శర్మ కాలక్షేపంకబుర్లు-అర్ధనారీశ్వరం,ఇదే అద్వైతం.

ardhanareeswara3

అర్ధనారీశ్వరం, ఇదే అద్వైతం.

అయ్యవారు త్రినేత్రుడు, అమ్మవారు త్రినయన.

అయ్యవారికి మూడో కన్నుంది, అమ్మవారికి మూడో కన్నుంది.

అయ్యవారి కన్ను మూసి ఉంటుంది, అమ్మవారికన్ను తెరచి ఉంటుంది.

అయ్యవారు కన్ను తెరిస్తే ప్రళయం, అమ్మ కన్ను మూస్తే విలయం.

అయ్య తెల్లనివాడు, అమ్మ నల్లనిది.

తెల్లనైన అయ్య ఉగ్రుడు నల్లనైన అమ్మ శాంతం.

అమ్మ అయ్యను ఉగ్రుణ్ణీ చేయగలదు శివుణ్ణీ చేయగలదు.

అయ్యవారి కన్ను సూర్యుడు, అమ్మవారి కన్ను చంద్రుడు.

మెదడు రెండు అర్ధభాగాలు. మెదడు కుడివైపుభాగం శరీరంలో ఎడమవైపును నియంత్రిస్తుంది, అలాగే ఎడమవైపు భాగం శరీరంలో కుడివైపును నియంత్రిస్తుంది. అర్ధనారీశ్వరంలో అయ్యవారు కుడివైపున అమ్మవారు ఎడమవైపున ఉంటారు.కుడి వైపు అయ్యవారి మెదడు అర్ధభాగం అర్ధనారీశ్వరం లో ఎడమవైపున్న అమ్మవారిని నియంత్రిస్తుంది. అలాగే ఎడమవైపు మెదడు అర్ధభాగం కుడి వైపు అయ్యవారిని శాసిస్తుంది. అమ్మలాస్యం అయ్యవారి తాండవంలోనూ, అయ్యవారి తాండవం అమ్మ లాస్యంలోనూ కనపడతాయి. అమ్మ ఆలోచన అయ్యవారి ఆచరణ, అలాగే అయ్యవారి పరిపాలన, అమ్మవారి ఆదరణ. ఆహా! ఎంత అద్వితీయం….ఇదేకదా అద్వైతం….. ఒకటే అయిన రెండు, రెండుగా కనపడే ఒకటి…..అన్నదానికి ఇంతకంటే ఆధారం కావాలా?

“కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్య సేత్వం,

కిం కాలకూటః కిము వా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే.”

స్వామీ నీకు పుఱ్ఱెల దండంటే ఇష్టమా, కౌస్థుభమణి అంటే ఇష్టమా? అసలు నీకు కాలకూట విషం బాగుందా లేకపోతే చన్నిచ్చి పెంచిన యశోద స్తన్యం బాగుందా చెప్పవయ్యా అన్నారు.

ఇది తిక్కనగారు భారతాన్ని తెనుగు చేస్తూ రాసిన సంస్కృత శ్లోకం. తిక్కన పరమాత్మను హరిహరనాథునిగా గుర్తించారు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. తిక్కనగారూహించినదీ అర్ధనారీశ్వర తత్త్వమే. ఇక్కడ వారు హరుని కుడి వైపున హరిని ఎడమవైపునా చెబుతారు. హరుని కుడివైపే ఎందుకు చెప్పాలి, మరి ఇటువంటి ఆలోచన నాకు గాక మరెవరిస్తాయి చెప్పండి. నారాయణుని స్త్రీ స్వరూపమే నారాయణి అమ్మ శివాని, త్రినయని. అందుచేత అమ్మ ఎడమవైపునే ఉంటుంది. – ఛార్జ్ లేక + ఛార్జ్ కి చలనం లేదు  🙂

ఇంతకీ తిక్కనగారి ప్రశ్న చూదాం. అసలు ఈ పుఱ్ఱెలదండేమీ శివునికీ అని చూస్తే, ఇవి బ్రహ్మ కపాలాలు.

365 రోజులు మానవ సంవత్సరం, అటువంటి
17,28,000 సంవత్సరాలు కృతయుగం.
12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం,
8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం.
4,32,000 సంవత్సరాలు కలియుగం.
43,20,000 మానవ సంవత్సరాలు ఈ నాలుగూ కలిపి ఒక మహా యుగం.

ఇటువంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మగారికి ఒక పగలు. ఇన్ని సంవత్సరాలూ ఒక రాత్రి. ఇటువంటివి 365 రోజులు గడిస్తే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. ఇటువంటీవి వంద సంవత్సరాలు ఒక బ్రహ్మగారి జీవిత కాలం. అలా గడచిన బ్రహ్మల పుర్రెలను దండగా ధరిస్తాడట, శివుడు. అనగా అమ్మతో కలిపి ఆయన కాల స్వరూపుడు.శివుడుగా ధరించే బ్రహ్మకపాలాల మాలా, విష్ణువుగా ధరించే కౌస్థుభమాలా ఒకటే ఆయనకు. అలాగే కాలకూట విషాని ఎంత అవలీలగా మింగాడో అలాగే యశోదాదేవి ఇచ్చిన చనుబాలూ తాగాడు కృష్ణునిగా. అన్నీ ద్వందాలే, రెండిటిని ఒకలా చూడటమే అద్వైతం సనాతనుడైన పుట్టుకయే లేనివానికివన్నీ ఒక లెక్కా, మనకుగాని.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అర్ధనారీశ్వరం,ఇదే అద్వైతం.

 1. శర్మ గారూ నా అజ్ఞానాన్ని మన్నించండి. పైన మీరు చూపించిన ఒక్కో యుగం సంవత్సరాల లెక్క తిరగేసి ఉండాలేమో కదా – ఎందుకంటే నాలుగు యుగాల్లోనూ కలియుగమే అన్నిటికన్నా చిన్నదని నేర్చుకున్నట్లు గుర్తు. మీరు కలియుగం17,28,000 సంవత్సరాలని వ్రాసారు. కలియుగం అన్ని సంవత్సరాలా అని తల్చుకుంటే భయంవేస్తోంది 🙂 అందువల్ల ఈ సందేహం.

   • తాడిగడప శ్యామలరావుగారు,
    పొరబడ్డాను, రాత్రి కంప్యూటర్ కట్టేస్తోంటే మిత్రుల కామెంట్ వచ్చించి, చూసి సరిచేశాను కాని కామెంట్ కి జవాబివ్వలేదు, అదీ జరిగినది, మిత్రులకు పొరబాటును సరిదిద్దినందులకు.
    ధన్యవాదాలు.

  • విన్నకోట నరసింహారావుగారు,
   పొరబడ్డాను, విషయం రాసే హడావుడిలో అంకెలు తారుమారయ్యాయి, ఆ అతరవాత వాటిని పట్టించుకోలేదు, సరిగానే ఉంటాయని.సరిచేశాను.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s