శర్మ కాలక్షేపంకబుర్లు-వేరు కుంపటి

వేరు కుంపటి

శూరులజన్మంబు,సురల జన్మంబు, ఏరులజన్మంబు..తెలుసుకోకూడదు, వారిని ఉపయోగించుకోవాలే తప్పించీ అన్నారు, మా దుర్యోధన సార్వ భౌములు. ఎక్కడో పుట్టినా, మన దేశంలో, మన వంటింటిల్లు తన పుట్టిల్లుగా చేసుకున్నదే కాఫీ.

images

అరవై ఏళ్ళకితం పైబడిన కాలంలో కాఫీ హోటేళ్ళు లేవు, పూటకూళ్ళ ఇళ్ళే, అక్కడా చద్దన్నమే పెట్టేవారష, ఉదయమే. లేదంటే సత్రవులే గతి. ప్రగతితో కాఫీహోటేళ్ళొచ్చిన కాలం, నేడు. కాఫీ హోటేళ్ళలో కాపీ పేరేగాని, నేడు అన్నీ దొరుకుతున్నాయి, అనుభవాలతో సహా, జేబులో చిన్నమ్మ, ఒంట్లో పులుసు ఉండాలే తప్పించి. కాఫీ వచ్చిన కొత్తల్లో అనగా అరవై సంవత్సరాల కాలంలో కాఫీని మడి కట్టుకుని కాచుకుని తాగేవారంటే వింతపడద్దు. నాటి రోజుల్లో ఈ కాఫీకి వేరుగా కుంపటి, సరంజామా ఉండేవి, అలాగే ఈ ’వేరుకుంపటి’ మాట పుట్టింది. కాఫీ వడపోసుకోడానికి రెండు గుడ్డలు, కాఫీ గిన్నెలు,గ్లాసులు వేరుగా ఉండేవి. వీటిని ఇంట్లో సామానులతో కలిపేవారు కాదు, ఆచారం. ఇప్పటికి మా ఇంట్లో ఉదయమే ఇల్లాలు, ముందుగా వెలిగించేది కాపీ కుంపటే, అది నిరంతరాయంగా తొమ్మిదిదాకా వెలుగుతూనే ఉంటుంది. ఆ తరవాత కాలంలో వచ్చినదే ఫిల్టరు, ఇప్పటికి ఫిల్టర్ కాఫీ అలవాటైనవారు మరోటి తాగలేరు. నేడంటే ఇనిస్టెంట్ కాఫీ అని,కాఫీ పౌచ్ లు వగైరాలొచ్చేయికాని, నాటిరోజుల్లో పచ్చి కాఫీ గింజలు, ఈత గింజల్లా ఉండేవి, తెచ్చుకుని కొద్దిగా నేతితో దోరగా వేయించుకుని రోట్లో పొడుంకొట్టుకుని, మడిగా, పొడిని వస్త్రకాళితం చేసుకునేవారంటే ఆశ్చర్యం లేదు. అలా తయారు చేసుకున్న కాఫీపొడికూడా మడికట్టుకునే చేసుకునేవారు. రోజుకి ఒకసారే తాగేవారు, అప్పుడు మాత్రం తవ్వగ్లాసుతో తాగేవారు, ఇప్పటిలా సిప్పుల లెక్కన కాక. ఆ తరవాత కాలంలో కాఫీ పేకట్లొచ్చాయి, ఈ అవస్థలెవరు పడగలరని పేకట్లు కొనడం మొదలెట్టేరు, పేకట్లు కొంటే కంపెనీ చిన్న స్పూనో, దువ్వెనో లంచం ఇవ్వడం మొదలెట్టింది, అమ్మకాలూ పెంచుకుంది.. ఆ రోజుల్లోనే కాఫీకి అలవాటు పడిపోయి వ్యసనంలా తయారైపోతోందని, తంగేడు పువ్వు తెచ్చుకుని ఎండబెట్టుకుని కషాయం తీసుకుని తాగేవారు కూడా. నిజంగా తెలిసిచేసినా తెలియక చేసినా మంచి పనే చేసేవారు, తంగేడు పూల కషాయంతో కాఫీలా చేసుకుతాగితే ఇప్పుడు కేన్సర్ ని జయించచ్చునని చెబుతున్నారు.హోమియోలూ కాఫీని మందుగా వాడతారు.

 

images

ఉప్పూ నిప్పూలా ఉండే తోడికోడళ్ళు ”ఏమే!లచ్చమ్మా ఇంగువారింట్లో పొద్దుటే కాఫీ తాగుతారుట, ఇదేం అనాచరమంటావ్” అంటే ఆంటే ఆ లచ్చమ్మ, ’’అవును, నేనూ విన్నాను, ఎవరో చెప్పేరు” అని సాగతీసేది. ”నిన్నో మొన్నో మీ ఇంట్లోంచి కాఫీ గింజలు వేయించినవాసనొచ్చిందే” అని ఆరా తీస్తే ”అవును, మీ మరిదిని, పొద్దుటే కాఫీ తాగమన్నారట, డాక్టర్ గారు, అందుకు తెచ్చుకున్నారు, మొన్ననే వేయించి పొడుంకొట్టలేక చచ్చాననుకో” అనేదీ లచ్చమ్మ, ఆ గింజలు తనే మొగుడిచేత పోరి తెప్పించుకున్నా. ఇంకా ”వియ్యాలారింట్లో ఉదయమే కాఫీలు తాగుతారట, మన పిల్ల అక్కడ మనగలదా” అని ప్రశ్న. దానికి ”ఇప్పుడంతా కాఫీలే తాగుతున్నారమ్మా! ఏం భయపడక్కరలేదు” అని సమాధానం. అప్పటి పెళ్ళి కూతురు నేటి బామ్మ, ఇప్పుడు ”వియ్యాలారింట్లో మందు తాగుతారుటే” అంటే ”ఏం మనమ్మాయికేం తక్కువా, తనూ తాగుతుంది” అంటోందానాటి పెళ్ళికూతురు, నేటిబామ్మ. అప్పటి రోజుల్లో పెళ్ళిలో ఐదురోజులూ ఉదయమే ఉపమా,కాఫీ లు అందరికి ఇవ్వాలనేదో షరతూ. ఇలా, ఈ కాఫీ, మన జీవితమనే పడుగులో పేకలా కలిసిపోయింది. ఎవరింటికేనా వెళితే, ముందు అథిది సత్కారం కాఫీతోనే ప్రారంభం. నేను మాత్రం ఈ మధ్య ఆ కాఫీలు తాగలేక చెప్పేస్తున్నా 🙂 ”కొద్దిగా మంచినీళ్ళివ్వండి, లేదా చాలా పల్చగా మజ్జిగేనా ఇవ్వండీ” అని ఎందుకో తెలిసిందా?

images (1)

ఇప్పటికి అక్కడక్కడా కాఫీ తాగనివారున్నారు, కాఫీవాసన కిట్టని వాళ్ళూ ఉన్నారు.ఆశ్చర్యం లేదు. లేచిన వెంటనే కుంపటి వెలిగించి వేణ్ణీళ్ళు పెట్టి ఫిల్టర్ లో పొడేసి, కాపీ పెట్టి పట్టుకొచ్చే ఇల్లాలు ’అమృతం చేత్తో తెచ్చే మోహిని’లాగే కనపడుతుంది, ఉదయమే. ఉదయమే లేచినది మొదలు ఒక సారి లార్జి పెగ్గు కాఫీ పడితే కాని బండి కదలదు,బుర్రా పని చెయ్యదు. ఆ తరవాత ఇక సిప్పులు, రెండూ, ఒకటి చొప్పున నడుస్తూనే ఉంటుంది, కాఫీ సేవనం. ఇల్లాలు తెచ్చి ఇస్తూనే ఉంటుంది. ఉదయం స్నానం అయిపోయిందా మరి కాఫీ తాగబుద్ధికాదు, మరదేం చిత్రమో!.

మన పాడేరు కాఫీ రుచి మరి దేనికీ లేదుట, ప్రపంచంలోనే….కాకినాడలో మెయిన్ రోడ్డు నుంచి శివాలయానికి వెళ్ళే మలుపు దగ్గరలో మేడ మీద, ఒక ఉడిపి హోటలుండేది, ఎప్పటిమాట నలభై ఏళ్ళ కితం , ఇప్పుడుందో లేదో తెలీదు, అందులో అప్పటికే అరవై ఏళ్ళ అయ్యరొకాయన కౌంటర్ లో కూచునుండేవాడు, తేలు మంత్రం వేసేవాడు, తేలుకుట్టి బాధ పడుతూ వచ్చిన వారిని కూచోబెట్టి, మంత్రం వేసి, తనే స్వయంగా చాలా వేడి కాపీ కలిపి, పెద్ద కప్పుతో నిండా తెచ్చి, ఇచ్చి తాగమనేవాడు, తాగేదాకా అక్కడే నిలబడేవాడు. కాఫీ తాగిన తరవాత విషం దిగిపోయేది. ఇది స్వానుభవం కూడా 🙂 అయ్యరుగారు కాఫీకి కూడా డబ్బులు పుచ్చుకునేవాడు కాదు, ఎవరిదగ్గరా కూడా. కాకినాడలో మెయిన్ రోడ్డులోనే టవున్ హాల్ ఎదురుగా మరో ఉడిపి హొటలుండేది, అందులో అయ్యరుగారు మేం టిఫిన్ కి వెళితే తనే స్వయంగా కాఫీ కలిపి తెచ్చేవాడు. అదేమోగాని ఆ కాఫీ ఎంతో రుచిగా ఉండేది.కాకినాడలోనే ఇండియన్ కాఫీ హవుజ్ వుండేది కల్పనాటాకీస్ దగ్గర, పేరుగొప్ప ఊరుదిబ్బలా ఉండేది. రాజమంద్రిలో ఇండియన్ కాఫీ హవుజ్ మెఇన్ రోడ్ లో బాటా పక్కనుండేది, అక్కడ కాఫీ తాగితే అద్భుతం, ఆ రోజుల్లో అక్కడ కాఫీ తాగడం ఒక స్టేటస్ సింబల్ కూడా….. …ఇవేళింకా మోహినీ దేవి ప్రత్యక్షం కాలేదు, బుర్రా పని చెయ్యటం లేదు, ఎందులోంచో ఎందులోకో పోతోంది……మోహినీ దేవీ ప్రత్యక్షం కావా! పాహిమాం………’ఏవండోయ్! మిమ్మల్నే’ లోపల్నించి కేక వినపడుతోంది, వస్తా మోహినీ దేవి అక్కడ ప్రత్యక్షమవుతుందేమో!… వస్తానండిబాబూ…కాఫీ..కాఫీ…

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వేరు కుంపటి

 1. .కృతజ్ఞతలు మాస్టారు గారూ. శైలి ఆసక్తికరంగా వుంది. మీ వంటి వారు మాకు పెద్దవారిగా వుంటే బాగుండేది. మీతో ఇలా పరిచయం ఆ తల్లి వారి అనుగ్రహమే.

 2. గురువు గారు, శ్రీపాద వారి కథల్లో క్రొత్త పెళ్ళికూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తెచ్చుకున్న వస్తువుల్లో కాఫీ ఫిల్టర్ ఒకటి. ఆయన వ్రాసిన కథాకాలం కూడా మీరు పేర్కొన్న సమయమే.

  • దూర్వాస్ గారు,
   మీరు చెప్పింది నిజమే. కాఫీ ఫిల్టరు ప్రధాన వస్తువుల్లో మొదటిది, నాటిరోజుల్లో ఏం లెండి, నేటికీ అంతే….
   ధన్యవాదాలు

 3. నాకూ ప్రొద్దున్నే లార్జ్ పెగ్ కాఫీ అలవాటు సుమండీ , మీ లాగానే ,
  కాకినాడ ప్రసక్తి తెచ్చి పడగోట్టేసరంటే నమ్మండి . ధన్యవాదాలు ..

  • అంజలి తనూజ గారు,
   ఉదయమే లార్జ్ పెగ్ కాఫీ పడకపోతే….అమ్మో! ఏమైనా ఉందా? సుగర్ టెస్ట్ చేయించుకునే రోజుంటుంది చూడండి నా బాధ. సత్యనారాయణ వ్రతం రోజుకూడా కాఫీకి అనుమతి ఉందండీ 🙂 మరి కాకినాడంటే…అమ్మో..గుండెకాయకదూ…
   ధన్యవాదాలు

 4. మోహినీ దేవి రోజూ ఇలా మీకు కాఫీ ఆలస్యం చేస్తే బాగుణ్ణు, ఇలా కమ్మని పోస్టులు రాస్తుంటారు!

  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆంధ్రా ఫిల్టర్ కాఫీ లేనిదే లాభంలేదండీ శర్మ గారూ! నా మటుకు నేను నా సూట్కేసులో మొదట సర్దుకుంది కాఫీ ఫిల్టరే!

  ఇక్కడి పల్చని బ్లాక్ కాఫీ తాగడం బతికుండగా నా వల్ల కాదు. ఎవరు నవ్వినా సరే! వారం దాటి వెకేషన్ ఉంటే, ఫిల్టర్ కూడా తీసుకెళ్ళి హోటల్ రూములోనే ఫిట్లర్ వేసుకుని మన కాఫీయే.. 🙂

  • సుజాతగారు,
   మోహినీ దేవికి అలకొచ్చినరోజు ఇబ్బంది తప్పదండి 🙂 మనదైన అలవాటు ఎందుకు వదులుకోవాలండీ! పాపం మన పెద్దవాళ్ళు మడికట్టుకుని కాఫీ తాగి, మరీ అలవాటు చేసిపోయారు కదా!!!
   ధన్యవాదాలు

 5. కాఫీ బానిసల ఇళ్ళల్లో రోజూ శుభోదయం ఇలానే ఉంటుంది.మా ఇంట్లోకూడా ఇలానే శర్మగారు.కాఫీ పడితేనే పేపర్ పైన చూపు పడేది,నడకకు బయలుదేరేది.

  • స్వరాజ్య లక్ష్మిగారు,
   ఈ కాఫీ ఏకులావచ్చి మేకులా అయిపోయింది కదండీ! కాఫీ తాగకపోతే ఏపనీ నడవదండీ..
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s