శర్మ కాలక్షేపంకబుర్లు- ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం.

ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం.

ఉభయ భ్రష్టత్వం ఉప్పరి సన్యాసం, అంటారు గాని, అసలు మాట ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసమే. ఒక చిన్న కథ చెప్పుకుందాం, దీని గురించి….

ఒక పల్లెలో ఒక బ్రహ్మచారి, చదువు సంధ్య అంటలేదు. తల్లి తండ్రులు పోరినా వీడు మారలేదు. తండ్రి ఉన్నంతకాలం పోషించాడు, కాలం చేశాడు. ఆ తరవాత తల్లీ, ’కన్నందుకు కర్మ’ అనుకుని కష్టపడి వీడిని పోషించింది. వయసుపెరిగింది, ఒళ్ళు పెరిగిందికాని బుద్ధి పెరగలేదు. ఏదైనా పని చేసి పొట్టపోసుకోవాలనే ఆలోచనేలేదు. తల్లీ కాలం చేసింది.అప్పటికి బుద్ధి రాలేదు. ఇప్పటికి వీడికి పిల్లనిచ్చేవాడే కనపడలేదు. వీణ్ణి చూస్తేనే ఆడపిల్లలు జడుసుకునే పని అయిపోయింది. తల్లిపోయిన తరవాత తిండి గడవడమే కష్టమూ అయిపోయి, ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండగా, ఒక రోజు ఒక స్వాములవారు ఆ ఊరురావడం జరిగింది.

స్వాములవారిని శిష్యులు పల్లకి పై తీసుకు వచ్చారు. స్వామి మౌనంగా ఉన్నారు, ఊరివారంతా స్వామికి శిష్యులకు ఆదర గౌరవాలు నెరపుతున్నారు. పాద పూజలు జరుగుతున్నాయి, విందులూ జరుగుతున్నాయి. స్వామీజీ శిష్యులకు కూడా ఊరివారు గౌరవం ఇస్తున్నారు. ఇది చూసిన బ్రహ్మచారికి తానుకూడా సన్యాసం తీసుకుంటే ఇలా జరుగుతుంది కదా! స్వామీజీ మాటాడింది లేదు, మౌనంగా ఉన్నారు కదా! సన్యాసం బాగున్నట్టే ఉందనుకుని,సంన్యాసం అంటే ఇంతే అనుకుని, స్వామీజీ దగ్గరకు చేరి ”స్వామి, నేను బ్రహ్మచారిని,తల్లి తండ్రులు గతించారు, వారి మరణం చూసి నాకు విరక్తి కలిగిందని, సన్యాసం ఇప్పించ”మని కోరేడు. ఇది విన్న స్వామి ”సన్యాసం అంత తేలికైనది కాద”ని చెబుతూనే కొంత కాలం శిష్యునిగా ఉండమన్నారు. ఇదే బాగుందనుకుని, ఆకలి బాధ తీరుతుందని, శిష్య వర్గం లో చేరిపోయాడు. స్వామి మకాం ఎత్తేశారు. స్వామీ జీ ఎవరైనా మూడవ రోజు రాత్రికి ఒక ఊరిలో ఉండకూడదన్న నియమం బ్రహ్మచారికి తెలియదు. స్వామీజి మకాం లు మార్చేస్తూ ముందుకుపోతున్నారు. ఎక్కడకెళ్ళినా భోజనానికి లోటు లేకుండా జరిగిపోతూ ఉంది.కొంత కాలానికి మఠం చేరేరు. అక్కడికి చేరినది మొదలు, స్వామీజీ దగ్గరున్న పెద్ద శిష్యులు, ఇతనికి పని చెప్పడం మొదలెట్టేరు. ఏడుస్తూనో మొత్తుకుంటూనో పని చేస్తున్నాడు,తప్పదు కనక, కాలం గడుస్తోంది. తిండి గొడవ లేకపోవడంతో కాలం సుఖంగానే నడుస్తోంది. తిండి పుష్థ్టిగా నడుస్తోందేమో బ్రహ్మచారికి వాంఛలు మొదలయ్యాయి. సన్యాసులకు స్త్రీ సంగమం కూడదు కదా! స్త్రీలతో మాటాడే సావకాశమే లేకపోయింది. స్త్రీవాంఛ పెరిగి, ’పోనీ, సన్యాసం వదిలేసి, వివాహం చేసుకుని సంసారి అయితేనో’ అనే ఆలోచనొచ్చింది. సంన్యాసం వదిలేస్తే…పిల్లనిచ్చేవారూ కనపడటం లేదు,ఎలాగూ గృహస్థుగా ఉండే యోగం లేకపోయింది, ఇక పెళ్ళీ కాదు. కాని మనసులో పెళ్ళి చేసుకోవాలనే కోరికా చావలేదు, స్త్రీ సంగమ వాంఛ ఉండిపోయింది. అప్పటికే సన్యాసం తీసుకుని ఉండటం చేత పైన సన్యాసి వేషం మాత్రం మిగిలిపోయింది. ఇలా ఈ బ్రహ్మచారి అటు గృహస్థు ఆశ్రమానికీ చెడ్డాడు, ఇటు సన్యాసి ఆశ్రమానికీ చెడ్డాడు, దీనినే ఇహ పరాలకి చెడటం అని అంటారు. అందుకే దీనిని ఉభయ బ్రష్టత్వం ఉపరి సన్యాసం అన్నారు,.

సనాతన ధర్మం అంతా ఘోరమే అన్నారొకరు, పాపం వీరు ఆ ధర్మం లో పుట్టేరు పెరిగారు కాని ఆ ధర్మం లో ఏముందో పూర్తిగా తెలుసుకోనూ లేకపోయారు. ఎవరో చెప్పిన మాటతో మరో ధర్మంలో చేరేరు, పోనీ అక్కడేనా పూర్తిగా తెలుసుకు చేరేరా? లేదు, ఏదో ఒక అవసరం కోసం చేరేరు, ఆ తర్వాత అదీ బాగా అనిపించలేదు.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్టితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహః…..భవద్గీత

పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్ననూ స్వధర్మమందు అంతగా సుగుణములు లేకున్ననూ చక్కగా అనుష్టింపబడు పరధర్మము కంటే స్వధర్మాచరణమునందు మరణమే శ్రేయస్కరము. పరధర్మాచరణము భయావహము.
ఎంత చెడ్డదయినా స్వధర్మం అనగా స్వయం ప్రవృత్తిని వదలుకుని పర ప్రవృత్తిని ఆశ్రయిస్తే చివరికి ఆ ప్రవృత్తీ అంటక, జన్మ పరవృత్తీ చెడి రెండిటికీ చెడ్డ రేవడి అయిపోతారంతే….

అదే యతో భ్రష్టః తతో భ్రష్టః అంటే…చేసే పని ఏదయినా త్రికరణ శుద్ధిగా ఉండకపోతే ఇలాగే జరుగుతుంది…

 

 

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s