శర్మ కాలక్షేపంకబుర్లు-(ప)కోడి కూర.

(ప)కోడి కూర.

ఎండవేడి ఎంతగా ఉందంటే బయట రోడ్ మీద అట్లపెనం పడేసి ఉంచి అట్టు వేస్తే పూర్తిగా కాలిన తరవాత తిరగేసి మరిచిపోతే మాడిపోయేటంతగా, ఇలా చేసి చూశారు కూడా, టీ.వీ లో చూపించారు. మొన్న 48 సెం. ఉందిట, వేడి. కంప్యూటర్ దగ్గర కూచోడమే బాధగా ఉంది పైన ఫేన్ తిరిగినా. అదేంటో తెలియదు, సరిగ్గా ఎండలు నెత్తి మాడుస్తున్న రోజులలోనే నీళ్ళు ఇవ్వడు కట్టిపారేస్తాడు, ఏమయ్యా అంటే మోటార్ పోయిందండీ అంటాడు. సోలార్ మూలంగా కరంట్ బాధ తప్పింది, మొన్న కరంట్ వారు బాధ పెట్టటం లేదన్నా కదూ, అయ్యో మనని గుర్తించడం లేదేమోననుకుని నిన్నటినుంచి పావుగంటకి ఒక సారి కరంట్ పీకేస్తున్నారు, ఏమయిందో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో టపా రాసుకోడం ఎలా? పగలు కంప్యూటర్ దగ్గర ఎనిమిది దాటితే కూచోడం కష్టం, రాత్రి తొమ్మిది దాటాలి, ఈలోగా ఒకవేళ దీని దగ్గరకొచ్చినా ఎక్కువ సేపు కూచోలేం, అదో బాధ, అందుకు టపాలు రాయాలనుకున్నవి చాలా ఉన్నా, చిన్న చిన్న టపాలే పడుతున్నాయి, అందుకే వంటా వార్పూ…..:)

తెనుగునాట పకోడీ అంటే తెలియనివారుండరు 🙂 ఇందులో రెండు రకాలు మెత్తటి పకోడీ, గట్టి పకోడీ. పకోడీ సాధారణంగా శనగపిండితో వేస్తారు, కొద్దిగా వరిపిండి కూడా జోడిస్తారు. మొక్కజొన్నపిండికి కొద్దిగా వరిపిండి కలిపి కూడా పకోడీ లు వేసుకుంటారు. శనగపిండి, మొక్కజొన్నపిండి, వరిపిండి కలిపి కూడా పకోడీ వేస్తారు. మొక్కజొన్నపొత్తులు తెచ్చుకున్నవి కాల్చికు తినడానికి ముదిరనట్టున్నాయా! ఏమీ దిగులొద్దు, గింజలు వలిచెయ్యండి, మిక్సీలో వేసి తిప్పెయ్యండి, మిగిలినవి చేర్చి, పకోడీ లేసెయ్యండి. భేషుగ్గా ఉంటాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి దీనిలో తప్పనిసరి, అల్లం ముక్క కూడా వేస్తారు కొంతమంది, వెల్లుల్లితో పాటు.. వీటిలో కలగలుపు పకోడీ మరీ బాగుంటుంది, అనగా ఆకుకూర కూడా కలిపి పకోడీ వేస్తే. ఇది శాకాహారమే కాదు మాంసాహారం కూడా. చికెన్ పకోడీ వేస్తారట,మటన్ పకోడీ కూడా. ప.గో.జి లో మార్టేరు అనే ఊరుంది. అక్కడ నాలుగు రోడ్ల సెంటరు, పెనుగొండ-పాలకొల్లు కాలవ రోడ్డు, పెనుమంట్ర, ఆచంట అడ్డ రోడ్డు. ఈ సెంటర్లో చక్రాల బండి మీద మటన్, చికెన్ పకోడీ వేస్తూనే ఉంటాడు, అసలు ఖాళీ ఉండదు, అంత బాగుంటుందిష, నేను తినలేదనుకోండీ 🙂

పకోడీలంటే చిన్నప్పటి ఒక సంఘటన గుర్తొచ్చింది. రెండు జెడలతో, అక్కకి పొట్టి అయిపోయిన గౌను తొడుక్కుని ఉండేవాడిని, ఐదేళ్ళ వయసులో, గోకవరంలో ఉండేవాళ్ళం రహదారి బంగళా ఎదురుగా పెద్ద కలప అడితీలో, ఒక పెద్ద మఱ్ఱిచెట్టు మొదటిలోని పూరి పాకలో. అక్కడినుంచి నడిచి రోడ్ కి రావడానికే సమయం పట్టేది. రోడ్ కొచ్చిన తరవాత ఊరివైపుకు వెళితే పోస్టాఫీస్ ఎదురుగా ఒక పెద్ద రావిచెట్టుకింద, పెద్ద పాకుండేది. (ఏభై ఏళ్ళ తరవాత వెళ్ళేనా వూరు, ఆ బంగళా, ఫోస్టాఫీసూ అలాగే ఉన్నాయి, పడిపోతూ.)అది ఆ నాటి పెద్ద హొటలు. ఏమీ తోచకపోతే, సాయంత్రం వేళ, నేనూ, అన్నయ్యా, అక్కా ముగ్గురం బయలుదేరి ఆ హోటల్ కి వెళ్ళేవాళ్ళం, సంత పాకలమీదుగా. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ హోటల్ యజమాని గంగయ్య, ఎర్రటి మనిషి, వినాయకుడిలా పెద్ద పొట్టతో, పెద్ద పొయ్యి వెలుగుతుండగా, నూనె మూకుడులో పకోడీలు వేస్తూనో, లేదా పకోడీలు వేయడం అయిపోయి కొట్టు మీద కూచునో ఉండేవాడు. మమ్మల్ని చూసి, రమ్మని పిలిచి నాలుగుపొట్లాలు కట్టి ఇచ్చేవాడు. ముగ్గురుకీ మూడూ, నాన్నకి అమ్మకి ఒకటి, పెద్దపొట్లాలే కట్టేవాడు. స్వంత కొట్టులాగానూ, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చని మాత్రమే తెలుసు. ఆ తరవాత కాలంలో తెలిసింది, అతని అక్కౌంట్లన్ని నాన్న రాసేవారట, అందుకు ఎప్పుడూ డబ్బులు పుచ్చుకోలేదతను, మా దగ్గర. ఎప్పుడూ డబ్బులు పుచ్చుకోగా చూడలేదు. ఇవి పుచ్చుకుని కబుర్లు చెప్పుకుంటూ వెనక్కి తిరిగొచ్చేవాళ్ళం, పొట్లాలతో. ఒక రోజలా తిరిగొస్తుండగా సంతపాకల దగ్గర ఒక గద్ద వచ్చి నా చేతులో పొట్లం తన్నుకుపోయింది, ఏడుపొకటే మిగిలింది. అక్క, అన్నయ్య తిట్టేరు, దాచుకోడం చేతకానందుకు. వెనక్కి వెళ్ళి గంగయ్య ముందు నిలబడ్డా! కుడి చెయ్యి వెనక్కి దాచుకుని. ఏం మళ్ళీ వచ్చేరన్నాడు, మాటాడక నిలబడ్డా, పొట్లమేదీ? అన్నాడు, మాటాడలేదు, నిజంగానే గద్ద ఎత్తుకుపోయిందా? అని నిలదీశాడు.  కుడి చేతిలో ఏముందీ? అని అడిగాడు. అప్పుడు ఏడుపొచ్చింది, నిజంగానే ఏడ్చా. కుడి చెయ్యి ముందుకు చాపా. చెయ్యి చీరుకుపోయి రక్తం వస్తోంది. గబగబా కొట్టు దిగి, చెయ్యిపట్టుకుని, చల్లని నీళ్ళతో చెయ్యికడిగి, గాయం మీద కొద్దిగా పంచదార వేసి నొక్కి, పొట్లం చేతికిచ్చి, ’ఒరే చిన్నపంతులుగార్ని ఇంటి దగ్గర దింపి రండిరా,’ అని మరొకరికి పురమాయించేడు.  ఏడవకు గద్ద తన్నుకుపోతుంది, జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి, అంటూ మళ్ళీ ఒక పొట్లం కట్టి చేతికిచ్చాడు. . ఒక అతను నన్ను ఎత్తుకుని తీసుకొచ్చి అమ్మకి అప్పచెబుతూ, అక్కడ జరిగినది చెప్పేడు. ఎందుకు ఏడ్చావు?  అని ఆరాతీసింది. ’అబద్ధమనుకున్నాడు’ అన్నా, ( పొట్లం గద్ద ఎత్తుకుపోయిందని అబద్ధం చెప్పేననుకున్నాడని ఏడుపొచ్చిందన్నా).”మాటకు ప్రాణము సత్యము,నువ్వు చెప్పింది నిజమని సాక్ష్యంతో ఋజువయిందిగా! అబద్ధం ఎప్పుడూ ఆడకూ,”  అంటూ, ఇప్పుడివి తింటే అన్నం తినవుగాని కూర చేస్తానని కూర చేసిందిలా……చూపుడు వేలుకి బొటనవేలుకి మధ్య చారలా ఓ మచ్చండేది చాలాకాలం,అదిగో ఆ మాటా, ఈ కూరా జీవితం లో గుర్తుండిపోయాయి.

పకోడీలు చిదిపెయ్యాలి, కొద్దిగా పసుపు పిసరేయాలి, ఉప్పు చేర్చాలి. చింత పండు పులుసుపిసుక్కుని అందులో ముక్కలేసి కొద్దిగా పోపు పెట్టి సన్నటి సెగని ఉడకనివ్వాలి. (దగ్గరపడ్డ తరవాత 🙂 ) చిక్కబడ్డ తరవాత దింపుకోవాలి. వేడి వేడిగా తింటేనే మజా……
కాదు కాదనుకుంటూనే టపా పెద్దదయిపోయింది….

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-(ప)కోడి కూర.

  • Dr.R.SumanLata గారు,
   మిత్రులు విన్నకోట వారూ అన్నారు, గట్టిపకోడీ గురించి చెప్పలేదేం అని, తప్పించుకొచ్చ్ఏసేను, మాట మార్చి, తప్పేలాలేదు :)కోడిగాని కోడి పకోడీ కదండీ.
   ధన్యవాదాలు.

 1. ఎన్నో విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి.
  ………….
  ఇంకొక విషయం ఏమిటంటేనండి,
  కొంతకాలం క్రిందట మీ బ్లాగులో నేను వ్రాసిన ఒక వ్యాఖ్యలో సరస్వతి ఆకుల గురించి వ్రాసాను.

  నిన్న నేను, నెట్లో కొన్ని మొక్కల గురించి వెతుకుతూ బ్రాహ్మి గురించి చదివాను.
  అందులో బ్రాహ్మి వంటి Gotukola అనబడే మొక్క గురించి కొత్త విషయాలు తెలిసాయి.

  ఈ Gotukola ఆకులను గర్భిణి స్త్రీలు వాడరాదనే సూచన చదివాను.( కొంతకాలం క్రిందట వ్యాఖ్య వ్రాసినప్పుడు ఈ విషయం గురించి నాకు తెలియదు.)

  కొత్తగా తెలుసుకున్న వివరాలు ఈ రోజు వ్రాసిన టపాలో వ్రాసాను. ఆసక్తి ఉన్నవారు చదవవచ్చును.

 2. టీవీ వాళ్ళు వాడే పదజాలం త్వరగా పట్టేసుకుంటున్నారండి మీరు 🙂 ఏకసంధాగ్రాహి.
  టపాలో గట్టిపకోడీల ఊసెత్తారు కదా. తర్వాత టపాలో వాటి గురించి కూడా వ్రాయండి మరి. (మా అమ్మగారు అద్భుతంగా చేసేవారు. తయారు చేసే విధానంమాత్రం నన్నడకండి 🙂 )

  • విన్నకోట నరసింహారావుగారు,
   నాదీ ఆబాపతేనండి, కానయితే అమ్మ కూడా తిరిగి చేస్తున్న పని చూడటం అలవాటుగా ఉండేది. అమ్మ కూడా నాలా మరెవరూ తిరిగేవారు కాదు. నా ఇల్లలు నాకు ”అమ్మకూచి” అని పేరుకూడా పెట్టేసింది లెండి 🙂
   ధన్యవాదాలు

 3. ఏదో నాన్వెజిటేరియన్ మేటరు అనుకుని వస్తే, మరీ ‘వెజిటేరియన్’ టపా !

  జేకే !

  జిలేబి

  • జిలేబిగారు,
   శాకాహార మాంసాహారాల తేడా ఉందా అమ్మకి 🙂 సర్వం జగన్నాధం కాదా!
   ధన్యవాదాలు

 4. మాటకి ప్రాణము సత్యము.ఎంత బాగా చెప్పారండీ అమ్మ గారు.నేను చెప్పే మాట కూడా ఎవరైనా నమ్మకపోతే చాలా బాధగా అనిపించేస్తుంది అది నిజం అని వాళ్లకి అర్థమయ్యే వరకు మనసంతా చికాకుగా ఉంటుంది.

  • చిత్రగారు,
   నిజాన్ని నమ్మించలేకపోతే బాధగానే ఉంటుంది. నిజం చెబితే నమ్మరు కదా! లోకమంతే 🙂
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s