శర్మ కాలక్షేపంకబుర్లు-ఇంటి పేర్లు

ఇంటి పేర్లు

పంతులుగారూ మీ ఇంటిపేరు చిత్రంగా ఉంటుందండీ అన్నాడోరోజు మా సత్తి బాబు.

మనిషిని గుర్తించడానికే పేరు. ఒకే పేరున్నవాళ్ళు ఎక్కువమంది ఉంటే, పేరుకి చిన్న, పెద్ద; నలుపు,ఎరుపు కలపడం ఇలా చాలా ప్రక్రియలు చేశారు మనవారు. వ్యక్తిని గుర్తించడానికి పేరయితే కుటుంబాన్ని గుర్తించడానికి ఇంటిపేరు చేర్చారు. అందులో భాగమే ఈ ఇంటిపేర్లుకూడా, మన తెనుగునాట. మా ఇంటిపేరుగురించి చెబుతా విను.

”ఒజ్జ” అంటే గురువు అని అర్ధం. మా పూర్వీకులంతా గురువులు. నేటివారు మనదగ్గర చదువులేమున్నాయండీ, అంతా తెల్లోడి చదువుతప్పించీ అంటున్నారు విజ్ఞులు. అంతెందుకు మన గుళ్ళు కూడా మనం కట్టుకోలేదు, మనకేం చేతకాదు, అక్కడెక్కడో ఒక గుడి కనపడిందిటా మన గుడిలాగా, అందుకు మనం ఆ గుడి నమూనా కాపీ కొట్టేశాం, అని రాసేశాడో తెల్లోడు. అదిగో అదిపట్టుకున్నాం, గుడికూడా మనదికాదన్న పరిస్థితికి మన బుర్రలెదిగిపోయాయి.కల్లూరు కాలిపోయినా విల్లూరు విరిగిపోయినా మనం మారం, అన్నట్టు ఈ కల్లూరు, విల్లూరు ఇంటిపేర్లు. ఆ రోజుల్లో చదువంటే, వేదం, తర్కం, న్యాయం, మీమాంస, ఆర్ధిక శాస్త్రం, ఆయుర్వేదం, వాస్తు కంగారు పడిపోకు, వాస్తు అంటే నేటి సివిల్ ఇంజనీరింగ్, దీనిని చండాలం చేసిపారేసి ఇలా తయారు చేశారు. ఇలా చాలా విద్యలుండేవి, అన్నీ ప్రజా జీవితానికి అవసరమైనవే. ఈ విద్యలు చెప్పేవారినే ఒజ్జలు అనేవారు. వీరు సంఖ్య రాను రాను పెరిగింది, మరి వీరిని గుర్తించడమెలా? మొదటగా ఒజ్జల అనేది ఆ తరవాత ఇంకాకావలసివచ్చి మంచనఒజ్జల,అనంత ఒజ్జల, కాశీఒజ్జల, మాచనఒజ్జల,రుద్రాఒజ్జల, సింఘాఒజ్జల,గోవిందఒజ్జల,మల్లాఒజ్జల, ఇలా ఒజ్జలకి ముందు మరొక విశేషణం అదిపేరుకావచ్చు మరొకటికావచ్చు తగిలించేరు. ఇలా మా ఇంటిపేరు మాచనఒజ్జల కాని కాల క్రమేణ మార్పులొచ్చాయి, అందుకు ఇది కాస్తా ”మాచనవఝుల” అయి కూచుంది, ”ఒజ్జల” ”వఝుల”గానూ తయారయింది. ”మాచనఒజ్జల” కాస్తా, మాచనవఝుల అయింది.. ఈ మాచన పేరుగలవారు మా ఆది పురుషుడై ఉంటారు. కొంతకాలమైతే మావాళ్ళు మాచనవఝ్ఝుల అనికూడా రాసేవారు. ఎంతమందికి చెప్పగలను, ఎలాచెప్పగలను, అందుకే నేనూ మారిపోయా వారితో పాటు మాచనవఝుల అనేరాసుకుంటున్నా. ఇదీ మా ఇంటిపేరు కత.

ఇంటిపేర్లుగా ఊరిపేర్లు, ఆహారపదార్ధాల పేర్లు, వ్యసాయపనిముట్ల పేర్లు, వృక్షాలు, చెట్లు పేర్లు, జంతువుల పేర్లు, పక్షులపేర్లు, కాయగూరలపేర్లు,తినుబండారాల పేర్లు, వృత్తులపేర్లు, పౌరుషనామాలు, తాంబూలంలో వాడేవాటి పేర్లు, ఆఖరికి సంగీతం కూడా ఇంటిపేరయింది. ఇలా చాలా చాలా జేరిపోయాయి. నేను పుట్టిన ఇంటిపేరు చిఱ్ఱావూరి, చినరావూరు అనేఊరు గుంటూరు జిల్లాలో ఉందట. చినరావూరు, పెదరావూరు కాతా అంటే అప్పు ఎగగొట్టే బాపతనో ఏదో చెబుతారు, నాకు పూర్తిగ తెలీదనుకోండి. ఒకసారి ఒక విచిత్రం జరిగింది. చిన్న తిరుపతి వెళితే అక్కడఒకాయన కలిశారు, మీ గోత్రం అంటే చెప్పేను, మీ ఇంటిపేరూ అన్నారు, చెప్పేను, అయ్యో మా ఇంటిపేరూ అదేనండీ కాని మాముత్తాతగారు సేనాపతిట ఒక రాజుదగ్గర, అందుకని అప్పటినుంచి మాఇంటిపేరు సేనాపతి అయిపోయిందీ అన్నారు, విచిత్రమే అనిపించింది.

ఆహారపదార్ధాలతో కూడిన ఇంటిపేర్లతో చాలాకాలం కితమే ఒకటపారశాను,సరదాగా ఉంటుంది, చిత్తగించండి.

https://kastephale.wordpress.com/2011/11/08/

వ్యవసాయపని ముట్లలో ముఖ్యమైనది నాగలి, దీనినుంచి, నాగళ్ళ,నాగెళ్ళ,నాదెండ్ల, నాదెళ్ళ ఇలా కావలసినన్ని రూపాలూ తీసుకుంది. నాదెళ్ళ సత్య ఒక ప్రముఖమైన ఇంటిపెరుతో పేరు.మేడి, మేడిచర్ల, ఎడ్ల, కరెడ్ల, గంగిరెడ్ల ఇలా….

పరిపాలనతో సంబంధం ఉన్నవారికి, భావరాజు,అబ్బరాజు, భద్రిరాజు, కామరాజు,సత్తిరాజు,రుద్రరాజు, లక్కరాజు ఇలా చివరరాజుపదం వచ్చిచేరింది, అలాగే కోట కూడా చేరింది, ఉదాహరణకి,ధరణికోట, విన్నకోట, కోట వగైరాతో. ఇంకా మానాప్రగడ, సత్యాప్రగడ, విస్సాప్రగడ,యెర్రాప్రగద, ధరణీ ప్రగడ, ప్రగడరాజు ఇలా ప్రగడ ఇంటిపేర్లవారంతా మంత్రికుటుంబాలు….. ”నీ పలికిననోట దుమ్ముబడ ప్రగడరాణ్ణరసా తుసాబుసా!” రామలింగడు తిట్టి కూడా ఈ ప్రగడరాజు నరస కవిని చిరంజీవిని చేశారు, లేకపోతే ఈ ప్రగడరాజు నరసన్న ఎవరో సంతలో చింతకాడ ఎవరికి గుర్తుండును చెప్పండి?

ప్రతివాది భయంకర ఇదొక ఇంటిపేరు, పౌరుషనామం, తర్కంలో పండితులైనవారి ఇంటిపేరిది.వీరి అసలు ఇంటిపేరు అణ్ణం, ఆ తరవాత ఈ బిరుదునామంతో ప్రతివాదిభయంకరం అణ్ణం అయింది. ఇక పౌరుషనామాలు చూస్తే సూరానేని, గంగినేని,గోగినేని,తాతినేని వీరంతా ఒకప్పుడు శూరులుగా, యుద్ధ వీరులు.

తూనికలు కొలతలు కూడా ఇంటిపేర్ల్గా చేరిపోయాయి,కుంచం వగైరా..తవ్వల ఇంటిపేరుంది… ఆరుసోలల అంటున్నారు, కాదు అయ్యలసోమయాజుల ఇది సరియైనది.యజ్ఞం చేసినవారు,యాజులని, చైనం చేసినవారు, వీరికి చయనుల ఇంటిపేరయిపోయింది. మా చేంబోలు సీతారామ శాస్త్రి ఇంటిపేరు ఇప్పుడు సిరివెన్నెల అయినట్టు. ఇంక వ్యాపారస్థులు పబ్బిశెట్టి,నరహరిశెట్టి,వరహాలశెట్టి ఇలా ఇంటిపేర్లు స్థిరపడ్డాయి.మా తూ.గో.జి లో ఒక ఊరుంది పేరు వ్యాఘ్రేశ్వరం, ఆ ఊరి దేవునిపేరు వ్యాఘ్రేశ్వరుడు, ఆ ఊరివారిలో నూటికి తొంభైతొమ్మిది మంది ఇంటిపేరు ఆకెళ్ళ, అన్ని కులాలవారూ. ఈ పేరుతో ప్రఖ్యాతిగాంచిన వారు ఆకెళ్ళ వ్యాఘ్రేశ్వరుడు వీరొక గొప్ప డాక్టర్, అలాగే ఈ ఆకెళ్ళ వ్యాఘ్రేశ్వరుడు పేరున్నవారంతా ఈ ఊరివారే. మరో సంగతి ఈ ఊళ్ళో అమ్మాయిలపేర్లు కూడా వ్యాఘ్రి 🙂

ఒక సారి మా వియ్యంకుల ఇంటికెళ్ళేను, అక్కడికి ఒక బంధువు వచ్చేరు, మా వియ్యంకుడు పరిచయం చేస్తే మీ ఇంటిపేరు అంటే మీ ఇంటిపేరూ అనుకున్నాం, వారు వారి ఇంటిపేరు బహుమాన్యం అన్నారు, నాకు అనుమానమొచ్చి ఈ ఇంటిపేరు మనవారిలోలేదే అన్నా. అవునండి, అసలు మా ఇంటిపేరు బొక్కా అది అశ్లీలంగా ఉందని ఇలా మార్చున్నాం అన్నారు, ఇలాటి చిత్రాలూ ఉన్నాయి, ఇంటిపేర్లలో.బలుసులేని తద్దినం, బులుసులేని యజ్ఞం లేదని నానుడి, ఇవి రెండూ ఇంటిపేర్లు.

వృక్షాలు…..టెకి, మద్ది…..

చెట్లు.. పనస మామిడి, మామిళ్ళ, మామిళ్ళపల్లి.చింతా…..

పక్షులు..నెమలి,కాకి,కోడి,పిచుక….

ఇంటికి సంబంధించి…కత్తి,కొడవలి, గడియారం, మంచాల,నూతి, చెఱువు, ద్వారబంధం, నడిమింటి…..

ఇక పండితులపేర్లూ ఇంటిపేర్లున్నాయి, పండితారాధ్యుల, పురాణపండ, పమిడిఘంటం…. ఇటువంటి ఇంటిపేర్లే.కోపం తెచ్చుకోనక్కరలేదు గుండు, దొంగ కూడా ఇంటిపేర్లే, మా బంధువులూ ఉన్నారీ గుండు ఇంటిపేరుతో. జిలేబి, జాంగ్రి, కాజా ఇంటిపేర్లు లేవు.

ఆకులు,పోకలు, సున్నం, కర్పూరం ఇలా తాంబూల ద్రవ్యాలూ, మిరియాలు వగైరా కూడా ఇంటిపేర్లున్నాయి.

పురాణ గ్రంధాలు..రామాయణం, భాగవతుల ఇంటిపెర్లే.

ఇక పీలుఖానా, తోప్ ఖానా వీరు తుపాకులు,ఫిరంగులు తయారుచేసేవారట.ఫిరంగి కూడా ఇంటిపేరేనండోయ్.

ఇక పువ్వుల పేర్లతో కూడా ఇంటిపేర్లున్నాయి, మల్లెల,మొల్లల, సంపంగి, మొగలి, జాజి ఇలా…నంది తిమ్మన అసలు పేరు కాని ముక్కుతిమ్మన పౌరుషనామం. ముక్కు తిమ్మనగా ప్రఖ్యాతి వహించిన కవి కూడా.బోనగిరి రూపాంతరం చెందిన ఇంటిపేరయి ఉంటుంది, అసలు ఇంటిపేరు భువనగిరి కావచ్చు.

జంతువులపేర్లతో కూడా ఇంటిపేర్లున్నాయి, గుఱ్ఱం, నక్కా, కుక్కల, పులి,పిల్లి ఇలా….

తెనుగు సామాజంలో ఇంటిపేర్లు మూలంగా చేసేవృత్తులు,ప్రవృత్తులు, తెలిసి సమాజపు, మన తెనుగువారి చరిత్ర తెలుసుకునే ఆధారాలివి. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను, ఈ మధ్య ఎవరో ఈ ఇంటిపేర్ల మీద పరిశోధన చేసేరట, ఆచార్య బిరుదూ పొందారట అదేనండి డాక్టర్,నిమిషనిమిషానికి ఈ టపా వరద గోదారిలాపెరిగిపోయింది, మరి అంతటి సంగతి ఒక టపాలో ”కుదురుద్దా” 🙂

ప్రకటనలు

27 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఇంటి పేర్లు

 1. sir chinaravuru,pedaravuru rendu tenali ni anukoni unnayi.chinaravuru ki railway station kooda undi.Pedaravuru tenali pakkana undatam valla tenali lo appulu petti agagotti gattiga adigithe andaru kalisi vachi kottevaarani vinnanu anduke pedaravuru kaatha ani peru vachindi anta,kaani aa ooru varu chepeedi marolaa undi pedaravuru vaariki tenali lo oil millulu,rice millulu unnayi raithulu panta raagani milluki toli entho kontha dabbulu teesukoni vellevaarani taravatha teerikaga vachhi lekkalu choosukoni vellevarani nammakamaina kaatha kaabatti pedaravuru katha ane chepparu.

  • suresh babu గారు,

   పెదరావూరు కాతా అంటే అప్పు ఎగ్గొట్టే బాపతని, అడిగితే దౌర్జన్యం చేసేవారని మా స్నేహితులనేవారు, అది గుర్తొచ్చింది. మీరన్న రెండవమాట కూడా నిజమేననుకుంటా.

   ధన్యవాదాలు.

 2. ఈ టపాను కాస్త ఆలస్యంగ చదివినట్లున్నాను. కాజ అన్నది ఒక అగ్రహారం అనుకుంటాను. శ్రీనారాయణతీర్థుల వారు గుర్తుకు వచ్చారు. వారి జన్మస్థలం కాజ అగ్రహారం అని చదివిన గుర్తు. ఆ కాజ అగ్రహారం కృష్ణాతీరమా గోదావరీతీరమా అన్నది తెలియదు.

  • శ్యామలీయం గారూ, కృష్ణాజిల్లా కాజ గ్రామం కృష్ణాజిల్లాలోని మొవ్వ మండలంలో ఉంది (మచిలీపట్నానికి దగ్గరలో). గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలో మరొక కాజ గ్రామం ఉంది (విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే దారిలో).

   • (continuation)

    శ్రీ నారాయణ తీర్ధుల వారిది గుంటూరు జిల్లా కాజ అని వికీపీడియా చెప్తోంది.

   • విన్నకోట నరసింహారావు గారు,
    వికిపీడియాని పూర్తిగానమ్మేయక్కరలేదుగాని, ఈ విషయం నిజమనిపిస్తూంది. కాజ పేరున్న గ్రామాలైతే చాలానే ఉన్నాయనమాట
    ధన్యవాదాలు.

  • తాడిగడప శ్యామలరావుగారు,
   పాలకొల్లు దగ్గర నేనెరిగిన కాజ అగ్రహారం కాదు, అది నారాయణ తీర్థులవారి జన్మస్థలమూ కాదు.
   ధన్యవాదాలు.

 3. మన తెలంగాణా గొట్టిముక్కల గారు ఆంధ్ర/కృష్ణ జిల్లా గొట్టుముక్కల ఉరు వాడు అయ్యి ఉంటాడు. 😉 ఆ మద్య ఆ ఉరు ప్రెసిడెంట్ ని ఎవరో వేసేసారు. అలా ఉరు పేరు తెలిసింది నాకు 😉

 4. అవునండి శర్మ గారు. అయితే కృష్ణాజిల్లాలో కూడా కాజ గ్రామం ఉంది. ఓ తరం అమ్మాయిల్ని కలల్లో విహరింపజేసిన నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారి జన్మస్ధలం ఈ ఊరే.

 5. హన్నా హన్నా ! ఎంత మాట ఎంత మాట !

  కోపం తెచ్చుకోనక్కరలేదు గుండు, … కూడా ఇంటిపేర్లే,

  జిలేబి, జాంగ్రి, కాజా ఇంటిపేర్లు లేవు.

  ఇందులో శ్లేష ఏమన్నా ఉందా ??

  గుండు జిలేబి

   • జిలేబిగారు,
    జిలేబి, జాంగ్రి పేర్ల మీద ఇంటిపేర్లు లేవుగాని ’కాజ’ అనేది పాలకొల్లు దగ్గర ఒక గ్రామం, నేనెరిగినది. ఈ ఇంటి పేరుంది, అది కాజా అయిందంతే!
    వెతుక్కుంటే అంతా శ్లేష కదా 🙂
    ధన్యవాదాలు.

   • విన్నకోట నరసింహారావు గారు,
    నిజమే! ‘కాజ’ గ్రామం నేనెరుగుదును. ఈ ఇంటిపేరూ ఉంది ‘కాజా’ అని.
    ధన్యవాదాలు.

 6. ఇంటి పేర్ల గురించి ఎంతైనా రాయొచ్చు.పూర్వం నుంచీ వస్తున్న ఇంటి పేర్లగురించి గాని,పెద్దలుపెట్టిన స్వంతపేర్లగురించిగాని సిగ్గుపడకూడదు.నాకు తెలిసి కొల్లూరువారన్న ఇంటిపేరు బ్రాహ్మలలోను ,వైశ్యులలోను ఉంది.పంచములలో కూడా ఉందంటారు. ఆ ఇంటిపేరువారు అందరూ ‘కొల్లూరు ‘ అనే ఊరినుంచి వచ్చి ఉంటారు.

  • రమణారావు గారు,
   ఒకే ఇంటి పేరున్న ఊళ్ళూ ఉన్నాయండి, వీటిని పరిశీలించి చూస్తే అదో ఆనందమే కలుగుతుంది, చరిత్రా అర్ధమవుతుందండి.
   ధన్యవాదాలు.

 7. ‌యింటి పేర్లు బాగున్నాయండి.‌ గోత్రాలు యెలా వచ్చినవో కూడా చెప్పగలరు.

  • వజ్రంగారు,
   నిజంగానే మంచి సూచన, తగిన వివరాలతో రాస్తే బాగుంటుంది, ఇది భారతీయ genetics శాస్త్రం, వివరాలున్నాయిగాని, కొన్ని నాకే అర్ధం కాలేదు, మరో సారి ప్రయత్నిస్తా.
   ధన్యవాదాలు.

 8. బోల్డు విషయాలు చెప్పారు. ఇదీ పరిశోధనా వ్యాసమే మీకూ డాక్టరేటు ఇవ్వచ్చు నిజంగా..

  • ఎన్నెలగారు,
   సరదాగా అప్పటికప్పుడు రాసిందండి, సమయం తీసుకుని వివరంగా రాస్తే బాగానే ఉంటుంది. ఇప్పటికే టపా పెరిగిందని కొంత తీసేశాను, తినే వస్తువులతో ఉన్న ఇంటిపేర్లు చెప్పలేదు, టపా లింక్ ఇచ్చాను, ఇలా ఇంక కొన్ని చేర్చాల్సినవీ ఉన్నాయండి, మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

  • Uma Kalyani గారు,
   కప్పగంతు, గోరుగంతు కూడా ఇంటిపేరేనండి, వీళ్ళు మా చుట్టాలూ కూడా, మనం మనంగా ఉంటాం, మన ప్రత్యేకత మనది, ఇటువంటి ఇంటిపేర్లు సిగ్గుపడక్కరలేదండి, అదే మన ప్రత్యేకత కదా. ఇంటిపేరు, పేరు గురించి సిగ్గుపడకూడదండి…
   ధన్యవాదాలు.

 9. మా ఇంటి పేరు చదలవాడ చదులవాడ అని కూడా అంటారు.
  చాలా ఆసక్తి కరమైన కబుర్లు వ్రాసారు!
  మా ఇంటి పేరు చదలవాడ, చదులవాడ అని కూడా అంటారు.
  ఒంగోలు చీరాల మార్గంలో ఉన్న ఊరు,
  అక్కడ శ్రీరామ చంద్రుని గుడి ముందున్న ఒక చతుర్వాటిక,
  నుండి చదులవాడ ఊరి పేరు వచ్చిందని,
  మా పూర్వీకులు ఆ ఊరి వారవడం వల్ల అదే మా ఇంటి పేరైంది అనీ మా ముత్తాత
  శ్రీ చదులవాడ సుందర రామ శాస్త్రి గారి అభిప్రాయం.
  ఆ ఊరికి చెందిన అన్ని వర్ణాలకు కులాలకు అదే ఇంటి పేరు.

 10. “కుదురుద్ది” శర్మ గారూ. జరగాలి అనుకుంటే “జరుగుద్ది”, “అవుద్ది” 🙂

  అన్నట్లు ఇంటి పేర్ల మీద చదివిన ఓ చిన్న కథ గుర్తొచ్చింది.
  విజయనగరం మహారాజుల ఇంటిపేరు “పూసపాటి” వారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు గారు వీరి ఆస్ధానంలోనే ఉండేవారు కదా. ఓ సారి దాసు గారిని సరదాగా ఆట పట్టించడానికి మహారాజా వారు “దాసు గారూ, మీ ఇంటిపేరు ఆదిభట్ల వారా? అదేమిటండీ అటువంటి పేరు పెట్టుకున్నారు?” లాంటి హాస్యమాడారట. దానికి “పూసపాటి” చెయ్యదా మహారాజా? అని దాసు గారి జవాబుట.
  (ఈ కథలో నిజమెంతో తెలియదు.)

  • విన్నకోట నరసింహారావు గారు,
   చిన్న ప్రయత్నం చేశాను, చాలా తెలిసి వదిలేశాను కూడా, ఇప్పటికే టపా పెరిగిందని.
   సంఘటన నిజంగా జరిగిందేనని అంటారు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s