శర్మ కాలక్షేపంకబుర్లు- న+ద్వైతం=అద్వైతం

 న+ద్వైతం=అద్వైతం

“శర్మ గారూ !

మీ కష్టేఫలి బ్లాగ్ postings నచ్చి నా భావాలను మీతో పంచుకోవాలనిపించి….​”
అన్నారు శ్రీభావరాజు శ్రీనివాసుగారు. చదువు సంధ్య లేనివాడి సొల్లు కబుర్లకి ఇంత విలువిచ్చి శ్రీ భావరాజు శ్రీనివాసుగారు నా బ్లాగును ఓపికగా చదివి ఇచ్చిన ఈ వ్యాఖ్యకు వినమ్రతతో తలవంచుతున్నా. వారు చిన్నవారు కనక శుభాశ్శీస్సులు తెలుపుతున్నా! “దీర్ఘాయుష్మాన్భవ”.
శంకరులు తమ ఆలోచనకు అద్వైతం అని పేరు పెట్టేరు, చాలా గొప్ప పేరు పెట్టేరని నా ధృడమైన విశ్వాసం. ఆయనొక సూపర్ మాస్టర్ సైకాలజిస్ట్. అద్వైతం అంటే రెండు కానిది అని అర్ధం, అలా ఎందుకనాలి? రెండు కానిదయితే మూడవుతుందా అనేది నాలాటి అల్ప జీవులకు అనుమానం రావచ్చు, కాని సమాధానం వెంఠనే దొరుకుతుంది, రెండే కాదని చెబుతున్నపుడు అది మూడెలా అవుతుందిరా తింగరి బుచ్చీ అని. మరి రెండు కానిదయితే ఒకటే? అనా అంటే అవును అనేదే సమాధానం. అలా ఒకటి అనే చెప్పచ్చుగా. అదే గొప్పతనం, ఈ ప్రపంచంలో సర్వమూ రెండు ప్రకృతులు,అదే ద్వందాలు, స్త్రీ పురుషులు, మిట్ట పల్లాలు,శీతోష్ణాలు, కష్ట సుఖాలు…..ఇలా, కాలాలు మూడయినా ప్రకృతులు రెండే. నిన్నను ఉన్నది, నేడు ఉన్నది, రేపు ఉండునో లేదో తెలియనిది, లేకాపోవచ్చు, లేనిది. నిన్నటిది నిజం నేటిదీ, రేపటిదీ నిజం, కాని రెండుగా కనపడేదంతా ఒకటే, శివ శక్తులలా, పార్వతీ పరమేశ్వరులలా. ఉన్నది, లేదు..అస్తి, నాస్తి..రెండులాకనపడేదంతా ఒకటే……. నా కబుర్లకేం కాని, అన్నట్టు ఒక మాట ఈ “సిరివెన్నెల” నా సహోద్యొగి, ఒకప్పుడు, అని చెప్పుకోవడం నాకు గర్వ కారణం. శ్రీభావరాజు శ్రీనివాసుగారు అద్వైతం గురించి చెప్పినది, నాకు వారు దయతో పంపినది, మీకోసం యధాతథంగా…
 https://www.youtube.com/watch?v=76C2W45eE1A

“ఇందులో ….

 1. అద్వైతం      2. నేనెవరు?     3. జగమంతకుటుంబం (శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారి “జగమంతకుటుంబం నాది” పాట ఫై విశ్లేషణ) ఉన్నాయి .   మూడూ అద్వైతానికి మూడు రకాల వ్యాఖ్యానాలు .ముందుమాటవ్యక్తి స్వేచ్ఛ విశృంఖలతగా మారి ప్రమాదంగా  పరిణమించకుండా ,నియంత్రించడానికి చట్టాలు,సంస్కారం సహకరిస్తాయి. భారతదేశంలో చట్టాలకంటే సంస్కారానికే ప్రాధాన్యత  ఎక్కువ. మతము ,సంస్కృతి ,సాంప్రదాయం ,కళలు, వేదాంతం ఇవన్నీ సంస్కారాన్ని పెంపొందించడానికే ఉన్నాయి. ఈ దృష్టి తోనే శ్రీ సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు “భారతీయుడు కానివాడు మానవుడు కాలేడు”అన్నారు. చట్టాలకు ప్రాధాన్యత ఇచ్చే  పాశ్చాత్యులు ఈ దేశాన్ని పరిపాలించడం వల్ల , ఇప్పటి పాలకులు పాశ్చాత్య పద్ధతికే ప్రాధాన్యత యిస్తూ స్వేచ్ఛను నియంత్రించడానికి, ప్రత్యేక చట్టాలను రూపొందించడం, చట్టాల పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ దేశ సాంప్రదాయం కాకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడంలేదు. దేశం(వ్యక్తి) ఆత్మ పరిశీలన చేసుకుని మళ్ళీ సాంస్కృతిక పునరజ్జీవనాన్ని పొందితే , అపుడు చట్టాలు చేసే పనిని సంస్కారం చేస్తుంది .గురువు లేకపోయినా ఏకలవ్యుడు విలువిద్యను సాధించినట్లు, సంస్కారాన్ని పెంపొందించే పరిస్థితులు సమాజంలో లేకపోయినా, స్వయంసంస్కారాన్నిసాధించవచ్చు. అలా సంస్కృతి ఫై నమ్మకముంచి స్వయం సంస్కారాన్ని సాధిస్తున్నవారికి, నాస్తికవాదులు, హేతువాదుల్లోని అతివాదులు అడుగడుగునా అడ్డుతగులుతూ ఉంటారు. వీరికి నిర్మూలించడమే గానీ , నిర్మాణం చేసే శక్తి లేదు. కొండనాలుక్కి మందేయ్యమంటే ఉన్న నాలుకను ఊడగోడతారు. మూఢనమ్మకాలను పోగట్టవలసిన హేతువాదంతో ,ఏకంగా నమ్మకాలనే నిర్మూలించే ప్రయత్నం చేస్తారు . ఇది అయ్యే పని కాదని చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది .భారతీయ సంస్కృతిలో జీవం ఉంది. అందుకే తరతరాలుగా ఎవరెన్ని దండయాత్రలు చేసినా ప్రతిఘటించి నిలబడుతోంది. హేతువాదులు ప్రజల విశ్వాసాలను ప్రశ్నించే బదులు అసలు ఈ నమ్మకాలు తరతరాలుగా నిరాటంకంగా కొనసాగుతూ రావడంలోని అంతర్యం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే బావుంటుంది.నేటి పరిస్థితుల్లో , సాంకేతిక విప్లవంతో సమానంగా సాంస్కృతిక విప్లవం సాగాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ రచన చెయ్యడం జరిగింది .

                            అద్వైతం

   వినాయకుడి వివాహఘట్టాన్నిపరిశీలిస్తే ముందుగా లోకాన్ని చుట్టి వచ్చిన వానికే వివాహం జరిపిస్తానని శివుడు కుమారస్వామికి , వినాయకునికి పరీక్ష పెడతాడు . కుమారస్వామి వెంటనే బయలుదేరుతాడు . వినాయకుడు అలోచించి సృష్టిలో ఉన్నది ప్రకృతి పురుషులైన తన తల్లిదండ్రులు శివపార్వతులేనని, వారి చుట్టూ తిరిగితే లోకాన్ని చుట్టివచ్చినట్టేనని  అద్వైత దృష్టితో వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు . ఆ దృష్టి ఉండడం వల్లే వినాయకుడు కాలు కదపకుండానే కార్యం సాధించాడు .

  అద్వైత దృష్టి మనకు తెలియకుండానే అప్పుడప్పుడు ముఖ్యంగా పర్వదినాల్లో కలుగుతుంది.పండగలప్పుడు బంధువులు స్నేహితులు అందరూ ఏకం అవుతారు . దానధర్మాలు చేస్తారు . సాంఘిక చారిత్రక ఆర్ధిక వ్యత్యాసాలకు అతీతంగా అందరూ ఒకటనే భావన కలుగుతుంది . మర్నాడు మళ్ళీ మామూలే . పండగ రోజు సామూహికంగా పొందిన అద్వైతానుభూతిని వ్యక్తిగతంగా పొందగలిగితే ప్రతిరోజూ పండగే . ఇందుకోసం పైసా ఖర్చుపెట్టక్కర్లేదు . కాలు కదపక్కర్లేదు . వినాయకుడిలా సూక్ష్మంలోనే మోక్షం పొందవచ్చు .

   1

   అద్వైతం అన్న మాట లోనే ద్వైతం ఉంది . ద్వైతం అంటే రెండు . ఆ రెండూ ఒక్కటనే భావం అద్వైతంలో ఉంది .

 2. 1+1  ×  1-1      =      1

 3.          ద్వైతం                 అద్వైతం

      (ఆలోచన )                   (అనుభూతి)

   

  ద్వైతంలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ లు (1+1  ×  1-1) అద్వైతంలో ఒకటి (1) అయ్యాయి.అలాగే ఆలోచనల్లో ఉండే పాజిటివ్ నెగిటివ్లు (సుఖం x దుఃఖం, మంచి x చెడు  మొదలైనవి ) అనుభూతి లోనే ఏకం అవుతాయి.  ఏకం అయినప్పుడు మిగిలేది ఏకాంతం.నిశ్శబ్దం .అనుభూతి  కిటికీలాంటిది . అది రెండిటిని కలుపుతుంది .

                                    1+1       ×   1-1         =        1

                                     ప్రోటాన్    ×  ఎలెక్ట్రాన్   =   పరమాణువు

  సుఖం    ×    దుఃఖం   =   మానవుడు

   పరమాణువు లో భిన్న విద్యుదావేశాలు కల ఎలెక్ట్రాన్ ప్రోటాన్ లు ఒకదాని ఆవేశాన్ని మరొకటి తుల్యం చేస్తుండడం వల్ల పరమాణువు స్థిరంగా ఉంటోంది . ఎలెక్ట్రాన్ ప్రోటాన్ లలో ఏ ఒక్కటి లేకపోయినా పరమాణువు స్థిరత్వాన్ని కోల్పోయి ఆవేశపూరితమౌతుంది . అలాగే మానవునిలో ఉండే సుఖ దుఃఖాలు ఒక దాని ఆవేశాన్ని మరొకటి తుల్యం (neutral) చెయ్యకపోతే, అతడు స్టిరత్వాన్నికోల్పోయి ఆవేశపూరితుడౌతాడు .

   ఆపిల్ పండు ఉంది . దాన్ని గూర్చి ఎన్ని విధాలనైన వర్ణించవచ్చు . కానీ దాన్ని కంటితో వస్తువుగా చూసినపుడు కలిగేది ఒక అనుభూతి . దాన్ని కొరికి తినడం మరొక అనుభూతి . ఈ రెండూ కాక మూడో రకం దాన్ని గూర్చి హెన్రీ మికాక్స్ చెబుతాడు. “ I set an apple on the table.Then I set myself in the apple. what utter calm.” రెండు వస్తువులు విడివిడిగా ఉన్నపుడు వాటి మధ్య communication ఉంటుంది . ఆ రెండూ comm ‘union’  ఐనపుడు      (ఒక్కటైనపుడు) ఇక వాటి మధ్య communication ఉండదు . మిగిలేది నిశ్శబ్దం (calmness)

  ఫై ఉదాహరణ లో దృశ్యమూ(apple) ద్రష్ట (నేను) ఒకటి అయ్యాయి . ఇలా (దృశ్యము x  ద్రష్ట) ; (సృష్టి x  నేను) ఒక్కటి కావడమే మూడో రకమైన అనుభూతి . అద్వైతానుభూతి.

   

                                       1+1  ×  1-1      =       1

                                   రెండు              ఒకటి

  ఒకటిని రెండుగా విడగొట్టి చూసేవారిది లౌకిక దృష్టి . రెండింటిని కలిపి ఒకటిగా చూసేవారిది అలౌకిక దృష్టి . విష్ణుమూర్తిది లౌకిక దృష్టి. ఆయన దేవతల్ని , రాక్షసుల్ని  వేరుగా చూస్తాడు . అమృతాన్ని రాక్షసులకు దక్కనివ్వలేదు.  పరమేశ్వరుడిది అలౌకిక దృష్టి.  ఆయన అందర్నీ ఒక్కలాగే చూస్తాడు.రాక్షసులైనా వారు చేసిన తపస్సు ఫలిస్తే కోరింది ఇస్తాడు

  కేశవుడిది లౌక్యం(logic).  శివుడిది ఆత్మీయత(music)

  లోకంలో ఉంటూ లౌకిక సమస్యలు ఎదుర్కుంటూనే అలౌకిక ఆనందాన్ని పొందడానికి వైష్ణవ తత్వం , శివ తత్వం (logic and music ) రెండూ అవసరమే . శివ కేశవుల మూర్తులు వేరైనా వారి  మూల తత్వం ఒకటే. అది సర్వేజనాస్సుఖినోభవంతు. అంతర్ముఖుడైన శివుడు అంతరంగాన్ని సంస్కరిస్తే ,బహిఃర్ముఖుడైన   విష్ణువు బాహ్య పరిస్థితుల్ని చక్కదిద్దుతాడు . సంస్కరణ బహిఃరంతరాలు  రెండిట్లోనూ జరగవలసిందే. అప్పుడే ఆదర్శానికి, ఆచరణకు; మాటలకు, చేతలకు పొంతన కుదురుతుంది.

  3

                               ( 1+1 ×  1-1)+1  ×     ( 1 )-1          =       1

                                  వియోగం                సంయోగం                ఒకటి

  జీవితంలో ఎదురయ్యే సంయోగ వియోగాలను ఒక్కటి చెయ్యడంలో వ్యక్తి పొందే సాఫల్య వైఫల్యాలే సుఖ దుఃఖాలకు  కారణమౌతుంటాయి . ధర్మార్ధకామమోక్షాలలో అర్థకామాల వల్ల  సంయోగ వియోగాలు ఏర్పడితే , మొదటిదైన ధర్మం ఆ సంయోగ వియోగాలను ఒక్కటి చేస్తుంది. అర్థకామాలవల్ల పాండవులతో ఏర్పడిన సంయోగ వియోగాలను ఒక్కటి చేసే ధర్మం(కృష్ణుడు) కౌరవుల వద్ద లేకపోవడంతో వారు యుద్ధంలో ఓడిపోయారు . అలాగే దక్ష యజ్ఞానికి శివుడు(ధర్మం) తప్ప అందరూ ఆహ్వానింపబడ్డారు . ధర్మాన్ని ,శివుణ్ణి  నిర్లక్ష్యం చెయ్యడంతో దక్ష యజ్ఞం ధ్వంసమైంది . శివపార్వతుల మధ్య ఏర్పడిన సంయోగ వియోగాలను ధర్మం (వివాహం ) ఒక్కటి చేసింది .

  ఈశ్వరః  సర్వభూతానాం హృద్దోశోర్జన తిష్ఠతి . — అన్ని జీవులలోను ఉన్న భగవంతుణ్ణి   తనలో గుర్తించి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చినపుడే వ్యక్తికి తన జీవితం తనదిగా కష్టమైనా సుఖమైనా సంతృప్తి నిస్తుంది .

  ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చే స్థితిని పొందినప్పటికిని మానవ జీవితంలో అర్థంకాని భాగం మిగిలే ఉంటుంది . తను చేసే కర్మతో, తన ధర్మ నిర్వహణలతో ,భాధ్యతతో ప్రమేయం లేకుండా సంభవించే అనుభవాల్ని మనిషి ఎలా అన్వయం చేసుకోవాలి. వాటిని యాధృచ్చికమని , దైవికమని వ్యహరిస్తూంటాం . ఒక స్త్రీ తన కుమారుడు హఠాత్తుగా మరణించడం చూసి అంతులేని ఆవేదనకు గురైంది . ఆమె పొందే బాధను ఏ ధర్మంతోనూ అన్వయించడం సాధ్యం కాదు . ఇక్కడ విక్టర్ ఫ్రాంక్ అనే మనస్తత్వశాస్త్రజ్ఞుడు ఒక సామ్యం చెబుతాడు . ఒకానొక కోతిని శాస్త్ర పరిశోధనలో మానవులకు కావలసిన రోగ నివారణౌషధం కనిపెట్టడం కోసం మాటి మాటికి సూదితో పొడిచి రక్తం తీస్తూంటారు . ఆ కోతి అనుకుంటుంది “ఈ యాదృచ్చికమైన ,అకారణమైన బాధ ఏమిటి నాకు? ఇంకా ఎన్నిసార్లు అనుభవించాలో ” అని.  దాని బాధకూ మానవలోకంలో ఒకానొక ప్రయోజనానికి సంబంధం ఉన్నదని దాని కెట్లా తెలియటం ? వీలుకాదన్నమాట ! అలాగే పై చెప్పిన స్త్రీ తో “అమ్మా , నీవు పొందే ఆవేదనకు అర్ధం ,మానవుని మేధకూ , అవగాహనకు అందని ఏ లోకంతో, ఏ పరమార్ధంతో ముడిపడి ఉన్నదో ఎవరు చెప్పగలరు.” అంటూ ఆ శాస్త్రజ్ఞుడు ఆమెతో స్వాంతన పలికాడట.యాదృచ్చికమూ ,దైవికమూ అన్నదానికి అర్ధం , సమాధానం మాటల్లో అనగా బుద్ధితో ఆలోచించి తేల్చేది కాదు. ఆ సమాధానం జీవించటంలో ఎవరికి వారు తమ అస్తిత్వం నుంచీ పొందవలసిందే . అలా పొందగలిగినవాడే ఆధ్యాత్మికమానవుడు . ఇక్కడ గమనించవలసిన ముఖ్యాంశం – తత్వ జిజ్ఞాస చెయ్యడం , సాధన ఆధ్యాత్మికత కాదు . తత్వమే తాను కావటం ఆధ్యాత్మికత . తత్వమూ తానూ ఒక్కటి కావడమనే మూడోరకమైన అద్వైతానుభూతి ఇక్కడ వర్తిస్తుంది . “ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు …. పురుషులందు పుణ్య పురుషులు వేరయా” అన్నట్లు ఆధ్యాత్మిక మానవుడు లోకంలో అందరిలా వ్యవహరిస్తూనే అస్తిత్వ వైశిష్ట్యం వల్ల నిర్లిప్తుడై వేరుగా ఉంటాడు .

  అద్వైతం రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని , సంఘర్షణను (సంయోగ వియోగాలను )గుర్తించి వాటి మధ్య సమన్వయాన్ని సాధిస్తుంది . ఆ సమన్వయమే ధర్మం. ధర్మాన్ని గ్రహించలేని స్థితిలో, అర్జునుడు కృష్ణుణ్ణి ఆశ్రయించినట్టు ,భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ధర్మం దానంతట అదే స్పష్టం అవుతుంది .

   

  నేనెవరు?

   ఈగ ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన కథ అందరికీ  తెలుసు. పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ,ఒక అన్వేషణగా సాగి ,పేరు మళ్లీ గుర్తుకుతెచ్చుకోవడంతో ముగుస్తుంది .

  మానవుని కథాఅంతే. ఈగ ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయినట్టు,లౌకికవ్యవహారాలలో పడి,మానవుడు తాను ఎవరైనదీ మరచిపోతున్నాడు. “నేనెవరు?” అని ప్రశ్నించుకొని,సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు. ఆ అన్వేషణే ఆధ్యాత్మిక సాధన. మానవుని చరిత్ర.

  చిన్నతనంలో తరతమ బేధాలు తెలియవు. ఆ అమాయకత్వం అమూల్యమైనది. పెద్దయ్యాక ‘సామజిక స్పృహ’ ఏర్పడుతుంది. అంతరాలు,అభిప్రాయాలు ఏర్పడి నామరూపాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ సామాజిక స్పృహ  కొన్నాళ్ళకు నిస్పృహ కలిగిస్తుంది.దానికి తోడు చేసే పనే కాదు,తీరిక సమయంలో చేసే కాలక్షేపం కూడా యాంత్రికం అయిపోవడం. దీనివల్ల అర్థాన్ని గడిస్తున్నా, బ్రతుకు అర్ధశూన్యంగానే వుందే అనిపిస్తోంది.

  ఈ నిస్పృహ నుండి బయటపడి జీవితం పట్ల ఆసక్తీ,ఉత్సాహం ఏర్పడాలంటే సమాజాన్ని, పరిస్థితుల్ని దాటి చూడాలి. అత్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ఇందుకు సంస్కృతి సహకరిస్తుంది.

   

                                       1

   

  శివుడు ఆత్మ స్వరూపుడు . అందువల్ల శివుడి లక్షణాలనే ఆత్మ లక్షణాలుగా గుర్తించవచ్చు.

  శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు.

  శివుడికి స్వపరబేధం లేదు. ఆయన అందర్నీ ఒక్కలాగే చూస్తాడు .రాక్షసులైనా వారు చేసిన తపస్సు ఫలిస్తే, కోరింది ఇస్తాడు .

  శివుడు అమృతాన్ని విషాన్ని వేరుగా చూడడు . సత్ప్రయోజనం కోసం అవసరమైతే విషం పుచ్చుకుంటాడు.

  ఈశ్వరుడు సంసారాన్ని, సన్యాసాన్ని విడగొట్టడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చి బూడిద చేసినవాడే ,పార్వతిని వివాహమాడి సంసారి అయ్యాడు. మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈ భిన్న తత్వాల వెనక ఉన్న ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం . ఈ తత్వాన్నే సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు, ‘సంసార సాగరం నాదే ,సన్యాసం శూన్యం నావేలే’ అని తన ‘జగమంత కుటుంబం’పాటలో వ్యక్తం చేసారు

   

  శివుడు జననాన్ని ,మరణాన్ని వేరుగా చూడడు . కాబట్టే ఆయనకు జననమరణాలు లేవు . మృత్యుంజయుడు .

  శివుడికి నామరూపాలకు అతీతుడు  . అందుకే ఆయన లింగరూపంలో వున్నాడు .

  శివుడికి మూడోకన్ను(జ్ఞాననేత్రం) ఉంది.అందువల్ల ఆయనకు తన్ను గూర్చిన జ్ఞానం(ఆత్మజ్ఞానం) ఉంది .

  శివపార్వతుల  వివాహ ఘట్టాన్ని పరిశీలిస్తే, మన్మధుడు,పార్వతి కలిసి శివుడికి తపోభంగం కలిగించి,శివుడి ఆగ్రహానికి గురై ,మన్మధుడు ప్రాణాల్ని ,పార్వతి శివుడి విశ్వాసాన్ని కోల్పోయారు.శివుడే ఆత్మ కాబట్టి శివుడి విశ్వాసాన్ని కోల్పోవడమంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడమే . ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన పార్వతి అందుకోసం తపస్సు చేసింది . ఆత్మవిశ్వాసం కోసం ప్రయత్నించడం ఒక తపస్సు . తపస్సు ద్వారా పార్వతి ఆత్మ(శివుడి)విశ్వాసాన్ని తిరిగి పొందింది . శివుడి సాక్షాత్కారం అంటే ఆత్మసాక్షాత్కారం పొందింది . శివపార్వతులు ఒక్కటయ్యారు . శివుడి శరీరం పార్వతి(ప్రకృతి)ఐతే ,పార్వతి ఆత్మ శివుడు(పురుషుడు). శివపార్వతుల,ప్రకృతిపురుషుల,దేహాత్మల ఐక్యరూపమే వ్యక్తి . అందువల్ల దేహాభిమానంతో సంసారంలో ఉన్నా,ఆత్మాభిమానంతో సన్యాసంలో ఉన్నా,దేహాత్మలను ఒకటిగా చూస్తూ వాటి మధ్య ఐక్యత సాధించడం ముఖ్యం .ఐక్యత లోపిస్తే ‘వ్యక్తి’త్వం లోపిస్తుంది .  అర్ధనారీశ్వర తత్వంలో వ్యక్తిత్వం ఉన్నది .

  శివపార్వతులిద్దరూ తపస్సు ద్వారానే ఒక్కటయ్యారు . తొలిచూపు ప్రేమలో (love at first sight ) శివుడికి నమ్మకం లేదు. అందుకే మొదట మన్మధుని జోక్యాన్ని,  పార్వతిని తిరస్కరించాడు . తపస్సు ద్వారా ఒకరి విశ్వాసాన్ని మరొకరు చూరగొన్న తర్వాతనే వారు వివాహం చేసుకుని అదిదంపతులయ్యారు. నేటి ప్రేమలో ఈ తపస్సు ,విశ్వాసం లోపించి, మన్మధుని జోక్యం ఉంటోందని , కొన్ని రాజకీయ పార్టీలు ‘ప్రేమికుల రోజు’ ను బహిష్కరిస్తున్నాయి .

  శివుడు తన దేహాన్ని (ప్రకృతిని) ఆలిగా చేసుకున్నాడు . ఈ దృష్టి తోనే శాస్త్రి గారు ‘నా హృదయమే నాకు ఆలి’ అన్నారు తన ‘జగమంతకుటుంబం’ పాటలో. (ఈ పాట పై  విశ్లేషణను ముందు పేజీలలో చూడవచ్చు)

  2

   

  శివపార్వతుల (దేహత్మల) కలయికే వ్యక్తి . ఆ వ్యక్తి విష్ణుమూర్తి అనుకుంటే , విష్ణువుకు నిశ్చితరూపం లేదు. ఆయన ఆకాశంలో పక్షిగా,నీటిలో చేపగా, ఇలా పరిస్థితిని బట్టి అవతారాన్ని మారుస్తూ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాడు. అలా ,మానవునితో సహా అన్ని జీవులూ ఆయన అవతారాలే అయినపుడు నేను ఎవరిని?. మానవుణ్ణా! మాధవుణ్ణా!. మానవుణ్ణి అనుకుంటే నేనొక రూపానికి నామానికి పరిమితుణ్నవుతున్నాను. ఇది బంధం. మాధవుణ్ని అనుకుంటే నేను అపరిమితుణ్ని. అన్ని రూపాలు నావే. ఇది స్వేఛ్చ. అన్నిరూపాలు నావే నంటూ సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు,జగమంతకుటుంబం పాటలో “కవినై ,కవితనై ,భార్యనై భర్తనై ,రవినై శశినై ,దివమై నిశినై ,నాతో నేను సహగమిస్తూ …” అంటూ తన అపరిమితత్వాన్ని,స్వేచ్ఛను వ్యక్తం చేసారు . ఆ పాటలోనే ఒంటరితనాన్ని,ఏకాకిజీవితాన్ని(ఏకాంతాన్ని) ప్రస్తావించారు . అన్ని రూపాల్లో ఉన్నది నేనే అయినప్పుడు ఉన్నది నేనొక్కడినే .అందువల్ల నేను ఒంటరిని . ఏకాకిని.అన్ని రూపాలూ నావే కనుక నాది జగమంత కుటుంబం .

  అంతా నేనే అయినపుడు,ఇతరులను హింసించడమంటే, నన్ను నేను హింసించుకోవడమే అవుతుంది.

   

  3

    సృష్టి చేయాలంటే సృజనాత్మక శక్తి (బ్రహ్మ) కావాలి . విష్ణువు లోనే బ్రహ్మ ఉన్నాడు. ఆయనలోంచే పుట్టాడు(వ్యక్తం అయ్యాడు). అందువల్ల విష్ణువు తన్ను తాను పునఃసృష్టిoచుకుంటూ పరిస్థితిని బట్టి  అవతారాన్ని మారుస్తున్నాడు .

  ఇపుడు , “నేనెవరు?”, అని మానవుడు ప్రశ్నించుకుంటే,

  దేహత్మలు ఉన్నందున అతడు శివుడా ?

  మానవరూపంలో ఉన్న విష్ణువా ?

  తనను తాను పునఃసృస్టించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగలడు కాబట్టి బ్రహ్మా?

  త్రిమూర్తులు ముగ్గురు లేరు . ముగ్గురూ ఒక్కరిలోనే ఉన్నారు . ఆయనే పరబ్రహ్మ . బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ స్వరూపాలు .

  ఫై ముగ్గురూ మానవుని ఆశ్రయించుకొని వున్నారు కాబట్టి నేను(అహం) ఎవరు ?

   

  ‘ అహం బ్రహ్మాస్మి’

   

  ఈ వేదాంత మహావాక్యంలోని  బ్రహ్మ, పరబ్రహ్మ.

  శివుడికున్న మూడోనేత్రం(జ్ఞాననేత్రం) తనకూ వుంది కాబట్టి మానవుడు తాను పరబ్రహ్మ స్వరూపుణ్నని గుర్తించగలడు.

   

  ************

  జగమంతకుటుంబం

  పాట

  పల్లవి   :  జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది

  సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే

  చరణం :  కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై

  మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో

  పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల

  నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ

  ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం

  కలల్ని,కథల్ని ,మాటల్ని ,  పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని

  కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని                                  //జగమంత//

  శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ‘ చక్రం ‘ సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు . కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్ఛిన ఘనత ఆయనదే .

                                               1+1  ×  1-1      =       1

                                                   రెండు                ఒకటి

                                       ( X+1 ×  X-1)+1   ×  ( 1 )-1   =     1

   

  పై సమీకరణంలో ‘1’ రెండుగా (1+1  ×  1-1) విడిపోయింది . రెండిట్లో ఒకటి (1+1) తిరిగి, క్రింది సమీకరణంలో , రెండుగా అనేకం(X+1 ×  X-1) గా మారిపోయింది . (X) స్థానంలో ఏ సంఖ్యనైనా ప్రతిక్షేపించుకోవచ్చు .సృష్టిలో ఉన్నది ఒకటే నని అదే రెండుగా అనేకంగా మారిపోయిందని అద్వైత తత్వసారాంశం ఈ తత్వానికి ఆదిశంకరాచార్యలు ఆద్యులు.ఈ అద్వైత తత్వానికి ఫై సమీకరణం ‘skeleton’ అయితే దానికి రక్త మాంసాలు కల్పించి ప్రాణం పోసింది శాస్త్రి గారి పాట. నవరసాలకు మూలమైన తత్వం ఈ పాటలో ఉంది .

                          

                                    ( X+1 ×  X-1)+1  ×     ( 1 )-1          =       1

                                  జగమంతకుటుంబం        ఏకాకిజీవితం             నేను(నాది)

   

  జగమంతకుటుంబం :   (X+1 ×  X-1) లో  X  బదులుగా (కవి ×కవిత),(భర్త  ×  భార్య),(భగవంతుడు × భక్తుడు) ….ఇలా ఒకరికొకరు వరసైన జంటలను ఎన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. కానీ ఏవరసకావరసే.తమ్ముడు తమ్ముడే  పేకాట పేకాటే, ఏమాటకామాటే .  ఒక  వరస పనిచ్తేస్తున్న సమయంలో రెండోది పనిచెయ్యదు . అలా ఏ వరసకు ఆ వరసను , ఏ రసానికి ఆ రసాన్ని విడివిడిగా గుర్తించడమే సామరస్యం .

  (2+1  ×   3-1)   ≠ 1

   ఫై సమీకరణంలో 2 వేరు ,3 వేరు . అందువల్ల అవి ఒకటి కాలేదు (≠ 1) అలాగే మనిషి మాటలకు చేతలకు పొంతన లే​కపోతే అతడు ‘వ్యక్తి’ కాలేడు .‘వ్యక్తి’త్వ లోపం వంచనకు,ఆత్మవంచనకు,సంఘర్షణకు దారితీస్తుంది . ఐక్యమత్యమే బలం అన్నట్టు మనస్సు,వాక్కు,కర్మ మూడింటికి పొంతన కుదిరి ఐక్యం (ఒకటి)గా ఉంటేనే నైతిక బలం సిద్దిస్తుంది. మనోవాక్కయకర్మలలో  ఏకత్వమే చిత్తశుద్ది ,నిజాయితీ.

   

   2 +1  ×  2 –1    =  1

  3 +1  ×  3 –1    =  1

               ఫై సమీకరణాలు ​రెం​డింటిలోనూ ఏకత్వం ,ఒకటి( 1) ఉంది .కానీ రెండు ​ సమీకరణాలు ఒకలా లేవు. భిన్నంగా ఉన్నాయి . ​ అలాగే ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు . ఉదాహరణకు శ్రీరాముడు,శ్రీకృష్ణుడు.వీరిద్దరిలోను, ఫై సమీకరణాల్లో లాగే ఏకత్వం-మనోవాక్కయకర్మలలో ఏకత్వం ​-ఉంది . కానీ  ఇద్దరి   జీవితమార్గాలు  ఒకలాలేవు .  విలక్షణంగా ఉన్నాయి. కారణం వారు ఏకత్వానికి,చిత్తశుద్దికి ప్రాధాన్యత యిచ్చి,అలావుండడానికి నిరంతర  సాధన  చెయ్యడం వల్ల ఆసాధన ఫలితం ఒక విలక్షణ జీవితవిధానంగా  దానంతట అదే రూపుదిద్దుకుంది .ఈ విలక్షణత అంతవరకు కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయాన్ని సమర్ధించవచ్చు ,లేదా వ్యతిరేకించవచ్చు . అలాకాకుండా ముందే ఏదో ఒక జీవితవిధానాన్ని ఆదర్శంగా పెట్టుకుని తదనుగుణంగా జీవించడం మొదలుపెడితే అది స్వభావానికి,పరిస్థితులకు విరుద్ధమై , మనోవాక్కయకర్మలలో  ఏక​త్వాన్ని (integrity)పోగొట్టి  అస్థిత్వాన్నే భంగపరుస్తుంది .అస్తిత్వంతో ఉండడమంటే ఏకత్వంతో ఉండడమే .అప్పుడే వ్యక్తిత్వము,విలువలు ,స్వేఛ్చ సిద్ధిస్తాయి .

  ఏకాకిజీవితం : ‘జగమంతకుటుంబం నాది’ ​​అనుకునేవాడికి ఏకాకిజీవితం తప్పదు . ఎందుకంటే అతడు  ఏ వర్గంలోను,వ్యవస్థలోను,వ్యక్తులతోను చేరడు . కాబట్టి అతడు ఏకాకి, సన్యాసి. ఎందులోనూ చేరడు కాబట్టే అందర్నీ కలుపుకుపోగలడు . అందువల్ల అతనిది జగమంతకుటుంబం ,సంసారసాగరం .

  నేను (సృష్టికర్త ): సంక్షిప్త రూపం లో ఉన్న 1  విస్తృత రూపం దాల్చి (X+1 ×  X-1) ​అయినట్లు , సూక్ష్మరూపంలో వుండే విత్తనం స్థూలరూపం పొంది వృక్షం అవుతున్నట్టు ,ఏకాకిగా వున్న ‘నేను’ ఇంతితై వటుడింతయై అన్నట్టు విశ్వమంత అయ్యాను . ఏకాకియైన శ్రీకృష్ణుడు ,తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు .

                      1 ​లో ​ ( X+1 ×  X-1)వున్నట్టు ,విత్తనంలో వృక్షం దాగి వున్నట్టు , ఏకాకి లో విశ్వం ఇమిడి  వుంది . ఏకాకి ఐన శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తనలోనే (నోట్లోనే ) విశ్వాన్ని చూపించాడు .

  విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation)కనుక జగమంతకుటుంబం నాది . విశ్వం నాలో లీనం (లయం ) అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితం నాది . ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం. భిన్నత్వంలో ఏకత్వం ఏకాకిజీవితం.

  ఏకాకిగా వున్నసృష్టికర్త కవిగా ,కవితగా ,భార్యగా ,భర్తగా …………సృష్టిగా మారి జగమంత అయ్యాడు . మట్టి, కుండగా మారినట్టు సృష్టికర్తే సృష్టిగా మారాడు . మాధవుడే మానవుడయ్యాడు . నరనారాయణులు ఒక్కరే . నరుడే నారాయణుడు .

  నరుడు ప్రేమికుడిగా,భావుకుడిగా ,భక్తుడిగా  ఉన్నపుడు పాడుకోవడానికి  ప్రేమగీతాల్ని, భావగీతాల్ని,భక్తిగీతాల్ని ఇంతవరకు కవులందరూ వ్రాసారు . కానీ నరుడు నారాయణుడిగా వున్నపుడు పాడుకునే భగవద్ గీత శాస్త్రి గారి ‘జగమంతకుటుంబం’

  ఉన్నది ఒకటే నని ,రెండుగా కనిపిస్తున్నవన్నీ ఒకే దానికున్న రెండు పార్శ్వాలని  అద్వైతతత్వ సారాంశం.మనిషి ఏ పార్శ్వంలో ఉన్నా,జ్ఞాననేత్రంతో రెండో పార్శ్వం యొక్క ఉనికిని,దాని విలువను గుర్తించగలడు .”

                                            ***************************   

  Please read 1+1 as one to the power of +1 and 1-1 as 1 to the power of -1. The inconvenience caused to you in this regard is much regretted.

       

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- న+ద్వైతం=అద్వైతం

  • మిత్రులు మాధవరావు గారు,
   వ్యాసం శ్రీ భావరాజు శ్రీనివాసుగారు, దయతో, నాపై అభిమానం తో పంపినది. దానికో నాలుగు ముక్కలు కలిపేనంతే. నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 1. శర్మ గారూ ! నమస్తే . ఆపాత మధురమైన ‘జగమంతకుటుంబం’ పాట లోని ఆలోచనామృతాన్నిఅందరికీ పంచాలన్న మీ ప్రయత్నం మీ blog tag line కి అనుగుణంగా ఉన్నందుకు సంతోషం .అద్వైతం లోనే ద్వైతం ఇమిడివుంది.తాత్వికంగానే కాదు! భాషాపరంగా కూడా.ఈ విషయాన్ని ముందు మీరు ప్రస్తావించడం బాగుంది .శంకరులు ఆ పేరు పెట్టడంలో ఎంతో ఔచిత్యం ఉంది.

  • భావరాజు శ్రీనివాసుగారు,
   అందుకే ఈ వ్యాసానికి పేరు న+ద్వైతం అనిపెట్టేనండి. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 2. వామ్మో ! ఇంత థియరీ నా !

  ద్వైతం థియరీ ! అద్వైతం ఠీవీ !

  ఆ అద్వైతుడు కూడా అదిరి పోతాడేమో (ఇంతకీ అద్వైతుడికి ద్వైతం థియరీ అర్థమవు తుందంటారా ! జేకే !

  బాగుందండీ … ఆఖర్లో సిరివిన్నెల పాట కి లింకు పెట్టండి పాట వింటూ ద్వైతాన్ని అద్వైతం గా మమేకం చేసుకోవచ్చు !!

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   అద్వైతం అంటే అంతే మరి. మిత్రుడి పాట లింక్ ఇవ్వమన్నారు, ఇచ్చాను, గొప్ప సూచన.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s