శర్మ కాలక్షేపంకబుర్లు-ఆధ్యాత్మిక భావనలో..

ఆధ్యాత్మిక భావనలో..                                                                       వివేకచూడామణి-1

ఆద్యాత్మిక భావనలో కొన్ని మాటలు వాడుతుంటారు, ప్రసంగాలలో దొర్లిపోతుంటాయి, కాని వాటి అర్ధాలు మాత్రం తెలియవు, అది తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. కొంచం గందరగోళంగా ఉంటుంది, నెమ్మదిగా ఒకటికి రెండు సార్లు చదివితేగాని బుర్రకెక్కదు, మన్నించండి, తప్పదు 🙂

స్థూల శరీరం..చర్మము,మాంసము, మజ్జ,నెత్తురు,నాడులు, మేదస్సు, ఎముకలు, మల మూత్రాలు కలిగియున్న దేహమే స్థూల శరీరం. ఆత్మకిది భోగస్థానం. దీనికి మూడు దశలు, పుట్టుక, పెరుగుట, నశింపు. అలాగే మెలకువ, నిద్ర, కలలు దీనికి ఉండే స్థితులు.గృహస్థుకి ఇల్లెటువంటిదో ఆత్మకి శరీరం అటువంటిది. ఈ శరీరానికే వర్ణ,ఆశ్రమ నియమాలు, మానము, అవమానము, బహుమానము అనే విశేషానుభవాలు ఉంటాయి. స్థూల శరీరానికి ప్రజ్ఞ జాగృతిలోనే ఎక్కువ.

అంతఃకరణ చతుష్టయము… మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు..

అనుక్షణం సంకల్ప వికల్పాలు చేసేది, మనసు. ఆలోచన పుడుతుంది, నశిస్తుంది, ఇదీ మనసు చేసేపని.

ఇదివరలో చేసిన పనుల ఫలితాలు, ఇతరులవలన కలిగిన అనుభవాలు, చదువుకున్నదాని ఫలితం, ఇలా చాలా విషయాల మీద పుట్టినప్పటినుంచి సంపాదించుకున్న జ్ఞానం యొక్క కేంద్రం. ,ఇది అవసరానికి మనసుకి సలహా ఇస్తూ ఉంటుంది, వద్దు, చేయకు, చూడకు, మాటాడకు, పరుగుపెట్టకు ఇలా. అన్నీ కాదనేవేనా అనుకోవచ్చు, కాదు మంచిపనులకూ త్వరపడమని చెబుతుంది. ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది, ఇది బుద్ధి.

చిత్తం..ఏదేని వస్తువు, పని, ఇష్టమైనవారు ఇలా మనసుకు నచ్చినవాటిని సతతం అనగా ఎల్లపుడూ చింతించేది, మననం చేసేది, చిత్తం.

ఇక చేసే ప్రతిపనికి కర్తృత్వభావన, నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అన్నదే, అహంకారం.

ఈ నాలుగూ మనసుయొక్క స్థాయిలే.

దశేంద్రియాలు…చెవి, చర్మం,కన్ను, ముక్కు, నాలుక ఇవి జ్ఞానేంద్రియాలు. వాక్కు( మాట) పాణి ( చెయ్యి) పాదము (కాళ్ళు) మలద్వారము, మూత్ర ద్వారము ఇవి కర్మేంద్రియాలు. మొదటివి పని యొక్క జ్ఞానాన్ని ఇస్తాయి కనక జ్ఞానేంద్రియాలు,తరవాతవి పనులు చేస్తాయి కనక కర్మేంద్రియాలు. ఇవి రెండూ ఒకటే అనుకునే ప్రమాదమూ ఉంది. ఈ మొత్తం పది దశేంద్రియాలంటారు.

పంచ ప్రాణాలు….ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు.ప్రాణ వాయువు హృదయమున, అపానము గుదము, సమానము కు నాభి,ఉదానమునకు కంఠము, వ్యానమునకు సమస్థ శరీరము స్థానములు.

ప్రాణ ధర్మాలు…ఉఛ్వాస నిశ్వాసలు,ఆవులింత, తుమ్ము,అదరుట,ఉత్క్రమించుట అనగా త్రేన్చడం, ఇవేగాక ఆకలి దప్పిక, ప్రాణ ధర్మాలు.

సూక్ష్మ శరీరము…..౧.పంచభూతాలు,౨.జ్ఞానేంద్రియాలు, ౩.కర్మేంద్రియాలు,౪.పంచప్రాణాలు,౫.అంతఃకరణ చతుష్టయము, ౬.అవిద్య, ౭.కామము, ౮.కర్మ,( మొత్తం ౨౭) ఈ ఎనిమిదిటి సమూహాన్నీ పుర్యష్టకం అంటారు. ఈ పుర్యష్టకమే సూక్ష్మ శరీరం. దీనినే లింగ శరీరం అనికూడా అంటారు. దీని ప్రజ్ఞ స్వప్న దశ.

గుణాలు… మూడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం.

రజోగుణం…క్రియా రూపమైన శక్తి ఉండేది రజోగుణం లోనే. అన్ని పనులు ఈ గుణం ఆధారంగానే జరుతాయి. కామ, క్రోధ,మోహ,లోభ, మద మాత్సర్యాలు,ఈర్ష్య, అసూయ, ద్వేషం, ప్రేమ, అభిమానం, ఇలా అన్నీ రాజోగుణ ప్రేరితాలు. మానవుల అన్ని సుఖదుఃఖాలకీ కేంద్ర బిందువు.

తమోగుణం…. ఉన్నదిలేనట్టు, లేనిది ఉన్నట్టు, ఒకటి మరొకదానిలాగా కనపడేదే తమోగుణం. తాడును చూసి పామనుకుని భ్రమపదటం లాటిది. ఎండమావిలో నీరుందనుకున్నట్టు, దీనికి ఉదాహరణలు. మానవులు ఒక వస్తువునందు తాము భ్రాంతిచే కల్పించుకున్న వస్తువునే సత్యమని తలచేదే ఈ గుణం. అది సత్యం కాదని ఎంతచెప్పినా వినిపించుకోకపోవడం, వినిపించుకోలేకపోవడమే ఈ గుణం యొక్క పరాకాష్ఠ.

సత్వగుణం…ఈ గుణంలో సూర్యకాంతిలో అన్ని వస్తువులూ కనపడినట్టు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ గుణం రజో, తమో గుణాలతో కలసి మానవుల సంసారబంధనానికి కారణం అవుతూ ఉంటుంది.

శ్రద్ధ,భక్తి,దైవీ సంపద, మోక్షాపేక్ష,అసత్యాన్ని విడవటం, ఆత్మానుభవం, ప్రసన్నత, తృప్తి, శాంతి, హర్షము, పరమాత్మయందు నిష్ట ఈ గుణం లక్షణాలు.

కారణ శరీరం….త్రిగుణాలతో వర్ణింపబడినదే అత్మయొక్క కారణ శరీరం. దీని ప్రతిభ సుషుప్తి, నిద్రలోనే. ఇదివరలో స్థూల శరీరానికి జాగృతిలోనూ,  సూక్ష్మ శరీరానికి స్వప్న దశలోనూ ప్రతిభ అన్నది చూశాం.

ప్రస్తుతానికి ఆపుదాం, ఎక్కువైతే ఇబ్బందికదా! మననం చెయ్యండి…

ఆదిశంకరుల వివేకచూడామణినుంచి, పొరపాట్లుంటే నావే సుమా!

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆధ్యాత్మిక భావనలో..

 1. గురువు గారు, చక్కటి ఆధ్యాత్మ పద సంపుటి సహాయ సూచిని అందించారు. దీన్ని భద్రంగా అందుబాటులో దాచుకోవాలి. తరచూ అవసరం పడేలా ఉంది.

  • durvas గారు,
   శంకరులు వివేక చూడామణిలో మెట్టు మెట్టు చొప్పున పైకి ఎక్కించి ఆత్మ దర్శనం చేయిస్తారు,మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది. చాలా విస్తృతంగానూ చెప్పారు. కుదించాను, ఎక్కడేనా తప్పు చేశానేమోననే భయమూ ఉండిపోయింది.

   శంకరులు వివేక చూడామణిలో చూపిన దారిలో, నెమ్మదిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఆత్మ దర్శనం చేయాలని కోరిక, ఇక ముందు రాబోయేటపాలలో వీటి అవసరమూ రావచ్చు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s