శర్మ కాలక్షేపంకబుర్లు-బోసినోటి టిపిన్ సంబరం

బోసినోటి టిపిన్ సంబరం

”రోజూ ఇడ్లీయేనా?” గునిశాను ఉదయం టిఫిన్ చెయ్యడానికి.
”ఉండండి” అని ఏదో పట్టుకొచ్చి వేసి ”తినండి” అంది.
”ఏంటిదీ” అంటే ”పళ్ళు రాలుతున్నాయి కదా! ( ఇక్కద శ్లేష వాడిందా అని అనుమానమొచ్చిందనుకోండి) మామిడి చెట్టువి, అవి పళ్ళేగాని గట్టిగా ఉంటాయి, ముగ్గుతాయని వదిలేస్తే కుళ్ళిపోతాయి, అందుకుగాను వాటిని ముక్కలుచేసి మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పుకల్లు పడేస్తే అదిగో అదే ఇది,రెండవది మొదటిదానికి కొద్దిగా పోపు జేర్చి మిక్సీలో తిప్పినది” అంటే, తింటే అబ్బో ఆనందమే ఆనందం, అంతబాగుంది, ఇడ్లీ లాగించేశా.

మరోరోజు మళ్ళీ ఇటువంటి తగువే ”రోజూ ఇలా టిఫిన్ దగ్గర తగువుతో వేగలేకపోతున్ననమ్మా! ఉండడి ఇప్పుడే వస్తా” అని ఇడ్లీ ప్లేట్ పట్టుకుపోయింది. ”టిఫిన్ పెడుతుందా? పెట్టదా? ఇవేళ ఏదీ గతినాకూ అని పాడుకోవాల్సిందేనా” అని ఆలోచిస్తూ, చిస్తూ ఉండగా ప్లేట్ తో వచ్చేసింది. ”ఏంటీ” అన్నా. ”ఇడ్లీ చిదిపేశాను, కొద్దిగా పోపులో ఉప్పురాయి వేసి కొద్దిగా చింతపండు పులుసు చేర్చి, ఇడ్లీ చిదిపినదానిలో వేసి కలిపేను, బాగుందా” అంది, ”మరికొంచం పెట్టూ” అని లాగించేశా, చప్పరిస్తూ.

ఇలా రోజూ ఏదో ఒక తలనొప్పి పడుతూనే ఉంది, ఒక రోజు పట్టుకొచ్చిన టిఫిన్ పట్టుకెళ్ళిపోయింది, మొహం చిట్లించానని. ఈ రోజు టిఫిన్ యోగం ఉన్నట్టా లేనట్టా అని బొమ్మా బొరుసూ వేద్దామంటే రూపాయి లేకపోయింది, అసలు చొక్కా ఉంటేకదా ఒంటిమీద! రూపాయి కావాలంటే మళ్ళీ ఆవిడ దగ్గరకే వెళ్ళాలి ఓపికలేక కూచున్నా! చిన్నప్పుడు పుస్తకం పుచ్చుకుని పేజీలు తిప్పుతూ ”బొమ్మొస్తుందా రాదా” అని ఆడుకున్నది గుర్తొచ్చి పుస్తకం కోసం చూస్తే అటువంటి పుస్తకమే కనపడలేదు, ఏదీ గతినాకూ అని పాడుకుందామా అనుకుంటుండగా, ఒక గిన్నె తెచ్చింది, ఏమిదీ అని చూస్తూ తినడం మొదలెట్టాను. ”ఇంత తొందరలో ఎలా టిఫిన్ మార్చావూ” అన్నట్టు చూశా. ”వంటింట్లోకెళ్ళి నాలుగు గుప్పిళ్ళ అటుకులు పక్కనే ఉన్న పుల్ల మజ్జిగలో పడేశాను, చిటికెడు పసుపేశాను, ఉప్పూ పడేశాను. పోపులపెట్టిలోంచి ఒక మిరపకాయ నాలుగు ఆవాలు తీసుకుని ఒక గరిటెడు నూనెతో పోపు వేయించి మజ్జిగలో కలిపేశాను, అదిగో అదే మీ టిఫిన్” అంది, మెచ్చుకోలుగా చూశాను, మధ్యాహ్నం టిఫిన్ ఏమిటీ అన్నట్టు.

మధ్యాహ్నానికి ఇలా చేస్తా అని చెప్పింది. కొద్దిగా అటుకులు నేతి చుక్కవేసి వేయిస్తా, వాటిని మిక్సీ పట్టి ఉంచుతా, దానిలో చిటికెడు ఉప్పూ, పంచదార కలుపుతా. కొద్దిగా జీడిపలుకులు కూడా మిక్సీ పట్టేసి కలిపేసి కొద్దిగా నెయ్యేసి ఉండచుట్టేస్తా అని ముగించింది. ”తీపా” అని సాగదీశా.

కాకపోతే మరోటీ అని చెప్పింది ఇలా. అటుకులు వేయించుకుని నేతి చుక్కతో మిక్సి పట్టేస్తా. కొద్దిగా నువుపప్పు, వేరు శనగ గుళ్ళు, గుల్ల శనగపప్పు, జీడి పప్పు విడివిడిగా కొద్ది నేతి చుక్కతో వేయిస్తా, అలాతినలేరు కదూ అందుకు అన్నీ మిక్సీ పట్టేస్తా, అటుకులగుండలో కలిపేసి, కొద్దిగా ఉప్పూ కారం చేర్చి నేతితో ఉండ చేస్తా అంది. అమ్మబాబోయ్ ఎంత కష్టపడుతున్నవని నోటి చివర దాక వచ్చిన మాట చెప్పలేదు, కళ్ళతోనే చెప్పి ఊరుకున్నా. వస్తా పనుంది అని వెళ్ళిందండి, అదండి పళ్ళులేని బోసినోటి టిఫిన్ సంబరం.

మొన్నో రోజు పదిమంది మిత్రులు చూద్దామని వస్తున్నామని కబురు చేశారు, ఒక పావుగంటలో వస్తామన్నారు, నేను కుర్చీలు సద్దుతుంటే ఇల్లాలడిగితే చెప్పాను, వచ్చే వాళ్ళకి ఏమయినా పెడితే బాగోదూ అని, అలాగే వాళ్ళు రావడానికోపావుగంట పడుతుంది కదా! వాళ్ళొస్తే వాళ్ళ బుర్రలు మీరు తింటూ ఉండండి, ఈ లోగా నేను వాళ్ళు తినడానికి పంపుతానంది. ఇంత తొందరలో ఏం చేస్తుందబ్బా అనుకున్నా. వాళ్ళు వచ్చిన ఐదు నిమిషాలకి టిఫిన్ వచ్చేసింది, చూస్తినా అది అటుకుల పులిహోర, లొట్టలేసుకుంటూ తినేసి ఆవిడకి ధన్యవాదాలు చెప్పేసేరు మావాళ్ళు. ఇదండి అటుకులతో తక్కువ సమయంలో చేయగల టిఫిన్లు.