శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రాప్తం

ప్రాప్తం

ప్రాప్తం ఉంటేగాని అంటేది అంటదు, ముట్టేది ముట్టదు అంటారు. నిజంగా ఇది ఎప్పుడూ నాకు అనుభవంలోకి రాలేదుగాని, గురువారం ఉదయం ఇది బలే అనుభవమే అయింది.

ఉదయం పూట మా దగ్గరలోని మెయిన్ రోడ్ వెంట నడుస్తాం, ఇద్దరు ముగ్గురు మిత్రులం, కబుర్లు చెప్పుకుంటూ. ఒక కిలో మీటర్ దూరం ముందుకు, వెనక్కి నడుస్తాం. మంగళవారం, శుక్రవారం, దశమి, ఏకాదశి ఇలా వారం వర్జ్యం అనుకుంటూ బద్దకించడం మూలంగానూ, బుర్ర ఏకుల బుట్టలా ఉన్నది కాస్తా గూళ్ళబుట్టలా పెరిగిపోయి, గడ్డం కూడా పెరిగి, నానా అవ్యవస్థగానూ తయారయింది. కొంత నీరసమూ కారణం, బద్ధకానికి. ఈ పరిస్థితులలో డాక్టర్ దగ్గరకెళితే రెండు సెలైన్లు పెట్టి, వేసవికాలం బాగా నడచిపోతుందన్నారు. దానితో మర్నాడు ఉదయానికి కొంత హుషారు చేరి నడకలో రోడ్డు పక్కనే ఉన్న మంగలి షాపు, అప్పుడే తీస్తుంటే, ”షాపు తీసి సద్దుకుని సిద్ధంగా ఉండు, ముందుకెళ్ళి వస్తానని” చెప్పి, ముందుకు నడకకి పోయాను. పది నిమిషాలలో తిరిగొచ్చేటప్పటికి మంగలి షాపు తాళాలు వేసి ఉంది, ఇదేంటీ ఇప్పుడేకదా తీశాడు, అప్పుడే తాళమేశాడేమో అనుకుని, ఏమైనా, మరో చోటయినా ఈ రోజు ఈ చీదర వదలించుకోవాలనుకుని ముందుకి అడుగేశాను.

చాలా దూరమే నడిచాను, మరినాలుగడుగులేస్తే మరో మంగలి షాపు, కనపడుతోంది, తీసిఉంది కూడా, ఎవరూ ఉన్నట్టూలేదు. ఈ లోగా వెనకనుంచి ఎవరో సైకిల్ మీద వచ్చి ”బాబుగారు నమస్కారం” అన్న మాట వినిపించింది. ఎవరా! అని చూస్తే ఒకప్పుడు ఇక్కడ మంగలిగా నాకూ పని చేసినవాడే, తొందరగా గుర్తుపట్టలేకపోయా. తనకు తానుగా పరిచయం గుర్తు చేశాడు, ”ఓర్ని నువ్వా! ఎప్పుడొచ్చావు గల్ఫ్ నుంచి ”అని కుశల ప్రశ్నవేశాను, ”పని చేయించుకోడానికి వెళుతున్నట్టున్నారు, రండి, మీ ఇంటి దగ్గరలోనే షాపు పెట్టేను, నిన్ననే కొబ్బరికాయ కొట్టేను, మీది ఈ రోజు బోణీ బాబు గారు, రండి, వెళదామ”ని అంటూ, ”బాబయ్యా! దూరపుకొండలు నునుపు, అక్కడేదో సంపాదించేసుకోవచ్చనుకున్నాను, ఎక్కడి బాధలు అక్కడున్నాయండి, అనుభవం లోకొస్తేగాని తెలియలేదు, మరి వెళ్ళనండి, కలిగినదో, లేనిదో, పెళ్ళాం పిల్లలతో ఇక్కడే పడిఉంటాను, నాకు ఇక్కడమాత్రం ఏం తక్కువైంది బాబయ్యా! ఆశకిపోయా తప్పించి” అంటూ షాపు దగ్గరకి తీసుకొచ్చాడు, షాపెక్కడా అనుకుంటే, అది ఇందాకా తాళం వేసుకుపోయినవాని షాపు దగ్గరే, పక్కనే. అతనూ అప్పుడే తిరిగొచ్చాడు,ఇద్దరూ ఒకసారే తాళాలూ తీశారు, తాళం తీస్తూ మొదటి మంగలి సాలోచనగా నాకెసి చూస్తూ, నీరసంగా నవ్వేడు… అప్పుడు చెప్పేను ”ప్రాప్తవ్యమర్ధం లభతే మనుష్య” ఎవరికి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు రాసిపెట్టి ఉంటే, అలాగే జరుగుతుంది నాయనా! నీతో మళ్ళీ వస్తానని చెప్పి ముందుకెళ్ళి తిరిగొచ్చేసరికి నీవు తాళం వేసుకుపోయావు, ముందుకుపోతే వీడు నన్ను గుర్తించి, నా వెంటపడి ఇక్కడికి తీసుకు తెచ్చుకున్నాడు” అని కొత్త షాపులోకి అడుగుపెట్టేను.

నన్ను కుర్చీలో కూచోబెట్టి ముందు నా పని చూశాడు, కొత్త షాపు మంగలి. చిత్రం నేనొక అరగంట పైగా షాపులో ఉన్నను, పాత షాపులోకి ఒక్కడు రాలేదు. పాత షాపు మంగలి ఉదయమే పని చేయించుకోడానికి వెళితే, నన్ను కూచోబెట్టి షాపు తుడుచుకోడం,నీళ్ళు తెచ్చుకోవడం, వగైరా పనులు చేసేవాడు, ఎన్నో సార్లు చెప్పేను, ”ఉదయమే వచ్చినవారిని కూచోబెట్టి నీపనులు చేసుకోడం కాదు, వీటన్నిటిని రాత్రి పూర్తి చేసుకుని, ఉదయం షాపు తీసినవెంటనే పని చేసేందుకు సిద్ధం గా ఉండ”మని, ఎన్ని సార్లు చెప్పినా ఉపయోగం లేకపోయిందతనికి, అతని అలవాటూ మార్చుకోలేకపోయాడు. పని మీద శ్రద్ధలేకపోయింది……ఇది ఒక మంగలిషాపుకే పరిమితంకాదు, క్లయింట్/ చందాదారుడు/ సేవ చేయించుకునేవారు వచ్చాకా, వారిని కూచోబెట్టి మనం ఆఫీస్ సద్దుకోవడం మొదలుపెడితే, వచ్చినవాడు, ”వీడు బద్ధకస్థుడ”ని మరొకరి దగ్గరికి పోతారు, అది సాఫ్ట్ వేర్ కంపెనీ కావచ్చు, మంగలి షాపు కావచ్చు,డాక్టరూ కావచ్చు, మరేదైనా కావచ్చు, మరొకటీ కావచ్చు. ముందు కావలసినది, పనిపై శ్రద్ధ, శ్రద్ధ, ఇది లక్ష్మీ దేవి ఐదో పేరు…..ఈవిణ్ణిబట్టే ఏదయినా…. ”ప్రాప్తవ్యమర్ధం లభతే మనుష్య” (మానవుడికి ఎంత ప్రాప్తం ఉంటే అంతే సొమ్ము దొరుకుతుంది)…నిజమే కాని శ్రద్ధలేనివానికి లక్ష్మి దొరకదు.

చిన్న తల్లి  మన ముందు నడవకూడదు, మనం ఆమెతో సమానంగానూ నడవ కూడదు. ముందున్న చిన్న తల్లి  మనలని ఊరుస్తూ ఉంటుంది, చేతికి దొరకదు, ఎండమావిలో నీరులాటిది. అవిడ ముందు నడుస్తూ ఉంటుంది, మనల్ని వెనక పరుగులు పెట్టిస్తుంది. చివరికి బాధే మిగులుతుంది. చిన్న తల్లి తో సమానంగా నడస్తే, ఆమె వెలుగులో మనకి కళ్ళు కనపడవు, ఆ తరవాత జరిగేది నేను చెప్పక్కరలేదు. చిన్న తల్లి మన వెనక ఉండాలి, ”నీకేం భయం లేదు, ముందుకి నడు” అని వెన్ను తట్టాలి, అప్పుడు మన జీవితం ఆనందంగా నడుస్తుంది.

శ్రద్ధఉంటే…. మన వెనక చిన్నతల్లి నడుస్తుంది లేకపోతే ……………..A slip between the cup and the lip…..అదీ తేడా……

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రాప్తం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s