శర్మ కాలక్షేపంకబుర్లు-కోడలికి బుద్ధి చెప్పి……..

కోడలికి బుద్ధి చెప్పి……..

”కోడలికి బుద్ధి చెప్పి, అత్త తెడ్డు నాకింది”, ఈ నానుడిని మన తెనుగునాట బాగా చెప్పుకుంటాం. దీనినే మోటగా కూడా చెబుతారు అది ”కోడలికి బుద్ధిచెప్పి, అత్త రంకుబోయింది” అని, ఇది మరీ మొరటుగా ఉంటుంది కాని మొదటిదాని కత చెప్పుకుందాం.

అనగానగా ఒక ఊళ్ళో ఒక అత్త,కోడలు, ఒకే ఇంట్లో కాపరం చేస్తున్నారు, ఇప్పటిలాగా అత్త కనపడితే పీకనులిపేద్దామని కోడలూ, కోడలు కనపడితే పీక కొరికేద్దామనుకునే, అత్తా, కోడళ్ళు లేనికాలం, సంసారపక్షంగా కొట్లాటలుండే రోజులు. ఉమ్మడి కుటుంబంలో వంటా వార్పూ అంతా అత్తగారి స్వామ్యమే, అప్పుడప్పుడూ కోడలు వండే అలవాటు. అత్త వంటింటి మీద తిరుగులేని ఆధిపత్యం వహించే రోజులూ. ఇటువంటి రోజులలో ఒక రోజు, అత్త కోడలిని వంట చేయమంది. అత్త వంటింటిలోకి రానివ్వడమే మహాభాగ్యం అనుకున్నకోడలు, వంట చేస్తోంది. అత్త కోడలికి వంట చేయమని పురమాయించినా, ఒక కన్ను వంటింటిమీద పడేసి ఉంచింది.

వంట చేస్తున్న కోడలికి కూరలో ఉప్పు సరిపోయిందా? లేదా? అనే అనుమానం వచ్చేసింది. ’ఎలాగో ఒకలా ఉంటుందిలే’ అని వదిలేస్తే, అమ్మో అత్తగారితో కష్టమే, ’వంటకూడా సరిగా చెయ్యడం రాదే! నాకోడలా!’ అని దెప్పుతుందేమో, అనుకుని, ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూసి, ఇటూ అటూ చూస్తే ఎవరూ కనపడలేదు. ఆ( మా బాగా ఉందనుకుని, కూర కలియబెట్టిన తెడ్డు చేతిలో ఉంటే, ఒక్క సారి అంటే ఒక్క సారి, దైవ సాక్షిగా ఒక్కసారి నాలుకతో నాకింది సుతారంగా. ఇటువంటి అనాచారమేదో చేస్తుంది, కోడలు చేయాలి, చేస్తే, చూసి పట్టుకోవాలనుకున్న అత్త, ఒక్క సారిగా ”హన్నా! హన్నా!! హన్నన్నా!!! ఎంత అనాచారం, ఎంత అనాచారం, మడిగా వంట చేస్తూ, రుచి చూస్తావా? అందుకు తెడ్డు నాకుతావా? ఎంగిలి మంగలం చేస్తావా? మా ఇంటా వంటా లేదే, మా పుట్టింటసలే లేదే, ఇటువంటి అనాచారం, నీ పుట్టింట ఇటువంటి అనాచారాలున్నాయా? మీవాళ్ళిలాగే పెంచారుటే నిన్నూ, ఇటువంటి అనాచారం పనులేంటే, వెళ్ళు వెళ్ళూ, తెడ్డు కడుక్కురా” అని చింత చెట్టును దులిపేసినట్టు దులిపేసింది. కోడలికి గుడ్ల నీళ్ళు తిరిగాయి, తెడ్డు నాకుతూ దొరికిపోయింది కదా! ఏమనాలో తెలియక నోరు మూసుకుంది. అత్త, ”ఆహా! ఇన్నాళ్ళకి కోడలి మీద పై చెయ్యి సాధించా”ననుకుని సంతోషపడింది.

రోజులు నడుస్తున్నాయి, ఒక రోజు అత్త వంట చేస్తోంది. ఆ సంఘటన జరిగినప్పటినుంచీ, కోడలు ఒక కన్ను అత్తమీద వేసి ఉంచింది. ఒక రోజు కూరవండుతూ ఉప్పు వేశానా లేదా? అనే అనుమానంలో పడిపోయింది, అత్త. ఏం చేయాలీ? వేసేననుకుని ఊరుకుంటే, ఆతరవాత వెయ్యలేదంటే అవమానం. వెయ్యలేదనుకుని మళ్ళీ ఉప్పేస్తే ఛీ! ఉప్పు కషాయం, నోట్లో పెట్టుకోలేరు. అందుకని అత్త అటూ ఇటూ చూస్తే ఎవరూ కనపడలేదు, గబుక్కున కూర కలియబెట్టిన తెడ్డు, అత్త ఒక్క సారి అంటే ఒక్క సారే, దేవుని సాక్షిగా ఒక్క సారి నాలికతో నాకింది. అమ్మయ్యా! కోడలు ఇది చూడనే చూసేసింది, వెంఠనే ”అత్తా! ఔరా, ఔరా, ఔరౌరా!!! ఇంత అనాచారం మా పుట్టింట నేను నేర్చుకోలేదమ్మా! ఇన్నేళ్ళొచ్చేయి, ఎందుకూ, రేవులో తాడి చెట్టులా పెరిగేవు, ఏంటి ఉపయోగం, మడిగా వంట చేస్తూ తెడ్డు నాకుతావా? ఇదేనా నువ్వు ఇన్నాళ్ళబట్టీ చేస్తున్నది” అని కోడలు, అత్తను దొరకబుచ్చుకుంది. అత్త ఒక్కసారిగా విస్తుబోయింది. ”అమ్మనా కోడలా! నీ పీత బుర్రలో ఇన్ని తెలివితేటలొచ్చేశాయా!” అనుకుని మౌనంగా ఉండిపోయింది.

ఇదిగో ఇక్కడిదాకా రాసేటప్పటికి మా సత్తిబాబొచ్చాడు, చాలా రోజుల తరవాత. వస్తూనే ”ఏంటండీ, నిన్న సవతులయ్యారా? ఇవేళ అత్తా కోడళ్ళమీద పడ్డారూ” అన్నాడు. ”బక్కవాణ్ణయ్యా! అత్తా కోడళ్ళ మీద పడగలిగినంత సత్తా ఉన్నవాడినేం కాదులే” అంటూ ”ఇదేంటీ” అన్నా. దానికి మా సత్తిబాబు

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్లనుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.

తప్పు, తప్పు, తప్పు అనేవాళ్ళ చాలామందే ఉంటారు. ప్రపంచం లో అందరికి ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది, కాని ఈ, తప్పు, తప్పు అని చెప్పేవారికి, తమ తప్పులు తమకు తెలియవు అన్నారు వేమన.

”తప్పులు చెప్పేవాళ్ళు చాలామందే ఉంటారు కాని వారికి తమతప్పు తమకు తెలియదు, అదెలా అంటే ఎర్ర గురివింద గింజకి ముడ్డి కింద నలుపుంటుంది. అదనుకుంటుందీ, నేను ఎర్రగా ఉన్నానూ అని, నిజానికి దాని నలుపు దానికి కనపడదు, దీపం కింద చీకటి ఉన్నట్టు. దీపం అనుకుంటుంది, నేను వెలుగిచ్చేస్తున్నానూ అని, కాని దాని కింద చీకటే ఉంటుంది. అది ఆ దీపానికి తెలియదు. అందుచేత తప్పులెన్నుకోడం అనవసరం. ఆ ఇద్దరూ ఆ ఇంటికోడళ్ళే, ఇద్దరూ దొంగలే, అనాచారం చేసి ఎంగిలి కూడు మగాళ్ళకి పారేస్తున్నారు, ఆ ఇంటి మగాళ్ళు, నిజంగా మగాళ్ళయితే, ఇద్దరిని చెరొకటీ వాయించి ఉండేవారు” అంటూ వెళిపోయాడు.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కోడలికి బుద్ధి చెప్పి……..

 1. కష్టే ఫలే శర్మ గారు,

  కుశలమేనా ! ఒక వారమయ్యింది గోదావరి ఖబుర్లు చదివి !

  జిలేబి
  (ఇచ్చట కూడా ఏమైనా టపా బందు అయి పోయిందా కొంప దీసి?)

  • జిలేబీ గారూ, “టపాబందు” అయ్యుండదు గాని బహుశా శర్మ గారు తదితర పెద్దలు బ్లాగుల్లో రగడల్ని బిత్తరపోయి చూస్తుండిపోయారేమో !!

   • విన్నకోట నరసింహారావు గారు,
    అనువుగానిచోట అధికులమనరాదు కదండీ అదండి సంగతి 🙂
    ధన్యవాదాలు.

 2. ఈ అత్తా కోడళ్ళ కథే ధో అయ్యవారు ఆంధ్ర తెలంగాణా ల గురించి రాసినట్టు ఉంది !

  అసమదీయులు, తసమదీయులు అంతా వచ్చి ఇక్కడ ఘెరావ్ చేయవలె !

  డమాల్ డమాల్ డమాల్ 🙂

  జిలేబి
  నారదాయ ప్రణీత ఇతి )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s