శర్మ కాలక్షేపం కబుర్లు-జీవిత పాఠం.

జీవిత పాఠం.

అన్నిదానములను అన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడులేదయా
విశ్వదాభిరామ వినుర వేమ.

వేమన తాత, అన్నిదానాలకంటే అన్నదానం గొప్పదనీ, తల్లికంటే ఘనమైనదేదీ లేదనీ, గురువుకంటే మరెవరూ గొప్పవారు కాదనీ అంటారు.

అన్నదానానికి మించిన దానం మరొకటి ఉంది కాని అది సద్యోఫలితాన్నివ్వదు. అదే విద్యాదానం. అన్నదానం మనిషిని వెంటనే కోలుకునేలా చేస్తుంది, జీవింపచేస్తుంది, అందుకే గొప్పదయింది.

మొన్న ఒక చోట భోజనానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ భోజనాలు వడ్డించారు,చిప్ప కూడు కాదు, ఆకులో వెయ్యగానే కలబడితినెయ్యాలేదు, మళ్ళీ పూర్వాచారంగా అందరూ ఒక సారి భోజనానికి కూచున్నారు, ఇది ముచ్చటా వేసింది.నేను వడ్డించేటపుడే కొన్ని వద్దని చెప్పేసేను. భోజనం చేయడం మొదలు పెట్టేము. ఒకరు వడ్డిస్తున్నారు, అనుభవజ్ఞుడిలా అనిపించలేదు. వద్దంటుంటే బలవంతంగా వేస్తున్నాడు. చాలా మంది, చివరికి ఆకులలో, చాలా పదార్ధాలు పారేశారు. నేను చివరికొచ్చేశాను. పెరుగు అన్నం ఊడ్చుకుని ఆకులో ఏమాత్రం లేకుండా తింటున్నది పక్కనున్నతను చూసి, ”మరీ అంత ఊడ్చుకుని తినాలా? కావాలంటే వేయించుకోవచ్చుగా” అన్నాడు వ్యంగ్యంగా. నేను నవ్వేను, అది అతనికి మరికొంచం బాధ కలిగించినట్లుంది, నొసలు చిట్లించుకుంటూ చూశాడు. లేవడానికి అతని సాయం తీసుకుంటున్నట్లుగా అతని చెయ్యి పట్టుకుని చేతులు కడుక్కునే దగ్గర దాకా వెళ్ళి చేతులు కడిగిన తరవాత, నెమ్మదిగా చెప్పాను. ”ఆహారం కావలిసినంతకంటే ఎక్కువ ఒకసారి తినలేరు, పొట్ట అందుకు అనుమతివ్వదు. కావలసినది వేయించుకుని తినాలి తప్పించి, ఆకులో వేయించుకుని పారెయ్యడమేలా? అది మంచి పనా? చెప్పండి, ఆకులో వేసినది, వేయించుకున్నది పూర్తిగా తినేయాలి, వడ్డన ముందు వేసిన ఆకు ఎలా ఉందో, భోజనం చేసి లేచిన తరవాతా ఆకు అలాగే ఉండాలి,అంత శుభ్రంగా తినాలి, కూరల్లో వేసిన మిరపకాయ,కొత్తిమీరి,కరివేపాకుతో సహా తినాలి,అంటే ”మనం వదిలేసినవి పేదవారికి పెడతారు కదండీ” అన్నారు. నాకు చాలా కోపమే వచ్చింది, కాని తమాయించుకుని, ”మీరు ఎంగిలి తింటారా?” అంటే ”నేనెందుకు తింటా”నన్నారు. ”మీరు ఎంగిలి తిననపుడు మరొకరు మీ ఎంగిలి ఎందుకు తినాలి, వారు లేనివారైతే మాత్రం. మనం వదిలేసినవే వారికి పెట్టాలా? బాగున్నవే పెట్టచ్చుగా! ఇది అలవాటు చేసుకోవాలి,” అని చెప్పేను. అతను నన్ను వెర్రి వానిలాగే చూశాడు, కక్కుర్తివానిలా కూడా అనుకుని ఉండచ్చు, నేను మాత్రం బాధ పడలేదు.

ఒకప్పుడు పెళ్ళిళ్ళలో తిన్నంత తిని పారేసినంత పారెయ్యడం గొప్పగా అనుకునేవారు. తరవాత కాలం లో దగ్గరగా నలభై ఏళ్ళుగా, ఇందులో మార్పూ వచ్చింది, మళ్ళీ ఈ దరిద్రపు అలవాటు పెరుగుతోంది, ఒకప్పుడు మా కుటుంబాలలో ఆహారం పారెయ్యవద్దని ఉద్యమంగా చెప్పేను. ఆహారం పారెయ్యకండి, ఎక్కువున్నది పది మందికి పెట్టండి, వారు తింటుంటే, చూస్తే ఆ ఆనందం మరి దేనిలోనూ రాదు, ’అన్నదాతా సుఖీభవ’ అనే ఆశీర్వచనం వినండి, దానిని మించిన ఆశీర్వచనం లేదు, లేదు, లేదు,మానవులచేత చాలు అనిపించగలిగినది ఒక అన్నదానమే! ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. ఒకప్పుడు ఆ రోజు వండుకోడానికి తీసుకున్న బియ్యంలో ఒకపిడికెడు వేరుగా ఉంచి నెలకి ఒక సారి అన్నదానానికి ఇచ్చిన రోజులున్నాయి. ఆ తరవాతి కాలం లో ఈ అలవాటుపోయింది.

అసలింతకీ నా అలవాటేమంటే, ఒక సారి, భోజనానికి ముందే కావలసినవి వేయించుకుంటా, ఆ తరవాత మరి మారు వడ్డించుకోను, ఏదీ పారెయ్యను, మితంగానే తింటాను, అది నా నియమం. అదేననుకుంటా నా ఆరోగ్య రహస్యం. ఈ అలవాటుకి వెనక ఒక చిన్న కథ ఉంది. నేనో బీద కుటుంబాన్నుండి వచ్చిన వాడిని కనక నాకు ప్రతి మెతుకు విలువా అది ఆకలి తీర్చే రీతీ పూర్తిగా తెలుసు.

అది ఉద్యోగం వచ్చిన కొత్త, ఏభై సంవత్సరాల కితపు మాట. కొత్తగా పెళ్ళైన సంవత్సరం కూడా. నేను ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో కార్తీక వన సంతర్పణ పెట్టేరు, నేనొక మాస్టారింటిలో అద్దె కున్నా. వారు బహుకుటుంబీకులు. నా వయసు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు, ఊళ్ళో చాలా మంది నేను కూడా ఆ కుటుంబంలో వాడినే అనుకునేవారు. ఆ కుటుంబం కూడా ”కూటికి పేద కావచ్చు గాని కులానికి కాదని” చాలా మంచి పేరున్న కుటుంబం. భోజనాలికి వెళ్ళేం. భోజనాలవుతున్నాయి, ఇంకా అప్పటికి పాత కాలపు వాసనలు పోలేదు, పూర్తిగానూ. ఎవరెవరో పద్యాలు పాటలు చదువుతున్నారు, నేనూ ఒక పద్యం చదువుతున్నా, ఆ సమయం లో ఒక పెద్దాయన ”పాకంతీబూంది” బుట్టలో తీసుకొచ్చారు. నేను వద్దని నోటితో చెప్పేందుకు సావకాశం లేదు. వద్దని చెయ్యి ఆడిస్తూనే ఉన్నా, కాని ఆయన నా చేతి మీదుగా బూందీ కొంచం ఎక్కువగానే వడ్డించి, ”కుర్రాళ్ళు తినకపోతే ఎవరు తింటారంటూ” వెళ్ళిపోయారు. నాకేం చెయ్యాలో తెలియలేదు. కొద్దిగా కష్టపడి తిన్నాను, ఇంకా తింటే డోకొచ్చేలాగానూ ఉంది,తీపి ఎక్కువగా ఒకసారి తింటే మొహం మొత్తింది, అక్కడికి ఊరగాయ నంచుకుని బూందీ తిన్నాను, పారెయ్యలేక. ఏం చేసినా ఇక నోటికిపోవటమూ లేదు. ఏం తోచక అదే తింటూ మిగిలిన పులుసు,పెరుగు వగైరాలు వేయించుకోనే లేదు. ఐనా కొంత వదిలేయకతప్పలేదు. అందరివి భోజనాలయ్యాయి, లేవడానికి సిద్ధంగా ఉన్న సమయం, ఎక్కువైనది ఆకులో వదిలేశాను. అదిగో అప్పుడొచ్చారు ఆయన, మళ్ళీ, వచ్చిన వాడు ఊరుకున్నాడా? పెద్ద గొంతుతో ”ఓ సర్వ భూతాలలారా, కుక్కల్లారా, నక్కల్లారా రండి, మీకు భూత తృప్తి, ఇక్కడీయన కుప్పగా పోసిపెట్టేడు, కావలసినది వేయించుకుతినాలి, ఇలా పారెయ్యకూడదు…….” ఇంకా ఆపైన ఆయన మాటాడిన మాటలు వినాలేకపోయా. అలా అంటూ నన్ను ఎద్దేవా చేయడం ప్రారంభించారు. నాకు కళ్ళ నీళ్ళు తిరిగాయి, ఉక్రోషం వచ్చేసింది. ఈ లోగా పక్క నున్న వారు ”మాస్టారూ! వీరు జోగారావుగారి ఇంట్లో ఉన్నవారు, నిదానం” అని అంటున్నా వినక ఇంకా ఏవో, ఏవో మాటలూ వదిలేశాడాయన. నేను ఎలా తమాయించుకున్నానో చెప్పలేను, నోరు విప్పలేదు. నిజానికి ఈ సంఘటనను ఎవరూ పట్టించుకోలేదేమో కూడా.అందరూ తాంబూలం వేసుకుంటున్న సమయం, నా పక్కన కూచున్నవారు నాతో మాటాడుతూ, ”మిమ్మల్ని ఆయన సరిగా గుర్తుపట్టినట్టులేదు, మీరు జోగారావుగారి తాలూకు అనుకున్నాడాయన. ఆయనకి జోగారావు గారికి పడదు, అదీ సంగతి, అందుకు మిమ్మల్ని అవమాన పరచాడు, మరేం అనుకోకండి” అని చెప్పి ఊరడించారు. అందరూ తాంబూలం వేసుకుంటూన్నారు, ఇందాకటి మాస్టారు మిగిలినవారూ భోజనాలు చేస్తున్నారు, వారి దగ్గరికి చేరాను. ”మాస్టారూ! నమస్కారం,” అంటే ఆయన కనుబొమలెగరేశాడు, నేను, నా పేరు, చేస్తున్న ఉద్యోగం, ఎవరింటిలో ఉంటున్నదీ, ప్రవర చెప్పుకున్నాను. ఆ తరవాత, ”నేను పద్యం చదువుతున్నాను, వద్దని చెప్పి చెయ్యి ఊపుతున్నా వినక, నా విస్తరిలో బూందీ పోసిపోయి, ఆ తరవాత పది మందిలో నేను ఆత్రగొట్టు మనిషినన్నట్లూ, నన్ను అవమాన పరచేలా మాటాడేరు, ఇది మీకు సభ్యతగా ఉందా? మీరు వయసులో పెద్దవారు, నేను తిరిగి మిమ్మల్ని ఏమీ అనలేదు, అంటే మీ పరువుపోయేది కదా! కక్ష తీర్చుకోవాలనుకుంటే మరో మార్గం చూడండి, ఇది మంచిదికాదు,” అని చెప్పి ఆయన ఏదో చెప్పబోతుంటే కూడా వినక వచ్చేశాను. ఆ తరవాత ఒక సారి ఆయన నన్ను కలవడం జరిగింది, అప్పటికి ఆయన ఇది మరచినట్టులేదు, ”శర్మగారూ, ఆ రోజు సంఘటనతో నాకో పాఠం నేర్పేరు, ఛెళ్ళుమని చెంపమీద కొట్టివున్నా బాధపడి ఉండేవాడిని కాదేమో కాని, మీరు చాలా సంయమనంతో మాటాడిన మాటలు నన్ను సిగ్గుపడేలా చేశాయి, చాలా బాధే కలిగింద”న్నారు.

అదిగో ఆ సంఘటన జీవితంలో పాఠం నేర్పింది నాకూ……అప్పటినుంచి అక్కరలేకపోతే వద్దని గట్టిగా చెప్పడమే అలవాటు చేసుకున్నా. ఆకులో వేయించుకున్నది పారేయపోవడం, మారు వడ్డించుకోకపోవడం నా నియమాలు, నాటినుండి. ఇదో జీవిత పాఠం.

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-జీవిత పాఠం.

  • బోనగిరిగారు,
   అలవాటైతే వదలలేరు. పచ్చి మిర్చి ఐతే అన్నంలో పిసికెయ్యచ్చు, ఎండు మిర్చిని చిన్న ముక్కలుగాచేసుకుంటే తినెయ్యచ్చు. మరో ముఖ్యమైన సంగతి, జీర్ణకోశ కేన్సర్ కి, దానిని తగ్గించేందుకు మిర్చి ఔషధమంటున్నారు.
   ధన్యవాదాలు.

 1. శర్మగారూ ,
  మీ జీవిత పాఠం , మా అందరికీ కూడా ఒక పాఠమే !
  పళ్ళెం లో వేయించుకుని, పూర్తి గా తినకుండా వదిలేయడం , ఒక అలవాటు గా మారింది , మన దేశం లో !
  అంతర్జాలం లో కొనుక్కుని , ఆ వస్తువులను వాడక పోవడం ఒక పెద్ద సమస్య అవుతూ ఉంది, అమెరికా లో !
  లక్షలూ , కోట్లూ బ్యాంకు ల్లో ఉంచుకుని , ఇంకా డబ్బు కోసం తాపత్రయ పడడం , ఒక వ్యాధి అవుతూ ఉంది, ప్రపంచం లో !
  ఇవన్నీ నాగరికతకు దర్పణా లవుతున్నాయి, ఈ రోజుల్లో !

  • సుధాకర్ జీ,
   మానవులు కావలసినది సంపాదించుకోడం తప్పు కాదు, దానిని సవ్యంగా అనుభవించడమూ తప్పు కాదు, దుబారా చేసి పారెయ్యడంలో ఆనందమేంటో అర్ధం కాలేదు.
   ధన్యవాదాలు.

 2. ఈ అలవాటుకి వెనక ఒక చిన్న కథ ఉంది. నేనో బీద కుటుంబాన్నుండి వచ్చిన వాడిని కనక నాకు ప్రతి మెతుకు విలువా అది ఆకలి తీర్చే రీతీ పూర్తిగా తెలుసు.
  —————————————————–
  అనవసరమైన వాటికి అప్పులుచేసి ఏదో సాధించామని కాలరెత్తుకు తిరిగే రోజుల్లో ఇవ్వేమీ అర్ధం కావేమో.

  • రావు లక్కరాజుగారు,
   కిందటి తరం అలాగే గడిచిపోయిందండి. మా తరంలో నేనే ఉద్యమంలా చెప్పేను, పెళ్ళిళ్ళలో పారేయడం గురించి. మళ్ళీ ఇప్పుడు మొదలయింది, అది గొప్పనుకుంటున్నారు, దురదృష్టం.
   ధన్యవాదాలు.

 3. చాలా విలువైన పాఠం కదా తాతగారు.
  ఈ సంఘటన నించి నేను ఒక పాఠం నేర్చుకునాను.
  అంతలా అవమానించిన పెద్దమనిషితో మీరు మాట్లడిన తీరు నిజంగా అందరికీ సాధ్యం కాదేమో మా తాతగారికి తప్ప.
  మీరు ఆయన తప్పుని విడిచిపెట్టలేదు.కోపం ప్రదర్శించలేదు. ఎలా ఆ మనిషికి చెప్పాలో అలా చెప్పారు.అదీ గొప్ప విషయం.. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s