శర్మ కాలక్షేపంకబుర్లు-అప్పులున్న వాడితోనూ…..

అప్పులున్న వాడితోనూ…..

“అప్పులున్న వాడితోనూ చెప్పులున్నవాడితోనూ వెళ్ళకూడదు”, ఇదొక నానుడి, జన సామాన్యంలో ఉంది.దీనికి అర్ధం చెప్పల్సినంతదేం లేదుగాని, అసలు వీళ్ళతో వెళితే ఏమవుతుందబ్బా అన్నదే ఆలోచన……

నాకో స్నేహితుడుండేవాడు, వాడు రెండురోజులు పరిచయం ఎవరితో ఉన్నా, వారి దగ్గర అప్పుచేసేవాడు. ఇది అతనికి మొదటి కాలం లో అవసరంగానూ, తరవాతి కాలంలో అలవాటుగానూ మారిపోయింది. ఇతను నా స్నేహితుడనీ, నాతోపాటే ఉద్యోగం చేస్తున్నాడనీ చాలా మందికి తెలుసు. నీ ప్రత్యేకతేంటీ? ఒకే ఆఫీసులో పనిచేసేటప్పుడూ, అని అడగచ్చు, నేను ఆఫీసులో పని చేస్తున్న స్థానికుణ్ణి, అదీ విశేషం. అందరూ నన్ను పక్క ఊరివాడిగా ఎరుగుదురు, దానికి ఇలా ఉద్యోగం చెయ్యడం, మరికొంతమందికి పరిచయం. ఇలా, నాతో ఇతనూ కలిసిరావడం చూసినవారు, చూడనివారు కూడా ఇతనికి అప్పులు పెట్టడం అలవాటయిపోయింది, నా స్నేహితుడు కావడం కూడా ఒక కారణం.. ఇతనిలా ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తున్న సంగతీ నాకు తెలియలేదు, తెలిసినా చేయగలది కూడా లేదు. ఎంతమందికని చెప్పగలను, ఇతనికి అప్పు పెట్టద్దని? ఇతనితో బయటికి వెళితే చాలామంది పలకరించేవారు, నమస్కారాలూ పెట్టేవారు, కుశలప్రశ్నలు వేయక వదిలేవారు కాదు, మొదటిరోజుల్లో. ఏంటబ్బా! నేనేమో స్థానికుడిని అదే ఆఫీస్ లో పని చేస్తున్నవాడిని నాకు నమస్కారాలు లేవుగాని, అదే ఆఫీసులో పని చేస్తున్న ఇతనికి ఎందుకు ఇంతమంది నమస్కారం పెడుతున్నారబ్బా అనే అనుమానం మాత్రం ఉండేది. ’అతి పరిచయాదవజ్ఞతా’ అనికదా! ఇక్కడివాడిని కనక నాకు కొంత గౌరవం తక్కువ చూపుతున్నారనుకునేవాడిని. కాలం గడచింది, ఇతను అప్పులు పుచ్చుకోడమేకాని తీర్చడం లేకపోవడంతో, సన్న సన్నగా మాటలు అంటూ ఉండేవారు. ఇతను పట్టించుకునేవాడు కాదు. ఆ తరవాత కాలంలో ఇతనితో బయలు దేరి ఎక్కడికి పోవాలన్నా, బయట కాలు పెట్టింది మొదలు ఎవరో ఒకరు నిలేసి, ‘బాకీ ఎపుడు తీరుస్తావని అడగడం’ దాకా వచ్చేసింది, పరిస్థితి. ఇప్పటికి ఇతనిలో మార్పురాలేదు. కాలం గడచింది, ఒకరోజొకరు నిలబెట్టి, అడిగి, రోడ్ మీద పరువుతీసేసేరు, చుట్టూ జనం చేరేరు, అప్పిచ్చినతను రెచ్చిపోయి మాటాడుతున్నాడు, జనాలకి అప్పు తీసుకున్నదెవరో తెలియదు, కూడా ఉన్నందుకు నా పరువూ పోయినట్టే అయింది, చాలా మంది నాకేసి అదోలా చూడడంతో. నా స్నేహితుడు ఆ రోజులలో తీసుకునే అప్పు వందనుంచి ఐదువందలదాకా ఉండేది. చిన్న మొత్తంలా కనపడినా, నాటిరోజుల్లో అవి పెద్ద మొత్తాలే. ఇలా అప్పులు చేసి ఏం చేసేవాడు? అని అనుమానమొచ్చింది, కాని అడగలేను.

ఒక రోజు ఇల్లాలు, ”మీ స్నేహితుని భార్య కొత్త వస్తువు కొన్నానని చూపించింది, చాలా బాగుంది, వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఏదో ఒక వస్తువు ఆవిడ కొంటునే ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది” అని గునిసింది. ”మనమే ఇలా ఉన్నామని” నసపెట్టింది. ”కొనమంటారా” అని నిలదీసింది. ”కావాలనుకుంటే, అవసరమైతే కొను, వద్దనలేదు” అని సరిపెట్టేను. ”ఏ సంగతీ ఖచ్చితంగా చెప్పరుకదా! కొను, వద్దు అని చెప్పచ్చుగా” అని కసిరింది. అన్నిటికి మౌనమే సమాధానం గాను, ఆయుధంగానూ చేసుకున్నా. చేసేది లేక, ”ఈ బతుకింతే! ఎప్పుడూ!!….., ఓ ముద్దా! ముచ్చటా!!” అని దీర్ఘాలూ తీసి, ముక్కు చీది ఊరుకుంది, చివరకి. ఇదయిన కొద్ది రోజుల తరవాత ఇల్లాలిని కూచోబెట్టి విషయం కదిపేను, ”అన్నీ బొల్లి కబుర్లే, నాతో మాటాడకండి” అని విసిరికొట్టింది. ”నేను చెప్పేది విని, నువ్వు ఏమన్నా పడతా”నని కాళ్ళబేరానికొస్తే, ”ఐతే చెప్పండి” అని చెవి పారేసింది. అమ్మయ్య! సమయం దొరికిందని వివరంగా, ఇద్దరి సంపాదనలు, మాకున్న పొలం మీద అదనపు రాబడి, ఖర్చులూ, ఇంటిలో ఉన్న మనుషులూ అన్నీ బేరీజు వేసి, కొద్దిగామనమే మేలు, ”అతను ఊరిలో అప్పులు చేసి తెస్తుంటాడు, ఈవిడ ఇలా వస్తువులు కొంటూ ఉంటుంది అని, పరువుపోయిన సంగతీ వివరిస్తే,”  ”అమ్మో! అలాగా!! నాకు తెలియదు కదా!!! ఆవిడేదో కొనేస్తోందనుకున్నా తప్పించి, ఇంత గోలుందని తెలియదు, కుండలోనైనా వండుకోవచ్చుగాని ఇలా నడివీధిలో పరువు తీసుకోలేములెండి” అని నాదారికొచ్చేసింది. మరి ఆ తరవాత సెన్సార్ కట్ 🙂 ..

ఆ ఆనంద, శుభ సమయంలో కొన్ని నిర్ణయాలూ తీసుకున్నాం. ఇంటిలోకి కావలసిన వస్త్తువులు, అందరికి కావలసిన బట్టలు వగైరా ఖర్చులన్నీ ఆమె చెయ్యాలి, మిగిలిన వ్యవహారాలన్నీ నా బాధ్యత. చేసిన ప్రతి ఖర్చూ లెక్క రాస్తుంది, రెండు మూడు నెలలకోసారి పద్దు పుస్తకం పట్టుకొచ్చి తీరుబడిగా సమీక్ష చేస్తుంది. ఏభయి ఏళ్ళకితం, అదుగో అలా నెల బడ్జట్, సంవత్సర బడ్జట్ వేసుకోడం ప్రారంభించాం. “ఎందుకోయ్! ఇదంతా” అంటే “అదేంమాట, ఏట్లో పారేసినా ఎంచి పారెయ్యాలన్నారు, ఏం చేసేనో చెప్పద్దా? మీరు చెప్పటం లేదా?” అని సాగతీస్తుంది. ఏం చేస్తాం వినడమే ఉత్తమం. ఇలా అవసరాలూ బాధ్యతలూ పంచుకున్నాం, మరెప్పుడూ తగువు రాలేదు. కుటుంబ రాబడి, ఖర్చుల అవసరాలు, భార్య,భర్త ఇద్దరికి తెలియాలి, ఒకరికే తెలిసి ఉంటే అది అరాచకత్వానికే దారి తీస్తుంది. సంప్రదింపులు అవసరం, ఏకాభిప్రాయం ఉత్తమం, లేదా ఏ ఒకరి అభిప్రాయాన్నీ మరొకరు మన్నించడం ఉత్తమోత్తమం. ఇద్దరూ సంపాదనపరులా ఇంకా ఆనందం, ఇది నాది, అది నీది అనుకోకుంటేనే ఆనందం, మనదనుకుంటే….

అప్పులున్న స్నేహితునితో వెళితే జరిగినదిదీ…. ఒక రోజు తీరిగ్గా మిత్రుడిని అడిగా, ”అప్పులు చేస్తున్నావు తీర్చటం లేదని గోల చేస్తున్నారు, నడిరోడ్ మీద నిలబెట్టి మొన్ననొకడు పరువు తీశాడు కదా ఏంటిదంతా?” అన్నా. మావాడు వెంటనే ”మనదగ్గరలేదు, వాడిదగ్గరుంది, అడిగేం, ఇచ్చేడు, వాడుకున్నాం, అప్పు అదనుకు వస్తుందా?, మన దగ్గరున్నప్పుడు తీరుస్తాం, కంగారు పడితే ఎలా?” అన్నాడు. ఇంకా కొనసాగిస్తూ ”ఒరే పిచ్చాడా! అన్నం పెట్టు అరిగిపోతుంది, వస్త్రం పెట్టు, చిరిగిపోతుంది. వాత పెట్టు మిగిలిపోతుంది. అన్నం, నువు పెడితే, తిన్నవాడెవడూ నిన్ను గుర్తుపెట్టుకోడు, అదే అప్పు చేసి ఎగ్గొట్టు ఎంతకాలమైనా నిన్ను గుర్తుచేసుకుంటూనే ఉంటాడ”ని గీత బోధ చేసేడు, మా వాడు తాను కమ్యూనిస్టునని చెప్పుకునేవాడు….. నాకయితే బుర్ర తిరిగింది. అయ్యా! ఇదండీ, అప్పులున్నవానితో సంగతి…..

ఇహ చెప్పులున్నవానితో సంగతి, చెప్పులున్నవాడితో వెళితే మనకు లేకపోతే, వాడు ముళ్ళలో పోవచ్చు, ఎండలో పోవచ్చు, అప్పుడూ బాధపడేది మనమే. నిజానికి ఇది చెప్పులున్నవాడన్నారు కాని రక్షణ ఉన్నవాడని చెప్పుకోవాలి. రక్షణ అంటే పెద్దవారబ్బాయో, అధికారి కొడుకో వగైరా వగైరా, వీళ్ళతో రక్షణ లేనివాడు వెళితే ఏమవుతుంది? ఈ రక్షణ ఉన్నవాడు వీధిలో అమ్మాయినైనా అల్లరిపెట్టచ్చు, చివరికి కూడా ఉన్నవాడు బలికావచ్చు. నిజానికి ఆ అమ్మాయి కూడా తప్పు చేసినవాడి పేరూ చెప్పలేదు, ఏం? ఎందుకనీ? వాడు పెద్దవారబ్బాయి కదా అదీ సంగతి. అందుకు ఎప్పుడేనా స్నేహం అంటే సమానమైనా స్థాయిలో వారితోనే రాణిస్తుంది. ఇటువంటి వారితో వెళితే మిగిలేది, వేదన.

అప్పులున్నవాడితో వెళితే పరువుపోతుంది లేదా హామీ ఉండవలసీ వస్తుంది, మనమూ ఆవేశపడితే, మొహమాటపడితే,చెప్పులున్నవాడితో వెళితే మనమే చిక్కుల్లోనూ పడిపోవచ్చు.. అదనమాట సంగతి.

చిన్నటపా రాయండీ అన్నారు,నిజమే..దీనికింత చరిత్ర ఉంది ఉంది..తగ్గించడమెలాగబ్బా?

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అప్పులున్న వాడితోనూ…..

 1. >>> ”ఈ బతుకింతే! ఎప్పుడూ!!….., ఓ ముద్దా! ముచ్చటా!!” అని దీర్ఘాలూ తీసి, ముక్కు చీది ఊరుకుంది, చివరకి. …

  అమ్మ వారా మజాకా మరి ! ఈ ముక్కు చీదుడు బాదుళ్ళ కి టాం అంటూ క్రింద పడని మానవ మాత్రుడు లోకం లో ఉన్నారా మరి !!

  >> కుటుంబ రాబడి, ఖర్చుల అవసరాలు, భార్య,భర్త ఇద్దరికి తెలియాలి …

  అబ్బే కుదరదండీ ! మా అయ్యరు గారి రాబడి మాకు తెలియాలి ! మా రాబడి ‘జామా’ ఖర్చు అబ్బే చాలా గోప్యం ! చెప్పం !

  అప్పులున్న వాడితో నూ, చెప్పులున్న వాడితో ను మాత్రమె కాదండోయ్ – మీలా మేటరు సత్తా ఉన్న వారి తో ను సమ ఉజ్జీ కి రాలేము !! జేకే !

  సూపర్ టపా
  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   నిత్య సత్యాలూ, జీవిత సత్యాలూ చెప్పేరు. అంతే కదండీ!

   >>>>అప్పులున్న వాడితో నూ, చెప్పులున్న వాడితో ను మాత్రమె కాదండోయ్ – మీలా మేటరు సత్తా ఉన్న వారి తో ను సమ ఉజ్జీ కి రాలేము !! జేకే !>>>

   అహహ బలే చెప్పేరండి.
   ధన్యవాదాలు.

 2. దృశ్య రూపకంగా రమణగారి మిధునాన్ని భరణిగారు తెరకెక్కిస్తే చూశాం.చాలా ఆనందించాం.నిజజీవితంలొ మిధునాన్ని మీ జీవనసహచరితో కలసి జరిగిన సంఘటనలను ఉటంకిస్తూ వ్రాసిన పోస్టు చదివి “ఆహా ఇదేకదా మిధునం అంటే” అని అనుకోకుండా ఉండలేకపోయా. మొదలుపెట్టినవిషయం బాగుంది,మద్యలో మీ మిధునం కధా బాగుంది.రమణగారి కధలో లేని ఆర్ధిక అంశాన్ని స్పృశించారు.అవికూడా జీవితంలో తప్పనిసరి అంశాలేకదాండి.ధన్యవాదాలు.నాకు చాలా బాగా నచ్చింది.ఆలూ మగలమద్య ఏవిషయంలోనూ అరమరికలుండకూడదని మీరుచెప్పిన విధానం,దానికి శ్రీమతిగారు స్పందిచినతీరు బాగానచ్చాయ్.మొత్తం మీద మీ పోస్టు బాగా నచ్చింది.మరోసారి ధన్యవాదాలు అందుకోండి,మీకు,మీశ్రీమతి గారికి.

  • రాజ్య లక్ష్మి గారు,
   ఇప్పటికీ నిత్యమూ ఏదో ఒక సందర్భం లో ఈ మిథునం నడుస్తూనే ఉంటుందండి, మళ్ళీ ఆవిడ దగ్గర చెప్పకండేం 🙂 అలవాటయిపోయిందండీ. అసలు భార్య, భర్త మద్య దాపరికాలేంటండీ బాబూ! వెధవ పని చేసిన చెప్పెయ్యడమే, తిట్లు తినెయ్యడమే, కమ్మహా ఉండదూ!
   ఆర్ధిక విషయాలలో దాపరికం అసలు కుదరదండి….
   ధన్యవాదాలు.

 3. అప్పులున్న వారితో కలిసి పనిచేయటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో నాకు ప్రత్యక్షంగా అనుభవమేనండీ. అప్పు ఇవ్వకండి తరువాత ఇబ్బంది పడతారు అని ఇచ్చే వారితో చెప్పాలనిపించినా చెప్ప లేక పోయేదాన్ని చాడీలు చెప్పినట్లు ఉంటుందేమో అని. కొన్నాళ్ల తరువాత అప్పు ఇచ్చిన వారి ఇక్కట్లు చూసి అయ్యో అనిపించేది.ఈ మధ్య బదిలీ అయ్యాక ఆ బాధ తగ్గింది.ముందు టపా లో ఆరోగ్యం కాస్త బాగా లేదన్నారు. ఇప్పుడు బాగుందాండీ?

 4. శర్మ గారూ ,

  నమస్తే . శుభోదయం .

  మీరు వ్రాసే టపాల వల్ల సమాజంలోని సగటు మానవుల జీవన్ గమనానికి అత్యవసరమైనవి .
  ఈ క్రిందవి సంసారం సజావుగా సాగేటందులకు , సంతోషాన్ని ఆసాంత ఆస్వాదించేటందులకు అవసరమైన సూత్రాలు .

  ” కుటుంబ రాబడి, ఖర్చుల అవసరాలు, భార్య,భర్త ఇద్దరికి తెలియాలి, ఒకరికే తెలిసి ఉంటే అది అరాచకత్వానికే దారి తీస్తుంది. సంప్రదింపులు అవసరం, ఏకాభిప్రాయం ఉత్తమం, లేదా ఏ ఒకరి అభిప్రాయాన్నీ మరొకరు మన్నించడం ఉత్తమోత్తమం. ఇద్దరూ సంపాదనపరులా ఇంకా ఆనందం, ఇది నాది, అది నీది అనుకోకుంటేనే ఆనందం, మనదనుకుంటే…. “

  • శర్మాజీ,
   కుటుంబ రథానికి భార్య భర్త రెండు చక్రాలు. రెండూ ఒక వైపు సమానంగా దొర్లితేనే….లేకపోతే బండి బోల్తాకొడుతుంది…ఈ చక్రాలని కలిపి ఉంచే ఇరుసే పెళ్ళి బంధం కదా 🙂
   అసలు భార్యకు, భర్తకు చెప్పకుండా దాచుకునేవేం ఉంటాయంటారు ?
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s