయవరం దగ్గర “శొంఠి వారి పాలెం” )
   వేంకట్రామయ్య గారు……తండ్రిగారు “మిగిల్చిన ఆస్థి!!!” ని వాడుకుంటూ…గుమాస్తా గిరీ చేసేవారు, వారి తమ్ముడు సోమ సుందర శాస్త్రి గారు….తనవాటా తో పాటు అన్నగారి వాటానూ “వ్యాపారంలో ఉం(ముం)చి” దేశం అంతా తిరిగారు….
   ఇలా మా “తాతలు- నేతులు” తాగడంతో……
   రక్తంలో “ట్రైగ్లిసరైడ్స్” ఎక్కువై… చెట్టు కొకరు…పుట్టకొకరుగా….”పొట్టకొరకు” దేశాలు పట్టి….
   చిన్నప్పటి “హెడ్మాస్టర్” గారి పుణ్యమా అని శొంఠి (SONTHI) లో ఘాటు తగ్గి చివరికి ఉత్త సొంటి (SONTI) గా మిగిలాం.
   పైకి కారం(కొంటె) గా ఉన్నా “జిలేబి లో తీపి” అంటే ఎప్పటికీ మక్కువే 🙂
   అందుకే జిలేబి లా—-బిజిలీ వ్యాఖ్యలూ, వరూధినిలా…నర్మగర్భితసుభాషితాలూ ….ఇలా “అమ్మ” ఎలా పలికినా చదివి ఆనందిస్తున్నాం.
   జిలేబి గారికి
   నమస్కారాలతో
   సుందరం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s