శర్మ కాలక్షేపంకబుర్లు-భయమూ లేదు భక్తీ….

భయమూ లేదు భక్తీ….

భయమూ లేదు భక్తీ లేదనిగాని, భయము భక్తి లేవనిగాని అనడం చాలా సహజం. అసలీ భయమేంటీ? భక్తేంటీ?

ఆహార, నిద్రా,భయ,మైధునాలు సర్వ జీవులకు సమానం. మానహాని,ధనహాని,ప్రాణహాని భయాలు, మానహాని,ధనహాని మాత్రమే మానవులకు ప్రత్యేకం 🙂 ఇవి రాకుండా ఉండాలంటే తప్పు చెయ్యకూడదు. తప్పులు చేస్తే కొన్ని దండనలుంటాయి. చిన్నపుడు అమ్మ తిడుతుందనీ, నాన్న కొడతాడనీ భయం. అలాగే వయసొచ్చిన తరవాత భార్య/భర్త దగ్గర కించపడాల్సివస్తుందేమోననే భయం. ఉద్యోగం లో పైవారు కన్నెర్ర చేస్తారని భయం. ఆ తరవాత చేయ కూడని పనులు చేస్తే ప్రభుత్వం దండిస్తుందేమోననే భయం కావాలి. దీనినే స్థూలంగా చెప్పుకోవాలంటే చట్ట భయం. ఎవరూ చూడలేదు కదా అని తప్పు చేయకూడదు, ఉభయ సంధ్యలూ, సూర్యచంద్రులు,వేదం సాక్ష్యం చెబుతాయని చెప్పింది శకుంతల.  తప్పు చేసి తప్పించుకుందామనుకుంటే కుదరదు, ఒక సారి తప్పించుకున్నా మరో సారి తప్పదు, దండన. సమాజం దండిస్తుందేమోననే భయం, చట్టం దండిస్తుందేమోననే భయమే భయం.

ఇక భక్తి, భగవంతుని గురించిన భక్తి,శ్రద్ధ అని చెప్పచ్చు. ఇది మతానికి సంబంధించినదీ అని అంటారు. మతం అంటే ఆలోచనా విధానం. భయంతో అన్ని పనులూ సాధించలేము. స్వయం నియంత్రణ చాలా అవసరం జీవితంలో. ప్రతి జీవితంలోనూ జరగకూడని పెద్ద తప్పులు రెండు, ఒకటి చోరత్వం, రెండు జారత్వం, వీటి కూడా వచ్చేది అబద్ధం. సావకాశం ఉండి కూడా నిగ్రహంగా బతకడమే భక్తిలో విశేషం, అలా బతకగలిగితేనే గొప్ప.. వృద్ధనారీ పతివ్రతా అంటారు, మన్నించాలి, మాట అలా ఉంది కనక చెప్పేను. ఎవరూ మనవైపు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడనపుడు శీలవంతులం అంటే…..వయసులో ఉండగా ఉండాలి అది…ఈ లౌల్యం నుంచి తప్పించుకుని మనసును దిట్టపరచుకుని తప్పు చేయకుండా కాపాడేదే భక్తి, అదే స్వయం నియంత్రణ.

భయమైనా ఉండాలి, భక్తయినా ఉండాలికాదు, రెండూ ఉండాలి. నాకు భయమూ లేదు,భక్తీ లేదు, నేను నాస్తికుడిని అని చెప్పుకుంటున్నవారు చాలా మంది కనపడుతున్నారు, నేటి కాలంలో. మానవ జీవితం గొప్పది, జంతూనాం నరజన్మ దుర్లభం, దీనిని వ్యర్ధం చేసుకుంటే నష్టపోయేది మనమే. ఇటువంటి వారికి వయసులో ఉండగా బాధలు తెలియవు, వయసుడిగిన తరవాత పడే బాధలు నరకాన్ని మరిపిస్తాయి. మన కళ్ళ ఎదుటనే అటువంటి వారిని చూస్తుంటాం. భయమూ భక్తీ లేకపోతే ఏమవుతుందో ఒక చిన్న కథ, పాతదే, మీకూ తెలిసినదే… అవధరించండి.

పాటలీపుత్రనగరం దగ్గరగా ఉన్న ఒక అడవిలో ఒక దొంగ ఉండేవాడు, వాడిపేరు అంగుళిమాలుడు. నిజానికి ఇతని అసలు పేరేంటో కూడా ప్రజలు మరచిపోయారు, కారణం ఇతని కౄరత్వం. ఇతను ఆ అడవిలోకి వచ్చే ప్రతి మనిషినీ పట్టుకుని,దోచుకుని, అకారణంగా చంపి, చనిపోయినవాని చిటికెన వేళ్ళు దండగా గుచ్చుకుని వేసుకోడం ప్రారంభించాడు, అంటే అతని దుర్మార్గం ఎంతకి పెరిగిపోయిందో ఊహించవచ్చు. అసలింతకీ ఈ అంగుళిమాలుడు అలా ఎందుకు తయారయ్యాడు అని అనుమానం రావచ్చు. అతనూ ఒకప్పుడు మనలాటివాడే, కాని ఒకప్పుడు అతనికి ఒక అన్యాయం జరిగింది, సమాజం పట్టించుకోలేదు, అంతతో అతనొక దొంగగానూ, హంతకునిగానూ తయారయ్యాడు, సమాజానికి పీడగా తయారయ్యాడు. అంటే భయమూ,భక్తీ వదిలేశాడు, (రాజు) /చట్టం అతన్ని పట్టుకోలేకపోయింది. మొండివాడు రాజుకంటే బలవంతుడు అని అంటారు, ఇందుకే.

ఇలా నడుస్తుండగా ఒక రోజు ఆ అడవిగుండా వెళ్ళడానికి బుద్ధుడు తయారయ్యాడు. కూడా ఉన్నవారు చెప్పేరు, ఈ అడవిలో అంగుళిమాలుడున్నాడు, కనపడినవాడిని కనపడినట్టు చంపేస్తాడు, వెళ్ళద్దూ, అని. బుద్ధుడు వినలేదు. బయలుదేరేడు, అనుకున్నట్టే అంగుళిమాలుడు కనపడ్డాడు దూరాన. నా పేరుచెబితేనే కంగారుపడి, భయపడి పారిపోతారు జనం, అటువంటిది, వీడెవడో నిర్భయంగా నడచి వస్తున్నాడే! అనుకున్నాడు, అంగుళిమాలుడు. ఇద్దరూ దగ్గరబడ్డారు. అంగుళిమాలుడు, ఆగు ఎవరునువ్వు?,ఎందుకొచ్చావని అడిగాడు. దానికి బుద్ధుడు, నేనెవరో నాకే తెలియదు, అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అన్నాడు. చంపేస్తానన్నాడు, అంగుళిమాలుడు. ఈ శరీరం , రేపో,నేడో రాలిపోవాల్సిందె, అలాగే కానియమన్నాడు. సాధారణంగా అందరూ చావంటే భయపడ్తారు కదా! బుద్ధుడు భయపడనందుకు అంగుళిమాలుడికి ఆశ్చర్యం వేసింది. ప్రాణం మీద తీపి, చంపేస్తానంటే భయము లేనివాడిని చూసేటప్పటికి అంగుళిమాలునిలో భయమూ, భక్తీ ప్రవేశించాయి, అప్పటివరకూ లేనివి. బుద్ధుని దగ్గర మోకరిల్లి తన మనసు విప్పాడు.

బుద్ధుడు అతనిని అక్కున చేర్చుకుని భయమూ,భక్తితో బతకాలనీ, ఇలా తయారయి, లోకకంటకునిగా బతకడం వ్యర్ధమనీ చెప్పి అంగుళిమాలునిలో మార్పు తీసుకొచ్చారు.

అందుచేత, చట్టభయమూ, మతమో, మరొకటో దాని మీద భక్తీ లేని జీవితాలు………అదీ భయము, భక్తీ లేవన్నదాని కత…..

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భయమూ లేదు భక్తీ….

 1. కొంతమందంతే శర్మ గారూ, బొత్తిగా భయం భక్తీ ఉండవు 🙂

  చిన్నప్పుడెప్పుడోవిన్న అంగుళీమాలుడి కధ గుర్తు చేసారు, థాంక్స్.

  • విన్నకోట నరసింహారావుగారు,
   భయమూ,భక్తీ మీద టపారాస్తుంటే అంగుళిమాలుడు కనపడ్డాడు, ’ఏం నన్ను మరచిపోయావా’ అన్నాడు,కళ్ళెర్రచేసి, భయమేసి 🙂
   ధన్యవాదాలు.

 2. ఈ కథను నా మనమరాలికి చెప్పాను.
  మరి బుధ్దుడికి భయం లేదు కదా?
  పరవా లేదా? అని అడిగింది

  • మోహన్జీ,
   మనవరాలు మంచి ప్రశ్న వేసింది.
   >>>>ప్రాణం మీద తీపి, చంపేస్తానంటే భయము లేనివాడిని చూసేటప్పటికి అంగుళిమాలునిలో భయమూ, భక్తీ ప్రవేశించాయి, >>>
   బుద్ధుడి కి భయం లేనిది చావంటే కదా!
   ధన్యవాదాలు.

   • >>>>ప్రాణం మీద తీపి, చంపేస్తానంటే భయము లేనివాడిని చూసేటప్పటికి అంగుళిమాలునిలో భయమూ, భక్తీ ప్రవేశించాయి, >>>

    బుద్ధుడి కి భయం లేనిది చావంటే కదా!<<<<<<

    మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఇండియన్స్ అంటే పాకిస్థాన్ వాళ్ళల్లో భయమూ,భక్తీ ప్రవేశించాలి,చావంటే భయం లేనివాడిని చూస్తే భయం కలుగదు. నాకు భయమూ,భక్తీ రెండూ లేవు,నన్ను చూసి నా కొడుకే భయపడడు.మనిషికి కావలిసినది భయ భక్తులు కావు,ధర్మం పట్ల విశ్వాసం,నమ్మకం.

    నమ్మకమే లేనివాళ్ళను చూస్తే భయం కాదు కదా నాలుగు తన్నబుద్ది అవుతుంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s