శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరికెవరు స్నేహితులు?

ఎవరికెవరు స్నేహితులు?

ఎవరు స్నేహితులు అని మొన్న టపా రాస్తే శ్రీనివాస్ గారు, రమణా రావుగారు, విన్నకోటవారు, జిలేబి గారు, ఎలాటివారు స్నేహితులో చెప్పారు కాని స్నేహితులు ఎవరో చెప్పలేదన్నారు అందుకే ఈ టపా. అవే శ్లోకాలు కనపడతాయి అదే టపా అని అనుకోకండి. అమ్మయ్య!బాకీలు తీర్చేశానండీ!!కొత్త బాకీలు చెయ్యదలుచుకోలేదు !!!  🙂

పాపాన్నివార్యతి,యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి,
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలేః
సన్మిత్రలక్షణం మిదం ప్రపదన్తిసన్తః……భర్తృహరి.

అఘమువలన మరల్చు హితార్ధకలితు
జేయు, గోప్యంబు దాచు బోషించు గుణము
విడువడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్త్రు డీలక్షణంబుల మెలగుచుండు…..లక్ష్మణ కవి.

చెడుపనులనుంచి రక్షించుట,మంచిపనులకు ప్రోత్సహించడం, రహస్యాన్ని దాచిపెట్టడం, కష్టంలో వదలిపెట్టకపోవడం,లేని సమయంలో సొమ్ము ఇచ్చి ఆదుకోవడం, ఇవి సన్మిత్ర లక్షణాలు అన్నారు కవిగారు.

పాపాన్నివార్యతి అంటే పాపం చేయడం నుంచి వారించాలి. నిత్యం ఎవరు చేయగలరు? అలా నివారించగలవారు భార్యకు భర్తా, భర్తకు భార్యా మాత్రమే, మరొకరివల్ల ఇది అసాధ్యం. భారతీయ వివాహంలో ఒక ప్రతిన, ప్రమాణం అదే ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతిచారామి (అనగా న+ అతిచరామి, ధర్మానికి, నీ మాటకి వ్యతిరేకించి ప్రవర్తించను వగైరా, వగైరా) ఉంది. ఉపమానాలు చెప్పి చెప్పి విసుగూ వచ్చింది, మీకూ చిరాకూ వచ్చింది అందుకు చెప్పటం లేదు.

యోజయతే హితాయ స్నేహితుని మంచిగురించి ఆలోచిచాలంటారు,
భార్య హితవు గురించి భర్త, భర్త హితవు గురించి భార్య మాత్రమే అనునిత్యం చర్య తీసుకోగలరు, మిగిలినవారికది అసాధ్యం. ఉపమానాలూ చెప్పను.

గుహ్యం నిగూహతి, రహస్యాన్ని కాపాడాలన్నారు,ఇందులో భార్యా భర్తలు బలే విచిత్రాలే చేసేస్తారు, చూసేవాళ్ళం నోళ్ళు వెళ్ళబెట్టుకోడం తప్పించి. ఒక ఉపమానం చెబుతా, వినండి. ఈయనకి తాగి అర్ధరాత్రి ఇంటికిరావడం అలవాటూ, వచ్చినవాడు తిన్నగా ఇంటికొస్తాడా? ఒక రోజు ఎదురింటి తలుపు కొడుతున్నాడు, తన ఇంటి తలుపనుకుని. భార్య చూసింది, గబగబా పరుగెట్టుకుని ఎదురింటి దగ్గరకెళ్ళింది, అప్పటికే ఆ ఇంటావిడ తలుపుతీసింది. ఏడవలేని నవ్వు మొహంతో ఎదురింటావిడతో, ”వదినా! కరంటు పోయిందీ, టెస్టర్ కనపడక ఇక్కడికొచ్చారు, కనపడింది, ఫ్యూజ్ పోతే వేశాను,కరంటొచ్చింది, ’అన్నిటికీ కంగారే నడవండి’ ” అని అంటుంటే తాగివున్నవాడి వాలకం చూసిన ఎదురింటావిడ, అతని భార్య చెబుతున్నది విని నోరొదిలేసి చూస్తూ ఉండిపోతుంది, ఎదురుగా కనపడుతున్నదానినినా భార్య ఎంత చక్కగా దాచేసిందో. ఇంట్లోకి మొగుణ్ణి తోసుకొచ్చి, తలుపులేసి, ”తాగద్దు మగడా అంటే చెప్పిన మాట వింటేనా? తాగేరే చూడండి, మనిల్లు ఎదుటివాళ్ళ ఇల్లూ తేడా చూసుకోవద్దూ!మరీ అంత ఒళ్ళు తెలియకుండా తాగాలా? పరువు పోతుందనుకున్నా! ఎన్ని సార్లు చెప్పేది? పరిగెట్టుకుని వచ్చేనుగనక సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మన పరువు బజారున ఉండేది. రేపటినుంచి ఇంటికి తెచ్చెయ్యండి, ఇద్దరం తాగేద్దాం, ఇంట్లో పడి ఏడవచ్చు, పరువు వీధిన పడదు!” ఇందులో చూడండి ఆ భార్య, భర్త చేసిన తప్పూ కప్పేసింది, అతని హితవూకోరింది, పాపాన్నుంచి రక్షించే ప్రయత్నమూ చేస్తోంది కదా! అన్నీ ముచ్చటగా ముప్పేటగా కలిసిపోయాయంతే. ఇలా మరెవరు చేయగలరు?

గుణాన్ ప్రకటికరోతి, మిత్రునిలో ఉన్న సుగుణాన్ని పదిమందిలో చెప్పాలన్నారు. ఆవిడో కూన రాగం తియ్యగలదు, దానికాయన ఆవిడ ఎమ్.ఎస్ స్థాయి గాయకురాలని చెప్పుకొస్తాడు, అలాగే ఆవిడా! ఒక సారి ఎవరో పడిపోతే హాస్పిటలుకి ఆటోలో తీసుకెళ్ళేడు, ఓ! దానిగురించి ఈవిడ తెగ ప్రచారం చేసేస్తుంది, ఇవి అతి అయిపోయి బాధగా ఉంటున్నాయి తప్పించి, అలా ఉన్న సుగుణాన్ని పొగిడి వారిని అదే పంథాలో నడపగలవారు ఒకరికొకరు, భార్యా/భర్తా మాత్రమే.

ఆపద్గతం చ న జహాతి, ఆపదలో ఉన్నప్పుడు వదలిపెట్టకూడదు. దీనికో ఉదాహరణే చెప్పుకోవాలి.

క్షీరేణాత్మగతో దకాయ హి గుణా దత్తాఃపురాతేఽఖలాః
క్షీరోత్నాప మపేక్ష్య తేన పయసా స్వాత్మా కృశానౌ హుతః
గన్తుం పావక మున్మన స్తదభవద్దృష్ట్వాతు మిత్త్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్త్రీ పునాస్త్వీద్పశీ…..భర్తృహరి.

క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్
క్షీరము దప్తమౌట గని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు
ర్వారసుహుద్విపత్తిగని వహ్ని జొరం జనె దుగ్ధ, మంతలో
నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ములమైత్త్రి యీగతిన్…లక్ష్మణ కవి

పాలలో నీరు కలిస్తే పాలగుణం నీటికొచ్చింది. పాలు కాగిపోతున్నాయని బాధపడుతూ నీరు పైకి లేచిపోతోంది, ఆవిరిగా. అయ్యో! స్నేహితుడు వీడిపోతున్నాడు, ఈ అగ్ని మూలంగా అని పాలు నిప్పులలో ఉరికి అగ్నిని ఆర్పేస్తున్నాయి. అప్పుడు పాలుచల్లబడితే నీరుకూడా ఉండిపోయింది, పాలతో.

పాలతో నీరుకలిస్తే పాలగుణం నీటికి, నీటి గుణం పాలకీ వచ్చాయి. జీవితం అనే కుంపటిలో, అనుభవాలనే నిప్పులు కాలుస్తుండగా ఒకరు బాధపడుతున్నారని మరొకరు ఆత్మ త్యాగానికే సిద్ధ పడుతున్నారు కదా! ఇదీ అవసర సమయం లో వదలిపెట్టకపోవడానికి పరాకాష్టకదా! ఇది భార్యాభర్తల మధ్య తప్ప మరొకరికి సాధ్యమా!

దదాతి కాలేః, ఒకరికోసం ఒకరు ఆత్మ త్యాగానికే సిద్ధపడే భార్యాభర్తలు అవసరానికి ఇవ్వకపోవడం అనేదే జరగదు. భారతీయ వివాహ వ్యవస్థలో స్త్రీధనమని ఉంది, ఆమెకు పెట్టిన నగలు, ఆమె సంపాదన, ఆమె ఆస్థులు అన్నీ ఆమె ఇష్టం, మగవాడు కలగచేసుకోడానిఉకి లేదు, ఇది శిష్టాచారం. ఈయన వ్యాపారం చేశాడు బాగానే సంపాదించాడు, విధి కలసిరాలేదు, పూర్తిగా నష్టపోయాడు, అప్పుడు ఆమె తన మెడలోని మంగళసూత్రం తో సహా ఇచ్చి ఆదుకున్నవారెందరో! అలా మరలా మొదలు పెట్టినవారు ఆ తరవాత ఆమె దగ్గర తీసుకున్న సొమ్ము మరలా వడ్డీతో ఇచ్చేసిన సందర్భాలెన్నో! ఇది కూడా భార్యా భర్తలలోనే సాధ్యం.

నిజం చెప్పాలంటే ఈ శ్లోకం పూర్తిగా భార్యాభర్తలగురించి చెప్పినదే! ఐతే కొన్ని గుణాలు పైవారిలో ఉండచ్చు, వారు కూడా ఉపకారమూ చెయ్యచ్చు కాని ఇలా భార్యకి భర్తా, భర్తకిభార్యలా మాత్రం కాదు కదా! ఇప్పుడు చెప్పండి అసలు సిసలు స్నేహితులు భార్య భర్త మాత్రమే కదా!

ఇటువంటి స్నేహం ఎలా ఉండాలి, మొదలవాలి?

ఆరమ్భగుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృద్ధిముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధభిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్……..భర్తృహరి.

మొదలు చూచిన కడుగొప్ప పిదప గుఱుచ
యాది కొంచము తర్వాత నధికమగుచు
దనరు దినపూర్వపరభాగ జనితమైన
చాయపోలిక గుజన సజ్జనులమైత్రి…..లక్ష్మణ కవి.

మొదట ఎక్కువగానూ తర్వాత చిన్నదైపోయే, మొదట చిన్నదిగానూ ఆ తరవాత పెద్దదయే,ఉదయ, మధ్యాహ్న కాలాలలో ఉండే మన నీడలా, దుర్జనుల, సుజనులతో మైత్రి ఉంటుంది.

ఇద్దరూ ఎక్కడెక్కడో పుడతారు, పెరుగుతారు. పెద్దలు చూసి నీకు వీరు సరిపోతారని చెబుతారు. కొద్దికాలం మాటాడుకుని అగ్ని సాక్షిగా స్నేహం మొదలుపెడతారు. ఇది మధ్యాహ్నపు ఎండలో నీడలా మొదలవుతుంది. కాలం గడుస్తున్నకొద్దీ ఆ స్నేహం పెరుగుతూ ఉండి చివరకి సూర్యుడు అస్తమిస్తే నీడ అస్తమించినట్లు, ఒకరు అస్తమిస్తే అప్పుడు ఈ స్నేహం ఆగిపోతుంది. అలా కాక ఉదయపునీడలా సహజీవనం తో ప్రారంభమయి ఆ తరవాత చేసుకున్న పెళ్ళిళ్ళు మధ్యాహ్నపునీడలా తగ్గిపోతున్నాయి, అటువంటి సమయంలో

కూరిమిగలదినములలో
నేరములెన్నడును గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ…

స్నేహం ఉన్నకాలంలో వారే వీరు, వీరేవారు చెప్పడమే కష్టం,ఎవరెవరో. ఆ స్నేహం కాస్తా విరిగింది, కారణం ఏదయినాకావచ్చు, చిన్నదే అయిన కారణం కూడా పెద్ద భూతం లా పెద్దదిగానూ కనపడచ్చు, అప్పుడు ఎవరు మాటాడినా రెండవవారికది తప్పుగానే తోస్తుంది,మరి అటువంటి స్నేహం అవసరమా?

ఇంతకీ నిజమైన స్నేహితులు భార్యభర్త అవునాకాదా చెప్పండి….

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరికెవరు స్నేహితులు?

 1. బాగు బాగు ! కామెంటితే మరో టపా గిట్టు బాటు !

  ఇంతకీ “అగ్ని సాక్షిగా స్నేహం ” ఈ స్నేహం అగ్ని సాక్షి గా మొదలవడం ఎట్లా అయ్యిందంటారు ? ఎందుకీ అగ్ని సాక్షి?
  ఎప్పటి నించి ఈ ఆచారం ? అగ్ని ఎందుకు అంత సాక్షీభూతం ?

  జిలేబి

  • Zilebi గారు,
   అధ్యక్షా! అంతర్జాలమునుండి వెళిపోతానంటున్నవారికి మరొకరిని టపా వ్రాయమనే హక్కుంటుందా? టపా రాయమన్నవారు స్పందించక్కరలేదా?
   టపారాయడం వారి నిర్ణయం మీద అధారపడి ఉంటుంది.
   ధన్యవాదాలు.

 2. ఇరువురిలో ఎవరికి కష్టమొచ్చిన” ఏవండీ ఇలా జరిగింది,దానికి పరిష్కారమెలా?”, అని అడిగితే “ఏమో నీ చావు నీవుచావు” అనే భర్తలు,భార్యలు వున్న ప్రస్తుత రోజుల్లో భార్యా భర్తలమద్య స్నేహ మాధుర్యం వుందంటారా? .చదువుకోవటానికి చాలా మంచి విషయాలు చదువుకుని, జీవితాలలో ఆచరించటానికి తగు సహచరి,సహచరుడు కుదిరితేనే ఆ స్నేహం(దాంపత్య స్నేహం)వికసిస్తుంది,లేదంటే నిత్యాగ్నిహోత్రమే.

  • mallampalli swarajya lakshmi గారు,
   ఇది లోకం కదా! అందరూ అలావుండరు, కొంతమంది అలానూ ఉన్నారు. అలాకాకుండా భార్యాభర్తలు ఇలా బతకాలోయ్ అని పెద్దలు చెబుతున్నారు, వింటే సుఖం, లేకుంటే….
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s