శర్మ కాలక్షేపంకబుర్లు-మరణమే…….

మరణమే…….

అంజలి తనూజగారు ఒక వ్యాఖ్య రాస్తూ ”అరవై ఏళ్ళొచ్చినతరవాత చనిపోవాలి లేదా ఆత్మ హత్య చేసుకోవాలి అని ఒకరు పిల్లల అనాదరణ పొందినవారు బాధ పడుతూ అన్నారు, ఈ విషయం మీద రాయమంటే”….. దీనిని రెండు భాగాలు చేసేను..తరవాయి భాగం త్వరలో…..

జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. కొన్ని మనం తెచ్చి పెట్టుకునేవి, కొన్ని భగవంతుడిచ్చేవి. మరి వీటికి పరిష్కారాలు లేవా? మరణమే శరణ్యమా? కాదన్నదే సమాధానం….కొంతమంది సమస్యలు చూదాం……

ఒక స్నేహితుడు ఒకతే కూతురు. ప్రస్తుత వయసు నలభై దగ్గర. మానసికంగా ఎదుగుదలలేదు. బట్టకూడా కట్టుకోలేదు, మరెవరో కడతారు. బట్ట ఉంచుకోవాలన్న స్పృహ మాత్రం ఇచ్చాడు దేవుడు. తల్లి, తండ్రులను తప్పించి ఎవరిని గుర్తించలేదు. పల్లెటూరు నివాసం, ధనానికి లోటులేదు. అశ్రద్ధ, గడచిపోతోంది కదా అని ఉపేక్ష సమస్యను పెంచాయి. ఒక సారి నా దగ్గర ఈ సమస్య చెప్పి బాధ పడ్డాడు, కొన్ని పరిష్కారాలు చూపాను. అసలు సమస్యను వివరించాను. ఆ అమ్మాయికి తల్లి తండ్రులున్నవరకు సమస్యలేదు, ఆ తరవాత అన్నదే సమస్య. నేను చూపిన పరిష్కారాలు తల్లికి నచ్చలేదు, సహజంగానే అతనికీ నచ్చలేదు..సమస్య సమస్యలా ఉండిపోయింది…కాలమే తీర్చాలి…ఏమో ఏమగునో….

మరొక మిత్రుడు భార్యభర్త, ఒకడే కొడుకు, విద్య చెప్పించారు, పెళ్ళి చేశారు. పెళ్ళి తరవాత పెళ్ళాం తో కలిసి కుర్రాడు వెళ్ళిపోయాడు. తల్లి తండ్రుల గురించి పట్టించుకోడు, కనీసం మాటాడడు,మనవడూ పుటాడు,పదిబారల దూరంలో ఉన్న అత్తరింటికొచ్చి వెళతాడు, తల్లితండ్రులను కనీసం పలకరించడు. ధనానికి లోటులేదు… ఎదురు చూస్తున్నారు, ఇంకా తల్లితండ్రులు…సమస్య సమస్యలాగే ఉండిపోయింది… కారణాలేంటీ? భగవంతునికే తెలియాలి….. ఆ కొడుకు ధూర్తుడా? కోడలు చెప్పిపెడుతుందా? ఈ మాటలు తల్లితండ్రులు ఒప్పుకోరు… మా కొడుకు, కోడలు బంగారం అంటున్నారు….కాలమే తీర్చాలి….

మరొక సమస్య. ఒకామె వయసు ఇప్పటికి 70+. ఒకడే కొడుకు, తమ్ముని కూతుర్నిచ్చి పెళ్ళి చేసింది. తన భర్తా, తమ్ముడూ కూడా కాలం చేశారు. పక్కపక్క పెద్దలోగిళ్ళు, ధనానికి లోటులేదు. కొడుకు భార్యను తీసుకుని ఉద్యోగానికి పోయాడు. కర్మకొద్దీ జారిపడి తుంటి ఎముక విరిగింది, సంవత్సరాలయింది, ఇప్పటికి వాకర్ తోనే నడక, అదీ ఇంటిలోనే, గదిలోనే. తనపని తను చేసుకోలేదు, మరదలు పక్కిల్లే, ఆమె చాకిరి చెయ్యలేదు. పనిమనిషిని పెట్టుకుంటే, ఆ మనిషి వచ్చి స్నానం చేయించి బట్టకూడా మార్చి భోజనం పెట్టి వెళుతుంది. కొడుకు కోడలు ఎప్పుడేనా వచ్చి చూసిపోతారు. పదిరోజులకోసారి కబురు పెడుతుంది. వెళితే, తన బాధ చెప్పుకుంటుంది, భారం దించుకుంటుంది, భారత,భాగవత, రామాయణాల్లో ఏదో ఘట్టం చెప్పమంటుంది, చెబుతాను, ఆమెదించుకున్న భారం నా మనసుకు ఎక్కుతుంది,తిరిగొచ్చేటపుడు ఆమె నమస్కారంతోపాటు  పళ్ళు చేతిలో పెడితే తీసుకుని, భారమైన మనసుతో వస్తాను, ఒక రోజు మనిషికాలేను. కబురుపెడితే వెళ్ళక మానలేను..సమస్య అలాగే ఉంది…..

మరొక మిత్రుడు, రిటయిర్ అయిన తరవాత పల్లెలో ఊరికి దూరంగా ఇల్లు కొన్నాడు, కలిగినవాడు. ఒకడికి కన్నుకుట్టి, నగల కోసం ఆమెను హత్య చేశాడు. మిత్రుడు ఒంటరివాడయ్యాడు. ఇద్దరు కూతుళ్ళు, పెళ్ళిళ్ళు చేశాడు, వారి దగ్గరికిపోవడానికి మొహమాటమంటాడు.. వెళ్ళినా రెండు నెలలుంటాడు, మరో కూతురు దగ్గరికిపోతాడు…సమస్య …..

మరో మిత్రుడు భార్య ఉద్యోగంలో ఉండగానే చనిపోయింది, ఒకడే కొడుకు. ఉత్తరాదిని ఉంటాడు, ఉద్యోగం. అక్కడే పని చేసేదగ్గర అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. మిత్రుడు తన ఇంటిదగ్గర తమ్మునితో ఉండేవాడు, విధి చిత్రమైనది. తమ్ముడు గతించాడు. కొడుకు దగ్గరకి పోక తప్పలేదు, ఇక్కడ చూచేవారు లేరు, ఓల్డేజ్ హోమ్ లో చేరడానికి ఇష్టం లేదు. కొడుకుదగ్గరకెళితే, కొడుక్కి మాటాడే తీరికలేదు, కోడలి మాటాడ్డానికి భాషా పరమైన చిక్కు, మనవడితో మొదలే లేదు, పరాయి ప్రదేశం, మాటాడేవారు కూడా లేరు… సమస్య అలాగే ఉంది….

ఒక భార్య భర్త, ముఫై ఏళ్ళకితం పెళ్ళయింది. భర్త అనుమానపు పక్షి, నిరక్షర కుక్షి, సంపాదన పూజ్యం, ఈమె ఉద్యోగం చేసి కుటుంబం పోషించేది. ఒకమ్మాయి పుట్టింది. సమస్య మొదలయింది. అనుమానపిశాచి, పుట్టినపిల్ల నా కూతురుకాదని భార్యను వదలేసిపోయాడు, మళ్ళీ పెళ్ళీ చేసుకున్నాడు. పిల్లని చదివించుకుంటూ కాలంగడుపుతుండగా, పిల్ల చదువుకునే దగ్గరో చిన్నవాణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుని తల్లిని వదిలేసిపోయింది. ఇంతకాలం వదిలేసినవాడొచ్చి ఇప్పుడు విడాకులు కావాలని కోర్ట్ కెక్కి బతుకు భారం చేశాడు…….సమస్య నడుస్తోంది…..

సమస్యలు వస్తాయి. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా మార్కండేయుడు వస్తే ఆయనను అడిగారు స్వామీ ఇలా బాధలు పడ్డవాళ్ళు ఎవరేనా ఉన్నారా? మేమే అలా బాధలు పడుతున్నామా? అని. దానికి మార్కండేయుడు నలదమయంతులకథ,రామాయణమూ చెప్పేరు. మనమే కాదు మరొకరూ మనలా బాధపడుతున్నారంటే, మనమొకరమే కాదంటే అదొక తృప్తి, మానవులకు. వీరెవరూ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. హనుమ సీతను వెతకడానికి లంక చేరేరు, వెతికారు, సీత జాడ తెలియలేదు. నిర్వేదానికి లోనయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. తరవాత మళ్ళీ ఆలోచించారు, బతికియుండిన సుఖములబడయవచ్చు అనుకున్నారు. ( శ్లోకాలు పెట్టాలనుకున్నా, కాని ఓపికతగ్గింది, మన్నించాలి) మళ్ళీ వెతికేరు సీతాదేవి దర్శనమిచ్చింది, తరవా కథ తెలిసినదే!

ఇవి కొన్ని సమస్యలు మాత్రమే, నా ఎఱుకలోనివి, మీముందుంచినవి.సమస్యలకి పరిష్కారాలు లేవా? ఉన్నాయి. ఎవరి సమస్యకి పరిష్కారం వారి దగ్గరే ఉంటుంది, అది చెబితే, లేదా మనం చెప్పిన పరిష్కారానికి కొంత సంస్కరించుకుని అమలు చేసుకుని సుఖంగా ఉండచ్చు.సమస్యలో ఉన్నవారు అసలు సమస్యను పరిష్కరించుకోవాలనుకోవాలి, ఎదుటివారితో మాటాడాలి, పోట్లాట కాదు. అప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మనం ఒకడుగు ముందుకేస్తే..ఎదుటివారు మరో అడుగేయచ్చు. మాటాడాటానికే ఇష్టపడకపోతే…..మరెందుకు అలా ఉండలేకపోతున్నారు? చేయలేకపోతున్నారు? అహం ముఖ్యకారణం….సమస్యను మనకోణం నుంచి మాత్రమే చూడటం…..

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మరణమే…….

 1. చక్కటి విశ్లేషణాత్మక టపా !
  శత కోటి సమస్యలకు , అనంత కోటి పరిష్కారాలు ఉంటాయి , కావాలనుకునే వారికి !

  • సుధాకర్ జీ,
   సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలనుకుంటే! దారి దొరుకుతుంది. కాదు నేను చెప్పినట్టే జరగాలంటే, దారి మూసుకుపోతుంది. అంతే కదండీ! అసలు సమస్య పరిష్కరించుకోవాలని ఇద్దరికి ఉండాలి కదండీ!
   ధన్యవాదాలు.

  • అంజలి తనూజగారు,
   అందరం ఈ అహమే, (ఈగో) గురించి తెలిసినవాళ్ళమే! తెలిసి తప్పు చేస్తుంటాం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s