శర్మ కాలక్షేపంకబుర్లు- జర / రుజ.

జర / రుజ.

జర అంటే ముసలితనం, ఇవే అక్షరాలని తిరగేస్తే రుజ అంటే రోగం. ఇవి రెండూ కవల పిల్లల లాటివి. వయసు పెరిగినకొద్దీ అన్ని అవయవాల పని చేసే శక్తి తగ్గిపోతుంటుంది, ఇందులో ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. చిన్నయసూరి చెప్పేరూ కేశములు,దంతములు,నఖములు,నరులు స్థానభ్రంశం చెందితే రాణించరూ, అని. స్థానభ్రంశం చెందినవెలాగూ రాణించవు, అవి ఎక్కడ ఉండాలో అక్కడ లేనివారు కూడా రాణించరు. జుట్టు, ఇది అందానికి కాదు, రక్షణ కోసం పెట్టేడు భగవంతుడు. మనం దాన్ని అందం చేశాం. నఖములు లేకపోతే వేలు పనికిరాదు, ఉపయోగపడదు, ప్రయత్నించకండీ. దంతములు, అసలు కతంతా వీటితోనే ఉన్నది. పుట్టినది మొదలు చచ్చేదాకా ఏదో ఒకటి కడుపులో పారెయ్యక తప్పదు. అది నమలకా తప్పదు, దానికోసం దంతాలు అవసరమే. లేనప్పుడే తెలుస్తుంది, అవసరం,బాధ.. ఉండగా ముసలి ముండా కొడుకు ఛంపుతున్నాడనుకున్నవాళ్ళు, పోయాకా అయ్యో! ఈ సమయం లో ఉండి ఉంటే మంచి ఆలోచన చెప్పి ఉండునుకదా అనుకున్నవాళ్ళమే అందరమూ…ఇక నరుల గురించి చెప్పను, చెప్పాలంటే కావలసినంత గ్రంధం……

పళ్ళు, నెమ్మదినెమ్మదిగా నోరు ఖాళీ అయింది. మరి ఇప్పుడు ఆహారం నమలాలంటే కుదరదు, గుజ్జనగూడులా చేసుకుతినాలి. ఇలా తింటే కూడా ఈ వయసులో బాధలు తప్పవు, విరేచనాలు వెడతాయి. గట్టిగా ఉండగా మింగేస్తే అరగదు, ఆకలుండదు, నీరసం, చిరాకు,పరాకు, కోపం తప్పవు.మరెలా? పళ్ళు కట్టించుకోవాలి, అదంత తొందరగా జరిగే పనికాదు. మూడు సిట్టింగులు పడుతుంది. ఒక్కో సిట్టింగ్ మధ్య పదేను రోజుల వ్యవధి. శనికి దరిద్రం తోడని నాకు మరో బాధ కలిగి అది మరీ ఆలస్యం అయింది. సమయం కావాలి, తప్పదు, లేకపోతే చిగుళ్ళు ఇబ్బందిపెడతాయి. నాకు రెండు సిట్టింగులు అయ్యాయి, మూడవదానికోసం చూస్తున్నా. ఆ తరవాత కట్టిన పళ్ళు ఇస్తే వాటితో తినడం అలవాటు కావాలి, పళ్ళు నోటికి అలవాటు పడాలి, అదో పెద్ద కత. ఇలా సంగతి ఎగదీస్తే బ్రహ్మ హత్య,దిగదీస్తే గోహత్యగా మారిపోతుంది. ఇదో చిన్నకత చెబుతా.

ఒక రాజ్యం మీద మరొకరాజు దండయాత్ర చేశాడు, అవి సత్యకాలం రోజులు. ఈ రాజు యుద్ధానికి సిద్ధంగా లేడు, అందుకని మంత్రి సలహా మీద బ్రాహ్మలందరిని, ఆవులతో యుద్ధరంగానికి పంపేడు. విల్లు బాణాలు, బరిసెలు, గుర్రాలతో యుద్ధానికొస్తారని ఎదురు చూస్తున్న సైనికులకి గోవులు వాటి మీద బ్రాహ్మలు కనపడ్డారు, చేతుల్లో దర్భకర్రలు పట్టుకుని. చూసిన యుద్ధ వీరులు, పైకి బాణం వదిలితే నిరాయుధుడైన బ్రాహ్మడు చస్తాడు, కిందకి బాణం వదిలితే, పాపం గోవు చస్తుంది, ఏం చెయ్యాలో, ఎవరితో యుద్ధం చెయ్యాలో తోచక ఆ సైనికులు వెనక్కిపోయి తమ రాజుగారికి చెప్పుకున్నారట, అయ్యా యుద్ధరంగం లో పరిస్థితి ఇలా ఉంది, ఎగదీస్తే బ్రహ్మ హత్య,దిగదీస్తే గోహత్య, అందుకని తిరిగొచ్చేసేం, అని. అలాగా ఒకందుకు వైద్యం చేస్తే మరో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ముసలితనం లో, అదీ మూడు పాతికల వయసులో, అన్నీ సమానంగా నడుస్తాయా?నడవ్వు, నడిపించడానికే ఈ అవస్థ.. బాగోలేం అనుకోడమే పెద్ద ఇబ్బంది, బాగున్నామనుకోడమే, ముక్కుతూ,మూలుగుతూ కూడా. ఇదేకదా పాసిటివ్ తింకింగ్ అంటే 🙂

మాకెందుకు చెప్పడం ఈ సుత్తంతా అంటారా? మొదటిమాట, బాధ చెప్పుకుంటే తగ్గుతుంది, మానసికంగా, అయ్యో బాధ పడుతున్నావా అని ఏ ఒకరేనా ఓదార్చరా? 🙂 ఇక కొంతమంది మా బాగా అయ్యింది ముసలాడికి అనుకునేవారూ ఉండచ్చు….కాలం ఎవరినీ వదలిపెట్టదు, గుర్తుంచుకోండి. ఎప్పటికీ ముఫ్ఫైలో ఉండిపోతామనుకోకండేం, అలా ఉండేవాళ్ళు ఒక్క దేవతలు మాత్రమే, అందుకే దేవతలకి త్రిదశులు అని పేరు కూడా.మనం దేవతలు కాదు.

కష్టాలే కలిసొస్తాయట, నిజమే. మొన్న ఐదురోజులకి కొంచం తెప్పరిల్లుకున్నా. లేప్ టాప్ ఆన్ చేస్తే మళ్ళీ పోయింది. లేప్ టాప్ కూడా నా వయసుదే, ఇంక దానిని బాగుచేయించే ప్రయత్నం చెయ్యకూ అనిచెప్పా. అబ్బాయన్నాడు, కొత్తది కొనేస్తానూ అని. అయ్యేబులం బుడ్డపదలమని నానుడి. నా ఘనకార్యానికి కొత్తది వద్దులే అని చెప్పేశాను. వీలు కుదిరితే డెస్క్ టాప్ మీద గిలుకుతాలే అన్నా. అమ్మయ్య! ఈయన వదిలేడనుకుని ఉంటాడు.. డెస్క్ టాప్ మీద కూడా మన హస్తం పడితే అది భస్మాసుర హస్తం అవుతుందేమోననీ, అదీగాక రోగీ పాలే కోరేడు, వైద్యుడూ పాలే చెప్పేడు అనుపానమన్నట్లుగా లేప్ టాప్ పోవడం సుఖపెట్టినట్టే. అందుకే బ్లాగులోకి రాలేదు. కాకపోయినా బ్లాగులోకొచ్చి నేర్చుకునేదేం కనపట్టంలేదు, ఒక్కటే దెబ్బలాట, దాని మూలంగా మనస్తాపమూ తప్పించి…బ్లాగులోకి రాకుంటేనే ఆరోగ్యం బాగుపడేలా ఉంది 🙂 పోనిద్దురూ అంతయూ మనమేలునకే కదా! చివరగా శ్రీ విన్నకోట నరసింహారావుగారు, గురువారం సాయంత్రం ఫోన్ చేసి ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగులేదన్నారని పలకరించారు, చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. శుక్రవారం ఉదయం ఉద్యోగం హడావిడిలో కూడా మిత్రులు శ్యామలరావుగారు పలకరించి ఎలా వున్నారన్నారు, ఏం చెప్పను, బాగున్నా సార్ అనేశా, ఇవ్వన్నీ చెబుతూ. వారి సహృదయానికి ధన్యవాదాలు.నావారందరికి నా ధన్యవాదాలు.
శుభం.

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- జర / రుజ.

 1. ఈ మధ్యేదో చాగంటి వారు శంకరాభరణం గురించి ప్రవచనం చెప్పేరట 🙂 కష్టే ఫలే వారు, మీరేమన్నా వాటి గురించి ‘జర’ టపా వ్రాస్తారా వీలు చేసుకుని ?

  జిలేబి
  (హమ్మయ్య ! నారదా :))

  • Zilebi గారు,
   వంకలేనమ్మ దొంకపట్టుకుని ఏడ్చిందని నానుడి, వాదానికి ఏదో ఒక కారణం కావాలి కదా!, నేనైతే ఆ ప్రసంగాలు వినలేదు, నాకు తెలియదు. తెలియనివి తెలిసినట్టు మాటాడే అలవాటు నాకు లేదు. 🙂
   ధన్యవాదాలు

 2. < " బ్లాగులోకి రాకుంటేనే ఆరోగ్యం బాగుపడేలా ఉంది 🙂 "
  హ హ్హ హ. కొన్ని బ్లాగులు వాటిల్లో జరిగే రామరావణ యుద్ధాలు చూస్తుంటే మీరన్నది నిజమే అనిపిస్తుంది. ఈ మధ్య మరీ ఎక్కువగా అనిపిస్తోంది.

  పళ్ళు కట్టించుకోవడం కార్యక్రమం మాత్రం త్వరగా పూర్తి చేయించుకోండి. పళ్ళు లేకపోతే – హమ్మయ్య ఈయన అందరిమీదా "పళ్ళు కొరకడం" తగ్గింది – అనుకుని సంతోషించడానికి ఎదుటివారికి అవకాశం దొరుకుతుంది కదా 🙂 🙂 జిలేబీ గారు అన్నట్లు "జేకే", ఏమనుకోకండి.

  అన్నట్లు "కష్టేఫలే" బ్లాగ్ మళ్ళా "మాలిక" అగ్రెగేటర్ లో కనపడడం మానేసిందే !

  • విన్నకోట నరసింహారావు గారు,
   అలాగే ఉందండి. ఇదే కాలక్షేపంలా ఉంది ఎక్కువ మందికి. 🙂

   మూడో సిట్టింగూ అయిందండి. ట్రయల్ టీత్ పెట్టి చూశారు, బాగున్నట్టే అనిపించింది. మరో పది రోజులు పడుతుందన్నారు, పళ్ళు కొరకడానికి 🙂

   మీరు చెప్పేకా చూశా మళ్ళీ వర్డ్ ప్రెస్ బ్లాగులు మాలికనుంచి గాయబ్,టపాలు కామెంట్లతో సహా.

   ధన్యవాదాలు

  • చిరంజీవి స్వాతి,
   అలాగేనమ్మా! ఇంత మంది నేను బాగోవాలనుకున్నప్పుడు అమ్మ కాదంటుందా? మీ అభిమానానికి.
   ధన్యవాదాలు.

 3. శర్మ గారూ ,
  మీ ఆరోగ్యం త్వరగా కుదుట పదాలనీ, మీరు మీ టపాలను , దీపావళికి ముందే , ‘ శర్మ ‘ మార్కు స్ఫూర్తి తో , టపాకాయల్లా పేల్చాలనీ ఆశిస్తున్నా !

 4. తాతయ్య గారు…మీ టపా కోసం చాలా ఎదురుచూసాను.ఆరోగ్యం బాగాలేదన్నారు కద,చాలా బాధగా అనిపించింది.మీరు ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.మీ నుండి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు మేము తెలుసుకోవాలి..

  • చిరంజీవి అనామకం,
   ముక్కుతూ మూలుగుతూ కూడా బాగున్నా అనుకుంటూ ఉంటాం, ( positive thinking ?) ఇదో అలవాటు. కొంచం బాగుంటే ఊరకనే కూచోలేం, అదో దురలవాటు. 🙂
   ధన్యవాదాలు.

 5. కష్టే ఫలే వారు,

  వెల్కం బెక బెక !

  -> మాకెందుకు చెప్పడం ఈ సుత్తంతా అంటారా? మొదటిమాట, బాధ చెప్పుకుంటే తగ్గుతుంది

  ఇట్లా అయినా ‘సుట్టెయ్య డానికి మళ్ళీ తపాళ్ వ్రాసేరు అదే మేలు 🙂

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s