శర్మ కాలక్షేపంకబుర్లు-మామిడి కాయ పప్పు- ఒక జ్ఞాపకం.

మామిడి కాయ పప్పు, ఒక జ్ఞాపకం.

వేసంకాలం వచ్చేస్తోంది కదూ! పెరటిలో కొత్తపల్లి కొబ్బరి మామిడి పూచింది, కాసింది కూడా. పిందె రాలిపోతోంది.వగరు పిందెలతో మెంతి బద్దలు వేసుకుంటే పప్పులో నంజుకు తింటే నా రాజా ఆ మజాయే వేరూ. పళ్ళులేవుగా అందుకు మన్నా అయిపోయింది. కాయ పెరిగింది జీడి పిందె టెంక పట్టనిది, పప్పులోకి బహు పసందుగా ఉంటుంది,

మామిడికాయపఫ్పు ఎవరికి తెలియనిది? పఫ్పు ఉడకపెట్టడం, మామిడి కాయలని చెక్కులు తీసి ముక్కలుకోసి జీడి పారేసి, ముక్కలుడకపెట్టి, పప్పులో కలిపేసి, తగినంత ఉప్పేసి, పోపుపెట్టేస్తే మామిడికాయ పప్పు తయార్ కదా! అక్కడే పప్పులో కాలేసారు.

కందిపప్పుని కుక్కర్లో ఉడికించకూడదు, మందపాటి అడుగున్న గిన్నెలో ఉడికించాలి, సన్నటి సెగమీద.  ముందుగా ఈ పప్పును వేయించుకోవాలి కమ్మహా! మామిడికాయ ముక్కలతోపాటు పచ్చి మిర్చి కూడా ఉడకబెట్టాలి. ఆ పచ్చిమిరపకాయలికి కూడా పులుపు అంటుతుంది. పప్పులో వేయాలి, కొద్దిగా పోపూ పెట్టాలి, జీలకఱ్ఱ పరకలో రెండు ఎక్కువ పడితే బాగుంటుంది.అందులోకి కంది గింజంత ఇంగువా వేయాలి, పప్పూ మామిడి కాయలో కలిపేయాలి. సన్నని సెగమీద ఉడకనివ్వాలి, కుంపటయితే భేషూ! మరో చిన్న చిట్కా, ఇలా తయారు చేసిన పప్పు బాగా పుల్లగానే ఉంటుంది, ఎంతకీ పులుపు చావదు, రుచీ రాదు, మరెలా అదే చెబుతున్నా, ఇలా ఉడకబెడుతున్న పప్పులో తగినంత ఉప్పూ, ఒక బెల్లం ముక్క వేయండి, (ఇప్పటి దాకా ఉప్పు దేనిలోనూ వేయకూడదు). పప్పూ మామిడికాయను సన్నటి సెగను మరగనివ్వండి. మరి ఇది తిని చూడండి అప్పుడు చెప్పండి, దీని రుచి మహిమ….పప్పూ మామిడికాయ లేనిరోజుండదు, కాయలొచ్చినంత కాలం…… పప్పూ మామిడి కాయ అంటే ఒక సంఘటన గుర్తొచ్చింది..దగ్గరగా ముఫైఏళ్ళకితంది…..

ఇప్పుడున్న ఊరొచ్చిన కొత్త,అప్పటికే కష్టపడికాక ఇష్టపడి పని చేస్తాననే పేరొచ్చేసింది. వేసవికాలం, మే నెల, ఒక రోజు ఆఫీస్ లో కూచున్నా, ఏదో పనిచేస్తూ. ఆఫీసర్ గారి దగ్గరనుంచి ట్రంకాల్ అన్నాడు ఆపరేటర్. మాటాడితే ”శర్మగారూ! అర్జంట్ గా బయలుదేరి పందలపాక వెళ్ళండి! అక్కడ ఎక్స్ఛ్ంజ్ పని చెయ్యటం లేదు,మీ మిత్రుడు శలవు పెట్టేడు, అందుకు మీకు చెబుతున్నా” అన్నారు. నా సెక్షన్ కాదు పక్క సెక్షను, ఎటూగాని సమయం, భోజనం చేసి బయలుదేరుదామా? ఆలస్యమవచ్చు, భోజనానికి వచ్చెయ్యచ్చులే, అని అడుగు ముందుకే వేశాను. బస్ దొరికింది అదెంత దూరం బలభద్రపురందాకా ఎనిమిది కిలో మీటర్లు, ఆ తరవాత ఐదుకిలో మీటర్ల దూరం ఉంది, ఇంకా పందలపాక. ఇప్పటిలా ఆటోలు, బస్ లు ఎక్కువగా లేవు, రిక్షాలూ తక్కువే, నాకా అప్పటికింకా మోటర్ సైకిల్ లేదు. బలభద్రపురం లో గుర్రపుబండి ఎక్కిన గుర్తు, పందలపాక సెంటర్ లో దిగేను, కాలవ గట్టున. టైమ్ పన్నెండవుతోంది, మే నెల ఎండ మండుతోంది. ఆ సెంటర్ నుంచి, ఎదురుగా పెద్ద కాలవ, కుడి వైపుకిపోతే తొస్సిపూడి బారెడు దూరంలో, లాకులు దాటితే కొమరిపాలెం, లాకుల ఇవతల తొస్సిపూడి. సెంటర్ నుంచి ఎడమవైపుకి పోతే కాలవ గట్టునే ఎడమవైపు దూదిమిల్లు, రాయవరం మునసబుగారిది, మరికొంత దూరం నడిస్తేగాని ఆఫీస్ కి చేరను. నడుస్తున్నా,ఎర్రటి ఎండలో. ఈలోగా ఎవరో సైకిల్ మీద వస్తూ నా దగ్గర ఆగి ”జే.యి గారు కాలినడకన బయలుదేరేరు?” అన్నారు. తీరా చూస్తే ఆయనొక చందా దారు. ”మీ ఎక్స్ఛేంజ్ పాడయిందిట, మీ జె.యి శలవు, అందుకు నేను వచ్చాను” అని ముందుకు సాగబోతుంటే, ”ఆగండి!” అని తన సైకిల్ మీద ఎక్కించుకుని ఆఫీస్ దగ్గరకి చేర్చాడు. అక్కడ పని చూస్తున్నంత సేపూ ఉన్నాడు, పని పూర్తయింది, బాగు పడింది, ఆఫీసర్ గారితో మాటాడేను, ఆయన ఆశ్చర్యపోయారు,”అప్పుడే వెళ్ళారా?” అని. టైమ్ పావు తక్కువ ఒంటిగంట. అక్కడే ఉన్న మిత్రుడిని ”బస్ స్టాండ్ లో వదిలేస్తే వెళతా”నన్నా. ”ఇంత ఎండలో నడచి రావడమే కాక, అప్పుడే ఎక్కడికెళతారు? మునసబుగారు మిల్లులో ఉన్నారు, ఆయనను కలిసివెళ్ళండి” అన్నాడు. నాకెందుకోగాని ఈ రాజకీయ నాయకులను కలవడం అంటే ఇష్టం ఉండేది కాదు. ఇతనేమో బలవంతం చేస్తున్నాడు, ఆయనేమో జిల్లాలో పెద్ద రాజకీయ నాయకుడు. ”భోజనం టైమ్ అయింది వెళతా, మళ్ళీ కలుస్తా” అన్నా. ”ఐతే అదే మాట ఆయనకి చెప్పనా?” అన్నాడు బెల్లిస్తూ. ఏం చేయాలీ అనే మీమాంసలో పడి, కలిస్తే మంచిదేమో అనే (దు)దూరాలోచనకి తోడిచ్చి, అతనితో బయలుదేరాను.రాయవరం మునసబు గారంటే నాటి రోజుల్లో పెద్ద పేరున్న రాజకీయ నాయకుడు, మేము వెళ్ళేసరికి ఆయన చుట్టూ చాలా మందే ఉన్నారు. నన్ను తీసుకుని వెళ్ళినతను ”వీరు టెలిఫోన్ జె.యి శర్మగారు” అని పరిచయం చేశారాయనకి. ఆయన వయసులోనూ పెద్దవాడే, నమస్కారం చేశాను, ”రండి, రండి ఎండనపడి వచ్చారు, లేవండి భోజనం చేద్దా”మన్నారు. ”వద్దండి వెళతానన్నా!” ”ఏం మాదగ్గర భోజనం చేయకూడదనా? బ్రాహ్మలు కదా” అన్నారు. ”కాదండి” అని నసిగేను… ఆయన, ” మీకోసం కేరేజి తెప్పించేను, బ్రాహ్మల ఇంటినుంచే వచ్చిందండీ, కొత్తపల్లి కొబ్బరి మామిడి కాయపప్పు, వడియాలు, చల్ల మిరపకాయలు….”అంటూ, ”ఒరే వడ్డించండిరా” అంటూ ఆయన లేచి కాళ్ళు కడగడానికి నీళ్ళ వైపుకు వెళుతోంటే ఆయనను అనుసరించాను. వారు కాళ్ళు కడుగుకుని, నేను కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చి, నేను కాళ్ళు కడుక్కునేదాకా నిలబడి, ఆతరవాత తువ్వాలు కాళ్ళు తుడుచుకోడానికి స్వయంగా పట్టుకు నిలబడ్డం చూసి, వారి అతిధి మర్యాదకు, నేను ఆశ్చర్యపోయాను, మిగిలినవారు కూడా అదే స్థితిలో ఉన్నారనిపించింది వారి చేష్ట చూశాటప్పటికి. పెద్ద పెద్ద వెండి కంచాలెట్టేరు, దానిలో మామిడికాయ పప్పు, అన్నం, చల్ల మిరపకాయలు, వడియాలు వేసేరు, నన్ను కూచోమని చెప్పి నేను పరిషించి కంచంలో చేయిపెట్టేదాకా ఆయన చూస్తూ ఉండిపోయి ఆతరవాత ప్రాణాహూతులు పుచ్చుకున్నారు.

భోజనం మొదలు పెట్టేం, పచ్చి మిరపకాయలతో సహా మామిడి కాయ పప్పు అన్నంలో కలిపితే కమ్మని నెయ్యి చేతిమీద పోశారొకరు. ఆహా! ఏం చెప్పను ఆ పప్పు రుచి, నేటికీ గుర్తొస్తూనే ఉంటుంది, మరి తయారు చేసిన తల్లి హస్తవాసి అటువంటిది. ఆయనా నేనూ పోటీపడి తినేసేం ఆ మామిడికాయ పప్పును, చివరికి పెరుగూ అన్నంలో కూడా కలుపుకుని. నాకు అప్పటికి ఇలా పెరుగు అన్నంలో మామిడికాయ పప్పు కలుపుకు తినడం అలవాటులేదు, ఆయనే ఇలా తినండి బాగుంటుందని వారు వేయించుకుని నాకు వేయించి తినమన్నారు. అది మొదలు ఇలాపెరుగు అన్నంలో కూడా మామిడికాయపప్పు కలుపుకు తినడం అలవాటయిపోయింది. ఆ తరవాత వెళ్ళొస్తానంటే ఆయన ”ఒరే వీరిని బలభద్రపురం దాకా దింపిరండని” పురమాయిస్తూ, ”మీ గురించి విన్నాను, ఇప్పుడే చూశాను,” అని ఏదో మరికొన్ని పొగడ్తలతోనూ కడుపు నింపేసేరు. వారు పెట్టిన భోజనం అరిగిపోయింది కాని తీపి గుర్తుండిపోయింది, నేటికీ…

ఇందాకటి మిత్రుడే బయలుదేరాడు నన్ను దింపడానికి, దారిలో అడిగాను.”మీకోసంకూడా కేరేజి తెప్పించేను బ్రాహ్మల ఇంటినుంచే అన్నారు, మునసబుగారు, నేనొస్తానని ఆయనకి ఎలా తెలుసు”  దానికతను నవ్వి, ”మీరు వస్తారని ఆయనకు బాగా తెలుసు, అందుకే ఉదయమే నన్ను, మీ రాకను కనిపెట్టి ఉండమనీ, మిమ్మల్ని వారిదగ్గరకి తీసుకురమ్మనీ,భోజనం ఏర్పాటు బ్రాహ్మల ఇంటి దగ్గర ఏర్పాటు చేయమనీ చెప్పేర”ని గుట్టు విప్పేసేడు, కాని నేను అప్పుడు వస్తానని ఎలా ఆయన ఊహించారో నాకైతే అంతుబట్టలేదు..ఏమో ఏదైనా సాధ్యమే అనుకున్నా…..

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మామిడి కాయ పప్పు- ఒక జ్ఞాపకం.

  • అమ్మాయ్ జ్యోతిర్మయి,
   ఎండనపడి వచ్చిన ఆడపడుచుకు పుట్టింట ఆదరం చెయ్యకపోతే ఎలాగమ్మా!
   ధన్యవాదాలు.

  • bonagiri గారు,
   ఇప్పటికి ఇది కాంబినేషన్, ఆ తరవాత జీడి ఆవకాయ, పెద్ద ఆవకాయ ఇంకా మిగిలే ఉన్నాయండి 🙂
   ధన్యవాదాలు.

 1. రాయవరం మున్సబుగారిగురించి నేనుకూడా ఇంతకుముందు విన్నాను. ముత్యాలముగ్గులోనో మరేదో సినిమాలోనో రావుగోపాలరావు క్యారెక్టర్ ఆ మున్సబుగారి క్యారెక్టర్ ఆధారంగానే రూపొందించారని అంటారు.

  • Sravan Babu గారు,
   మునసబుగారు రాజకీయంగా చాణుక్యుడు. వ్యక్తిగా చాలా మంచివారు. అప్పటికే రాజకీయాలలో ఉన్నవారు సొమ్ములు సంపాదించుకుంటుంటే వీరు ఆస్థులు కరగదీసుకున్నారు. రామచంద్రపురంలో కాలేజీ పెట్టించారు. చివరగా భీమేశ్వర స్వామి సన్నిధిలో అభిషేకం చేసుకుంటూ తనువు చాలించారు.మంచివారిని గొప్పవారిని కూడా హేళన చేసినవారు లేకపోలేదు కదండీ.
   ధన్యవాదాలు.

  • mallampalli swarajya lakshmi గారు,
   నిజమేనండి, మెంతి బద్దలు మిక్సీ లో వేసి అన్నం లో కలుపుకు ముద్దలు మింగడం కొత్త అనుభవమే 🙂
   ధన్యవాదాలు.

 2. కష్టే ఫలే వారా మజాకా ! ఏదైనా పిందె మామిడి తో వండేయ్య గలరు !

  డానికి పై , ఆ మునసబు గారు కూడా శర్మ గారిని సరిగ్గా అంచనా వేసేరంటే శర్మ గారు ఎంత నిఖార్సు మడిసి యో తెలిసి పోతోంది …

  మీరు ఆల్మోస్ట్ శ్రీపాద వారి రచనా శైలి దరిదాపుల్లో వచ్చేసేరు !! (‘సహ వాసం!)

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   కాలక్షేపం కదా! పాత జ్ఞాపకం గుర్తొస్తే!!
   అమ్మో! పెద్దవారొతో పోలికా, ఆనందమే కాని కొంచం భ..యం
   ధన్యవాదాలు.

 3. మావిడికాయ పప్పు అద్భుతః,
  మునసబుగారితో మీ ఇంటరాక్షన్, పప్పు అన్నంలో మధ్యమధ్య తగిలే వేగిన మిరప గింజలా పరమాద్భుతః

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s