అహల్య.
అహల్య బ్రహ్మ మానస పుత్రిక. ఆమెను బ్రహ్మ సభలో చూసిన దేవతలంతా ఆమెను చేపట్టాలనుకున్నారు, ఆమె అతిలోక సౌందర్యానికి ముగ్ధులయి. బ్రహ్మగారీ విషయం గమనించి అక్కడే ఉన్న గౌతముని పిలిచి, అహల్యను అప్పగిస్తూ, ”ఈమె కొంతకాలం, సపర్య చేస్తూ నీ ఆశ్రమం లో ఉంటుంద”ని చెప్పేరు. గౌతముడు ఆమెతో ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఈ అతిలోక సుందరి దగ్గర ఉన్నా గౌతముడు చలించలేదు, అహల్యా చలించలేదు, ఇద్దరూ వయసులో ఉన్నా. వీళ్ళని గమనించిన బ్రహ్మగారు వీరికి వివాహం చేశారు. ఇది గాక మరో కథ చెబుతారు అదెలాగంటే,
అహల్యను చేపట్టాలనుకున్న దేవతలతో బ్రహ్మ గారు ”భూప్రదక్షణ ఎవరు ముందుచేసివస్తారో వారికి అహల్యనిచ్చి వివాహం చేస్తా”నన్నారు. దేవతలంతా భూ ప్రదక్షిణానికి బయలు దేరారు. అక్కడే ఉన్న గౌతముడు మాత్రం దూడతో ఉన్న గోవుకి ప్రదక్షిణం చేసి బ్రహ్మగారి దగ్గరకెళ్ళి అహల్యను కోరితే, వారిద్దరికి వివాహం జరిపించారు. ఎలాగైనా అహల్యాగౌతములకు వివాహం జరిగింది. వీరిద్దరూ ఆశ్రమం లో ఉండి సంసారం చేస్తూ తపస్సు చేసుకుంటున్నారు. ఇక్కడిదాకా కథ శ్రుతం. ఇకముందుది మాత్రం వాల్మీకి రామాయణంలోదే….
చాలా సంవత్సరాలు గడిచాయి, తపస్సు చేసుకుంటుండగా, ఈ సందర్భంగా ఒక రోజు, గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు, గౌతముని వేషంలో ఆశ్రమానికి వచ్చి అహల్యతో ”ఓ సుందరీ! నీతో సంగమించాలనుకుంటున్నాను, కామాతురులు ఋతుకాలం దాకా ఆగరు” అన్నాడు. గౌతముని వేషంలో వచ్చిన వాడు ఇంద్రుడని అహల్య తన తపశ్శక్తితో గుర్తించి, ”ఏమీ దేవతలరాజయిన ఇంద్రుడే ఇలా పలుకుతున్నాడు” అని ఆశ్చర్యపోయి, పెక్కు విధాలుగా ఆలోచించి, చివరగా ”దేవేంద్రా! నా దాంపత్య జీవనంలో నేను సంతుష్టిగానే ఉన్నాను,నీవు వెళ్ళిపో. అలాచేస్తే అది నీకూ నాకూ గౌరవప్రదం” అని చెప్పింది. ఇది విన్న దేవేంద్రుడు నవ్వుతూ,”నీ విశిష్టరీతికి సంతసించాను, వచ్చినట్లే వెళుతున్నాను” అని బయటికి నడచాడు. ఈ లోగా గౌతముడు రానే వచ్చారు, కుశలు దర్భలు చేబూని,. తన రూపంలో ఉన్న దేవేంద్రుని చూశారు. పట్టరాని కోపంతో ”దుర్మార్గుడా! నా రూపం ధరించి వచ్చి, అనుచితంగా ప్రవర్తించావు కనుక వృషణాలు లేకుండా పోతావ”ని శపించారు.ఆ తరవాత అహల్యను ”వేలకొలది సంవత్సరములు అన్నపానములు లేక వాయుభక్షణతో, దుమ్ములోపడి ఉండి, ఎవరికి కనపడకుందువుగాక” అని శపించారు. ”శ్రీరాముడు ఈ ఆశ్రమాన్ని దర్శించినపుడు ఆయనకు అతిది మర్యాదలు జరిపి, నీవు పునీతవై నన్ను చేరుదువుగాక” అని చెప్పి తపస్సుకై హిమాలయాలకు వెళిపోయారు.
అహల్యా వృత్తాంతంలో, వచ్చినవాడు గౌతముని వేషంలో ఇంద్రుడని తెలిసి, అహల్య, ”మునివేషం సహస్రాక్షం దేవరాజ కుతూహలాత్” అన్నారు వాల్మీకి. ఏమి దేవేంద్రుడయి ఉండి, గౌతముని వేషంలో వచ్చి ఇలా అసభ్యంగా మాటాడుతున్నాడనే కుతూహలంతో చూసిందే తప్పించి, మరేమీలేదు, ఆమె మనసులో కూడా ఇంద్రునిపై కోరిక లేదు. ఆ తర్వాత కూడా సామాన్య స్త్రీ ఇటువంటి సందర్భం లో ఎలా మాటాడుతుందో అల్లాగే మాటాడింది. నేను నా భర్తతో అసంతుష్టిగా ఉన్నాననుకున్నావు, కాని నేను సంతుష్టి పడుతున్నాను, నువ్వు వచ్చిన దారినే వెళితే ఇద్దరి గౌరవాలూ నిలబడతాయని హెచ్చరించింది. దానికి ఇంద్రుడు కూడా వెనుకంజ వేసి, సుందరీ నీ విశిష్టరీతికి తగినట్టే మాటాడేవని వెనుతిరిగాడు.
ఇంద్రుడు ఈ పని ఎందుకుచేయాల్సివచ్చింది? అహల్యా, గౌతములు తపస్సు చేస్తున్నారు, ఇంద్రుడు పరీక్షాధికారి. సాధారణంగా అందరి మగవారికి పెట్టే పరిక్ష (స్త్రీ లోలత్వం) ఇంద్రియ నిగ్రహం. కాని గౌతముడు అపురూపసౌందర్యవతి ఐన అహల్యతో కాపురం చేస్తూ, తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనపై కామాన్ని ప్రయోగించినందువలన ఉపయోగం లేదు. అందుకని అతనిలోని మరో గుణాన్ని ప్రచోదనం చెయ్యాలనుకున్నాడు,అదే క్రోధం. దానికి దారి, అహల్యతో సంగమాన్ని కోరి వచ్చినట్టుగా కనుపింపచేయడానికే గౌతముని వేషం వేసుకువచ్చాడు. కథ నడిచింది,దేంద్రుడు అనుకున్నట్టే. అదేవేషంలో బయటకూ వచ్చాడు, గౌతముని కంటా పడ్డాడు, కాగల కార్యం జరిగింది. ఇది కావాలనుకున్నదే. గౌతముడు సంయమనం కోల్పోయాడు, శాపమిచ్చి తపశ్శక్తిని కోల్పోయాడు. ఇది అహల్యకు కూడా పరీక్షే.
మరి అహల్యకు శాపమెందుకిచ్చాడు? సామాన్య మానవునిలాగానే ప్రవర్తించాడు. నిజానికి అహల్య కూడా ఇంద్రుని శపించగలదే, అతను అన్న మాటలకి, కాని ఆ పని చేయలేదు, కారణం, ఆమె సంయమనం కోల్పోలేదు,సత్వగుణాన్ని వదులుకోలేదు, ఇంద్రుడు అసభ్యంగా మాటాడినా. ఇంద్రుడు ఆశ్రమాన్నించి బయటకు వస్తూ తన స్వస్వరూపంతో బయటకు వచ్చినా గౌతముడు శపించేవాడు కాదు, అప్పుడు దేవేంద్రుని అవసరమూ తీరేది కాదు. దేవేంద్రుడు గౌతమ రూపంలో వచ్చి అహల్యను ప్రలోభ పెట్టబోయినందుకే శపించాడు. నిజంగానే అహల్య తప్పు చేసిందని భావించినా, ”నిన్ను శాశ్వతంగా వదిలేశాను ఫో” అనలేదు,నేటి కాలపు పురుషులలాగా.తప్పు చేసిందనుకున్నా శిక్షించి ఏలుకోవాలనే అనుకున్నారు. వేల సంవత్సరాలు తపించి, నాయందనురక్తవైనపుడు, శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చినపుడు మరల నన్ను చేరుతావని చెప్పేరు. గౌతముడు ఇంద్రునికి శాపం ఇచ్చిన తరువాత ఏమి జరిగినదీ అహల్యను అడగనూ లేదు, అహల్యా చెప్పలేదు, అసలు అహల్య నోరు విప్పలేదు..గౌతముడు సామాన్య పురుషునిలాగే ప్రవర్తించారు, కోపం ఆయన యొక్క వివేకాన్ని పాడుచేసింది.శాపమిచ్చిన గౌతమునికి ప్రతిశాపం ఇవ్వలేదా అహల్య? ఇవ్వగలదు కాని సత్వగుణాన్ని వదులుకోలేదు, దీనిని మరో రకంగా అనుకోడం సబబు కాదు.
చివరగా మరో మాట, వృషణాలు నేల రాలినప్పుడు దేవతల వద్దకుపోయి ఇలా అంటారు,
కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః
క్రోధముత్యాద్య హి మయీ సురకార్యమ్ ఇదం కృతమ్
గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపశ్శక్తిని వృధా చేసి దేవతల కార్యం నెరవేర్చాను అంటాడు. దీనిని బట్టి కూడా ఇంద్రుడు తనకుతానుగా అహల్యను వ్యభిచరించడానికి పూనుకోలేదని, గౌతమునికి కోపం తెప్పించడానికి చేసిన పని అనీ తెలుస్తోంది.
ఇది ”ఇతిహాసం” అంటే ఇలా జరిగినదీ అని చెప్పడమే, పెద్దలు కూడా వచ్చినవాడు ఇంద్రుడని తెలిసీ అహల్య సంగమించి, తప్పుచేసిందని,అన్నారు. తప్పుచేసిందని ఎలా నిర్ణయానికి వచ్చారో చెప్పలేను. నిజానికి అహల్య న+హల్య= అహల్య,దున్నబడనిదే.
అహల్యా,సీతా,తారా,ద్రౌపది, మందోదరి, వీరు ఐదుగురు పంచకన్యలన్నారు, వీరిని స్మరిస్తే చాలన్నారు, అదీ భారత స్త్రీ వైభవం.
తెలిసిన కధే అయినా మళ్ళీ చదవాలి అనిపించేలా రాశారు. తొమ్మిదవ తరగతిలో చదువాను ఈ కధని. మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేసారు. మరిన్ని కబుర్లు మీనుండి ఆశిస్తూ…
పద్మ గారు,
మళ్ళీ గుర్తుకు తేగలిగినందుకు, నచ్చినందుకు
ధన్యవాదాలు.
గురువు గారు, రామాయణం కథలుగా చదివిన, నేర్చుకొన్న నేటి పెద్దలకు (నాటి బాలలు) ఇదేమి క్రొత్త విషయం కాదు. కాని అహల్య ఇంద్రుడితో కూడినద లేదా అన్నది ఇంకా అనుమానాస్పదం. దీనికి మీ వివరణ అద్భుతం. మీకు మరో మారు అభినందనలు.
ప్రసాద గారు, గురువు గారు దీన్ని రామాయణం లోంచే గ్రహించి వివరించారు.
durvas గారు,
టపా రాసిన తరవాత వివరణ సరిపోదనిపించింది, ఈరోజు టపా చూడగలరు.నా వివరణ నచ్చినందుకు
ధన్యవాదాలు.
మీరు పైన చెప్పిన విధంగానే నాకు అహల్య కధ తెలుసును. కానీ ఈ మధ్యన కొంత మంది అహల్య, ఇంద్రులు సంగమించినట్టుగాను, ఎందుకు అహల్య అలాంటి పనికి పూనుకోవలసివచ్చినది ఇత్యాది విషయాలతో పలు రాతలు రాసి కల్తీ చేసారండి. కానీ ఆ విషయంను ఎందులో నుండి తీసుకొని చెబుతున్నారొ కూడా ఎవరూ తెలియపర్చలేదు. ఇప్పటి వరకు వస్తువులు లోనే కల్తీ చూసాను. ఇప్పుడు మన ప్రాచీన పురాణా గాధల్లో కూడా కల్తీ ప్రవేశపెట్టి వారికి నచ్చిన రీతిలో రాయడం చాలా తప్పు కదండి.
మంచి విషయంను పోస్ట్ చేసారు.
rajiv raghav గారు,
సనాతన ధర్మం స్వేఛ్ఛని ప్రసాదించింది. దానిని దుర్వినియోగం చేసుకుంటే మనమే నష్టపోతామని తెలుసుకోక, కొద్దిపాటి లాభానికి తిప్పలు పడతారు.
ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పారు, మరి చాలా మంది ప్రవచనాలలో, సినిమాలలో అహల్య తెలిసీ తప్పు చేసింది అంటున్నారే? గురువు గారూ, నాదొక విన్నపం, ఇటువంటి తప్పుడు ప్రచారాలని మీ బ్లాగ్ ముఖతః ఇలా ఖండిస్తూ ఉండండి, మాకు విజ్ఞానాన్ని పంచుతూ ఉండండి.
మరొక్క మాట: పైన ఉదహరించిన శ్లోకాలు ఏ పుస్తకమో చెబుతారా? ఇలా సంస్కృత మూలం మరియు తెలుగు అర్థాలతో ఉండే పురాణాలు పుస్తకాలని కొన్ని ఉదహరిస్తే మాలాంటి వాళ్ళకి కొంచెం ఉపయోగంగా ఉంటుంది, వాటిని కొని చదువుకుంటే పుణ్యమూ, పురుషార్థం!
శివరామ ప్రసాద్ గారు,
ఇటువంటివాటిని ఇదివరలో రాశాను, వీలున్నంతవరకు చెబుతాను. మీకు చూపిన శ్లోకాలు రామాయణం లోనివే. ఇలా శ్లోకం అర్ధం ఉన్న పుస్తకాలున్నాయి.
ఇది రామాయణం గీతాప్రెస్ వారిది. మూడు పెద్ద పుస్తకాలు చాలా చవక. రైల్వే బుక్ స్టాల్ లో దొరుకుతాయి.
ఇదిగాక పుల్లెల శ్రీరామచంద్రునిగారి అనువాదం ఉంది ఇలాగే ఉంటుంది, ఖరీదెక్కువ కొనలేకపోయా. ఉషశ్రీగారి రామాయణం వచనం బదొక గంగా ప్రవాహం, చదవాల్సిందే తి.తి దేవస్థానం వారు వేశారు.
భారతం ఇలా దొరకలేదు, చాలా ప్రయత్నం చేశాను. మీకెక్కడేనా పుస్తకం దొరికితే నాకూ చెప్పగలరు.చాలామందిని అడిగాను కూడా.
భాగవతం ఇలా శ్లోకం తెనుగు అర్ధం తి.తి. దేవస్థానం వారు వేశారు, బాగుంది. నాకెందుకో సంస్కృతభాగవతం కంటే పోతన భాగవతం బాగా నచ్చింది.తెలుగు విశ్వవిద్యాలయం వారు వేశారు. భాగవతాలు రెండూ ఉన్నాయి నాదగ్గర. ఏదో ఒకటి కొని చదవడం మొదలు పెట్టండి.
ధన్యవాదాలు.
voleti17 April 2015 at 07:16
Nice sir..please write some more stories in original contest ..thank u sir..
voleti
Thanx