శర్మ కాలక్షేపంకబుర్లు-విల్లు అనే మరణ శాసనం.

విల్లు అనే మరణ శాసనం.

విల్ అనేది ఇంగ్లీషు మాట. ఇది అపభ్రంశం చెంది తెనుగులో విల్లు, వీలునామాగా రూపాంతరం చెందింది. కాని అసలు తెనుగు మాట మాత్రం మరణ శాసనం.

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై
బేరైనన్ గలదే శిబిప్రముఖులుం బ్రీతిని యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!

మహరాజులు లేరా చరిత్రలో,రాజ్యాలూ లేవా?,వారున్నకాలంలో గర్వంతో తిరగలేదా? కాని నేడు వారెవరూ లేరే, వారి పేరు కూడా లేదు భూమి మీద,పోనీ సిరినేమైనా మూట కట్టుకునిపోగలిగారా? కీర్తి శరీరాలతో శిబి మొదలైన దాతలు మిగిలిపోలేదా? వాళ్ళని మఱచిపోయారా? ఎందుకయ్యా ఈ సిరి, సంపద అని కొట్టుకోడం దానమిచ్చేస్తా అన్నారు బలి చక్రవర్తి.

ఈ మాటలు అందరమూ చెబుతాం, ఆహా! ఏం చెప్పేడండీ బలి చక్రవర్తి అనీ అంటాం. శ్మశాన వైరాగ్యం లాగా, ప్రసూతి వైరాగ్యంలాగా, మరిచిపోతాం, మళ్ళీ సంపాదన, మనం మామూలే, మాయలోనూ పడిపోతాం. మరి ఈ మాయను తప్పించుకోడమెలా? దానికోమార్గం, ఉన్న ఆస్థులను పిల్లలకిచ్చేసి, ఉన్న దానితో సంతృప్తి చెంది, కలిగినంతలో కాలక్షేపం చెయ్యడమే చివరి దశలో ఉత్తమం, అని నా బుద్ధికి తోచినది.

అసలు విల్లు అనే మరణ శాసనం ఎవరు రాయచ్చు? మైనారిటీ దాటిన, ఆస్థిపాస్థులున్న,మతి స్థిమితం సరిగా ఉన్న స్త్రీ, పురుషులు ఎవరైనా రాయచ్చు. మరి పెద్దాళ్ళనే ఎందుకురాయమన్నామంటే, వారిక ఉండేరోజులు, గతించిన రోజులకంటే తక్కువుంటాయి కనక, ఎప్పటికి ఏమగునో తెలియదు కనక, ఉన్న, కూడబెట్టిన, పెద్దలిచ్చిన ఆస్థులు తమ తదనంతరం ఏమికావాలి? ఎవరు అనుభవించాలి అనే విషయాలు వివరంగా చెప్పేదే మరణ శాసనం.

దీని రాయాలనుకున్నవారు స్థిరమైన బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకుని రాయించుకోవాలి. కోపం వచ్చిన ప్రతి సారి ఒక విల్లు రాయకూడదు, ఎందుకంటే, విల్లు మనం చనిపోయే రోజుదాకా ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు కనక. కొంతమంది విల్లు రాస్తే, ఈ రోజే ఆస్థులిచ్చెయ్యాలన్నట్టు బాధ పడతారు. అలా ఇవ్వక్కరలేదు. విల్లు రాస్తే, చనిపోతామని అనుకోడమూ జరుతుంది, ఇది మూఢ నమ్మకం.  ఒకతే అమ్మాయి, లేదా ఒకడే అబ్బాయి విల్లెందుకు? చెబుతా, ఎందుకుకావాలో. మన వారసులొకరే, మన తరవాత, మన ఇల్లు వారిపేరుమీద మారాలంటే, ఆధారం చూపితేకాని మార్పుచెయ్యరు. ఇప్పటివరకు మన పేర ఉంది, మరి అమ్మాయి పేర మారాలంటే, మనం ఏమీ చెయ్యకపోతే వాళ్ళు చాలా చిక్కులుపడాలి. ముందుగా సక్సెషన్ కోసం కోర్టుకుపోవాలి. అక్కడ చాలా తతంగం జరిగి, వారసులమని ఋజువులు చూపిన తరవాత, ఆ సక్సెషన్ ఇస్తుంది. వచ్చేటప్పటికి ఎప్పటి మాటో! సాధారణంగా ఆస్థులు అనుభవించేవారు తమ పేర మార్చుకోడం మరిచిపోతుంటారు, నడిచిపోతోందికదా, అని. ఎప్పుడో అవసరమొస్తే, ఏ పనీ జరగదు, అప్పుడు చిక్కులు పడిపోతారు. ఇంత అవస్థ లేకుండాలంటే చిన్న మార్గం, విల్లురాయడం. ఆ విల్లు కాపీపట్టుకుపోయి ఆస్థిని తమపేరు మీద మార్పు చేసుకోవడం చాలా సులభం, అందుకుగాను విల్లు రాయడం అవసరమే. ఒకరికంటే ఎక్కువమందికి ఆస్థులు సంక్రమింప చేస్తున్నపుడు, ఎక్కడా అపార్ధాలకి తావు లేకుండా వివరంగా రాయాలి, మనం ఎదో అనుకుంటే కుదరదు. అక్కడ రాసిన ప్రకారమే జరుగుతుంది. చరాస్థులు అనగా బేంక్ డిపాజిట్లు, షేర్లు వగైరాలున్నవారయితే నామినేషన్ ఇస్తే సరిపోతుందనుకోరాదు. ఒక్కరే వారసులైతే బాధ లేదు కాని, ఎక్కువ మంది ఉంటే కుదరదు. ఉమ్మడి కుటుంబంలో, నామినేషన్ పొందినవారు మాత్రమే వాటిని అనుభవించడం కుదరదు. వారు ఆ ఆస్థిని కాపాడి, పొంది, పట్టుకొచ్చి ఉమ్మడి కుటుంబంలో అప్పగించలవలసిన బాధ్యత వరకు మాత్రమే ఆ నామినేషన్ విలువ, అనేది గుర్తించాలి.మనం ఉన్నంత కాలం ఈ విల్లుకు చిత్తుకాగితం విలువ కూడా ఉండదు, కాని మన మరణానంతరం మాత్రం అది పాశుపతాస్త్రమే, ఎక్కుపెట్టిన విల్లే.

విల్లు రాసి రిజిస్టర్ చేయించడం ఉత్తమం, రిజిస్టర్ చేయించకపోయినా అది చెల్లుతుంది, కాకపోతే మన వారసులు దానిని సబ్ రిజిస్త్రార్ దగ్గరకి తీసుకుపోతే, ఒక ప్రకటనిచ్చి అభ్యంతరాలు లేకపోతే రిజిస్టర్ చేస్తారు. ఇది మన మరణానంతరం మాత్రమే జరుగుతుంది. మన డయరీలో రాసుకున్నది కూడా విల్లుగా పరిగణించచ్చు. మన విల్లును అమలు జరపడానికి ఒకరిని నియమించచ్చు కూడా. వారు విల్లులో ఆస్థులు సంక్రమించేవారిలో ఒకరై ఉండచ్చు కూడా..పెద్ద వయసులో ఆస్థుల బరువు తగ్గించుకోండి, బాధలనుంచి విముక్తి చెందండి, డబ్బున్నంత కాలం సుఖం ఉండదని గుర్తించండి…మన వారసులెవరూ విల్లు రాయమని అడగరు, అడగలేరు, దీని అవసరం మనమే గుర్తించాలి, పెద్దవాళ్ళంగా…

విల్లు రాయలనుకుంటే మాత్రం, మంచి మనసున్న, ఒక సీనియర్ లాయర్ని కాని, సీనియర్ సిటిజన్ ని కాని సంప్రదించడం మంచిది. మనం రాసే విల్లు ప్రకారం ఆస్థులు తెలిసిపోతాయేమో అనే అనుమానం ఉండచ్చు, మనం రిజిస్టర్ చేయించిన విల్లు కూడా రహస్యమే, దాని పబ్లిక్ కాపీ ఎవరికి ఇవ్వరు, మన తరవాత కూడా, పబ్లిక్ కాపీ కావాలంటే కూడా, ఆ విల్లులో ఆస్థులు రాయబడ్డవారికి మాత్రమే ఇస్తారు, దరఖాస్తు చేసుకుంటే. ఇంకా రహస్యం కావాలనుకుంటే విల్లు రాసి, దానిని ఒక కవర్లో పెట్టి సీళ్ళు వేసి జిల్లా రిజిస్టార్ కార్యాలయం లో భద్రపరచచ్చు. అలా భద్ర పరచడాన్ని ‘విల్లు డిపాసిట్’ అంటారు. ఆ విల్లును మన తదనంతరం వారసులు మరణ ధృవీకరణ పత్రం తీసుకుపోయి, జిల్లా రిజిస్టార్ కి దరఖాస్తు చేసుకుంటే, ఆ డిపాసిట్ లో ఉన్న విల్లును బయటకు తీసి, అందరిముందు చదివి, రిజిస్టర్ చేస్తారు. ఇలా కూడా చేయచ్చు, ఇది అన్నిటికంటే చాలా రహస్యమైన పద్ధతి. ఒక సంగతి మాత్రం మరువ కూడదు, ఏం చేసేమో కుటుంబం లో ఒకరికైనా చెప్పాలి, ఎవరికి చెప్పకపోతే కనీసంగా డయిరీలో రాసుకోవాలి….

మరి ఆస్థులు లేనివారి సంగతేంటండీ అనచ్చు, అస్థులు ఎలాగా ఇస్తున్నాం కదా….

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-విల్లు అనే మరణ శాసనం.

 1. >>> ఆ డిపాసిట్ లో ఉన్న విల్లును బయటకు తీసి, అందరిముందు చదివి, రిజిస్టర్ చేస్తారు.

  దీనికి ఎంత ఆమ్యామ్యా ఇవ్వాలి ? విశదీకరించుడీ !!

  జిలేబి

  • jvrao185 గారు,
   ఈ సలహా ఉచితమేనండి 🙂 మరి లాయర్ దగ్గరకెళితే మాత్రం ఫీస్ పుచ్చుకుంటాడు, ఇది చెప్పినందుకూ….. అది ఆయన వృత్తి కదండీ… 🙂
   ధన్యవాదాలు.

 2. శ్రీ శర్మగారూ,
  “మరి ఆస్థులు లేనివారి సంగతేంటండీ అనచ్చు, అస్థులు ఎలాగా ఇస్తున్నాం కదా…”. ఒక గొప్ప జీవిత సత్యాన్ని ఇలా చిన్న పదం తో ఎంత గొప్పగా చెప్పారండీ…..
  ప్రతీ బాధ్యతాయుతమైన వ్యక్తి చేయవలసిన అతి ముఖ్యమైన “విధి” గురించి ఇలా మీరు నిజమైన “సీనియర్ సిటిజన్” గా “ప్రతీదీ మనకు తెలుసులే, వేరే వాళ్లు చెప్పేది ఏముంది?”అనుకునే చాలామంది ఉన్న నేటి యువతకు, ఒక “మంచి గురువుగా, తండ్రిగా, పెదనాన్నగా, బాబాయిగా, అన్నింటికీ మించి ఒక మంచి స్నేహితుడిగా” మీరు ఇచ్చిన ఒక సలహా (హితోపదేశం). ఇది అందరూ తమకు అన్వయించుకోదగ్గ, తప్పక ఆచరించవలసినది. ధన్యవాదములు.
  నమస్కారములతో
  సుందరం

  • సుందరం గారు,
   మనకి తెలియకనే ఈ లోకానికొచ్చాం,తెలిసి కొంతమందిని ఈ లోకానికీ తెచ్చాం. మన పని మనం సవ్యంగా చేసి నిష్క్రమించడమే మన కర్తవ్యం…అందరికి తెలిసినదే….మరుగునపడి పోతుందని గుర్తుచెయ్యడమే..మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s