శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి

Courtesy: you tube

ఏఱువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నా.

నవధాన్యాలను గంపకెత్తుకుని
చద్ది అన్నము మూటగట్టుకుని
ముల్లుకఱ్ఱను చేతబట్టుకుని
ఇల్లాలుని నీ వెంటబెట్టుకుని ఏరువాకా సాగారో!

అమ్మయ్య గుర్తొచ్చిందనమాట. రచన కొసరాజు రాఘవయ్యగారిదే కదూ! ఎక్కడా రచయిత పేరు కనపళ్ళా, పాడినవారు, ఆడినవారి పేరు తప్పించి, ఇదండీ లోకం. అదండి ముల్లుగఱ్ఱంటే. అదేం అదోలా పెట్టేరు మొహం. ఓహో! ముల్లుగఱ్ఱ తెలీదు కదూ, చెబుతా. పొన్నుకఱ్ఱ తెలుసా మొన్ననో సారి కిఱ్ఱుచెప్పులు పొన్ను కఱ్ఱ గురించి చెప్పేను కదా! ఆ అదీ సంగతి, ఈ ముల్లు కఱ్ఱ కూడా పొన్ను కఱ్ఱలాగే ఉంటుంది. కఱ్ఱ చివర పొన్నుంటుంది, చివరలో ఒక చిన్న మేకుకొద్దిగా సూదిగా ఉన్నది దిగేసి ఉంటుంది. దీనిని ఎడ్లను తోలడానికి ఉపయోగిస్తారు. ఇదేమన్యాయమండీ అంటారా! ఈ ముల్లు కఱ్ఱని ఆనిస్తారు, పశువు మీద తప్పించి ముల్లుతో పొడవరు. పొడిస్తే ఎద్దుకి పుండు కాదా! రైతు అది భరించలేడు. కొన్ని పశువులు అదిలించినా కదలవండి,కొన్ని నర పశువులూ అంతేనండి, ముల్లుకఱ్ఱలుచ్చుకుని పొడిచినా కదలవండి. వాటి కోసం ఈ ముల్లుగఱ్ఱ అవసరమే.నేడు వ్యవసాయానికి పశువులేవండి? ఒక్క ఆవును పెంచుకుంటే ఇరవై ఎకరాల వ్యవసాయం ఎరువులు, పురుగు మందులకి పెట్టుబడి అక్కరలేకుండా వ్యవసాయం చేసుకోవచ్చంటే, రైతు వినేలా లేడు. కృత్రిమ పురుగు మందులు చల్లుతున్నాడు, పురుగులు చావక తను ఛస్తున్నాడు. మందులో ములిగిపోతున్నాడు,.పల్లెల్లో చేలకి నీళ్ళు లేకపోయినా మందు మాత్రం సమృద్ధిగా దొరుకుతోంది…

Glass

Photo credit:Owner

కవిగారేమన్నరూ? పాటలో, చద్దెన్నం మూట కట్టుకోమన్నారు, ‘తిండి కలిగిన కండ కలదోయ్, కండ గలవాడేను మనిషియోయ్’ అన్నారు కదండి, చద్దెన్నం తిన్నవారెవరండి ఇప్పుడు? లేచీ లేవడం తోనే, పుల్ల నీళ్ళతో మొహం కడుగుతున్నాడు రైతు. ఆ తరవాత పశువుల్ని అదిలించేందుకు ముల్లు కఱ్ఱ పట్టుకోమన్నారు, ఆ తరవాత ఇల్లాలిని వెంట బెట్టుకోమన్నారు. అంటే ఇల్లాలు లేకుండా ఏపనీ కాదోయ్ వెఱ్ఱివాజెమ్మా! భార్య/భర్త ఒకరికొకరు తోడుండి, ఆడుతుపాడుతు పని చేస్తుంటే…. అదనమాట కవి హృదయం. మరో మాట, భార్యకి భర్త, భర్త కి భార్య ఒకరికొకరు సుఖస్థానమూ, సంతోషస్థానమూ కూడా. అదే కావాలి కూడా, మరొకరెవరూ కాలేరు, అందుకే ఇల్లాలు కూడా ఉండాలోయ్ ప్రతి విషయంలో అన్నారు. ఇది ఒప్పుకోమండి, ఇదంతా పురుషాహంకారమంటారా? బాబూ! పురుషుడి గురించి చెబితే స్త్రీ గురించి కూడా చెప్పినట్టేనండీ, వేరుగా చెప్పక్కరలేదు. అయ్యో! మనది శివుడు పార్వతికి సగభాగం శరీరం ఇచ్చిన సంస్కృతి కలవాళ్ళం, అదిగో మళ్ళీ శివుడు ఇచ్చేడంటున్నారు, ఇది కూడా పురుషాహంకారంకాదా? వామ్మో! మీరు చాలా మేథావులండీ, అమ్మ సగం శరీరం అయ్యకిస్తే, అయ్య సగం శరీరం అమ్మకిచ్చినట్టు కాదాండీ! అదండి సంగతి, ఇంకా వివరించనా? బాగోదు. ముతక సామెతై పోతుంది.

చివరకొచ్చేటప్పటికి కవిగారు, పల్లెలలో పొలాలమ్మి టవునుల్లో ఇళ్ళు కట్టేవాళ్ళు,బేంకుల్లో డబ్బు దాచుకునేవాళ్ళు, పల్లెలలో పని దొంగలు రాజకీయనాయకులవుతారు, పాపం వీళ్ళు ప్రజా సేవ అనే అరుస్తారు, అన్నారు. ఇది మాత్రం నూటికి నూరుపాళ్ళు సరిగా ఊహించారు, అరవై ఏళ్ళకితమే. పాపం ఆయన ఆశాజీవి, రైతుని గుర్తిస్తారన్నాడు,అందరూ రైతు పేరు చెప్పి మొసలికన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. రోజులు మారాయా? అవే సంవత్సరాలు, నెలలు,రోజులు,గంటలు,నిమిషాలు.

మరి మారిందేంటి? మనిషి బుద్ధులు. కుళ్ళు, కుచోద్యం,ఈర్ష్య,అసూయ,ద్వేషం పెరిగిపోయాయి..నిజమే రోజులు మారాయి, మందు పెరిగింది,కొట్లాటలు పెరిగాయి, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వకీళ్ళు పెరిగారు, డబ్బు కోసం శవానికి వైద్యం చేసేవాళ్ళు పెరిగారు.ప్రాణావసరాలయిన తాగునీరు, మందులు అధిక ధరలకు అమ్ముకునే వారు పెరిగారు. పాత రోజుల్లో, ‘పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమ్’ అనేవారు, ఇప్పుడో ‘పరాపకార పుణ్యాయ, పుణ్యాయ పరపీడనం’ అని అనుకునేవాళ్ళు పెరిగారు.ఇంగ్లీష్ వాళ్ళొచ్చాకానే మనకి సభ్యత సంస్కారం వచ్చాయి, అంతకు ముందు మనకు చదువులేదు, సంస్కారం లేదు,బతకడం తెలియదు, వ్యవసాయం తెలియదు, వైద్యం అసలే తెలియదు,మనమంతా అడవి మనుషులం, పాములు పట్టుకుని ఆడించుకునేవాళ్ళం అనే  కుహనా మేధావులు పెరిగారు.

లేని పిచ్చి జనాలకి ఎక్కించేవాళ్ళూ పెరిగారు. ఆడ మగ వాళ్ళలో చదువు’కొన్న’వాళ్ళు పెరిగారు. , సంస్కారం తరిగింది. స్త్రీ, పురుష సంవాదం పెరిగింది, సంయమనం చచ్చింది. అభివృద్ధి కలిగింది, న్యాయం చచ్చింది. ‘ఇదే అభివృద్ధి అంటే’ అని వాగేవాళ్ళూ పెరిగారు.అసహనం పెరిగింది. పెద్దలు చెబితే వినేదీ పోయింది, ‘ఎవరి మగ్గానికి వారేసేనాపతి’. తల్లి తండ్రుల మాటలు విషమయ్యాయి. ‘నైతిక పతనమే పురోభివృద్ధి’ అని భావించే,వాదించే స్త్రీ పురుషులు పెరిగారు. నోటితో పొగడుతూ నొసటితో వెక్కిరించేవారు పెరిగారు.ఆహారం, నిద్ర, భయం, మైధునం, సర్వ జీవులకి సమానం అంటున్నారు కదా! ఈ మైధునానికే ఆంక్షలెందుకు? ఆకలేస్తే అన్నం తిన్నట్టు, కోరికను ఎవరితోనైనా, ఎక్కడైనా తీర్చుకోవడం తప్పేంటీ? అని వాదించే వారు, కాదు కాదు ఆచరించేవారు పెరిగారు. ఉదయం పెళ్ళిచూపులు, మధ్యాహ్నం పెళ్ళి,రాత్రికి శోభనం,మర్నాడుఉదయమే విడాకులకి కోర్టుకి పరుగు పెట్టడం పెరిగాయి.

’రోజులు మారాయి,మారాయి,రోజులు మారాయి…

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి

  • సుధాకర్ జీ,
   జరుగుతున్నవి చూస్తుంటే, ఇంకా ఎందుకు బతికున్నాం అనే బాధ కలుగుతోంది, అప్పుడప్పుడు.నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 1. శర్మగారు చాలా మంచి పోస్టు వ్రాశారు.ప్రస్తుత పరిస్తితులను కళ్ళకి కట్టినట్లు వ్రాశారు. చాలా భయంగాఉంది ఈ పరిస్తితులలో పిల్లలను పెంచడం,బయటకు ఇవ్వడం ఎలా అని.ఒక ఆడా లేదూ,మగా లేదూ అందరివిషయంలో రోజులు మారిపోయాయ్.పై పరిస్తితులగురించి నేను వ్రాస్తే పెద్ద పోస్టే అవుతుందేమొనని ధన్యవాదాలతో ముగిస్తున్నాను.

  • స్వరాజ్య లక్ష్మి గారు,
   మనుషుల్ని చూసి భయపడే రోజులొచ్చేశాయి. మంచిమాట వినేవారూ లేరు. రామా అంటే బూతు మాటంటున్నారు. ఎవరిని నమ్మాలో తెలీదు. మెరిసేదంతా బంగారం కాదేమో అనే అనిపిస్తూంది.
   ధన్యవాదాలు.

 2. కష్టే ఫలే వారు,

  నిన్న ప్రోటాన్ న్యూట్రాన్ ల గురించి వ్రాసి, నేడు రోజులు మారాయి గురించి రాయడం మీకే జెల్లు !!

  మానావా నిరాశా నిస్పృహ లను వదులుము ! అన్నింటికీ కాలము వచ్చును ! ఖర్చులు అధికమై, అధికమాసము వచ్చు వేళ అన్ని యు సర్డుకొనును !! (అప్పుడు బ్లాగాడుటకు కరెంటు ఉండదు !)

  జిలేబి

  • జిలేబిగారు,
   ఎప్పటికెయ్యది తథ్యమో
   అప్పటికా మాటలాడి అన్యుల మనసుల్
   నొప్పింపక తానొవ్వక
   తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ

   నిరాశ, ఆత్మ న్యూనతల సమస్యే లేదు.
   ఎవరికేనా మనవల్ల ఉపకారం జరిగితే సంతసం,అంతే
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s