శర్మ కాలక్షేపంకబుర్లు-పుష్కరాలు.

పుష్కరాలు.

గోదారమ్మ పుష్కరాలు, వైభవం, వీటి ప్రత్యేకతల గురించి చాలామంది రాస్తారు, అందుకు వీటి గురించిన టపా రాయకూడదనే అనుకున్నా, కాదనుకున్నది చేయవలసిరావడమే జీవితం కదూ 🙂

DSCN0049

జూన్ 29 సోమవారంనాడు, ఇల్లాలు ”పుష్కరాలు మొదలయ్యాయికదూ, నిన్ననేనూ” అంటూ వచ్చింది. ”అదేంటీ పుష్కరాలు జూలై 14 నుంచి కదా” అన్నా, సాలోచనగా చూస్తూ. ”మనది దృక్ సిద్ధాంతం కదా” అని పొడిగించింది. ”అవును మరచాను, మరైతే గోదావరి స్నానమెప్పుడో, అదీ ముహూర్త నిర్ణయంచేసెయ్యి” అన్నా, ఆ సావకాశం ఆవిడకే ఇచ్చేస్తూ. ”జూలై రెండవ తారీకు పున్నమి, ఆరోజున పుష్కర స్నానం చేసొచ్చేద్దాం, ఉదయమే,” అని నిర్ణయం చేసేసింది. ”సరే”ననుకుని ఆ రోజు ఉదయమే ఐదు గంటలకి రైలుకెళితే, అరగంట లేటుగా వచ్చి క్షేమంగా గోదావరి స్టేషన్లో దింపింది, ఏడుంపావుకి. అమ్మ కనపడుతోంది ఎదురుగా, దగ్గరే, రెండడుగులేస్తే అమ్మ దగ్గరుంటాం.

DSCN0040

నెమ్మదిగా అడుగులేస్తూ ”స్నానం తరవాత మనవరా…..” అన్నమాట పూర్తి చెయ్యకుండానే, ”కొడుకులు,కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, బొమ్మరాళ్ళు….ఎందుకొచ్చిన తగులాటం, ఇంకా ఎంత కాలం?” అంటూండగానే గోదారమ్మ దగ్గరకొచ్చేం. అమ్మకి దణ్ణం పెట్టి లోపలికి దిగి కొంగూ చెంగూ ముడేసేను, చుట్టూ స్నానం చేస్తున్నవాళ్ళు వింతగానూ చూశారు, సంకల్పం చెప్పుకుని, గంగేచ యమునైశ్చైవ గోదావరి సరస్వతీ….చెప్పుకుని, ముక్కూ చెవులూ మూసుకుని ప్రవాహానికి ఎదురుగా, ఇద్దరం ఒకసారే మూడు మునకలూ వేసేం, అదే సరిగంగ స్నానమంటే. ఆ తరవాత తూర్పుగా తిరిగి మరో మూడు మునకలూ వేసేం. అమ్మకి పసుపు కుంకుమలిచ్చి హారతిచ్చి, బయటకొచ్చి అశ్వద్ధానికి ప్రదక్షిణం చేసేం, బట్టలు మార్చుకున్నా. ఆమె బట్టలు మార్చుకోడానికెళితే, నేను ఫోటోలు తీసుకున్నా. ఎవరో గోదావరమ్మ ప్రసాదం పెడుతున్నారు, చివరికొస్తే దొరకలేదు, లేదన్నాడు, అమ్మ ప్రసాదమంటే రెండు మెతుకులు చాలయ్యా, అని గిన్నెలో మిగిలిన నాలుగు మెతుకులంటే నాలుగే ఇద్దరం ప్రసాదం తీసుకుంటే, అక్కడున్నతను ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడిపోయాడు.

DSCN0024

నెమ్మదిగా బయటికి అడుగులేస్తూ, ”వదిలేశానోయ్! అందరినీ వదిలేశా” అన్నా. నవ్వింది, ”ఎందుకూ నవ్వుతున్నావ”న్నా, చిన్నాంజనేయ స్వామి ఆలయం వైపు నడుస్తూ, ”వదిలేశాను, వదిలేశాను అంటున్నారు, ఏం వదిలేశారు? ఎవరిని వదిలేశారు? స్నానం చేస్తున్నంతసేపూ వాళ్ళనే తలుచుకున్నారా!” అంటూ నవ్వింది, ఈలోగా ఆలయం దగ్గరకొచ్చేం. గుడి ఖాళీగా ఉంది. లోపలికెళ్ళీ స్వామి దర్శనం చేసుకుని బయటికి వచ్చి మళ్ళీ కాలు సాగిస్తే, అడుగులు మార్కండేయ స్వామి ఆలయం వైపు పడుతుండగా, ”వదిలేశానంటే ఎందుకునవ్వేవు” అన్నా. ”వదిలేశానని చెబుతూ, మీరు వాళ్ళనే తలుచుకుంటున్నారు” అని నవ్వింది. ”మనకా వయసొచ్చింది, అందరూ ఎవరిమటుకు వారు పెద్దవాళ్ళూ అయ్యారు, మనవరాళ్ళకే ముఫై ఏళ్ళొస్తున్నాయి, ఇంకా మనం వాళ్ళచుట్టూ తిరగడమేంటీ? వాళ్ళకి మనల్ని చూడాలని, పలకరించాల్ని,మాటాడాలని ఉంటే వస్తారు, లేకుంటే లేదు, వస్తే మాటాడండి”. ”ఈ వదిలేయడమన్నది మీరన్నట్టు కాదనుకుంటా. హిరణ్యకశిపుడు ఎక్కడా? హరి ఎక్కడా అని వెతుకుతూ హరినే పట్టుకున్నాడు, కాని వదిలెయ్యలేదు. మీరుకూడా వదిలేశాను, వదిలేశాను అనుకుంటూ అందరిని పట్టుకున్నారు, అసలు వదిలెయ్యడమంటే పట్టుకోకపోవడమే కదా, చాగంటివారేం చెబుతారు? కట్టు మీద కట్టేస్తే లోపలికట్టు జారుతుందని కదా! అటువంటపుడు పట్టుకోకపోవడమే వదిలేయడం కాదా!” అని ఆగింది. ఆహా ”నేడు ఒక సత్యం తెలుసుకున్నా, ఇంత చిన్న విషయం ఎందుకుతోచలేదబ్బా” అనుకుంటుండగా మార్కండేయ స్వామి దర్శనమైంది. బయటికొస్తే కడుపులో కావుడు గంతులేస్తున్నాడు.

DSCN0026

పక్కనే ఉండే టిఫిన్ బడ్డిలు సందులలోకి సద్దుకున్నాయి, ఒక సందులోకి దిగి ఆత్మారాముడికి ఆహూతులిచ్చి మరలా గట్టెక్కితే ఒక ఆటోఖాళీగా వచ్చింది, అందులో పడితే బస్ స్టాండ్ చేరేం, ఇలా నిలబడితే అలా బస్సొచ్చింది, గంటలో మా వూళ్ళో దిగేం, ఇక్కడినుంచి ఇంటికి చేరడం మాకు యజ్ఞమే, చిత్రం ఒక ఆటో ఖాళీగా వచ్చింది, అందులో కూలబడ్డాం, ఐదు నిమిషాల్లో ఇంటిదగ్గరకి చేరేం. పుష్కర స్నానం దిగ్విజయంగా పూర్తయింది. అన్ని వేళలా ప్రయాణం ఇలా ఉండదూ, చిత్రహింస పదతాం.

పుష్కరం లో స్నానం, పెద్దలకి తీర్థవిధి ఇవి రెండూ ముఖ్యం. గోదారమ్మలో స్నానం ఎప్పుడైనా విశేషమైనదే, పుష్కరాలకి మరికొంత. గురుడు సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరమ్మకి పుష్కరం. గురుడు ఈ రాశిలో సంవత్సరం ఉంటారు, ఈ సంవత్సరకాలం లో ఎప్పుడైనా గోదావరి స్నానం చెయ్యచ్చు, మరో సంగతి ఒక్క గోదారమ్మకి మాత్రమే అంత్య పుష్కరాలున్నాయి, మరేనదికి చివరికి గంగకి కూడా అంత్య పుష్కరాలు లేవు, అదీ గోదారమ్మ గొప్పతనం. అందుచేత ఈ పన్నెండు రోజులలో స్నానం చేయలేనివారు, దూరతీరాలనుంచి రాలేనివారు బాధ పడద్దు, సంవత్సరంలో ఎప్పుడైనా స్నానం చేయచ్చు. ఒక్క రాజమంద్రిలోనే స్నానం చేయాలని లేదు, అమ్మ ప్రవహించిన ప్రాంతమంతా, ఏ ప్రాంతం లోనైనా మునకేయచ్చు. అందరూ రాజమంద్రి కోసం వస్తే తొడతొక్కిడిలో వయసుమళ్ళినవారు, పిల్లలు ఇబ్బంది పడచ్చు, అందుకు అమ్మ ఉన్న ఊరు ఎక్కడైనా స్నానం చేయండి. సంవత్సరం పొడుగునా చేయచ్చు, అంత్య పుష్కరాలలోనూ చేయచ్చు, వయసుమళ్ళినవారికి ఇది తెలుసు కాని మరొక సారి గుర్తు చెస్తున్నానంతే, అందుకే ఈ టపా రాయాల్సివచ్చింది, ఒకరు రాలేక బాధపడుతూ ఫోన్ చేస్తే వారికి చెప్పినదే ఇది..

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పుష్కరాలు.

 1. మాధవ రావు గారు ప్రశ్న “ఇంతకీ ఈ పుష్కర స్నానం చేయటంలో శాస్త్రీయత ఎంతవరకూ వున్నది? అంటే, గురుడు సింహరాశిలో ప్రవేశించటానికి ముందు, ప్రవేశించినప్పుడు, ఆ తరువాత నదీజలాల్లో ఏమైనా మార్పులు వుంటాయా? ” చాలా మంచి ప్రశ్న

  సమాధానం తెలిసిన వాళ్ళు ఇవ్వ వచ్చు

  జిలేబి

 2. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  టపా చాలా హృద్యంగా వున్నది. ముందుగానే పుష్కర స్నానం పూర్తిచేసి, మంచి పనిచేశారు. ఇంతకీ ఈ పుష్కర స్నానం చేయటంలో శాస్త్రీయత ఎంతవరకూ వున్నది? అంటే, గురుడు సింహరాశిలో ప్రవేశించటానికి ముందు, ప్రవేశించినప్పుడు, ఆ తరువాత నదీజలాల్లో ఏమైనా మార్పులు వుంటాయా? తెలుపగలరు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • madhavaraopabbaraju గారు,
   పుష్కర స్నానం లో శాస్త్రీయత గురించి చెప్పలేనుగాని, పారే జలంలో శక్తి ఉంటుందంటారు, అది స్నానం చేసినవారికి జేరుతుందని నమ్మకం. అంతకు మించి నదిని బాగు చేసుకోవడమనేదే ముఖ్యావసరంగా కనపడుతుంది.
   ధన్యవాదాలు.

   • శ్రీ శర్మగారికి, నమస్కారములు.
    `అంతకు మించి నదిని బాగు చేసుకోవడమనేదే ముఖ్యావసరంగా కనపడుతుంది.’ :- శర్మగారూ, చాలా మంచి మాటన్నారు. అక్షరాలా నిజం.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

   • మాధవరావుగారు,
    నదికి పుష్కరాలు ఏర్పాటు చేసింది, నదిని బాగుచేసుకోవడానికి కూడా. ఇందులో ప్రజల భాగస్వామ్యమే పుష్కరం. ఇది అందరం మరచిపోయాం.
    ధన్యవాదాలు.

 3. sarma garu, namaste. meeru konnalla kinda puskaralo sradham gurinchi oka list eicharu. please adokaarsri malli evvara m akemo boldu duram. 9 gantala prayanam. vuntanu.
  a.v.ramana. ramana.arcot @gmail.com

 4. Sarma garu
  Chaala manchi vishayalu teliyachesaaru. Aa rush lo rajamundry velladamante pillalato ibbandi anukunnam andi. Munde velli pani kaniyyachu ani telusukunnam. Ilaanti vishayalu eppatikappudu teliyachestoo undandi.

  • Jyotsna గారు,
   పెద్దవాళ్ళతో వచ్చిన వాళ్ళు చూసేది నరకం. ఆ తొడతొక్కిడిలో వీళ్ళు నడవలేరు, వీళ్ళని కూడా ఉన్నవాళ్ళు పట్టుకోలేరు, ఎవరికి వారే తొందరపడిపోతుంటారు, కుదురు కనపడదు, ముసలాళ్ళు పడిపోయారా…….వద్దు ఇంకనా నోటితో చెప్పించద్దు. ”శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం”.
   ఇక పిల్లలు, ఇదో పెద్ద బాధ. ఎత్తుకునేవాళ్ళయితే సమస్య లేదు. నడిచేవాళ్ళు చేయి పట్టుకు నడిపించడం పెద్ద కష్టం. వీళ్ళకి ఏం కనపడదు పాపం,ఒంటరిగా నడవాలని కోరికుంటుంది. చెయ్యి వదిలేస్తే……తప్పిపోతే….. ఆ తరవాత ఆలోచించడమే బాధాకరం, అందుచేత ఈ తొడతొక్కిడి తరవాత హాయిగా గోదారమ్మలో మళ్ళీ మునకేదామనుకుంటే హాయి కదా.
   ధన్యవాదాలు.

   • శర్మ గారూ, మొన్నటి రాజమండ్రి పుష్కరఘాట్ దుర్ఘటన గురించి విన్నప్పుడు నాకు మొదట గుర్తుకొచ్చింది మీ ఈ వ్యాఖ్యే. ప్రభుత్వోద్యోగుల్లో మామూలుగానే పేరుకుపోయున్న నిర్లక్ష్యధోరణి, వీఐపీల హడావుడి, వారి బందోబస్తుకే అంకితం అయిపోతున్న ప్రభుత్వయంత్రాంగం. దానికి తోడు అనేక విషయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లో విచక్షణాజ్ఞానాన్ని కూడా అణగదొక్కేసేట్లు పెరిగిపోతున్న వేలంవెర్రి ధోరణి. మీడియా హంగామా. వగైరా….వగైరా. తిలాపాపం తలా పిడికెడు.

   • విన్నకోట నరసింహారావు గారు,

    ఇవన్నీ కనపడేవండి, అదృశ్య హస్తాలెన్నో, పుష్కరాలు సవ్యంగా జరగకూడదనుకునేవి.
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s