శర్మ కాలక్షేపంకబుర్లు-సెలగ

సెలగ

నాచిన్నప్పటి రోజులలోఆహారధాన్యాలన్నీ కొలవడమే అలవాటు. ఇన్ని కుంచాలు అనడం అలవాటు. అలాగే ఇరవైనాలుగు కుంచాలంటే ఒక కాటా బస్తా అని లెక్క, ఇప్పటి వంద కేజీలు. ఆ రోజుల్లో ఆ బస్తాని అవలీలగా మోసేవారు, దీనిని పల్లెలలో ”చార” అనడం అలవాటు. ఆ రోజులలో ”పట్టుబడి” ఇరవైనాలుగు కుంచాలు. తరవాత కాలం లో అది ఏభయి కేజీలయింది. నేటి కాలంలో ఏదయినా పట్టుబడి పాతిక కేజీలకి తగ్గిపోయింది. ఇన్ని మార్పులూ నేనెరిగినవే. ఆ రోజుల్లోవంద కేజీల బస్తాని మరొకరి సాయం లేకనే నేలమీంచి మోకాలి మీకి ఎత్తుకుని ఆ తరవాత భుజం మీద వేసుకోగలిగిన బలశాలులు ఉండేవారు…నేటి పరిస్థితి చూస్తున్నాం కదా…దారి తప్పిపోయాం….

ఇలా ధాన్యం, బియ్యం, నువ్వులు, ఉప్పు అన్నీ కొలిచి అమ్మేవారు. తైలాలలో నేయి, నూని కూడా కొలిచి అమ్మేవారు, శేరు లేదా మానిక ఒక కొలత.  కొలవడానికి, లెక్కించడానికి వీలు లేనివాటిని మాత్రమే తూచేవారు.బెల్లం, చింతపండు, మిర్చి ఇటువంటివాటిని తూచేవారు. కూరలెప్పుడూ తూకమే, వాటిలో కాయలు మాత్రం లెక్కించేవారు, ఇప్పటిలాగా.  వీశ అప్పటి తూకం.  ఇక కాయలు, పళ్ళు అన్నిటిని వందలు, ఏభయి, పాతిక, పరక, అరపరక లెక్కలో అమ్మేవారు కొనేవారు కూడా…..

ఎక్కువ ధాన్యాలు కొలవాలంటే, వంద కుంచాలు కొలిచిన తరవాత, సెలగ అనేవారు అంటే ఒక యూనిట్ పూర్తయింది, మరల కొత్త లెక్క మొదలు అని చెప్పడం. అప్పుడు కొలతకి గుర్తుగా ఒక ”కాయ” ఇచ్చేవారు, దానిని ఒక చోట భద్రపరచి మొత్తం కొలత అయిన తరవాత కాయలు లెక్కపెట్టి మొత్తం సరుకెంతో తేల్చేవారు. ఈ కొలత చేసేందుకు ఒకరిని ఊరు ఉమ్మడి మీద నియమించుకునేవారు, వారికి ఇలా కొలిచినందుకు కొంత రుసుమూ ఇచ్చేవారు. నేను ఎరిగిన రోజుల ప్రారంభంలో అది ఒక అణా గా ఉండేది, బస్తాకి. తరవాత రోజులలో తూకం వచ్చినా, ఈ వ్యవస్థని ”కొలగారం”అనడమే నేటికీ అలవాటు పల్లెలలో.  నిజానికి వీరు మధ్యవర్తి తూకం దార్లు, కొనేవారికి అమ్మేవారికి నష్టం లేకుండా చూచేవారు. ఇతనిని ఊరు మొత్తం మీద పాటపెట్టి, అతనిచ్చే హెచ్చు మొత్తాన్ని ఊరు ఉమ్మడికి ఉపయోగించుకుని, అతనికి ఈ బాధ్యతలప్పచెప్పడం ఇప్పటికి పల్లెలలో అలవాటే. తూనిక కొలతని చాలా శ్రద్ధగాను నిక్కచ్చిగానూ అనగా నిష్కర్షగానూ చేసేవారు, ఎటువంటి మోసానికి తావులేకుండేది. అసలీ తూకాలు కొలతలు ప్రపంచ వ్యాప్తంగా మూడు రకాలుగా ఉన్నాయి. అవి FPS (Foot,pound,second) CGS (Centi meter,gram, second) MKS ( Meter, kilogram, second) Systemsఒక విషయాన్ని గమనించచ్చు, అన్నిటిలోనూ సమయం మాత్రం ఒకటే దానిలో మార్పురాలేదు. నేటికి రోజుకి ఇరవైనాలుగు గంటలని పదిగంటలుగానూ, గంటకి వంద నిమిషాలుగానూ మార్పు చేయాలనే ప్రతిపాదనైతే ఉన్నట్టుందిగాని ఆచరణలోకి రాలేదు….సెలగ గురించి చెబుతానని ఇలా తూనికలు కొలతలమీద పడ్డారేంటీ అని కదా మీ అనుమానం, ఉండండి దీనికి దానికి ముడి ఉంది కనక……..

ధాన్యాలు కొలత ఉన్న రోజులలో వంద కుంచాలు కొలిచి సెలగ అని కొత్తగా మళ్ళీ కొలత ప్రారంభించే ముందు ఒక ఐదు కుంచాల ధాన్యం సెలగ గా రాసిలో పోయడం అలవాటుండేది. కాల క్రమేణా ఇది తూకంతో తగ్గిపోయింది. ఇప్పుడు ఎక్కువ సరుకులు తూకంలోనే అమ్ముతున్నారు, మామిడి పళ్ళు తో సహా. పాలు, కిరోసిన్, పెట్రోల్ కూడా తూకం వేసే రోజులొస్తాయేమో చెప్పలేను.

ఇక కాయలు పళ్ళూ విషయానికొస్తే, వంద అంటే ఇరవై చేతులు అనేవారు. చెయ్యి అంటే ఐదు అని అర్ధం ఇరవై చేతులు అంటే వంద, ఆపైన ఒక చెయ్యి సెలగ అనేవారు, చెయ్యిఅంటే ఐదు కదా అనగా వంద కాయలు, పళ్ళు, అంటే నూట ఐదు ఇచ్చేవారు. ఏబై అంటే సెలగ మూడు, పాతిక అంటే ఇరవై ఐదు ఒకటి సెలగ, డజను అంటే పన్నెండు ఒకటి సెలగ దీనిని పరక అనేవారు, అరపరక అంటే అరడజను ఒకటి సెలగ మొత్తం ఏడు. ఇప్పుడు తూకంతో ఈ సెలగ అనేమాట పూర్తిగా వాడుకలోంచే పోయినట్టుంది. సెలగ అనేమాటని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఆనందం, తృప్తి అయింది అనుకున్నదానికంటే ఎక్కువే జరిగింది అనే అర్ధం లో వాడేరు. ఇప్పుడు సెలగ అనేమాట ఎందుకొచ్చిందంటారా? కొత్తపల్లి కొబ్బరి మామిడి కాచింది, ఇది వరలో కాయలు కోసి పండేసి పంచి పెట్టడం అలవాటు, అలా చేయడం శ్రమైపోతోందని ఈ సారి పచ్చికాయలు ఊరగాయకి అమ్మేసేం, గత పదిరోజులుగా అదేపని పరక, పాతిక, ముఫై,నలభై, ఏభయి, వంద ఇలా కాయ కోయడం లెక్కపెట్టడం సెలగగా మరో రెండు కాయలు ఎక్కువ వేయడం తోనూ, పురుగు మందులు చల్లకుండా పెంచిన కాయలవడంతోనూ, ఊరగాయ పెట్టుకుంటే బాగుంటుందని తెలియడంతోనూ, నిరుడు పెట్టుకున్నవారు చాలా బాగుందని చెప్పడంతోనూ, డిమాండ్ పెరిగిపోయింది. అసలు ఖాళీ లేకుండా క్యూ లో నిలబడి కొనుక్కుపోయారు, వంద పన్నెండు వందలన్నా మార్కెట్ లో మంచి ఊరగాయ కాయే దొరకటం లేదు. పురుగుమందుల అవశేషాలు లేని కాయాలేదు. ఇంకా కొంత కాయుంది, కోసి పండేయాలి… కాయ కోయించాలి పండేయాలి కావేసే పనిలో ఉన్నా….

ఈ సంవత్సరం పెరటిలో,కొత్తపల్లి కొబ్బరి పచ్చికాయ అమ్మేం, ఊరగాయ పెట్టుకున్నవాళ్ళంతా చాలా బాగుందని వచ్చి చెబుతున్నారు. , ఏమో మళ్ళీ సంవత్సరానికి ప్రధాని మోదీ గారు చెప్పినట్టు ఊరగాయపెట్టి, అమ్మకానికి గ్లోబల్ ఆర్డర్లు తీసుకుంటామేమో చెప్పలేను… ఎంతయినా పురుగుమందుల అవశేషాలు లేకుండా పెంచిన, పురుగుపట్టని కాయ కదా. మిగిలిన కాయలేనా కావేసి పంచిపెట్టాలి. ఉంటా…పనుంది, వస్తా!  మీతో కబుర్లాడితే కుదరదు…

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సెలగ

  1. గ్లోబల్ ఆర్డర్లు తీసుకోండి శర్మ గారూ, మాలాంటి పరదేశీలు చాలామందే దొరుకుతారు మీకు కష్టమర్లుగా

    • అరుణ్ గారు,
      నిజంగానే ఇంట్లో పెట్టిన ఊరగాయ దొరకటం లేదు ఏదో ఏదో తప్పించి, అందుకు ఇది వ్యాపారమే కాదు, కొంత సేవ కూడా జోడించాలని ఉద్దేశం,మొదటి కస్టమర్ గా నిలిచినందుకు.
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s